కవితా స్రవంతి-1

ఉగాది కానుక

(విజయ నామ సంవత్సర ఉగాది కవితల పోటీల్లో మొదటి బహుమతి $200  పొందిన కవిత)

 

-   గరిమెళ్ళ నాగేశ్వరరావు, విశాఖపట్నం   


 

ఇంధ్ర ధనుస్సుకి ఇరువైపులా

మెరుపుతీగ నారి కట్టి...

వేకువ కిరణాన్నిసూరీడి చెవిదాకాలాగి

సూటిగా వదిలినట్టుంది కాలం.

వెలుగురేఖ చెట్టు కొమ్మకి తగలగానే

గూటిలోపలి పిట్ట కొత్త పాటందుకుంది

స్వాగతగీత సంగీతంలా.

నందనవనంలో నీళ్ళోసుకున్న కాలం

ఎవ్వరి కంటా పడకుండా ఎలాగైతేనేం..

పండంటి ఆడబిడ్డని కని పండగ చేస్తోంది.

హృదయాలలో విజయోత్సవం ఇప్పుడే మొదలయ్యింది.

మిత్రమా... ఉగాదికి నీకో అరుదైన కానుకనందించాలి

మనసు లోతుల్లో వెదికైనా నీకో బహుమతి తేవాలి!

.సీ గదుల్లో కూర్చున్నా..ఎవ్వరిదో ఏడుపు వినిపిస్తోంది

మినరల్ వాటర్ తాగుతోన్నా కన్నీటి రుచే అనిపిస్తోంది.

వెన్నముద్ద గొంతు దిగుతున్నా..మదిలోపల మన్ను వాసనే వేస్తోంది.

మూలాలని మరిచిపోలేని బలహీనతే మనిషిని బ్రతికించే బలమౌతోంది

నా వెదుకులాటలో కొన్ని జ్ఞాపకాల రాళ్ళు కాళ్ళకి తగిలి తడబడింది నిజం

హస్తినాపురంలో బస్సెక్కి నలిగిపోయిన బంతిపువ్వు ని చూసి చింతిస్తూనే

మలాలా పెదాల మధ్య రాలిన గుప్పెడు మల్లెలని గుట్టుగా ఏరుకున్నాను.

దిల్ సుఖ్ నగర్ దిగులు బుగ్గలమీద బొగ్గు నుసి తుడుస్తూనే...

నన్ను నేను దహించుకు ఇన్సాట్ ఎత్తుకి ఎగిరి చూసాను.

కష్టాలని కాష్టానికి పంపించేసి.. దుఃఖాన్ని దుక్కి తో దున్ని

సంతోషం పండించడం..మనకి మన్ను తో పెట్టిన విద్యే కదా.

అందుకే..మిత్రమా..కాలాన్ని కరవాలం చేసి నీ చేతికిస్తాను

విలువల వలువల్ని వొంటికి చుట్టి నైతికతని నెత్తిన పెడతా

గుప్పెడు ప్రేమని నీగుండె నిండా నింపి..

ఎగిరే గుర్రాన్ని ఎక్కిస్తా..

ఎదురయ్యే దుఃఖ నదులని లెక్క చెయ్యకుండా దూసుకుపో

విసిగించే చిక్కుముళ్ళని ఒక్కటొక్కటిగా కోసుకుపో

దారి పొడవునా సంతోషాల సంతర్పణ చేస్తూ..సాగిపో

పారిపోయే వాళ్ళని దారి మళ్ళిస్తూ..

దారి తప్పిన వాళ్ళకి దీపం చూపిస్తూ

నిరాశ ఉరికొయ్యలకి నీరసంగా ఊగుతోన్న

జీవచ్చవాలని కిందికి దింపి...

అణువణువునా ఆత్మ విశ్వాసాన్ని నింపు.

చూపులని దాటుకు లోపలికి ఎగిరొచ్చే

సీతాకోక చిలుకల స్నేహావిహారాలకి..

మనసు పూదోటలో మకరందాన్ని కానుక చేద్దాం!

మిత్రమా.. ఉగాదికి జగమంతా వెన్నెల నింపి

జనావళికి...కానుకగా ఇద్దాం!!

 

 
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)