|
సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు: |
తాటిపాముల మృత్యుంజయుడు |
సంపాదక బృందం: |
తమిరిశ జానకి |
సి. కృష్ణ |
కస్తూరి ఫణిమాధవ్ |
|
|
పాతికేళ్ల తర్వాత తెలుగుతల్లి మనసు మళ్లీ
పులకరించింది. తెలుగుసాహిత్యం కొత్త హంగును
అద్దుకొంది.తెలుగు జాతి గర్వంగా మరొక్కసారి తలెత్తింది. ఏప్రిల్ 17, 2013 మనందరం
మరిచిపోలేని రోజు. 2012 సంవత్సరానికిగాను
డా.రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠం
లభించింది.'తరలిరాదతనేవసంతం,
తనదరికిరాని వనాలకోసం' అన్నసిరివెన్నెలసాహిత్యం
నిజమైంది. వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయిన
భరద్వాజ గారిని, ఆలస్యమైనా, సరస్వతీదేవి ఆయనను
వెదుక్కుంటూ వచ్చిసత్కరించింది. ఆయన రాసిన 'పాకుడురాళ్లు
' నవలకు మహోన్నత గౌరవం లభించింది.
ఈ శుభ సందర్భలో
సిలికానాంధ్ర సుజనరంజని సంపాదకవర్గం
హైద్రాబాదులో భరద్వాజ గారిని కలిసి ఆభినందనలు
తెలిపింది. వారితో జరిపిన ముఖాముఖిని ఈనెల
ప్రత్యేక కథనంలో చదవండి.
ఒక జాతి జీవన
విధానాన్నిఆజాతి సంస్కృతిగా నిర్వచించుకోవచ్చు.
భాష, సాహిత్యం, కళలు సంస్కృతి రూపకల్పనలో
ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. గత పన్నెండు
ఏళ్లుగా సిలికానాంధ్ర 'ఇంతింతైవటుడింతై'
అన్నచందానా జగమంత కుటుంబంగా వర్ధిల్లుతూ తెలుగు
సంస్కృతిని మర్చిపోతున్నవారికి గుర్తు చేస్తూ,
భావి తరాలకు భద్రంగా అందజేయడానికి ఎంతగానో కృషి
చేస్తున్నది. అలాగే సుజనరంజని మాసపత్రిక
సిలికానాంధ్ర ధ్యేయాలను ప్రతిబింబించే రచనలకు
తావిస్తూ దిగ్విజయంగా ముందుకు పోతున్నది.
ఆటువంటి పత్రికకు సంపాదకునిగా బాధ్యతలు
తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
నాకు తెలిసినంత
వరకు తెలుగు సాహిత్యంలో అత్యంత నిగర్వి బమ్మెర
పోతన. ఆంధ్ర మహాభాగవతం
రచనను రచనను ప్రారంభిస్తూ 'విబుధజనులవలనవిన్నంతకన్నంత,
తెలియవచ్చినంతతేటపరతు ' అంటూ ఒక
ఉద్గ్రంథాన్నేతెలుగు జాతికి అందించాడు. మరి,
నేను సామాన్యుణ్ణి. చేతనైనంత పరిధిలో, వీలైనంత
మేరలో సుజనరంజని శోభను పెంపొందించడానికి
ప్రయత్నిస్తాననిమనవి చేసుకుంటున్నాను.
ఈ సంచిక నుండి కొన్నికొత్త శీర్షికలు
మొదలయ్యాయి. అలాగే కొన్నిపాత శీర్షికలు
ముగిసాయి. ప్రతి నెలా చదవండి, ఆనందించండి.
ఎప్పటిలాగే మీ అమూల్యమైన సలహాలను అందించండి.
ఎప్పుడైనా తప్పటడుగులు వేస్తే పెద్దమనసుతో
మన్నించండి.
ఇంతవరకు ముఖ్య
సంపాదకునిగా పనిచేసిన తల్లాప్రగడరావు గారికి
కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి అంతా మేలు
జరగాలని కోరుకుంటున్నాను.
- తాటిపాముల మృత్యుంజయుడు |
|