కవితా స్రవంతి-3

గడియారం బతుకులు

(విజయ నామ సంవత్సర ఉగాది కవితల పోటీల్లో మూడవ బహుమతి $100 పొందిన కవిత)

-  :   డా. జడా సుబ్బారావు, నూజివీడు   


 

 

 

తనకంటూ ఎవరూ లేకపోయినా

తనకోసం ఎవరూ రాకపోయినా

కంటి చూపెప్పుడూ

కదులుతున్న గడియారం వైపే

ఆశగా చూస్తుంటుంది అలుపు లేకుడా

 

వరండాలో వాలుకుర్చీ

వంటింట్లో వంగిపోయిన నడుము

పగిలిన కళ్లద్దాలను సరిచేసుకుంటూ ఒకరు

వంటపాత్రలతో కుస్తీపడుతూ మరొకరు

జీవితసారాన్ని నెమరేసుకుంటున్నారు

 

రెక్కలొచ్చిన పక్షులు

వలసవేటలో... డాలర్ల బాటలో

దిక్కులు దాటిపోయాయి

వయసుడిగిన బతుకులు

అయినవారు లేక అనాథలైపోయాయి

 

గుప్పెడు ఆశల్ని... ఉప్పెనలాంటి ఆలోచనల్ని

ఊహలకందని లోకాల్ని... ఊపిరి సలపని పనుల్ని

అన్నింటినీ తనలో లీనం చేసుకుని

గంటలతో

ప్రతి ఇంటినీ మేల్కొలిపే గడియారమే

వారికిపుడు ఆప్తబంధువు

 

టిక్ టిక్ మని తిరిగే గడియారం చప్పుడుకి

ఏ అర్థరాత్రో హఠాత్తుగా మెలకువ వస్తుంది

కళ్లలో ఆశల దీపాన్ని వెలిగించి

వాలిపోతున్న కనురెప్పల్ని వాకిలిగా కాపలా పెడతారు

అయినా... తమకోసం ఎవరొస్తారు?

అయోమయంగా నవ్వుకుని

రాని నిద్రని దుప్పటిలా ముసుగేసుకుంటారు

 

పగలెప్పుడవుతుందా అని రాత్రి

రాత్రి ఎప్పుడవుతుందా అని పగలు

ఎదురుచూపుల్తోనే గడిచిపోతుంది జీవితమంతా

అయినా...

ఎప్పుడు తెల్లారతాయో తెలియని బతుకులకు

రాత్రెప్పుడు గడిస్తేనేం?

పగలెప్పుడైతేనేం?

 

చుట్టూ మనుషులున్నారు

అయినా...

మమతలు గాలిలో దీపంలా ఆరిపోతున్నాయి

ఎవరూ లేని అనాథలు కొందరు

అందరూ ఉన్నా అనాథలు ఇంకొందరు

మనిషి సంబంధాలన్నీ మనీ సంబంధాలే!

 

తీరంలేని సముద్రంలా

దారం తెగిన గాలిపటంలా

వృద్ధాప్యమిప్పుడు

ఊతకర్రను చేతపట్టుకుని

తనలో తానే ఊసులాడుకుంటోంది

ఒంటరితనపు ఒలలో చిక్కి

తనలో తానే పెనుగులాడుతోంది

టిక్ టిక్ మని తిరిగే గడియారం చప్పుడుకి

అర్థరాత్రో హఠాత్తుగా మెలకువ వస్తుంది

కళ్లలో ఆశల దీపాన్ని వెలిగించి

 

 
     
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)