|
ధారావాహిక -
అంతర్ముఖం
- 7 |
-
రచన : యండమూరి వీరేంద్రనాథ్
|
|
చిరునవ్వులు చిందిస్తూ, సరదాగా
నవ్వుతూ, నవ్విస్తూ, చురకలు అంటిస్తూ, జోకులు
వేస్తూ తిరిగే సత్యం లోలోపల కన్నీళ్ళు మింగుతూ
బ్రతుకుతున్నాడు కాబోలు.
సత్యం చెప్పడం ప్రారంభించాడు.
నాకు ఒకే చెల్లి, అమ్మపోయి నాలుగేళ్ళయింది.
నాన్న నా దగ్గిరే ఉంటాడు. కొడుగ్గా ఆయన బాధ్యత
నాదేననీ వప్పుకుంటాను. చెల్లి పెళ్ళి
పెట్టుపోతలు నా బాధ్యతగా నేనే చేశాను.
అడిగినవన్నీ ఇచ్చాము. అప్పట్లో నాన్న రిటైరయిన
డబ్బు చేతిలో ఉన్నందువల్ల ఎలాంటి
ఇబ్బందికలుగలేదు. దాన్ని మా మేనత్త కొడుక్కే
ఇచ్చాం. దగ్గిరవాళ్ళు, ఎలాంటి సమస్యలు
ఉండవనుకున్నాను. కానీ అదిప్పుడు వాళ్ళింట్లో
నరకయాతన అనుభవిస్తోంది. మా బావ వాళ్ళ అమ్మ
మాటకు ఎదురు చెప్పలేడు. భార్యతో సినిమాకు
వెళ్ళాలన్నా అమ్మ పర్మిషన్ ఇవ్వాలి.
వాళ్ళిద్దరూ నవ్వ్తుతూ కబుర్లు చెప్పుకోవడం
కూడా ఆవిడ సహించలేదు. కొడుకు దూరమైపోతున్న
దిగులేమో అంటె అది కాదు. ఆమెకు మరో కొడుకు,
కూతురు ఉన్నారు. కూతుర్దా ఊరే. ఆమె నెలలో ఇరవై
రోజులు తల్లి దగ్గరే ఉంటుంది. నా చెల్లెలు మా
ఇంటికి రావాలంటే నేను వెళ్ళి అత్తగారి పర్మిషన్
తీసుకోవాలి. అదీ ఒక్క రోజుకంటే ఎక్కువ
ఉండటానికి వీల్లేదు. ఇక ఆవిడ గొంతెమ్మ కోరికలకు
అంతులేదు. దేశంలో ఏ మూల ఏ కులంలో అత్తగారిగా
రాబట్టుకోవాలసిన ఆచారాలు ఏమైనా ఉన్నాయేమోనని
వెతుకుతుంది. నా బాధ ఏమిటంటె అన్నీ ఇచ్చి నా
కూడా నా చెల్లెలు సుఖపడటం లేదు.
అడగ్గానే ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అలా అలవాటు
చెయ్యడం మీ తప్పుకాదా? ఆ అమ్మాయిని అంత
కష్టపెడుతుంటే మీరెందుకు ఊర్కోవడం? వెళ్ళి
పదిమందిలో నిలదీయచ్చుగా? అన్నాను.
ఆ విషయం నేను ఆలోచించలేదంటావా? దేన్నయినా
ఎదుర్కోగలనన్న ధైర్యం నాకుంది. కానీ ఈ విషయంలో
నేను అశక్తుడనయిపోతున్నాను. కారణం నా శత్రువు
నా ఇంటిలోనే ఉన్నాడు. అతను మా నాన్న. మా
చెల్లి అత్తగారు, ఆయనకి స్వయానా అక్క. అక్క
మాటంటే ఆయనకు ఈ నాటికీ వేదం. ఆవిడ ఏం చేసినా
అది తప్పుకాదు. ఆయన వాదన ఏమిటంటే లోకంలో ఈ
రివాజులన్నీ సహజం. అత్తగారు కోడలిమిద అధికారం
చూపించడం కూడా సహజమే. ఆడపిల్లగా నా చెల్లికి
అది భరించక తప్పదు. ఆవిడ అడిగేవి తెచ్చిచ్చే
తాహతు నీకు లేదా? వెళ్ళు, నీ అత్తగారిని అడిగి
తీసుకురా, అంటాడు నాతో. కట్నం తీసుకోకూడదని,
వాళ్ళనించి ఏదీ ఆశించకూడదనీ నా ఆదర్శం. వాళ్ళు
కలిగిన వాళ్ళే అయినా నేనేమీ తీసుకోలేదు. వాళ్ళ
అమ్మాయి పేర మీద ఏదో ఆస్థి ఇచ్చుకున్నారు.
అదేమిటో కూడా నాకు తెలీదు. అదీ ఆయన కోపం. ఆ
ఆస్థికాస్త అమ్మేసి చెల్లికి కలర్ టి.వి.
వి.సి.ఆర్., బావకి మోటార్ సైకిల్
కొనివ్వచ్చుగా అంటాడు. పెళ్ళికి లక్షరూపాయలు
కట్నం ఇచ్చాం. దాంతో వాళ్ళే అన్నీ
కొనుక్కొవచ్చుగా అంటాను నేను. మా అత్తయ్య కూడా
చాలా లౌక్యురాలు. మా నాన్నని చాలా అభిమానంగా
చూస్తుంది. ఆయనకు డయాబిటీస్. కానీ స్వీట్లంటె
ఆయనకు చాలా ఇష్టం. ప్రేమగా అన్ని స్వీట్లు
ఆవిడ చేసిపెడుతుంది. అది తనపట్ల అభిమానంగా
మాత్రమే అర్ధం చేసుకుంటాడాయన. ఆయన ఎదురుగా నా
చెల్లెల్ని ప్రేమగా చూస్తుంది. అందుచేత నా
చెల్లెలు అక్కడ కష్టాలు అనుభవిస్తోందంటె ఆయన
నమ్మడు, సత్యం ఆగాడు.
ఈ సమస్యలు చాలా ఇళ్ళలో ఉండేవే. ఒక ఇంట్లో కలసి
జీవించే మనుష్యుల్లో పరస్పర అవగాహన, ఐకమత్యం
లేకపోతే దాన్ని అవతలవాళ్ళు అడ్వాంటేజీగా
తీసుకుంటారు. పదిమందిలొ తెలిస్తే అవమానం అన్న
భయం కొందరిని అదుపులో ఉంచడానికి
ఉపయోగపడుతుంది. ఆ భయం లేనపుడు వాళ్ళను
కంట్రోలు చెయ్యడం కష్టం.
సత్యం అన్నాడు. చెల్లెలికి నేనున్నానని ధైర్యం
చెబుతూ, వయసైపోయి ఆవిడ పోతే నీకీ కష్టాలు
ఉండవంటూ, నా అంతరాత్మకు వ్యతిరేకంగా చెప్తూనే
ఉన్నాను. కానీ మొన్న తెలిసిన విషయం నన్ను చాలా
బాధపెట్టింది. నేనొక ఆదర్శాన్ని నమ్మాను.
నమ్మినదాన్ని ఆచరణలో పెట్టాను. కాదు.
పెట్టాననుకునే ఇన్నాళ్ళు మురిసిపోయాను. నన్ను
చూసి నేనే గర్వపడుతూ సంతోషపడుతూ వచ్చాను. కాని
నవ్వుల పాలయ్యానని నాకు తెలియదు. సత్యం
కళ్ళలోనే కాదు కంఠంలోనూ బాధ ధ్వనించింది.
మొన్న ఆదివారం నాడు చెల్లెలి దగ్గరకు
వెళ్ళాను. అదృష్టవశాత్తు మా అత్తయ్య, బావ
లేరు. ఏదో పెళ్ళికి వెళ్ళారట. అవకాశం
దొరికిందని మా చెల్లెలు జరిగిన విషయాలు
చెప్పింది. ఈ మధ్య మా నాన్న వాళ్ళింటికి
వెళ్ళినపుడు ఆవిడ ఆయనతో మాట్లాడటం చెల్లెలు
విన్నదట. నా చెల్లి చెప్పిన విషయం వింటుంటే
కోపంతో వణికిపోయాను. నా పెళ్ళిలో నేను పైసా
కూడా కట్నం తీసుకోనంటే పెళ్ళికూతురికి నగలు,
బట్టలు పెట్టకపోతే బావుండదని నా చేత లోన్
పెట్టించి ఇరవై వేలు తీసుకున్న నాన్న, నాకు
తెలియకుండా మా మామగారి దగ్గర పెళ్ళి ఖర్చులకని
మరో యాభైవేలు తీసుకొచ్చాడట. అది నాకు
చెప్పద్దని బతిమాలుకున్నాడట. ఇప్పుడు అదే
రకంగా మరో పాతిక వేలు మళ్ళీ మా మామగార్ని
అడిగి తెచ్చి అల్లుడికి వీడియో, వాషింగ్
మెషిన్ కొనివ్వమని వాళ్ళక్కగారు ఆయనకు సలహా
ఇస్తోంది. ఆ విషయం తెలుసుకుని నేను మా మామగారి
ఊరెళ్ళాను. మా నాన్నకు డబ్బు ఇచ్చారా.. అని
నేను నిలదీశాను. వాళ్ళు నిజమేనని
ఒప్పుకున్నారు. అంతేకాదు, పండగలకీ, పబ్బాలకీ
ఏవేవో కావాలని ఆయన వాళ్ళకు వ్రాయడం, వాళ్ళు
అతి మామూలుగా అవి మాకు పంపడం జరుగుతున్నాయి.
ఆయన ఇక్కడి నుంచి వాటిని తన కూతురికి సరఫరా
చేస్తున్నాడన్నమాట. సత్యం మొహం ఎర్రగా
కందిపోయింది. తన అత్తగారింట్లో అతను ఎంత
అవమానం జరిగినట్లు ఫీలవుతున్నాడో నేను
ఊహించగలను.
తల్లిదండ్రులంటే బిడ్డల సుఖం కోరుకుంటారనీ,
బిడ్డలకోసం ఎంతటి త్యాగమైనా చేస్తారని నమ్మిన
సంస్కృతి మనది. కడుపు మాడ్చుకునయినా బిడ్డలకు
కడుపునిండా తిండిపెట్టె త్యాగధనులని నమ్మకం
మనది. కాని అందరు తల్లి దండ్రులు అలాంటివారు
కాదు.
తల్లీ, దండ్రీ, కొడుకు, కూతురు, అన్నా,
చెల్లెళ్ళు ఎవరయినా పైకి కనిపించే ఆకారం
వెనుక, లోపల మనిషో, పిశాచమో, రాక్షసుడో లేక
వాటి మిశ్రమమో గల మరో ఆకారం ఉంటుంది. బుద్ధి
అనేది మనిషికి మాత్రం లభించిన వరం. ఏ జంతువుకీ
లేని ప్రత్యేక గుణం. కానీ మన మాటల వల్ల చేతల
వల్ల అవతల మనిషిని మోసం చేయడానికే ఆ బుద్ధిని
ఉపయోగించవలసి రావడం మన దురదృష్టం.
హ్యూమన్ రిలేషన్స్.. బ్లడీ హ్యూమన్
రిలేషన్స్.,
* * *
ఆఫీసు నుంచి ఇంటి దగ్గర బస్సు దిగుతుంటేనే
ఎదురయ్యాడు శ్రీనాథ్.
ఎప్పుడొచ్చావు క్యాంపునుంచి, అడిగాను.
ప్రొద్దుటే.. నేను వచ్చేసరికి నువ్వు లేవు.
త్వరగా వెళ్ళిపోతాయావని వీరభద్రయ్యగారు
చెప్పారు. నీతో మాట్లాడాలి. అలా పార్కులో
కూర్చుందాం పద, స్కూటర్ మీద తీసుకెళ్ళాడు
శ్రీనథ్. నాకేదో అర్ధమయినట్లే అన్పిస్తోంది.
కాని నేనేం మాట్లాడలేదు.
ఇద్దరం పార్కులో ఒక పక్క కూర్చున్నాం.
శ్రీనాథ్ ఉపోద్ఘాతం లేకుందానే మొదలుపెట్టాడు.
రాత్రి ట్రెయిన్ లో ఒక ఫ్రెండ్ కనిపించాడు.
మల్లికని సినిమాహాల్లో ఎవరో వ్యక్తితో
చూశానంటున్నాడు. ఏమంటావు? అలాంటి తిరుగుళ్ళు
మొదలుపెట్టిందంటావా? అడిగాడు.
అదేం అనుమానం శ్రీనాథ్. ఎవరో మగాడితో
కనిపిస్తే అది చెడు తిరుగుడుగా అనుకోవడమేమిటి?
వాళ్ళ బంధువులెవరయినా అయిఉండవచ్చుగా..
ఆ స్నేహితుడికి మా వాళ్ళందరూ తెలుసు.
వాళ్ళన్నయ్య ఇంటి దగ్గరే ఉంటాడు..
ఎవరో తెలుసుకోకుండా అనుమానించడం తప్పు
శ్రీ...బంధువు కాకపోతే పరిచయస్థుడై ఉండవచ్చు.
అనుకోకుండా ఎక్కడో కలిసి ఉండవచ్చు. అనుకోకుండా
గండిపేట దగ్గర కూడా కనిపించారంతావా?
నేను మాట్లాడలేదు..
ఆ న్సేహితుడికి తెలుసు. నేను మల్లికని ఎంతగా
ప్రేమించి పెళ్ళి చేసుకున్నానో! ముందుగా అతడేం
చెప్పలేదు. తర్వాత మల్లిక ప్రవర్తన గురించి
బాధగా చెప్పుకుంటే అప్పుడు చెప్పాడు.
చూడు శ్రీనాథ్. అవన్నీ అనవసరమైన అనుమానాలు. ఈ
రోజుల్లో ఒక మగా, ఒక ఆడ స్నేహం సాధారణం. ఏదో
సందర్భాంలో ఏదో రకంగా కలవడానికి అవకాశం
లేదంటావా? నీ మనసులో ఏమైనా ఉంటే మల్లికనే
డైరెక్ట్ గా అడుగు. ముఖ్యంగా మన బాధలు అందరి
వద్దా ప్రస్తావించడం మంచిది కాదని నా
ఉద్దేశ్యం. చివరి మాట మాత్రం చాలా సిన్సియర్
గా చెప్పాను.
నేనూ అలాగే అనుకున్నాను. కాని వాడలా చెప్పగానే
ఏదో బాధ. ఇప్పుడదే పని చేస్తాను. పద వెళదాం.
శ్రీనాథ్ లేచాడు. అతడి ముఖంలో రిలీఫ్ తో పాటు
ఆనందం. అతడి మనసు వికలం చేయడానికి క్షణం
పట్టదు. కాని అదంత అవసరంగా నాకు అనిపించలేదు.
కొన్ని నిజాలు ఎంత ఆలస్యంగా తెలిస్తే అంత
మంచిది. మరెవరి ద్వారానో కంటే అసలు వాళ్ళ
ద్వారా తెలుసుకోవడం మరీ మంచిది.
నేను లేస్తుండగా, వెన్నెముక క్రింది భాగంలో
నొప్పిగా అనిపించింది. కొద్ది రోజులుగా తరచూ ఈ
నొప్పి వస్తోంది. కాసేపటికి సర్దుకుంటుంది.
నేను నడకకొనసాగించాను. ఈ సారి నొప్పి కాస్త
ఎక్కువగానే ఉంది.
ఆకాశం నిండా నల్లటి మబ్బులు, రాబోయే తుఫానుకి
సంకేతంలా ఉన్నాయి.
* * *
నేను పర్మనెంట్ అయినట్లు ఆర్డర్సు
అందుకున్నాను. అంత వరకు చేసిన టెంపరరీ సమయం
కూడా కలుపుకుని జీతం ఎరియర్స్ ఇవ్వమని
హెడ్డఫీసు నుంచి మా ఆఫీసర్ కి లెటర్ కూడా
వచ్చింది. అది ఆశించని అదృష్టం.
ఆఫీసులో అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్పి
వెళ్తున్నారు. ఒక్క పరంథామయ్య గారు మాత్రం
పర్మనెంట్ అయిపోయానని గొప్ప ఫీలవడం కాదు.
కష్టపడి పనిచెయ్యాలి. ఇన్నాళ్ళూ టెంపరరీ
కాబట్టి ఆషామాషీగా గడిచిపోయింది. ఇప్పుడలా
కాదు అన్నాడు.
పై ఆఫీసరు స్వయంగా వచ్చి అభినందనలు చెప్పడమే
కాకుండా హాల్లో అందరి ఎదుటా నా సిన్సియారిటీని
పొగడడం ఆయన భరించలేకపోయాడు. ఆ రోజంతా
చిర్రుబుర్రులాడుతూనే ఉన్నాడు.
పర్మనెంట్ అయినందుకు పెద్ద ఉద్విగ్నంగా ఏమీ
లేదు. రకరకాల ఉద్యోగాలు చెయ్యడానికి అలవాటు
పడ్డవాడిని. నా బ్రతుకు తెరువుకి ఎక్కడో ఒక
చోట చిన్న ద్యోగం తప్పక దొరుకుతుందన్న నమ్మకం
నాకు ఉంది. ఆర్దికంగా ఇక ఎలాంటి ఇబ్బంది
ఉండదన్న సంతోషం తప్ప గొప్పగా ఫీలవడానికేమీ
లేదు. ఇకపోతే సిన్సియర్ గా ఉద్యొగం చేయడం
అన్నది గొప్పకాదు. అది కర్తవ్యం.
ప్రొద్దుట నుంచీ చుస్తున్నాను. ముసలాడికి
ఎందుకంత జెలసీ? అడిగాడు సురేష్.
అది జెలసీయా? ఒక అకౌంట్స్ ఆఫీసర్ కి మామూలు
ఉద్యోగిని చూసి అసూయపడాల్సిన అవసరం ఏముంది?
వరుల జాబితాలో నా విలువ పెరిగిందనా, లేక అతి
తెలివి పరులైన తన కూతుళ్ళతో సమాన స్థాయిలోకి
వచ్చానన్న అసూయా అది?
ఎదుటి వాడి కష్తాలు, బాధలు చూసి పైపైన
సానుభూతి చూపిస్తూ లోపల తృప్తిపడే కొందరు
వ్యక్తులు ఉంటారు. ప్రపంచంలోని మంచి అంతా తమకే
జరిగినా వాళ్ళలో తృప్తి ఉండదు. పరంధామయ్యది
అలాంటి మనస్తత్వం.
పరంధామయ్య లాంటి వాళ్ళ గురించి ఎక్కువగా
ఆలోచించడం కూడా అనవసరం. అదొక టైం వేస్టు.
అంటాడు సత్యం. తెలుసు. కానీ ఆలోచిస్తూనే
ఉంటాం. చర్చిస్తూనే ఉంటాం. టైం వేస్టు
చేసుకుంటూనే ఉంటాం.
చిత్రమేమిటంటే, అక్కడ పరంధామయ్య ఇంట్లో కూడా,
వాళ్ళు మా గురించి ఇలాగే చర్చిస్తూ ఉంటారు.
* * *
తలుపుమీద ఎవరో కొడుతున్న శబ్దానికి మెలుకువ
వచ్చీంది. టై చూస్తే నాలుగవుతోంది. ఇంత
ప్రొద్దుటే ఎవరొచ్చారు? వెళ్ళి తలుపు తీశాను.
వచ్చింది శ్రీనాథ్.
శ్రీనాథ్ ముఖం ఎర్రగా కందిపోయి ఉంది. కళ్ళు
అగ్ని గోళాల్లా మండుతున్నాయి. మనిషి విపరీతమైన
అలజడికి లోనయినట్లు సన్నగా ఒణుకుతున్నాడు.
ఏం జరిగింది శ్రీనాథ్? అని ఆడిగాను. నా
ప్రశ్నలో ఆరాటం లేదు, నిర్లిప్తత తప్ప.
అదృష్టవశాత్తు శ్రీనాథ్ అది గమనించలేదు.
రాత్రి బాగా కొట్టాను. చితకబాదాను. అయినా నాకు
కోపం తగ్గటం లేదు. తప్పు చేశానని అనిపించలేదు.
మళ్ళీ ఏం జరిగింది. ఈ మధ్య మల్లికలో చాలా
మార్పు వచ్చింది. ఇంటిపట్టునే ఉంటుందని
చెప్పావుగా?
అవును. అదంతా నటన. నాకు అనుమానం రాకుండా
వేషాలు వేసింది. ట్రైయిన్ లేటయి క్యాంపు నించి
రాత్రి లేటుగా వచ్చాను. రెండు దాటింది.
అప్పుడు తలుపు తెరిచిన దాని వేషం చూస్తే విషయం
తెలిసిపోయింది. పల్చటి నైటీ, తలనిండా
నలిగిపోయిన పూలు చూడగానే అర్ధమయింది. లోపల
వెతికితే ఎవరూ లేరు. బెడ్ రూమ్ లో సిగరెట్
పీకలున్నాయ్౯ఇ. అడిగితే వాళ్ళన్నయ్య వచ్చి
వెళ్ళాడంది. వాడు తాగే బ్రాండేననుకో... కానీ
దాని ఆకారం చూస్తే నాకు తెలియదా? అది రాత్రి
ఎవరితోనో గడిపిందన్న విషయం మాత్రం నిజం. నాకు
ప్రూఫ్ దొరకలేదు గానీ, దొరికితే వాణ్ణి,
దాన్ని కూడా నరికిపారేద్దును. అన్నాదు. అతన్ని
చూస్తే జాలివేయలేదు. విసుగేసింది.
నాకు ఇంట్లోకి వెళ్ళాలని లెదు. ఇక్కడే
పడుకోనా? అడిగాడు శ్రీనాథ్. దానికేముంది
పడుకో..
శ్రీనాథ్ పడుకున్నాక సిగరెట్ వెలిగించి
కూర్చున్నాను.
ఆ రోజు స్నేహితుడు చెప్పినప్పటి నుంచి
శ్రీనాథ్ లో అనుమానం పెరుగుతూనే ఉంది అన్నమాట.
మల్లిక ఈ కొద్ది రోజులనుంచి అక్కసారిగా అతడి
మీద ప్రేమ ఒలకపోస్తోంది. అయినా అతడి అనుమానం
తీరలేదు. అందుకే కావాలని అర్ధరాత్రి దాటాక
ఇంటికి వచ్చాడు.
అక్కడ జరిగిందేమిటో నాకు తెలుసు. చిట్టుపక్కల
అందరూ రాత్రి పదింటికే పడుకుంటారు. అతగాడు
పదకొండు దాటాక వచ్చాడు. మళ్ళీ రెండో ఆట వదిలే
సమయానికి వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు
శ్రీనాథ్ అతడు వెళ్ళిపోయాక వచ్చాడు. లేకపోతే
అతడిలాంటి ఆవేశపరు"డు ఆ సమయంలో ఏమయినా
చేస్తాడు.
ఇక వాళ్ళ దాంపత్యం ఎలా గడుస్తుంది? ఆవిడ తన
తప్పు ఒప్పుకోదు. రెడ్ హేండెడ్ గా దొరకదు
కాబట్టి ఆమెకు ధైర్యం. ఇతడిలో అనుమానం పోదు.
ఇద్దరూ దెబ్బలాడుకుంటూ, ఒకరినొకరు
నిందించుకుంటూ అలా కలిసే ఉంటారు కాబోలు.
ఏమిటీ మానవ సంబంధాలు? మూడు ముళ్ళు వేయడమంటే
జీవిత కాలపు బంధం అని నమ్మిన మనుధర్మంలో, ఆ
బంధం అంత బలంగా ఎందుకు నిలబడటం లేదు?
సమాజానికో, ఇతర పరిస్థితులకో భయపడి, పిల్లలతో
అడ్జెస్ట్ అయి కలిసి ఉండడం. పైకి చిరునవ్వులు
పులుముకుని కనిపిస్తూ లోలోపల వికృతంగా,
ద్వేషంతో నలిగిపోతున్న బంధాలివి. గదుల్లో
దెబ్బలాడుకుంటూ, గుమ్మం దాటగానే అప్యాయతనీ,
అత్మీయతనీ ఒలకపోస్తూ పదిమందిలో అదొక గొప్పగా
భావిమ్చే పటాటోపపు భేషజాలివి. ఈ బలవంతంగా
కలిసి ఉండటం అనేదు ఎందుకు జరుగుతుంది.
స్త్రీ తన కాళ్ళ మీద తాను నిలబడే ధైర్యం
లేకపోవడం వల్లనా?
తన ఇష్టానుసారంగా బ్రతికే స్త్రిని
బరితెగించిందని.. సమాజం ముద్ర వేస్తుందన్న
భయంతోనా?
మరి అదే పని పురుషుడు చేస్తే ఏమంటుంద్?
(ఏమంటుందో నాకు కొన్ని రోజుల తర్వాత ఎదురింటి
మన్మధరావు ద్వారా తెలిసింది). నాకెందుకో
మల్లిక పట్ల కోపం కూడా రాలేదు. నా కెప్పుడయినా
కోపం వస్తే.. అది అవతలి మనుష్యుల చేతగానితనం
పట్లే వస్తుంది.
శ్రీనాథ్ నిద్రలోనే ఏడుస్తున్నాడు. బహుశా
భార్యను కొట్టినందుకు కలలో పశ్చాత్తాప
పడుతున్నాడేమో..
* * *
|
|
|
|
|
|
|
|
మీ అభిప్రాయాలు,
సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం
ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please
leave your opinion here) |
|
సుజనరంజని
మాసపత్రిక
ఉచితంగా మీ
ఇమెయిల్
కి పంపాలంటే
వివరాలు
కింది
బాక్స్‌లో టైపు
చేసి
సబ్‌స్క్రైబ్
బటన్ నొక్కగలరు.
|
|
గమనిక: మీ
విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము;
అనవసర టపాలతో మిమ్మలను వేధించము.
మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ,
సందర్భోచితంగానూ తెలుపవలసినది.
|
|
(Note: Emails will not be shared to
outsiders or used for any unsolicited
purposes. Please keep comments
relevant.)
|
|
|
|
|