|
.jpg)
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిచుట్టూ
తిరుగుతుంది.
అలాగే- తెలుగుభాష ఇప్పుడు తన చుట్టూ తాను
తిరుగుతూ సాంస్కృతిక శాఖ చుట్టూ తిరుగుతోంది.
తనచుట్టూ తాను ఎందుకు తిరుగుతోందంటే
ప్రజలచుట్టూ తిరిగేందుకు, జనంలోకి చొచ్చుకు
వెళ్లేందుకు సర్కారువారు వీలు కలిపించలేదు
కనుక.
కల్చరల్వాళ్లచుట్టూ ఎందుకు తిరుగుతోందంటే
భాషకు సంబంధించిన సమస్త వ్యవహారాలమీద, సమస్త
సంస్థలమీద కర్రపెత్తనాన్ని ఏరికోరి వారికే
సర్కారు కట్టబెట్టింది కనుక.
తిరుపతి సంబరాలకు ముందు తెలుగు భాష నాథుడు లేని
అనాథ. రంగ రంగ వైభవంగా జరిగిన ప్రపంచ సభల్లో
వరసబెట్టి ముఖ్యమంత్రి వరాలచ్చిన తరవాత కూడా
అది నాథుడెవరో తెలియని అనాథే!
వరాలిచ్చి ఊరుకోకుండా కిరణ్రెడ్డిగారు
ముఖ్యమైన వాటిపై ఆర్డర్లుకూడా ఇప్పించారు.
సంతోషమే. అన్ని స్థాయిల్లో పరిపాలన తెలుగులోనే
నడిపిస్తాం; బడిపిల్లలకు అన్ని క్లాసుల్లో
తెలుగు నేర్పిస్తాం; చచ్చిన అకాడమీలను
బతికిస్తాం అని చకచకా ఉత్తర్వులు రావటం
దశాబ్దాల నిస్తబ్ధతను గుర్తుంచుకుంటే పెద్ద
విశేషమే. కాని జీవోలివ్వగానే సరిపోదు. చేసిన
వాటిని, ఇకముందు చేయబోయే వాటిని సజావుగా అమలు
జరిపించేందుకు గట్టి ఏర్పాటుకూడా ఉండాలి.
ఎప్పటినుంచో నలుగుతున్న ప్రత్యేక మంత్రిత్వశాఖ
డిమాండుకు సర్కారు సరే అనటంతో ఆ లోటూ తీరిందనే
భాషాభిమానులు మురిశారు. తిరుపతి తిరునాళ్ళు
ముగిసి నాలుగు నెలలయినా భాషామంత్రి జాడ లేడు.
పెట్టబోయే కొత్త శాఖ నామరూపాలు ఏమిటన్నదే
తెలియదు.
ప్రధానంగా భాష, సాహిత్యాలకు సంబంధించిన ప్రపంచ
మహాసభలను కల్చరల్ ప్రోగ్రాంగా పరిగణించి,
మునె్నన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా
సాంస్కృతిక శాఖను పీటలమీద కూచోబెట్టడమే వింత.
భాషకు వేరేశాఖను ప్రకటించిన తరవాతకూడా
దానిమానాన దాన్ని బతకనివ్వకుండా అదేదో తమ
బ్రాంచాఫీసు అయినట్టు సాంస్కృతిక శాఖ ఫీలైపోవటం
ఇంకా అతి. సంగీతం, నాటకం, లలితకళలు గట్రాలు
సంస్కృతికిందికి వస్తాయి కాబట్టి వాటి బాపతు
చచ్చి బతికిన అకాడమీలను కల్చరల్ డిపార్టుమెంటు
పరిధిలోకి తేవటంలో తప్పులేదు. కాని భాష,
సారస్వతాలతో బాదరాయణ సంబంధం ఉంటుందనుకునే
సాహిత్య అకాడమీకి కూడా సాంస్కృతిక మంత్రిని
పెద్ద కుర్చీలో కూచోబెట్టి సాంస్కృతికశాఖ శాఖ
అధికారులకే అధికారం ఇవ్వాలా? భాషకోసం విడిగా
ఒక మంత్రిత్వశాఖను ఏర్పరిచాక అధికార భాషా
సంఘమనే అజాగళస్తనాన్ని రద్దుచేస్తామంటే ఎవరికీ
అభ్యంతరం ఉండనక్కర్లేదు. కాని- ముఖ్యంగా ఉన్నత
విద్యకు సంబంధించిన తెలుగు అకాడమీ, తెలుగు
విశ్వవిద్యాలయాలను సాంస్కృతికశాఖ గొడుకుకిందకి
నెట్టాలన్న ప్రతిపాదనకు అర్థం ఉందా?
ఏణ్నర్థంకింద ఇలాంటి బ్రెయిన్వేవే వచ్చి
తెలుగు యూనివర్శిటీని లాక్కుపోయి సాంస్కృతిక
పందిరికింద కట్టేస్తే ఏమయింది? తెలుగు
విశ్వవిద్యాలయానికి యు.జి.సి. నిధులు
బిగదీసింది. అన్నివైపుల నుంచీ గగ్గోలు పుట్టాక
ప్రభుత్వం నాలుక కరచుకుని ఆ యూనివర్శిటీని
మళ్ళీ ఉన్నత విద్యాశాఖకు బదలాయించింది. ఒకసారి
చేతులు కాలిన తరవాతకూడా అదే తెలివితక్కువ పనిని
మళ్ళీ చేయబూనడాన్ని ఏమనాలి?
కేంద్రంలో భాషా వ్యవహారాలు మానవవనరుల శాఖలోని
ఉన్నత విద్య విభాగం కింద... సాంస్కృతిక విషయాలు
సాంస్కృతిక శాఖకింద చేరి ఉన్నప్పుడు రాష్ట్రంలో
మాత్రం భాషమీద కల్చరల్ స్వారీ ఎందుకు?
భాషాభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భాషా
మంత్రిత్వశాఖకు చేయదలచుకుంటే ఎన్ని పనులు లేవు?
పాలనాభాషగా, బోధనా భాషగా తెలుగు అమలును
కనిపెట్టి ఉండటానికే సంవత్సరానికి 365 రోజులు
చాలవు. శాసనాలను తెలుగులో చేయించేసరికే తాతలు
దిగివస్తారు. అన్ని దుకాణాల, కార్యాలయాల
బోర్డులు తెలుగులో ఉండాలన్న రూలును
రాష్టమ్రంతటా అమలు జరిపించటమే చాలా పెద్దపని.
విదేశాలలోని వారి భాషావసరాలను తీర్చటం,
తెలుగులో ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహించటం,
భాషాపరమైన పరిశోధన, అధ్యయనాలను చేయించటంలాంటి
విధాయకాలకే సజావుగా చేయదలిస్తే ఎంత సమయమూ
సరిపోదు. అతి ముఖ్యమైన అలాంటి విధులమీద
దృష్టిపెట్టటం మాని తెలుగు యూనివర్శిటీ, తెలుగు
అకాడమీలాంటి ఉన్నత విద్యాసంస్థలమీద పుట్టబోయే
భాషాశాఖ పెత్తనం చేస్తానన్నా ఆక్షేపించాల్సిందే.
అలాంటిది భాషతో లంకేలేని సాంస్కృతికశాఖ
తీరికూర్చుని తనకు మాలిన రుబాబుకు దిగితే
ఏమనాలి?
శిలలపై శిల్పాలు ఎవరైనా చెక్కగలరు. ఇసుకపై
శిల్పాలు కొద్దిమంది మాత్రమే చేయగలరు. అరుదైన
ఆ విద్యలో మన మారాజులవి అందెవేసిన చేతులు.
చిన్నపిల్లలు గుజ్జెనగూళ్ళు కట్టినంత అలవోకగా
మన ప్రభువులు అకాడమీల ఇసుకగూళ్ళు కట్టి
కూల్చేశారు. నార్లవారి డెత్వారెంటుతో మూడు
అకాడమీలకు ఆయువుతీరిన దరిమిలా అమాంబాపతు
అవార్డులను పంద్యారం పెట్టేపని అకాడమీలను
మింగిన తె.వి.వి. మీద పడింది. అకాడమీల
దుకాణాలను మళ్ళీ తెరవడం వల్ల తమకు గిరాకీ
తగ్గుతుందని ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతులు
ఉసూరుమనవచ్చు. కాని పనికిమాలిన లంపటాలు వదిలి
పరిశోధన, గ్రంథ ప్రచురణల లాంటి ముఖ్య బాధ్యతలకు
వెసులుబాటు యూనివర్శిటీకి ఏ మేరకు పెరిగినా
మంచిదే.
కష్టపడి సాధించుకున్న తెలుగు విశిష్ట
భాషాకేంద్రాన్ని మైసూరునుంచి మన రాష్ట్రానికి
తరలించడమే నాలుగేళ్లయినా మనవల్ల కాలేదు. దాన్ని
హైదరాబాదులో ఉంచాలనే ఏకాభిప్రాయంలాంటిది
పొసగినా దాన్ని నడపటానికి జానెడు జాగా చూపించటం
ఏలినవారి వల్ల కాలేదు. దాన్ని సాంస్కృతిక
పులుసులో కలిపేసుకోవాలన్న పవిత్ర సంకల్పంతో
సాంస్కృతిక శాఖ వారు తమ భవనం ఇవ్వజూపితే
విశిష్ట భాషాకేంద్రం వారు కుదరదు పొమ్మన్నారు.
మామూలుగా ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి రావలసిన
ఇలాంటి విషయాలను కబ్జా చేయటానికి కల్చరల్ వారు
ఎందుకు ఉత్సాహపడగలుగుతున్నారంటే గిట్టనివారు
చెప్పడం- ఉన్నత విద్యను ఉద్ధరించాల్సిన ఉప
ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి మహోదయుడికి శృతి
కలవటంలేదని, సాంస్కృతిక అమాత్యుడేమో
సర్కారువారికి తెగ ముద్దొచ్చేస్తున్నాడని,
ఇందులో ఏకాస్త నిజమున్నా... ఇంతోటి దానికి
ఇన్ని విధాలా విధం చెడాలా? వ్యవస్థలతో,
విద్యాసంస్థలతో చెలగాటం ఆడేకంటే... ఇష్టుడైన
వట్టిని ఉన్నత విద్యాశాఖకు, ఇష్టం లేని
దామోదరుడిని సాంస్కృతిక శాఖకు కుండమార్పిడి
చేస్తే సరిపోదా?
|
|