సౌరభము లేల చిమ్ము
పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
-కృష్ణశాస్త్రి
హాలుని గాథాసప్తశతి మొదలు, పదిహేడు
పద్ధెనిమి శతాబ్దాలలో వచ్చిన ప్రబంధాల వరకూ,
శృంగారరసాన్ని తెలుగు కవులు ఎన్నెన్ని
రీతులలో పండించారో, కిందటి వ్యాసాలలో
కాస్తంత చవిచూసాం కదా. ఇందులో ముఖ్యంగా
గమనించాల్సిన అంశం ఒకటుంది. శృంగారరసం
పండాలంటే కావలసింది ప్రేయసీప్రియులు. వారు
భార్యాభర్తలు కానవసరం లేదు. రసపోషణలో
ఔచిత్యం గురించి మాట్లాడినప్పుడు కూడా,
ఆలంకారికులు నాయికా నాయకుల మధ్య
పరస్పరానురాగం ఉండాలనే అన్నారు తప్ప, సమాజ
సంప్రదాయాలూ కట్టుబాట్ల గురించి పెద్దగా
పట్టించుకున్నట్టు కనిపించదు. మేనకా
విశ్వామిత్రులు, గోపికా శ్రీకృష్ణులు, తారా
శశాంకులు, రాధామాధవులు, మొదలైన వారి మధ్య
కావ్యాలలో పోషింపబడిన శృంగారరసం,
వివాహబంధంతో సంబంధం లేనిది.
ప్రేయసీప్రియుల మధ్య శారీరక, మానసిక
స్థాయిల్లో ఉండే కోరికనీ, అనురాగాన్నే "రతి"
అన్నారు. ఈ రతి అనే భావాన్నే వివిధ
రీతుల్లో పోషించి శృంగారరస స్థాయికి కవులు
తీసుకువెళ్ళారు. అయితే, పదహారవ శతాబ్దిలోనూ
ఆ తర్వాతా వచ్చిన అనేక ప్రబంధాలలో,
శృంగారరస పోషణలో అంగాంగ వర్ణనా, సంభోగ
వర్ణనా పెచ్చరిల్లాయి. మొత్తం కావ్యమంతా
అలాంటి వర్ణనలే నిండిపోయిన కావ్యాలుకూడా
అవతరించాయి. తదనంతర కాలంలో, బ్రిటిష్
సామ్రాజ్య విస్తరణతో, పాశ్చాత్య విద్యా
సంస్కృతుల ప్రభావంతో కొత్త గాలులు వీచాయి.
ప్రజల అభిరుచులలో మార్పు వచ్చింది. ఈ
శృంగారవర్ణనలు మోటుగానూ అసభ్యంగానూ
కనిపించడం మొదలుపెట్టాయి. శారీరక
సౌందర్యానికీ సంభోగానికీ మాత్రమే శృంగారం
పరిమితమైపోయినట్టు అనిపించసాగింది. అది
తుచ్ఛమనే భావన కూడా ఏర్పడింది. కిందటి
వ్యాసంలో పేర్కొన్న కట్టమంచివారి "కవిత్వతత్త్వ
విచారం"లో ఈ ధోరణి చాలా స్పష్టంగా
కనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, ఇరవయ్యో
శతాబ్దపు తొలినాళ్ళలో, "అమలిన శృంగారం" అనే
ఒక కొత్త సిద్ధాంతం తెలుగుసాహిత్యంలో
అవతరించింది. ఈ సిద్ధాంతానికి నారుపోసి
నీరుపోసినవారు, భావకవిత్వానికి కూడా
ఆద్యులైన రాయప్రోలు సుబ్బారావుగారు. ఈ
సిద్ధాంతానికి లక్షణాలనూ లక్ష్యాలనూ కూడా
వీరు పద్యరూపంలో సమకూర్చడం విశేషం. లలిత,
తృణకంకణము, స్వప్న కుమారము మొదలైన
కావ్యాలను ఈ సిద్ధాంతానికి లక్ష్యాలుగా
వ్రాసారు. రమ్యాలోకము, మాధురీదర్శనము అనే
కృతులలో యీ సిద్ధాంతాన్ని లక్షణీకరించారు.
అమలినశృంగార సిద్ధాంతంలో ముఖ్యమైన అంశాలు
మూడు. వాటిలో కీలకాంశాన్ని రమ్యాలోకములోని
యీ పద్యం స్పష్టం చేస్తుంది:
సురతసంస్పర్శ లేని యీ శుచిమ దమల
జీవితానురాగాదులన్ చిలకరించు
కానరాని శృంగార మాకర్షణ ప్ర
భావ విమలోపచార సుఖావహముగ
శారీరక సంభోగ ప్రసక్తి లేని శుచిమంతమైన
అమల ప్రేమనే వీరు అమలినశృంగారం అన్నారు. "శృంగారః
శుచి రుజ్జ్వలః" అన్న ప్రాచీనుల సూక్తి
బహుశా దీనికి ఆధారం అయ్యుండవచ్చు. అలాంటి
శృంగారమే ఉత్కృష్టమైనదనీ సుఖావహమనీ వీరి
సిద్ధాంతం. మరి దంపతుల మధ్య శృంగారం
సంగతేమిటి అన్న ప్రశ్నకి, వీరిచ్చే సమాధానం?
ప్రజాతంతంతువు (సంతానోత్పత్తి) కోసం ఈ
సంయోగాన్ని సమర్థిస్తూనే, అది ఒక అవస్థకు
మాత్రమే పరిమితమై ఉండాలనీ, ఉత్తమ
సంస్కారంగల దంపతులు క్రమక్రమంగా శరీర
విముక్తమైన సౌందర్యాన్ని ఆశ్రయించాలనీ
అంటారు. ఈ అమలినశృంగారాన్ని సమర్థిస్తూ
వారు చేసే వాదన యిది:
పార్వతీ పరమేశ్వర బాంధవమున,
భారతీ బ్రహ్మదేవ దాంపత్యమందు,
విషయ సురత ప్రసక్తి భావింపగలమె?
రస మనౌచిత్యమున మలీమసమయగుట
పార్వతీపరమేశ్వరులు, సరస్వతీ బ్రహ్మదేవులు
- వీరి మధ్యనున్న బంధంలో, దాంపత్యంలో,
ఇంద్రియసంబంధమైన రతి క్రియని భావింపగలమా?
అలా ఊహిస్తే అది అనౌచిత్యంతో మలినమైపోదా?
అదీ వీరి ప్రశ్న! ఇంకా యిలా కూడా అంటారు:
యామినీ చంద్రులకు
మిథునానురక్తి
పద్మినీ మిత్రులకు వధూవరుల వలపు
గారవించిరి కవులు శృంగారకృతుల
సురత మేది? ఆ ప్రకరణాంతరములందు
రాత్రికీ చంద్రునికీ మధ్యా, తామరపూలకూ
సూర్యునికీ మధ్యా, ప్రేమని వర్ణించారు మన
కవులు. వాటి మధ్యనున్న ఆ వలపులో సురత
ప్రసక్తే ఉండదు కదా మరి! - అని. కాబట్టి
శృంగారానికి ఇంద్రియసంబంధమైన కోరికతో,
కలయికతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదని
రాయప్రోలువారి వాదన. ప్రస్తుత వ్యాసం, యీ
సిద్ధాంతాన్ని పరిచయం చేయడానికే తప్ప
విపుల విమర్శకి కాదు. కాని యీ వాదన
చదివినప్పుడు నాకనిపించిన ఒక్క విషయాన్ని
మాత్రం ప్రస్తావిస్తాను. దేవుళ్ళ మధ్యనుండే
ఒకానొక అలౌకిక సంబంధాన్నీ, ప్రకృతిలోని
వస్తువుల మధ్యనుండే ప్రాకృతిక సంబంధాన్నీ
సులువుగా అర్థం చేసుకోవడానికి, మనిషిగా
మనకి బాగా తెలిసిన దాంపత్య బంధాన్నీ, రతి
భావననీ, ఆయా దైవాలకూ ప్రాకృతిక వస్తువులకూ
ఆపాదించారు పూర్వులు. కానీ యిక్కడ
రాయప్రోలువారు ఆ పోలికలని తీసుకొని,
మనుషుల మధ్య శృంగారం కూడా అంత ఉదాత్తంగా
ఉండాలని అనడం కాస్త విచిత్రంగా అనిపించింది.
పూర్వకవులు, దేవమిథునాల మధ్య శృంగారాన్ని
వర్ణించినప్పుడు వారిని అచ్చమైన
మనుషుల్లాగే చిత్రించారు. ఇక, యామినీ
చంద్రులు, పద్మినీ మిత్రుల వంటి వాటి
మధ్యనుండే వలపు చిత్రణ, శృంగారరస పోషణలో
ఉద్దీపన విభావాలుగానూ లేదా ఉపమానాలుగానే
కనిపిస్తుంది తప్ప వాటంతట అవి ఎన్నడూ
శృంగారరసానికి ఆలంబనాలు కావు.
రాయప్రోలువారు ప్రతిపాదించిన సిద్ధాంతంలో
మరొక ముఖ్యాంశం, సంభోగశృంగారం కన్నా
వియోగశృంగారం ఉత్తమమైనదని. సంభోగశృంగారం
అవయవనిష్ఠమైనది కాబట్టి అది అశాశ్వతమనీ,
వియోగశృంగారంలో అలాంటి ఉపాధి అవసరం
ప్రత్యక్షంగా ఉండదు కాబట్టి అది అక్షయమనీ
అందువల్ల శ్రేష్ఠమనీ వీరి సిద్ధాంతం. ఇది
ఇంచుమించుగా మొదట చెప్పిన అంశాన్ని
అనుసరించేదే. వియోగశృంగారం మనసుకూ ఆత్మకూ
సంబంధించినదిగా రాయప్రోలువారు భావించారు.
అందుకే దానికి ఉత్తమత్వాన్ని సమర్థించారు.
అమలినశృంగార సిద్ధాంతంలో మూడవ అంశం -
స్నేహం, వాత్సల్యం అనే భావాలను కూడా
శృంగారరసానికి స్థాయీభావాలుగా పరిగణించడం.
"రతి" అనే శబ్దానికి కేవలం స్త్రీ పురుషుల
మధ్యనుండే కోరిక, కామము అనే అర్థాన్ని కాక,
ఆనందము అనే అర్థాన్ని తీసుకొని,
స్నేహవాత్సల్యాలను కూడా అందులో చేర్చారు.
ఈ రకంగా రాయప్రోలువారు శృంగార పరిధిని
విస్తరింప జేసి, మాతృశృంగారము,
స్నేహశృంగారము, ఆప్తశృంగారము,
సోదరీశృంగారము ఇత్యాది అనేక రకాలైన
శృంగారాలను పేర్కొన్నారు.
ఇదీ క్లుప్తంగా అమలినశృంగార స్వరూపం.
సి.నారాయణరెడ్డిగారు "ఆధునికాంధ్ర కవిత్వము
- సంప్రదాయములు ప్రయోగములు" అన్న పుస్తకంలో
దీని గురించి మరింత వివరంగా చర్చించారు.
ఆసక్తిగల పాఠకులు దాన్ని చదువుకోవచ్చు. తన
సిద్ధాంతానికి లక్ష్యభూతంగా రాయప్రోలువారు
రచించిన కావ్యం "తృణకంకణము". ఆ సిద్ధాంతం
లాగానే యీ కావ్యం కూడా ఇప్పుడు మనకి కాస్త
విచిత్రంగా అనిపిస్తుంది. ఇందులో,
చిన్ననాటినుండీ కలిమెలిసి పెరిగిన యిద్దరు
యువతీయువకులు ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను
పెంచుకుంటారు. కానీ విధివశాత్తూ
వారిరువురికీ పెళ్ళి జరగదు. అమ్మాయికి
మరొక అబ్బాయితో పెళ్ళి జరిగిపోతుంది.
యువకుడు భగ్నప్రేమికుడై ఆమెనే తలుచుకుంటూ
కాలం గడుపుతూ ఉంటాడు. కొంతకాలానికి
వాళ్ళిద్దరూ ఒకసారి కలుసుకోడం తటస్థ
పడుతుంది. పరస్పరం ఎలాంటి కామవాంఛా కలగదు.
ఒకరిపై ఒకరికుండే అనురాగంతో, మనసులోనే
ఒకరినొకరు తలుచుకుంటూ జీవితాలను
గడిపేయాలని నిశ్చయించుకుంటారు. వారి
మధ్యనుండే చెలిమి మరింత పక్వమవుతుంది.
దీనికి గుర్తుగా యువకుడు యువతికి ఒక
గడ్డితో చేసిన కంకణాన్ని (అదే తృణకంకణం,
రాఖీలాంటిది అనుకోవచ్చు) కట్టి ఆమెని
"సోదరీ" అని పిలుస్తాడు. ఆ అమ్మాయి తన
చేతి ఉంగరాన్ని తీసి అతని చేతికి
తొడుగుతుంది. ఇద్దరూ ఎవరిదారిని వారు
వెళిపోతారు. అదీ కథ! ఇందులో
అమలినశృంగారాన్ని స్థాపిస్తూ, అమ్మాయి చేత
యిలా పలికిస్తారు:
"కనుల నొండొరులను జూచుకొనుట కన్న
మనసు లన్యోన్య రంజనల్ గొనుట కన్న
కొసరి "యేమోయి" యని పిల్చుకొనుట కన్న
చెలుల కిలమీద నేమి కావలయు సఖుడ!"
దీనికి మరో రెండుమెట్లు పైకెక్కి, ఆ సఖుడు
ఇలా అంటాడు:
"సరససాంగత్య సుఖ వికాసముల కన్న
దుస్సహ వియోగభరమె మధురము సకియ"
ఇదీ ఆధునిక కాలంలో శృంగారం ఎత్తిన
సరికొత్త అవతారం!
ఈ అమలినసిద్ధాంతంతో పాటుగా తెలుగులో
అవతరించిన భావకవిత్వంపై, దీని ప్రభావం
చాలానే ఉందని చెప్పవచ్చు. శృంగారానికి
స్థాయీభావమైన రతి, భావకవిత్వంలో ప్రేమగా,
ప్రణయంగా మారింది. ఆ ప్రేమకి హృదయంతో తప్ప
తనువుతో పెద్దగా పనిలేదు. కవి ప్రేయసి,
లౌకికపరిథులను దాటి ఊహలలో ఊర్వశిగా
నర్తిస్తుంది . కవికి ఆమె భౌతికరూపంతో
పనిలేదు ఆమె తన ప్రాణకాంత. ప్రకృతే ఆమె
రూపము.
నీవు తొలిప్రొద్దు నునుమంచు తీవసొనవు
నీవు వర్షాశరత్తుల నిబిడసంగ
మమున బొడమిన సంధ్యాకుమారి, వీవు
తిమిరనిశ్వాసముల మాసి కుములు శర్వ
రీ వియోగకపోలపాళికవు, నీవె,
నీవె నిట్టూర్పు, నీవె కన్నీరు, విశ్వ
వేద నామూల్య భాగ్య మీవే, నిజమ్ము
నే గళమ్మార పాడుకొనిన యఖాత
శోకగీతమ్ములం దీవె శోకగీతివి!
ఊర్వశీ! ప్రేయసీ!
అని పాడుకుంటాడు.
ఆమెతో పొందుకూడా అవసరం లేదు. తుదిలేని
విరహమే తీయనిబాధై, అందులోనే సుఖాన్ని
అనుభవిస్తాడు.
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు
నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు
నా కమూల్య మపూర్వ మానంద మొసగు
నిరుపమ నితాంత దుఃఖంపు నిధులు కలవు
అని మురిసిపోతాడు! వియోగంలోనే ప్రేమ
రాశీభూతమై ఉంటుందని చెప్పిన కాళిదాసు
మేఘసందేశం భావకవులకు అభిమాన కావ్యం.
భావకవిత్వంలో, గోపికా/రాధికా కృష్ణుల మధ్య
కొత్త రూపు దాల్చిన ప్రణయతత్త్వం కూడా
కొంత యీ అమలినశృంగార ఛాయలు కలిగినదే.
భాగవతంలో గోపీజనుల శృంగారం, ఇంద్రియస్పర్శ
కలిగి ఉండి, భక్తిలో లీనమైతే,
భావకవిత్వంలో అది అమలినశృంగారమై, అంటే
కేవల హృద్గత భావమై, ఆధ్యాత్మికత వైపుకి
అడుగులు వేస్తుంది.
"వలపులు ముర్మురించు రసవన్నవ హృచ్ఛషకమ్ము
నీకునై
నిలిపితి, త్రావి పొమ్ము నవనీతదయాగుణశాలి!
ఆవలన్
వలచిన నుండునో! మరి రవంతయు నుండక
యెండిపోవునో!
మొలచిన కూర్మి కన్నుగవ మూసిన నేమగునో
జగత్ప్రభూ!"
"రాధ పిలుపు" అనే కావ్యంలోని(కవి సంపత్),
యీ పద్యాన్ని భాగవతంలో "క్రమ్మి
నిశాచరుల్..." అనే పద్యంతో పోల్చి
చూసుకుంటే శృంగారభావనలో వచ్చిన పెనుమార్పు
స్పష్టంగా తెలుస్తుంది. పై పద్యంలో
సూఫీకవిత్వ ప్రభావం కూడా కొంత
కనిపిస్తుంది.
అమలినశృంగారంలోనే ఒక ప్రత్యేక ఛాయ
"కులపాలికా ప్రణయం" అని చెప్పవచ్చు.
రాయప్రోలు వారు చెప్పిన దంపతీశృంగారమూ,
దివ్యశృంగారమూ - యీ రెంటి కలయికలో పుట్టిన
శృంగారభావమిది. ఇది దంపతుల మధ్యనుండే
ఇంద్రియాతీతమైన అనురాగం. అది
లౌకికస్థాయిని అధిగమించి దివ్యమైన ఆనందం
వైపుగా అడుగులు వేస్తుంది. అప్పుడా
దంపతులు ప్రకృతీపురుషులకూ
అర్ధనారీశ్వరులకూ ప్రతిరూపాలవుతారు. ఈ
కులపాలికా ప్రణయం సంపూర్ణంగా కనిపించే
కావ్యాలు విశ్వనాథవారి "గిరికుమారుని
ప్రేమగీతాలు", నాయని సుబ్బారావుగారి
"సౌభద్రుని ప్రణయయాత్ర", "ఫలశ్రుతి".
తెరచాటు బొమ్మవై త
త్తరమున నను జూచి తక్కితారెడు తరి ప్రే
మరసమ్ము చింద పరపిన
చిరునవ్వు మదీయ హృదయసీమ గరంచెన్
అంటూ మొదలైన సౌభద్రుని ప్రణయయాత్ర,
మనము ప్రణయమహాకావ్యమున నపూర్వ
నాయికానాయకుల మభిన్నమ్ములైన
మన మనోభావగీతమ్ములను పఠించి
పరవశముపో రసజ్ఞ ప్రపంచ మెల్ల
అనేంత వరకూ సాగుతుంది.
అయితే భావకవుల ప్రణయమంతా "అమలిన"మైనదని
చెప్పడానికి లేదు. అక్కడక్కడా ఆలింగనాలూ,
అధరచుంబనాలూ కూడా కనిపిస్తాయి. కాని అలాటి
చోట్ల కూడా హృదయానికే ప్రాధాన్యం!
ఉదాహరణకి యీ అందమైన పద్యం చూడండి:
బింబఫలములబోలు నీ పెదవు లెపుడు
ఈ యధరమంటి వేడి ముద్దిచ్చె, నపుడె
అంకితంబయ్యె నా హృదయంబు నీకు
నృపతిముద్రాంకితంబైన లేఖయట్లు
హృదయమనే లేఖ తనని తాను సమర్పించుకొనే
హక్కుపత్రం. అలాంటి లేఖకి, ముద్దు
రాజముద్రట (ఇప్పటి భాషలో చెప్పాలంటే
official stamp)! పైన ఊర్వశీ విరహాన్ని
మనసారా పాడుకున్న కృష్ణశాస్త్రిగారిదే యీ
చమత్కారం కూడా.
భావకవిత్వానికి, వియోగమూ విరహమూ (అంటే
ఆలంకారికభాషలో విప్రలంభశృంగారం) ఆత్మీయ
కవితావస్తువులని పైన చెప్పాను కదా. ఆ
విరహంలో యీ కవులు పడే బాధకీ, పూర్వ
కావ్యాలలో నాయికా నాయకులు పడే బాధకీ ఉన్న
వ్యత్యాసాన్ని సి.నా.రె.గారు "ఆధునికాంధ్ర
కవిత్వము..." పుస్తకంలో చక్కగా
వివరించారు. కావ్యాలలో చంద్రుడు,
మలయానిలము మొదలైనవి విరహార్తులని
బాధిస్తాయి. వారు వాటిని దూషిస్తారు.
కిందటి నెల వ్యాసంలో, "కాలాంతఃపుర..."
ఇత్యాది పద్యాలలో యిది మనం చూసాం కదా.
భావకవులు అలా కాదు. విరహంలో కూడా వారికి
ప్రకృతి ఎంతో ఆత్మీయంగా తోస్తుంది.
"విరిసిన పూలవెన్నెలల వెల్లువ జక్కదనాల
హంసవై
యరిగెడు నిన్ను జూచి నిశలందున నాకగు
బాష్పశాంతి"
అంటారు వేదులవారు "సుధాకరా" అనే కవితలో.
హంసలాగా పూలవెన్నెలలు కురిపిస్తూ ఆకాశంలో
సాగిపోయే చంద్రుణ్ణి చూస్తే యీ కవికి
కన్నీరు ఉపశమిస్తుందట. "కృష్ణశాస్త్రి బాధ
ప్రపంచం బాధ" అన్నట్టుగా, భావకవి తన
వేదనకి ప్రకృతికూడా దుఃఖిస్తున్నట్టు
భావిస్తాడు. మేఘగర్జనకి పురివిప్పి ఆడని
నెమలిని చూసి, అది కూడా తనలా విరహంలో
ఉందనుకుంటాడు. చకోరాన్ని చూసి, పాపం
దానికి పున్నమి ఎప్పుడో అని బాధపడతాడు.
ఇలా భావకవి, విరహంలో కూడా ప్రకృతిలో
మమేకమై సేదదీరుతాడు.
ఆధునికకాలంలో ఒకవైపు అమలినశృంగారము,
భావకవిత్వమూ శృంగారరసాన్ని యిలా
క్రొత్తపుంతలు తొక్కించినా, మరోవైపు
పూర్వసంప్రదాయ వాసనలతో కొనసాగిన
శృంగారరసపోషణ కూడా
కనిపిస్తుంది.విశ్వనాథవారు భావకవిత్వ
ప్రభావంనుంచి పూర్తిగా బయటికి వచ్చిన
తర్వాత రచించిన కావ్యాలు వీటికి కొన్ని
ఉదాహరణలు. తాత్త్విక పరమైన విషయాలను
పక్కనపెడితే, "శృంగారవీథి" కావ్యంలోని
శృంగారవర్ణనలు, రసపోషణ, పూర్వ ఆలంకారిక
పద్ధతిలో సాగినవే. పాతపద్ధతిలో అయినా
ఆధునికకావ్యాలలో, అత్యంత మనోహరంగా
చిత్రించబడిన శృంగార సన్నివేశం నా
దృష్టిలో, పింగళి-కాటూరి రచించిన
"సౌందరనందము" అనే కావ్యంలో ఉంది. ఇందులో
నాయికా నాయకులు సుందరీ నందులు.
కావ్యారంభంలోనే వారిద్దరి అనురాగమయ సంయోగం
చిత్రించబడుతుంది. ఆ తర్వాత వారికి కలిగే
వియోగబాధ పాఠకుల హృదయాలలో బాగా
హత్తుకొనేందుకు వారి యీ ప్రణయ సన్నివేశం
చక్కని ప్రాతిపదిక అవుతుంది.
మేలేర్చి నందుండు పూలు గోసి యొసంగ
సరము లందముగ సుందరి రచించు
మెలత వర్ణమ్ములు మేళవించి యిడంగ
హరువుమై నతడు చిత్తరువు వ్రాయు
బతి సుకుమారభావము వచించిన నను
రూప పద్యమున గూర్చును లతాంగి
అతివ చక్కని రాగ మాలపించిన వీణ
పలికించు నతడు మై పులకరింప
నెఱ్ఱ సెరల నందుని చూపు లింతి యాన
నేందునకు గెంపుల నివాళు లెత్త, నతివ
కజ్జలపుజూడ్కి ప్రియుని వక్షఃకవాటి
గట్టు దోరణములు నల్లకల్వపూల
నందుడు మంచిమంచి పూలను ఏర్చి కోసి యిస్తే,
సుందరి వాటిని అందమైన మాలలుగా అల్లుతుంది.
సుందరి రంగులని కలిపి యిస్తే, నందుడు
చక్కని చిత్రాలను రచిస్తాడు. నందుడు
సుకుమారమైన భావాన్ని చెపితే, దానికి
అనుగుణమైన పద్యాన్ని కూరుస్తుంది సుందరి.
సుందరి చక్కని రాగాన్ని ఆలపిస్తే నందుడు
వీణ పలికిస్తాడు. ఎఱ్ఱని జీరలతో కదలాడే
నందుని చూపులు సుందరి ముఖచంద్రునికి
కెంపుల నివాళిని ఎత్తుతున్నాయి. సుందరి
కాటుకచూపులు ప్రియుని విశాలవక్షమనే
ద్వారానికి నల్ల కలువల తోరణాన్ని
కడుతున్నాయి. దాంపత్య అనురాగమంటే యిది
కదా! అనురాగమొక్కటేనా? ఆ దాంపత్యంలో పొలి
అలకలూ ప్రణయకలహాలు కూడా ఉన్నాయి. ప్రియుడు
ప్రాణేశ్వరి పాదాల చెంత వాలి వేడుకోడాలూ
ఉన్నాయి. "అలక మబ్బుల మాటున ఒక్క ముహూర్త
కాలం దాగిన నీ ముఖచంద్రుడు తిరిగి
ఉజ్జ్వలమైన నవ్వుల వెన్నెలలతో
ప్రకాశించడంలో ఉన్న కొత్త ఉత్సాహం ఏమని
చెప్పను." అంటాడు నందుడు. అంతే కాదు, వారి
వలపుల కల్పలతకి అలాంటి ప్రణయకలహాలే
దోహదక్రియలట! ఇది ప్రేయసీప్రియులైన
దంపతులు తప్పక చదవాల్సిన రసవద్ఘట్టం.
దీన్ని చదివిన ఏ దంపతులైనా
ప్రేయసీప్రియులుగా మారతారు అనడంలో కూడా
అతిశయోక్తి లేదేమో!
ఇలాంటి సొగసైన సన్నివేశంతో మన యీ
శృంగారరసవాహినీ విహారానికి వీడ్కోలు
పలుకుదాం. నవనవోన్మేషశీలి అయిన
శృంగారాన్ని రసరాజంగా మన ఆలంకారికులు
కీర్తించడంలో ఉన్న ఔచిత్యాన్ని,
ఆంతర్యాన్ని, అర్థం చేసుకుంటే, మన
జీవితాలను కూడా తప్పక రసవంతం
చేసుకోగలుతాం.
వచ్చే నెల ఒక సరికొత్త రసాన్ని రుచి
చూద్దాం. అదేమిటో ఇప్పుడే చెప్పేస్తే ఎలా!
ఊహిస్తూ ఉండండి. :-)
|