తెలుగు తేజోముర్తులు

- నిర్వహణ : ఈరంకి వెంకట కామేశ్వర్   


  తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత నాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు.
వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్బంధాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

పాత్రికేయులు, వక్త  పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు

" భారతీయులని యవ్వరూ ఓడించ లేరు;
భారతీయుల్ని భారతీయులే ఓడిస్తారు ....
ఇది రెండు రకాలుగా చూసినా సబబుగానే కనిపిస్తుంది " అని కితాబిచారు. పన్నెండు వేల సభలకు అధ్యక్షుడిగా వ్యవహరించిన అపూర్వ వ్యక్తి. నాలుగు వేల ప్రసిద్ధ అంధ్రులని తన కలంతో పరిచయం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంస్థ అధ్యక్షకుడిగా పనిచేస్తున్నారు. " శత సహస్ర సభాధ్యక్ష " గౌరవం దక్కించుకున్న ఏకైక తెలుగు వాడు - పాత్రికేయుడు, వక్త. ఈ అపూర్వ వ్యక్తి - పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు.

ఎవరికి లేని ఒక ప్రత్యేకత శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారికే దక్కింది. " దశ సహస్ర సభాపతి " బిరుగు అందుకున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా పన్నెండు వేలకు పైగా సభలకు అధ్యక్షత వచించారు. ఇలాటి ఘనత స్వతంత్ర భారతావనిలో మరెవ్వరికి సుసాధ్యం కాదు - అని చెప్ప వచ్చు. ఇది ఎవరో ఆయనకి కట్టబెట్టింది కాదు. వీరి శ్రద్ధ, శక్తులు ప్రత్యేకమైనవి. మంచి వక్త కూడాను! విషయాన్ని కలంతోనే కాదు, గళంతోనూ - ఏ వార్త ముక్కని ఎప్పుడూ, ఎలా, ఏ సందర్భంలో వెయ్యాలో తెలిసిన వ్యక్తి. ఎవరినీ ఎప్పుడు నిందించలేదు. ఇది వారి విషయబద్ధతకూ, నిగ్రహానికీ తార్కాణాలు. వీరిని చూసి నేర్చుకోవాల్సిందే!

ఎప్పుడూ పత్రికలలో వార్తలు వ్రాస్తూ ఉండడమే కాక వార్తల్లో ఉండడం వీరి ప్రత్యేకత. పత్రికా విలువలను ఎప్పుడూ వదులుకోలేదు. కోటం రాజు రామారవు గారి లా వీరు కూడా జేబులో " రాజీనామ పత్రం " పెట్టుకుని తిరుగుతూ ఉండేవారు. వార్తల్లోని వ్యక్తిగా ఆరూ దశాబ్దాలపాటు కొనసాగుతూ - జీవిత సాఫల్య పురస్కారం అనుకున్నారు. తాను నమ్మినది శ్రద్ధగా చేశారు - ఇంకా చేస్తూ ఉన్నారు. జననం - బాల్యం - ఉద్యోగం:

1933 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడ లో జన్మించారు. చిన్నతనంలో ఎదురు దెబ్బలు తిన్నారు. వీరి తండ్రి గారు - సుందర రామానుజ రావు. కుటుంబరావు గారు " ప్లీడర్ " కావాలని ఆకాంక్షించారు. మంచిగా బతికిన కుటుంబం అయినా భూములు పోయి, దెబ్బతిన్నారు. చిన్నతనం సుఖంగా గడవలేదు. చాలా ఇబ్బందులకు గురైయ్యారు. వీరికి ఒక తమ్ముడు, చెల్లెలు. మార్చి 1947 లో వీరి రచనా ప్రస్థానం మొదలైయ్యింది. తొలి వ్యాసం స్వరాజ్యంలో స్వరాష్ట్రం - మాతృభూమి వెలువడింది.

వీరి సతీమణి రాధాకుమారి గారు. మంచి నృత్య కళాకారిణి. ఆ రోజులలో వీరిది ప్రేమ వివాహం. కోల్ కత్తా ఆంధ్ర సభాధ్యక్షుడు - వీరిద్దరినీ సంబోదిస్తూ " సాహిత్యం, నాట్యం కలసి నర్తిస్తాయి " అని సెలవిచ్చారు. నెహ్రూ ముందు కూచిపూడి నృత్య ప్రదర్శనలను ఇచ్చారు.

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆంతరంగిక కార్యదర్శి గా కొంత కాలం పనిచేశారు. సినీ రంగంలో వీరికి దాదాపు అందరూ సుపరిచుతులే.
ప్రముఖ నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు కు " నట సామ్రాట్ " బిరుదుని " ఆపాదించిన వ్యక్తి శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు.

కుటుంబరావు గారికి విజయవాడ అంటే వీరికి మక్కువ. ఓ సందర్భంలో - " దేశ భాషలందు తెలుగు లెస్సా " అని చెప్పింది వినుకొండ వల్లభరాయుడు అని వివరించారు కుటుంబరావు గారు.

రచనలు:

ఆరు దశాబ్దాల పాటు తెలుగులో రచనలు చేస్తూ వున్నారు. కొన్ని వేల వ్యాసాలు రాశారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. వీటిలోని కొన్ని ఆణి ముత్యాలు:

- వార్తలలోని వ్యక్తులు - ప్రముఖుల జీవిత రేఖాచిత్రాలు - ఈ శీర్షికలో ఎందరో ప్రముఖుల జీవితాలను పరిచయం చేశారు.
- 1857 విప్లవ వీరులు
- మహానాయకులు
- శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి
- జాతినిర్మాతలు
- తొలి తెలుగు ప్రధాని పి. వి. నరసిం హరావు

పురస్కారాలు:

గత ఆరున్నర దశాబ్దాలుగా అనేక గౌరవ సత్కారాలు అందుకున్నారు. వీటిలో కొన్ని మైలురాళ్ళు:

- భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు
- జీవిత సాఫల్య పురస్కారం
- శత సహస్ర సభాపతి
- నార్ల వెంకటేశ్వరరావు - లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు
- సద్గురు శ్రీ శివానంద మూర్తి - ప్రతిభా పురస్కారం (2011)
- ఇంటూరి స్మారక పురస్కారం
- ఆచార్య నాగర్జున విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం
- ఆదుర్తి సుబ్బారావు పురస్కారం
- పాత్రికా సేవలకు బంగారు పతకం అందుకున్నారు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి - కళాప్రపూర్ణ

" వార్తల్లోని వ్యక్తి " - శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు. విజయవాడ పౌరులు వీరి పేరున లబ్బిపేటలో " తుర్లపాటి కుటుంబరావు వీధి " పేరు పెట్టి వీరిని చిరస్మరణీయులను చేశారు. భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. " ఈ పురస్కారం అందుకున్న ప్రప్రధ పాత్రికేయుడిని నేను - ఇది నాకు సంతృప్తి ఇచ్చే విషయం " అని అభివర్ణించారు.


 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)