కొత్త కెరటం : అమెరికా లో తెలుగు పిల్లలు

-- ప్రణవ ఉపద్రష్ట

సుజనరంజని ఆశయాల్లో యువతలో పఠన, రచన ఆసక్తులను పెంపొందించడం; తెలుగు భాషను వారి భావధారలోకి తీసుకువెళ్ళటము ముఖ్యమైనవి. సిలికానాంధ్ర చేపట్టే అనేక భాష - సంస్కృతి సంబంధించిన కార్యక్రమాలతో పిల్లలు, యువకులు విశేషంగా ఆకర్షింపబడటం ఎంతో ఉత్సాహం కలిగిస్తోంది. ఆ ప్రేరణతో యువకులలో తెలుగులో వ్రాసే నేర్పు పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ శీర్హిక ద్వారా అవకాశాన్ని కల్పిస్తున్నాము. మనకు తెలిసిన వివిధ అంశాలను సరికొత్త కోణంలో చూపించగల నేర్పు యువత సొంతం. అందుకు పట్టం కట్టే ప్రయత్నమిది. పిల్లలను యువయను, వారి భావాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

అమెరికా లో పెరిగే పిల్లలు రెండు ప్రపంచాలలో పెరుగుతారు. ఒక ప్రపంచము - ఇంట్లో, మరొకటి - బయట బళ్ళో. పిల్లలు ఒక కాలు ఇటు, ఒక కాలు అటు పెట్టవలసిన అవసరము వస్తోంది. ఇంటి పట్టున అమ్మ, నాన్న గార్లకి మన ఆంధ్ర పద్ధతిలో పెరగాలని ఆశగా వుంటుంది. దాని కోసము, వాళ్ళు తెలుగు లొనే మాట్లాడమని, మన సంస్కౄతి పాటించమని, మన సాంప్రదాయాన్ని తెలిపే బట్టలు వేసుకొమ్మని చెబుతారు. కానీ, ఇక్కడి పిల్లలకు బయట ప్రపంచముతో కలవాలి అని కొరిక గా వుంటుంది. బళ్ళో వాళ్ళ స్నెహితులతో కలిసిపొవలంటే, వాళ్ళ లాగ బట్టలు వేసుకోవడము, ఇంగ్లీషు మాట్లాడడము, TV లొ వాళ్ళ వయసు కు తగిన కార్యక్రమాలు చూడడము, చాటింగులు చెయ్యడము, ఇవ్వన్ని చెయ్యవలసిన అవసరము వస్తోంది.

ముందు చెప్పిన విధము గా, పిల్లలు, వాళ్ళ తల్లి తండ్రులు వేరు వేరు ప్రపంచాలలో నివాసము ఏర్పరుచుకుంటున్నారు. అందరూ ఒకే ప్రపంచము లో వుండాలంటే, ఇద్దరూ ఒక మెట్టు దిగి, మధ్యలో కలుసుకోవాలి. అలా జరగాలంటే, పెద్ద వాళ్ళు మన సంస్కౄతీ సాంప్రదాయాలను వివరము గ తెలుసుకుని అర్ధమయ్యేలా పిల్లలకి చెప్పగలిగి వుండాలి, చెప్పాలి. పిల్లలు కూడ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలీ - ఇతరులను, ఇతర సాంప్రదాయాలను అనుసరించడము లో అసలైన ఆనందము లేదని అర్ధము చేసుకోవాలి. అలా అని, తాము ప్రతి రోజు తిరిగే బయట ప్రపంచాన్ని వదులుకొమ్మని కాదు. పిల్లలు కూడ ఈ బయట పద్ధతుల గురించి వాళ్ళ ఇంట్లొ వివరము గ మాట్లడితే ఫలితము వుంటుంది.

నా అనుభవము లో, ఇవన్నీ చేస్తే, మన తెలుగు సాంప్రదాయాలు పిల్లలకి అర్ధము అవుతాయి - కాని, నాకు ఒకటి అనిపిస్తోంది. పిల్లలు అర్ధము చేసుకుంటే సరిపోతుందా? మా తల్లి తండ్రులు అలా చేస్తారని కాకుండా, మనకై మనము అలా చేద్దాము అని అనుకుంటే బాగుండదా? మన సాంప్రదాయాల విలువలు తెలిసి, వాటి మీద అభిమానము వుంటేనే పిల్లలు ఇల్లు వదిలేక కూడా వాటిని పాటించే అవకాశము ఎక్కువ. మన పద్ధతుల మీద గౌరవము పెరగాలంటే, ముందర పిల్లలకు, వాళ్ళ తల్లి తండ్రులకు ఒక స్నేహ భావము పెరగాలి. మన అమ్మా నాన్నలు మన ప్రధాన గురువులు, కానీ పిల్లల దగ్గరనుంచి తల్లి తండ్రులు కూడా నేర్చుకోవచ్చును. ఈ స్నేహము తో, తల్లీ కూతుళ్ళు కలిసి వరలక్ష్మి వ్రతాల లాంటి పూజలు చేసుకోవచ్చు, బయట షాపింగ్ కి కూడా కలిసి వెళ్ళవచ్చును. ఆ సమయాలల్లో, ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. అలాగే, తంద్రీ కొడుకులు కూడా స్కూల్లో జరిగిన విషయాల గురించి, TV లో ఆటల గురించి, తెలుగు లో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ పిల్లలు అన్ని చోట్ల పైకి రావాలంటె - తల్లి తండ్రుల, పిల్లల మధ్య స్నేహము చాలా ముఖ్యము.

పిల్లలకు తల్లి తండ్రులకు మధ్యమాత్రమే కాకుండ, తెలుగు పిల్లల మధ్య కూడా స్నేహము ముఖ్యము. పిల్లలు ఇంటి నుంచి పెద్ద చదువులకు బయటికి వెళ్ళినప్పుదు, వాళ్ళ స్నేహితులతో కలిసి తెలుగు మాట్లాడడము, పండగలు చేసుకోవడము జరిగితే చాలా బాగుంటుంది. ఇంటిలో లేనప్పుడేనేమో, మన సాంప్రదాయానికి విలువ నిజముగ తెలుస్తుంది! అప్పుడు, పిల్లలకి వాళ్ళ తల్లి తండ్రుల తో గడిపిన సమయాలు, నేర్చుకున్న పద్ధతులు మనసులో ముందరికి వస్తాయి. తెలుగు పిల్లల మధ్య స్నేహము వుంటే, వాళ్ళు కలిసి, తెలుగుతనాన్ని గుర్తు చేసుకుని పాటిస్తుంటారు. కాలము మారినట్లే, ఈ పద్ధతులు కూడా కొంచెమైనా మారుతాయి. కాని, వాటి సారాంశము అర్ధము చేసుకుని, వీలు వున్నపుడల్లా పాటిస్తే మన తెలుగుతనము తరతరాలకి మిగులుతుందనే ఆశ.

స్వఛ్ఛమైన తెలుగు మాట్లాడే ఉపద్రష్ట కుతుంబంలో పుట్టిన ప్రణవ; తల్లిదండ్రులు, బాల - సత్యం గార్ల నుండి తెలుగు సంస్కృతీ సౌరభాలను అందిపుచ్చుకున్నది. మాట్లాడే తీరులోను, నడవడిలోను పదహారణాల తెలుగుదనాన్ని నింపుక్కుని సాంప్రదాయాలకు, ఆధునికతకు సరికొత్త వారధులను నిర్మిస్తున్నది. ప్రఖ్యాత బర్కిలీ విశ్వవిద్యాలయం నుండి ఈ నెలలో సంస్కృతంలో 'గ్రాడ్యుయేట్' అవుతున్నది. తన పరిశోధనాంశంగా 'వాల్మీకి రామాయణం' ఎంచుకుని, సిధ్ధాంత వ్యాసాన్ని సమర్పిస్తున్నది ప్రణవ. భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం.