ప్రప్రథమ వాగ్గేయకారుడు - అన్నమయ్య

-- కాకుళవరపు రమ

తెలుగు పదకవితామహుడైన శ్రీఅన్నమాచార్య 1408 సంవత్సరంలో వైశాఖమాసం, విశాఖ నక్షత్రంలో కడప జిల్లాలోని తాళ్ళపాక అనే గ్రామంలో నారాయణసూరి, లక్కమాంబ దంపతులకు జన్మించారు. ఆయన చిన్నతనంలోనే ఇల్లు విడిచి తిరుపతికి పారిపోయి అక్కడ ఒక కొండ మీద నిద్రించి కలలో అలమేలు మంగను గాంచి, ఏడుకొండలనెక్కి వేంకటేశ్వరస్వామిని దర్శించి ఆయన మీది అనన్యభక్తితో ఎన్నో పాటలు పాడారు. అన్నమయ్య తన 16వ ఏట మొదలెట్టి శ్రీవేంకటేశ్వర స్వామివారి మీద భక్తి ప్రపత్తులతో సుమారు 32000 సంకీర్తనలను, పదములను అచ్చ తెలుగులో రచించారు. అందులో మనకు 14000 కీర్తనలు మాత్రమే లభించినవి. వీటిని ఆయన కుమారుడైన పెదతిరుమలరాయుడు మరియు మనుమడైన చినతిరుమలాచార్య తాళపత్ర గ్రంధములమీద చెక్కించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంకీర్తనా భండారంలో భద్రపరచి ఉంచారు. అన్నమయ్యకు వేంకటేశ్వరస్వామి మీద ఉన్న అచంచల మైన భక్తిని, ప్రేమను ఈకీర్తనలలో పొందు పరిచి స్వామివారి చరణారవిందములకు పూమాలగా సమర్పించుకున్నారు.

కొంతకాలం తిరుమలలో నివసించిన తరువాత, కుటుంబసభ్యులు అతనిని వెతికి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళి పెళ్ళి చేసారు. పెళ్ళి వలన ఆయనకు తన ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర మీద భక్తి ఎంతమాత్రము తగ్గి పోక, అహోబిలంలోని శ్రీవైష్ణవ గురువైన శతకోపయతి వారికి శిష్యుడిగా మెలిగుతూ, రాముడు, కౄష్ణుడు, నరసిం హుడు, విఠాలస్వామి, అందరు దేవుళ్ళను తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి అవతారంలో చూసుకున్నారు. ఆయన కీర్తనలు ఎంతో భక్తితోను, అనురక్తితోను కూడుకొని ఆధ్యాత్మ మరియు శృంగార రచనలుగా పేర్కొనబడినాయి. మరియు ఒకక్రమం తప్పకుండా ఒక పల్లవి, అప్పుడప్పుడు అనుపల్లవితో కూడుకొని, మూడు కాని నాలుగు కానీ వరుసల చరణాలు కలిగివుండి చక్కటి సంగీత, లయజ్ఞానములతో మేళవించిఉంటాయి.

అన్నమయ్య తన కష్టాలను, సుఖాలను కూడా సంకీర్తన రూపంలో వేంకటేశ్వరస్వామి వారికి విన్నవించుకొన్నారు. అందుకనే ఆయన పాటలు-పదాలు కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతన కలిగి దైవిక విలువలను మనందరికీ గుర్తు చేస్తాయి "ఆకటి వేళల అలపైన వేళల వేకువ హరినామమే దిక్కెమరి లేరు" "మాయా మోహము మానదిదీ, శ్రీ అచ్యుత నీ చిత్తమే కలదీ - ఎంత వెలుగునకు అంత చీకటి, ఎంత సంపదకు అంత ఆపద" ఆయన శృంగార కీర్తనలన్నీ కూడా ఎంతో రక్తితో కూడుకొని దేవుడు సాంగత్యాన్ని కోరుకునేలా చేస్తాయి.

ఆయన పదాలలో యెంతో కష్టమైన సాహిత్య సంగీతాలు కలిసివుండి, ఆ నడవడి ఆయన మనసుకి మెల్లగా కొంతకాలానికి అలవాటు పడిపోయేలా చేసింది. తెలుగులో అంత చాకచక్యంతో పదకవితలు రాయడంలో ఆయనే ప్రధముడు.అందువలననే ఆయన మొట్టమొదటి వాగ్గేయకారుడిగా పిలవబడ్డారు.

అన్నమయ్య సాళువనరసింగ రాయలు వారి కొలువులో ఆస్థాన గురువుగా ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామి మీద ఉన్న మధురభక్తితో తనను ప్రియురాలిగా, స్వామివారిని తన ప్రియుడుగా ఊహించుకుంటూ శృంగారంతో కూడిన ఒక కీర్తనను గానం చేసారు. రాజుగారు ఆ పాట విని ఎంతో ముగ్ధుడై ఆయన రచనలో తననుకూడా అనువదిస్తూ రాయమని ఆజ్ఞాపించగా, అన్నమయ్య తాను అలా చేయడానికి నిరాకరించారు. రాజుగారు అది అవమానముగా భావించి, సహించలేక ఆయనను ఇనుప గొలుసులతో బంధించారు. అన్నమయ్య భక్తితో దేవుడిని వేడుకోగా ఆ ఇనుప గొలుసుల బంధాలు తెగిపొయినాయి. రాజు అప్పుడు అన్నమయ్య ప్రతిభను గుర్తించి తనను క్షమించమని వేడుకోగా అన్నమయ్య విరక్తితో రాజు గారి ఆస్థానాన్ని వదిలి, ఆ వేంకటేశ్వర స్వామి వారి సేవల కోసం తిరుమలకు వెళ్ళి అక్కడే భగవంతుని సన్నిధిలో వేదాంతాన్ని కలబోసిన సంకీర్తనలు రచించి, గానం చేసారు. ఆయన కీర్తనలు మంత్రములవలే చిరకాలము నిర్మల భక్తిని చాటింప చేస్తున్నాయి.

"అదివో అల్లదివో శ్రీ హరివాసము, పదివేల శేషుల పడగలమయము"

"అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వేంకటేశు మంత్రము"

దురదృష్టవశాత్తు మనము అన్నమయ్య సంగీతాన్ని మటుకు భద్రపరుచు కోలేక పొయాము. ఆయన రాసిన తాళపత్ర గ్రంధాలలో రాగం గురించే తెలియ చెప్పబడి ఉంది కానీ, అవి ఏ తాళమో లేక ఏ సంగీతంతో సమకూర్చినవో తెలయ చెప్పలేదు. అందుకనే మనం అన్నమయ్య సంకీర్తనలను గానం చేస్తున్నప్పుడు వాటిలోవుండే అర్ధానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి, ఎందుకంటే అవి సంగీతంతో కూడుకొన్నవి కాకుండా, ఎంతో సాహిత్య పరంగా రచించినవి. ఆయన రచనలు ఎంతో గొప్ప పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకొన్న సంగీత విద్వాంసులు గానం చేసారు, ఇప్పటికీ చేస్తున్నారు కూడా! మనలాంటి మామూలు ప్రజనీకానికి కూడా ఈ కీర్తనలు అందుబాటులో ఉన్నాయి.

ప్రతి సంవత్సరం సిలికానాంధ్ర జరిగే సారధ్యంలో భారత దేశమంతటా జరిగే అన్నమాచార్య జయంతోత్సవాలలో ఎంతోమంది పాల్గొని కృతకృత్యులౌతున్నారు కూడా. ఈ ఏడుకూడా మే నెల 2నుండి ఆసేతుహిమాచలం జరిగే 'అఖిల భారత అన్నమాచార్య జయంతుత్సవం'లో వివిధ కళాయలాలు, ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వసంస్థలు పాల్గొంటున్నాయి. ఆయన 1503 ఫాల్గుణ మాసం, బహుళ ద్వాదశిరోజు భగవంతుడిలో ఐక్యమైపోయారు.

సర్వేజనా సుఖినో భవంతు!