తెలుగు నాటకానికి జయీభవ...విజయీభవ...

- రచన : డా|| కె.వి.రమణాచారి, ఐ.ఏ.ఎస్. 


  తమస్సును చీల్చి ఉషస్సును ప్రసాదించే ప్రాగ్దిశా దీపిక..
కష్టసుఖాల తారంగ విన్యాస రూపిక..
అంతరంగ తరంగాల సూచిక..
అస్తవ్యస్త గమన సమాజ సమస్యా మద కరీంద్రంపై విసిరిన పరిష్కారాంకుశ ప్రతీక..
జన జాగృతి దిశా నిర్దేశ పతాక నాటకం.

అవివేకం నుండి వివేకానికి,
అసత్యం నుండి సత్యానికి,
మృతత్వం నుండి అమృతత్వానికి నడిచి, నడిపించి,
పరిపూర్ణపు బ్రతుకుకు చైతన్యపు స్రవంతిని చూపించే దిశానిర్దేశ నాటకం.

చిటికెడు విషాదం, పిడికెడు వినోదం,
చారెడు విజ్ఞానం, దోసెడు సందేశాలను
పంచిపెట్టే నాటకం
నవ్వుల పువ్వులను రువ్వుతుంది,
కన్నీటి గంగను పొంగిస్తుంది,
కర్తవ్య దీక్షణు ప్రోది చేస్తుంది,
ఆత్మావిష్కరణకు ఆలంబనగా నిలుస్తుంది,
గమ్యగమనాలకు ఆకరమౌతుంది,
నవతకు, భవితకు శ్రీకారం చుడుతుంది.
అందుకే కావ్యేషు నాటకం రమ్యం!!

పదమూడున్నర దశాబ్దాల పైబడిన తెలుగునాటక రంగంలో
ఎన్నో మలుపులు..మజిలీలు..
కదలికలు.. ప్రకంపనలు..
సంఘర్షణాభిలాషతో సమస్యల మూలాలను ఛేదించింది నాటకం.
జాతీయోద్యమంతో నరనరాన దేశాభిమానాన్ని ఉరకలెత్తించింది;

మరెన్నో ఉద్యమాలకు పురుడు పోసింది;
పాదులు చేసింది;
చలువ పందిళ్ళు వేసింది;
కత్తిని ఝళిపించింది;
కొరడాతో ఛెళ్ళున చరిచింది;
ప్రజలతో నడిచింది, ప్రజలతో నడిచింది.
మంచి గతమున స్వల్పం కాదు; అనల్పంగానే ఉంది..
తెలుగు నాటక రంగ చరిత్రలోని ప్రతిపుటా
అమందానంద కందళిత హృదయారవిందమే.
ప్రతి పంక్తీ
చైతన్య ప్రదీప్త మానవతా మందిరమే.

వర్తమాన తెలుగునాటక-స్థితి అవలోకన అత్యంతావశ్యకం.
ఆంధ్ర నాటక కళాపరిషత్ వందలాది నాటక పరిషత్ లకు అంటుకట్టింది.
ఎందరో రచయితలు కలాలను కదిలించారు.
కళాకారులు గళాలను పలికించారు.
వేలాది నాటకాలు రంగవేదిపై రసానుభూతిని వర్శించాయి.
వేవేల కోణాలలో వచ్చిన రచనలు, నటుల అభినయ కౌముది
తెలుగు నాటకరంగ వికాసానికి ఉద్దీపనగా నిలిచాయి.
అయితే-పరిషత్ పరిష్వంగంలో చిక్కుకున్న తెలుగు నాటకం
జాతీయ వేదికపై ఆశించినంతగా ప్రకాశించలేదు.
తెలుగునాటక ప్రదీప్తికి నందీ శ్వరుడు రంగస్థలంపై పాదం మోపాడు.
ప్రాణావశిష్టంగా ఉన్న పద్యనాటకం పునరుజ్జీవంతో కళకళలాడింది.
కానీ-సాంఘికనాటకంలో రూపపరిణామం ఆశించిన మేరకు జరగలేదు.
రచయితలూ, నటులూ, దర్శకులూ, సాంకేతిక నిపుణులూ
సమధికోత్సాహంతో ముందడుగు వేస్తున్నారు.
కానీ-కొత్తదనం కొరవడింది.
గతాన్ని మదించి, వర్తమానాన్ని అనుసంధించి
భవిష్యత్తుకు కొత్తహంగులు సమకూర్చాలి.
తెలుగు నాటకానికి సరికొత్త రంగు, రుచి, వాసనలను అద్దాలి... దిద్దాలి..

ఇది తెలుగుభాషా సాంస్కృతిక వికాసవత్సరం
తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం జరగాలని
అటు ప్రభుత్వం, ఇటు భాషాసాంస్కృతికాభిమానులు
సదాశయంతో, సత్సంకల్పంతో ముందడుగు వేస్తున్న శుభతరుణం.
సాంస్కృతిక శాఖకు గతంలో లేని విధంగా ఆర్ధిక కేటాయింపులు జరిగాయి.
నాటకరంగ వికాసానికి
అకాడమీ మళ్ళీ ప్రాణం పోసుకోబోతున్నది.
ఇప్పటికీ చాలా జిల్లా కేంద్రాలలో అన్ని హంగులున్న రంగశాలకు లేవు.
వాటి నిర్మాణానికి ప్రణాళీకలు రూపుదిద్దుకోవాలి.
నాటక రంగ అభ్యుదయానికి రిపర్టరీ ఏర్పాటు యోచించాలి.
అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ పరంగా నాటకోత్సవాలు జరగాలి.
పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థ్గాయిలో బాలోత్సవాలు, యువజనోత్సవాలు జరగాలి.
గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు నిత్యనాటక ప్రదర్శనలతో,
కళాసుమాల పరిమళంతో తెలుగునాటకం పరవశించిపోవాలి.
జిల్లా సాంస్కృతిక మండలికి ఆర్ధికంగా జవజీవాలను కల్పించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర నాటక కళాపరిషత్ సౌజన్యంతో
రాష్ట్రంలోని కళాపరిషత్తుల నాటకోత్సవాల నిర్వహణకు
ఒక్కొక్క సంస్థకు రెండు లక్షల రూపాయల మేర
ఆర్ధిక సహాయాన్ని అందించే ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాలి.
అక్షర రూపం దాల్చిన కవి సిరా చుక్కలకు దర్శకుడు ఆకృతినిస్తే,
కళాకారుడు అభినయంతో జీవం పోస్తాడు.
సాంకేతిక నిపుణుడు తన అమేయాచాతురీ మహిమతో
రంగుల హంగులను అద్దుతాడు.
ఆ కళారూపం రసప్లావితం కావాలంటే జిల్లాకొక్కటి చొప్పున అభ్యసనశాలలు కావాలి.

ఆర్ధిక చేయూతకు అటు ప్రభుత్వం,
నవ్య, భవ్య నాటకం కోసం ఇటు రంగస్థల ప్రతినిధులు
ప్రతతిశీల భావనతో కదలాలి.
నవనవోన్మేషంగా రచయితలు, దర్శకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు
తమ మేథను మధించి
ఆ నవ్యామృతాన్ని నాటకానికి అందించాలి.
నాటకం మనిషినీ, మనసునూ పలుకరించాలి, పులకరింపచేయాలి.
 
     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)