కవితా స్రవంతి-2

ఓ కొత్త మనిషీ!.. రాయిలా

(విజయ నామ సంవత్సర ఉగాది కవితల పోటీల్లో రెండవ బహుమతి $150 పొందిన కవిత)

-  యశస్వీ, హైద్రాబాదు   


   
 

కొత్త మనిషీ!.. రాయిలా
కూర్చో నా ముందు రాయిలా

పూజ నిన్ను కరిగించాలనే
చిమ్ముకుంటుంది చీకటి నాపై
నీ సాయంతో తొలగించాలనే

ఒత్తుల్నికళ్ళలో నలుపుకుంటూ
చీకటి తొలగాలని
నా చూపుల్ని నీపై గుచ్చాను
వెలిగించవా నన్ను..
ఒక్క క్షణం చిటపటలాడి వెలిగిపోతాను

నా మాటల మధ్య నీ మౌనాన్ని పంచవా..
చప్పట్లతో బెదరగొట్టకు నన్ను
చెప్పాల్సినవి ఎన్నోఉన్నాయి
చీకటి పై పట్టుతప్పిపోతాను
కొన్ని రహస్యాల్ని గుట్టు విప్పిపోతాను 

నేనొచ్చే దారిలో ఎన్నో చూశాను
నీరుగారిపోతున్న వ్యవసాయ వర్తకాల్ని
కునారిల్లుతున్న జవాబుదారీతనాన్ని
గొలుసుల్లాగే దొంగల్ని
పన్ను ఎగ్గోట్టే దొరల్ని 

నేనొచ్చే దారిలో చూశాను..
సర్చార్జీలతో పెరిగిన కరెంటు బిల్లుల్ని
గ్యాసు బండ బరువుల కరువుల్ని
ప్రాణాలు తీసే దవాఖానా మందుల్ని
కళ్ళ ముందు కుదేలవుతున్న వ్యధల్ని

నేనొచ్చే దారిలో చూశాను
కందిపప్పు కవరుమీద మంత్రిగారి ముఖాన్ని
కులాల బలాల పై నిలబడ్డ ఓటు విలువని
మరుగుదొడ్లను మింగేసిన యంత్రాంగాల్ని
ఆడతన్నాన్ని వేటాడే విహంగాల్ని 

నేనొచ్చే దారిలో విన్నాను
ఉన్మాదపు బాకా ధ్వనులను
ధర్మ సూక్ష్మ పెడార్ధాలను
లక్ష్మణరేఖపై వక్ర భాష్యాలను
దైవదూతల సంయమనాలను 

నేనొచ్చే దారిలో చూశాను
పెరిగిన టికెట్టుధరల పట్టీల్ని
పెట్రోలూ డీజిల విజిల్ మోతల్ని
తెలుగులో చదువుతూ ఇంగ్లీష్ పరీక్షలు రాస్తున్న పిల్లల్ని
మనమలతో మాటాడాలని ఇంగ్లీషు నేర్చుకునే బామ్మల్ని 

నేనొచ్చే దారిలో చూశాను
తగ్గిన వరి సాగుని
ఎండిన నారు పక్కనే.. చచ్చిన రైతు చేతిలో
సగం మిగిలిన పురుగు మందు డబ్బాని
చేతిలో నోట్లు చెల్లనివని తెల్లబోయిన వాడ్ని 

నేనొచ్చే దారిలో చూశాను
చావలేక బతుకుతున్న సగటుజీవిని
మతమో మౌఢ్యమో తెలియని ఉన్మాదుల్ని
బాంబులు పేలి తునకలైన శరీరాల్ని
రక్తానికీ మాంసాన్ని మతాలతో ముడిపెడుతున్న కసాయి తనాన్ని 

నేనొచ్చే దారిలో చూశాను
గన్ మేన్ల రక్షణలో గున్న ఏనుగుల్నిఎలుగుల్ని
బుధ్ధుడి ముందరే దిక్కులేని తెలుగు వెలుగుల శిధిలాల్ని
వీధి వీధినా లెక్కలేనన్ని గాంధార సంతానపు విగ్రహల్ని
పేదరికం పెంచుతున్న ఆగ్రహాల్నితగ్గుతున్న నిగ్రహాల్ని 

నేనొచ్చే దారిలో చూశాను
రాజకీయ ఉద్యోగాల్లో వంశోత్తర దశల్ని
పందికొక్కులు మెక్కుతున్న ధాన్యాన్ని
కాలుష్య నగరాల్లో ప్రాభాత పరుగుపందాల్ని
తాగిన మత్తులో కన్నవారిని కడతేర్చిన కసాయిని 

నేనొచ్చే దారిలో చూశాను
వివాదాలే నినాదాలైన నవీనరీతిని
వివక్షలకు మూలాలైన తరగతి గదుల్ని
పుట్టినా మగాళ్ళమధ్య మగ్గలేక తగ్గుపోతున్న ఆడపిల్లల్ని,
ఉన్న కొద్ది మందీ తమని తాము మరచిపోతున్న వైనాన్ని 

నేనొచ్చే దారిలో చూశాను
రోగాలతో తల్లడిల్లుతున్న అడవి బిడ్డల్ని
లోగుడ్డలేసుకున్నందుకే నక్సలైట్ ముద్ర పడ్డ చెల్లెల్ని
రహస్యం గా ఉరితీస్తున్న రాజ్యాంగాన్ని
చనిపోయినా పించను పొందుతున్న సమాధుల్ని 

నేనొచ్చే దారిలో చూశాను
కోటి మందిలో జెడీని
ప్రతి పది మందీలో ఒక కెడీని
వంద కోట్ల మందిలో ఒకే ఒక గాంధీయ వాది అన్నాని,
వందలకోట్లను మింగిన రాబందుని 

నేనొచ్చే దారిలో చూశాను
నా తలపై పెరిగిన అప్పుని
బ్రిటన్ ప్రధాని ఇన్నాళకైనా ఒప్పుకున్న తప్పుని
బాల్యాన్ని నలుపుతున్న పేదరికపు ముప్పుని
తొక్కి నారతీస్తున్న అమలు కాని చట్టాల్ని, 

మరి ఏం చేద్దాం చెప్పు తప్పుల తడకల లోకాన్ని
తిట్టుకుంటూ కూర్చుందామా ముసురుకుంటున్న చీకట్లని!!

కొత్త మనిషీ!.. రాయిలా
ఎందుకు మౌనం నా ముందు రాయిలా

వెలిగించవా నన్ను.. ఏం చేయాలో ఏమిటో!!
ఒక్క క్షణం చిటపటలాడి వెలిగిపోతాను

నా మాటల మధ్య నీ మౌనాన్ని పంచవా..
చప్పట్లతో బెదరగొట్టకు నన్ను
చెప్పినవి కొన్నే..
చెప్పాల్సినవి ఎన్నోఉన్నాయి
చీకటి పై పట్టుతప్పిపోతాను
కొన్ని రహస్యాల్ని గుట్టు విప్పిపోతాను

 

 
     
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)