|
మట్టిమీది
మమకారం -
ఓ
విషాద
గాథ!
చిలుకూరి
దేవపుత్ర
కథ :
మన్నుతిన్న
మనిషి
కొన్ని జీవితాలు చీకట్లో పుట్టి, చీకట్లో పెరిగి,
తిరుగుతూ చీకట్లోనే పయనిస్తూ ఉంటాయి. కథ -
జీవిత దర్పణమే కాబట్టి కొన్ని కథల పరిస్థితీ
ఇంతే.
మట్టిమీద మమకారం పెంచుకున్న మనిషి కథ కూడా
ఇలాగే ముగియడం యాదృఛ్ఛికం కాదు. ఛిద్రమైన జీవన
చిత్రపటం అంత వాస్తవంగా ఉంది. చిలుకూరి
దేవపుత్ర రచన ’మన్నుతిన్న మనిషి, కథ కూడా
ఇటువంటిదే. ఈ కథ దాదాపు పదిహేనేళ్ళ క్రితం
ప్రచురితమైంది. అంతకు ముందూ ఈ ఇతివృత్తంతో
పెద్దలు కొన్ని మంచికథలు రాశారు. అయితే, ఈ కథ
వచ్చిన తర్వాత అంశం ఆధారంగా పుంఖానుపుంఖాలుగా
చాలామంచి కథలు వచ్చాయి.
మన్నుతిన్న మనిషి కథకి చెన్నప్ప రైతు జీవితం -
కేంద్ర బిందువు. పండీ పండని పొలాన్ని నమ్ముకుని,
దానితో మమేకమై పోయినవాడు చెన్నప్ప. ’బూమినా
పానంరా. దాన్ని అమ్మేది అంటే తల్లిని
అమ్మినట్లేరా అని కొడుక్కి నచ్చచెప్పచూసినా,
బతిమాలినా బామాలినా పొలం అమ్మాల్సిందేనన్న
కొడుకుతో విసిగిపోతాడు చెన్నప్ప. అలాగే
కొడుక్కీ తండ్రిచేత ’సరే’ అనిపించడం చేతకాలేదు.
త్వరతరగా ముగిసిపోతున్న క్రిందటి శతాబ్దం చివరి
దశాబ్దంలోని బక్కరైతు చెన్నప్ప. అతని నమ్మకాలూ,
మమతానురాగాలూ, అహంకార మమకారాలూ అతనికి ఉన్నాయి.
వీటన్నిటి తునుకలూ సంఘటనా శకలాలు కథలో మనకు
తగులుతాయి. మరో వైపు అప్పుడే సంసారపు కాడి,
భుజాలకెత్తుకున్న చెన్నప్ప కొడుకు - ఇద్దరు
బిడ్డల తండ్రి - రామచంద్రుడు ఉన్నాడు. వీళ్ళకి
అనేకానేక ఆశలూ, అవకాశాలూ. వీళ్ళకీ పెద్దాయనంటే
ఉన్న అభిమాన గౌరవాలూ ధ్వనిస్తూ ఉంటాయి కథలో.
అయితే, వీళ్ళు వూర్లో ఉన్న పదెకరాలూ అమ్మేసి
వెళ్ళి బళ్ళారిలో ఇంత ఇంటి జాగా కొనుక్కుని
గుడిసె వేసుకొని, ఏ కూలోనాలో చేసుకుంటూ,
పిల్లల్ని చదివించుకుంటూ బతకాలనే ఆలోచనలో
ఉన్నవాళ్ళు. ఈ ఆలోచనలతోనే పల్లెకొచ్చి
చెన్నప్పతో ఘర్షణకి దిగారు. చివరికి ససేమిరా
అంటే .. నా భాగానికి వచ్చేది నాకిచ్చెయ్యి
అంటాదు కొడుకు తెగతెంపులు చేసుకుంటున్నట్లు.
చెన్నప్ప కళ్ళలో గిర్ర్తున నీళ్ళు తిరిగాయి.
ఆక్రోశాన్నీ, ధర్మాగ్రహాన్నీ ఇలా వ్యక్తం
చేశాడు. ’ నీ భాగం నా భాగం ఏందిరా? అంతా నీది
కాదేంరా? నాకేమన్నా నలుగురు కొడుకులూ ఉండారేంరా
భాగాలు పంచి యిచ్చేదానికి? నాతో భాగం
పంచుకొనేకి నాకీ అన్నదమ్ముడేంరా... రేయ్...అంతా
నువ్వే తీసుకోప్పా! నాకేమి వల్ల! దాన్ని
అమ్ముకుంటావో పాడు చేసుకుంటావో నాకేల? అంటూ
ఏడుపు గొంతుతో వెళ్ళిపోతాడు. మసిలోనికి
భూమిపిచ్చి అని తేలిపోయింది. తీరా మర్నాడు -
తన వాడిపోయిన వేరుశనగ చేనులో తల్లియెదమీద
ఆదమరచి నిద్రిస్తున్న పసివాడిలా నిర్వికారంగా,
నిర్మలంగా శవమైపోతాడు చెన్నప్ప!
Life is a tragedy for those who feel అంటారు.
మట్టిమీది మమకారం ఆరాధనగా మారి, ఆత్మీయబంధమై,
ఆప్తసాన్నిహిత్యమై విడదీయరాని కఠోర
సత్యమైనప్పుడు ఆ మట్టి పోతుందన్న ఊహే
దుర్భరమవుతుంది. మన్నుతిన్న మనిషి కథలోనూ
జరిగిందిదే!
రాయలసీమ అనావృష్టి దుస్థితే కథా నేపథ్యం.
బళ్ళారి పోయి కూలీక్గా మారిన రామచంద్ర వలస
బతుకు కూడా పల్లవిలేని పాటగా - కథకుని కంఠస్వరం
ధ్వనిస్తూనే ఉంటుంది. ఈ కథలో అసలు మెఱపు -
తండ్రీకొడుకుల మధ్య కొడుకూ కోడలు మధ్య,
మామకోడలు మధ్య ఎన్నెన్ని నిష్ఠూరాలాడుకుంటున్నా
- అంతరాల్లో వెలిగే మమతానురాగాల చిరుదివ్వె
వెలుగు. ఒకరి భావం పట్ల ఒకరికి లోలోపల
నిలిచిఉన్న గౌరవ పరిస్థితుల బలిమివలన బయలు
గాలికి రెపరెపలాడినా - లోన నిశ్చలంగా వెలుగుతూ
ఉండటం. పాత్ర చిత్రణలో కథకుడు చూపిన నైపుణ్యం
అబ్బురపరుస్తుమ్ది.
సమాజాన్ని సన్నిహితంగా అనుశీలనం చేస్తున్న
దేవపుత్ర వంటి రచయితల కథల్లో వస్తువు వివరణ
గాఢంగా ఉంటుంది. పఠితని చేస్తున్న దేవపుత్ర
వంటి రచయితల కథల్లో వస్తువు వివరణ గాఢంగా
ఉంటుంది. పఠితని తన పట్ల ఆకర్షించబడుతుంది. ఈ
కథలు చదివిన పాఠకుడు - తనకు ఇప్పటివరకూ లొతుగా
తెలియని ప్రపంచం ఎలా ఉందో అవగతం
చేసుకోగలుగుతాడు. గ్రామవృత్తులూ, వృత్తాంశాలూ
ఎన్ని కఠోర వాస్తవాల సుడిగుండాల్లో స్రుక్కి
విలవిల్లాడుతున్నాయో తెలుసుకోగలుగుతాడు. ఈ
పరిస్థితులు ఇట్టా ఉండడానికి కారణాలు ఏమిటి?
అనే విచికిత్స మొదలౌతుంది. ఆ విచికిత్స
అన్వేషణకి దారితీస్తుంది. ఆ ఆలోచన
ఆచరణాత్మకమైన దిశానిర్దేశానికి పునాది అవుతుంది.
అనే ఆశే కథకుల ఆశయం.
జీవితాన్ని Truthful గా ప్రతిబింబించటం. జీవిత
సత్యం బయట పెట్టడం ఇదే సాహిత్య లక్ష్యంగా
చెప్పారు కొ.కు. ఈ లక్ష్య శుద్ధి కలిగి రచనలు
చేస్తున్న చాలా మంది కథకుల్లో ఒక మంచి కథకుడు
దేవపుత్ర. దానికి ఒక చిన్న సాక్ష్యం. మన్ను
తిన్న మనిషి కథ!! కథకి ఉండాల్సిన మూలస్థంభాల్లో
ఒకటి - Unity of thought ఏకసూత్రత అంటారు. ఒకే
అంశం మిద ఒకే సమస్య మీద రెండు తరాల మనుషుల్లో
ఎంతటి సంఘర్షణకి అవకాశం ఉందో ఈ కథ చెప్తుంది.
ఆ సంఘర్షణ ప్రాధాన్యాన్ని మింగేయని శిల్ప బలంతో
కథనాన్ని సాగించారు రచయిత. అందుకే మన్నుతిన్న
మనిషి తెలుగు కథల్లో మరొక తేజోరేఖ. |
|