అవని

--- మల్లాది రజని

హరిత సుందరమౌ అవని అది ఏది?
కలను కోల్పొవగ కారణమ్మెది?
కళల దాగున్నది కలల మాటున్నది
కనుల కనిపించగా కరువు యగుచున్నది

పచ్చని చేలై పరిమళ వురులై
చల్లని నీడై చక్కని తోడై
పరులకుపకారైన తరు సంపదే
నేడు ధరణి బోసిగ చేసి తరిగిపో చుండగా

పులకింతలనిడు తొలకరిజల్లుల
పలకరింతలకు పలవరించుచు
నీరదములచే కరుణ పొందగా
మేఘ మధనమే శరణు ఆయెగా

జన జీవన జల జీవన మనుగడకాధారమైన
సలిల మెల్ల నేడు చూడ మలినమ్మై పోగా
వర్షా సుందరి రాకకు కర్షకులెల్లరు వేచుచు
నేటి నొసగు మనుచు కన్నీటితో వేడుకొనగ

మానవాళికి మిగుల హాని గూర్చేటి
కర్మాగారాల కలుషితములు
వాహనమ్ములు విడచు థూమమ్ములే గాని
ఎంచి చూడగ నేడు ఏ కోశమున లేవు

ఆహ్లదమును గూర్చు పిల్ల తెమ్మెరలు
వొడలెల్ల పులకించు సుమ సుగంధములు
వాయు కాలుష్యమే వాని దిగ మ్రింగి
ఆయువును హరియింప వాకిటను నిలువంగ

ప్రజా హితము సేయ నాడు పవిత్ర యాగాదులలో
అగ్గళించి వెలిగిన ఆ అగ్ని హోత్రమే నేడు
వేదనల రోదనల పేడిట జన జఠరాగ్నిగ
అణుబాంబుల ప్రయోగాల వున్మాదుల ద్వేషాగ్నిగ
రానణ కాష్ఠమ్మై మారణ హోమమ్మై
జాతి వినాశమ్మునకై తాను రూపు దాల్చినది

హరిత సుందరమౌ అవని అది ఏది?
కళను కోల్పోవంగ కారణమ్మేది?

మల్లాది రజని గారు ఆలిండియా రేదియోలో పని చేస్తూ వృత్తిపరంగా అనేక రచలను చేసి, ఉపన్యాసాలను ఇచ్చారు. ప్రస్తుతం దూరదర్శన్ లో స్క్రిప్ట్ రైటర్ గా చేస్తున్నారు. వారు అనేక కూచిపూడి నృత్య రూపకాలకు కూడా దర్శకత్వం వహించి రూపొందించారు.