ఈ మాసం సిలికానాంధ్ర


 
 

 

వైభవంగా సిలికానాంధ్ర ఉగాది ఉత్సవాలు.
సన్నీవేల్ ఏప్రిల్ 13, 2013



చిన్నారి తెలుగు బాలలు ముద్దు ముద్దుగా కురిపించిన చిట్టి పొట్టి పాటల విరిజల్లు..
నిన్నటి తరం నుండి రేపటి తరం వరకూ కవులు హృద్యంగా తీర్చిన కవితా శిల్పాలు..
స్వంతగా కూర్చుకున్న లలిత్ సంగీత వెన్నెలలో చిన్నా పెద్దా సేదతీరి కొత్త వత్సరానికి నాంది పలికిన వైనం..
గిలిగింతల నాటికతో, సరి విందుతో, కవితా తాంబూలాలతో ఉగాది లక్ష్మి కి ఆహ్వానాలు..
ఇవన్నీ సిలికానాంధ్ర సంప్రదాయ స్ఫూర్తితో రెండు నెలలు పాటు శ్రమించి, అంతా కలిసి ఉత్సాహంగా చేసుకున్న ఉగాది పండగ ప్రత్యేకతలు. శనివారం ఏప్రిల్ 13 వ తారీఖున సిలికానాంధ్ర సన్నీవేల్ హిందూ దేవాలయ ప్రాంగణంలో శ్రీ విజయనామ ఉగాది ఉత్సవం వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం సంప్రదాయ రీతిలో ఉగాది కార్యక్రమం దిగ్విజయంగా జరపడం సిలికానాంధ్ర ప్రత్యేకత.

సిలికానాంధ్ర శైలిలో కార్యకర్తలు సమధికోత్సాహంతో ఉగాది వేడుకను నిర్వహించారు. ఆవరణలో అడుగిడుతూనే సవర్ణమయమైన అలంకారాలు స్వాగతం పలికాయి. అందులో కొండిపర్తి దిలీప్ మంచు గడ్డతో చేసిన కలశం, పులి అందరికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఉగాది ఉత్సవ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు మారేపల్లి వేంకట శాస్త్రి గారు వేద ప్రవచనంతో ప్రారంభమయింది. అటుపై మారేపల్లి వెంకట శాస్త్రి గారిచే ప్రేక్షకులను అలరిస్తూ సాగిన పంచాగ శ్రవణం మంచి అనుభూతినిచ్చింది. సిలికానాంధ్ర అధ్యక్షుడు మాడభూషి విజయసారధి సభకు ఆహ్వానం పలుకుతూ, విలువలకు పట్టం కట్టేలా కార్యక్రమాలు రూపొందిస్తూ సంప్రదాయాన్ని కాపాడుతూ నవీనత వైపు యువతరాన్ని తీసుకెళ్ళడం సంస్థ లక్ష్యమని వివరించారు. కార్యక్రమం ఆసాంతమూ ఖండవిల్లి కృష్ణ నిర్వహణలో జరిగింది.

తొమ్మిది మంది కవులతో కొలువుదీరిన కవి సమ్మేళన కార్యక్రమం ప్రఖ్యా వంశీకృష్ణ ఆధ్వర్యంలొ నిర్వహించబడింది. ఈ కవి సమ్మేళనంలో ముఖ్య విశేషం అమెరికాలో పుట్టి పెరిగిన యువతి కుమారి మైథిలి హరి తెలుగులో హృద్యంగా చేసిన కవితా గానం. తొమ్మిది శైలుల్లో తొమ్మిది మంది కవులు కొత్త లోకాలను చూపిస్తూ తెలుగువారి ప్రాణమైన కవితలను రసరమ్యంగా ఆవిష్కరించారు. సిలికానాంధ్ర విజయ నామ ఉగాది పురస్కరించుకుని ప్రపంచవ్యాప్త తెలుగు వారికి కవితల పోటీ నిర్వహించింది. ఈ పోటీలో గెలుపొందిన విజేతలను ప్రకటించారు.

విజేతల వివరాలు :
మొదటి బహుమతి : శ్రీ గరిమెళ్ళ నాగేశ్వర రావు, విశాఖపట్నం
రెండవ బహుమతి : యశస్వి, హైదరాబాద్
మూడవ బహుమతి : డా|| జడ సుబ్బారావు, హైదరాబాద్

మొదటి బహుమతి పొందిన కవితను వీడియో ద్వారా ప్రదర్శించారు.
ఆపై సిలికానాంధ్ర వైస్ ఛైర్మెన్ దిలీప్ కొండిపర్తి కవులందరినీ జ్ఞాపికలతో సత్కరించారు.

తొలుత ఉదయం 10 గం. నుండి మధ్యాహ్నం 3 గం.వరకు పిల్లలను వారి వయసును బట్టి వివిధ బృందాలుగా భాషా వికాస పోటీలు నిర్వహించారు. ప్రభ మాలెంపాటి, కృష్ణ ఖండవిల్లి నిర్వహణలో రోజంతా సునాయాసంగా పిల్లలలో తెలుగు పట్ల ఆసక్తి రేకెత్తించి ఆకర్షించే పోటీ నిర్వహించారు. ఈ పోటీల విజేతలను రాత్రి జరిగిన కవి సమ్మేళనంలో ప్రకటించి బహుమతులు అందజేశారు.

ఇక ఈ ఉగాది మరో విశేషం, సిలికానాంధ్రులచే వ్రాయబడిన లలిత గీతాలను పిల్లలకు నేర్పి పాడించడం, ప్రఖ్యా మధుబాబు, ప్రఖ్య వంశీకృష్ణ రచించగా పలివెల భారతి, తంగిరాల రఘుచే సంగీతం కూర్చబడిన పాటలను పిల్లలు నేర్చుకుని పాడి ప్రేక్షకులను ఆనందింపచేశారు. కాజ రామకృష్ణ, వంక రత్నమాల, పొట్టి యామిని, పలివెల భారతి పిల్లలకు 4 వారాలుగా శిక్షణనిచ్చి పాడించారు.

ఆపై చివరగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే హాస్య నాటిక ఆదివిష్ణు రచించిన ‘పండగొచ్చింది’ ప్రదర్శించారు. దశిక సూరజ్ దర్సకత్వంలో, మాధవ కిడాంబి నిర్వహణలో నటీనటులు అద్భుతంగా నటించి అందరిని కడుపుబ్బ నవ్వించారు. నాలుగు వారాల పాటు సాధన చేసి ప్రదర్శించిన ఈ నాటకం ఆహూతులను ఎంతో అలరించింది.

శ్రీ అన్నమాచార్య జయంత్యుత్సవం:

ఈ కార్యక్రమంలో రాబోయే కాలంలో సిలికానాంధ్ర చేపట్టబోయే కార్యక్రమం, అన్నమాచార్య జయంత్యుత్సవానికి అట్టహాసంగా ఏర్పాట్లు ప్రారంభించారు. వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో వెయ్యిమందికి పైగా గాయనీ గాయకులు ఈ ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. దీనికి సంబంధించిన కార్యవర్గాన్ని పరిచయం చేశారు. Dr. లక్కిరెడ్డి హనిమిరెడ్డి, నల్లమోతు ప్రసాద్, Dr. వింజమూరి అనసూయాదేవి చేతుల మీదుగా గోడపత్రికను ఆవిష్కరించారు.

కార్యక్రమం తర్వాత సిలికానాంధ్ర నలభీములు, అన్నపూర్ణలు కలిసి అన్నం అనిల్, కొండిపర్తి దిలీప్ నేతృత్వంలో ‘త్రినేత్ర సూపర్ మార్కెట్’ సౌజన్యంతో పదహారణాల తెలుగు భోజనం అందరికీ కొసరి కొసరి వడ్డించారు. విందులో భాగంగా ప్రతి వారికి తాంబూలంతో పాటు ఒక చిన్న కవితను జోడించి కవితా తాంబూలం అందజేశారు. సిలికాన్ వేలీలో శ్రీ విజయనామ ఉగాది సాహితీ, సంగీత, నాటక వైభోగంతో విజయం చేసింది.

తల్లాప్రగడ రామచంద్రరావు గారికి అభినందన సత్కారం:

తల్లాప్రగడ రామచంద్రరావు గారు ఆరేళ్లకు పైగా సిలికానాంధ్ర సుజనరంజని సంపాదక బాధ్యతలను దిగ్విజయంగా నిర్వహించారు. ఈ మాసపత్రికను తన అరుదైన శైలిలో మరొక్క పై మెట్టుకు తీసుకెళ్లారు. సుజనరంజని సంపాదకత్వ బాధ్యతల విరమణ సందర్భంలో సిలికానాంధ్రకు, సుజనరంజని కి చేసిన సేవలను కొనియాడుతు విజయ నామ సంవత్సర ఉగాది వేడుకలో సత్కరించింది.

ఈ సందర్భంగా సిలికానాంధ్ర సమర్పించిన సన్మాన పత్రాన్ని చదువుటకు ఇక్కడ క్లిక్ చేయండి

సుమారు 1000 మంది సిలికాన్ వేలీ వాసులు కార్యక్రమంలో పాల్గొని అందమైన అనుభూతిని స్వంతం చేసుకున్నారు. పలువురు మాట్లాడుతూ స్వఛ్ఛమైన సంప్రదాయాలకు చిరునామాగా సిలికానాంధ్ర వెలుగొందుతోందని వెయ్యి మందికి పైగా కిక్కిరిసిన హలులో ‘కవి సమ్మేళనం’ చేయటం సిలికానాంధ్రకే చెల్లిందని కొనియాడారు. కొట్ని శ్రీరాం వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

 
 
 
 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)