కథా భారతి - అనుకున్నదొక్కటి

- రచన : తమిరిశ జానకి  


 

సాయంకాలం వొచ్చేటప్పటికి ఎదురింటి తలుపులు తీసి ఉండడమే కాక లోపల సామాన్లు...బయట కూడా కొన్ని పెద్ద చెక్కపెట్టెలు కనిపించి ఎవరో అద్దెకి దిగారన్నమాట అనుకున్నాడు చక్రవర్తి. ఇరవై రోజులయిందేమో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేసి. చాలా పెద్ద ఇల్లది. ఇంటికి ముందూ వెనకా మొక్కలున్నాయి. కార్ గరాజ్ ఉంది. తను ఇది వరకున్న ఇల్లు మారి ఆర్నెల్లకిందట ఈ ఇంటికి వొచ్చేటప్పటికి వృద్ధదంపతులున్నారా ఇంట్లో. ముసలాళ్ళంటే పరమ చిరాకు చక్రవర్తికి...తనెప్పటికీ ముసలాడు కాకుండా పడుచువాడిగానే ఉంటాడన్నట్టు....వాళ్ళు తనని పలకరించబోయినా తప్పించుకు తిరిగాడు. పరిచయం చేసుకోలేదు.ఓసారి ముసలాయన అత్యవసరపరిస్థితిలో గుమ్మంలోకొచ్చి ఏదో సలహా అడగబోతే తెలిసి కూడా నాకు తెలియదు ఆఫీసుకి టైమ్ అవుతోందినాకు అంటూ ఇంక వెళ్ళమన్నట్టు చూశాడు ఆయన వంక. వాళ్ళూ అర్ధం చేసుకుని తమ మర్యాద తాము నిలబెట్టుకుని మసలుకున్నారు ఆ ఇంట్లో ఉన్నఆర్నెల్లూ.అమెరికాలో ఉన్నకొడుకు ఒక్క ఆర్నెల్లపాటు వాళ్ళని తన ఇంట్లో ఉండమని చిన్నచిన్నరిపేర్లు ఏవన్నాఉంటే చేయించెయ్యమని ఆర్నెల్లల్లోఅమెరికాలో ఉన్న తన స్నేహితుడొకడు ఇండియాకి వొచ్చేస్తున్నాడని నాఇల్లు అద్దెకి తీసుకుంటాడని బతిమాలడంతో కొడుకు మాటకాదనలేకవాళ్ళొచ్చిఆ వయసులోఆ పెద్దఇంట్లోఒంటరిగా గడపవలసివచ్చిందని వాళ్ళతో అసలు పరిచయం చేసుకుంటే కదా చక్రవర్తికి తెలిసేది.అది తెలియక లంకంత ఇంట్లోముసలిపీనుగులు గొప్పకోసం కాకపోతే ఎందుకు ఉండడ ంఅనితిట్టుకుంటూ ఉండేవాడు చక్రవర్తి.తను అద్దెకున్న ఎదురిల్లు డ్రాయింగ్ రూమూ వంటగదీ ముందు వరండా వెనక వరండాలో బాత్రూమూ ఉన్నచిన్నఇల్లు.ఇంకా కట్టుకోవలసిన స్థలం ఉంది గానీ డబ్బు సరిపోక తాత్కాలికంగా కట్టడం ఆపేసి అద్దెకిచ్చేశారు ఆ ఇంటివాళ్ళు. తలుపు తాళం తీసి లోపలికెళ్లాడుగానీ వెంటనే మళ్ళీ వీధితలుపు వేసెయ్యలేదు చక్రవర్తి.ఇదివరకైతే్ ఆముసలాళ్ళు వొచ్చి పరిచయం చేసుకుంటారేమో అన్న చిరాకుతో ఇంట్లోకి అడుగుపెట్టగానే దఢాలున వేసేసుకునేవాడుఇప్పుడు కుతూహలం కదా ఆ ఇంట్లో దిగిన వాళ్ళెవరైనా కనిపిస్తారేమో చూడాలి. కాఫీ కలుపుకుని తాగుతూ గుమ్మంలోనే తచ్చాడటం మొదలెట్టాడు. కాసేపట్లోఅనుకున్నది నెరవేరింది. మొక్కల దగ్గిరకి వచ్చిన ఆమె సుతారంగా పసిపిల్లల బుగ్గలు తాకినట్టు చేయి వేసి ఒక్కొక్క మొక్కనీ పలకరిస్తోంది. ఆమె బాగా కనపడేవిధంగా ముందు వరండాలోకి వచ్చాడు చక్రవర్తి .ఉలిక్కిపడ్డాడు...మళ్ళీమళ్ళీ పరీక్షగా చూశాడు. ఔను..సందేహం లేదు...ఆమె...నీరజ...తాను చులకన భావంతో చూసే వ్యక్తులలోమొదటి వ్యక్తి. ఇక్కడుందేమిటి ?ఇంత పెద్ద ఇంట్లో ! నమ్మలేకపోతున్నాడు. ఇంతలో నీరజా అని పిలుస్తూ ఒకతను వచ్చిఆమె పక్కన నిలబడి ఏదో మాట్లాడుతుంటే మరింత ఆశ్చర్యపోతూచూశాడు. అతను...... అతను శ్రీహర్ష...ఔను....చక్రవర్తి కళ్ళు పెద్దవయ్యాయి....తెరుచుకునే ఉండిపోయిన నోరు...కదలిక మర్చిపోయిన కాళ్ళూ.....ఊహించని దృశ్యాన్ని చూస్తూ ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్న మనసు....కొద్దిసేపు ఆ పరిస్థితిలో ఉండిపోయాడు. మెల్లిగా వెనక్కి తిరిగి నీరసం కమ్ముకొచ్చినవాడిలా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళి కుర్చీలో వెనక్కివాలిపోయాడు........

ఆఫీస్ లో తన పనేదో తను చేసుకుని బుద్ధిగా ఇంటికి వెళ్ళిపోవడం తప్ప ఇతర విషయాల్లో గానీ ఇతరుల విషయాల్లోగానీ జోక్యం చేసుకునేది కాదు నీరజ. అవసరం ఉన్నా లేకపోయినా ఆమెతో కల్పించుకుని కబుర్లు చెప్పాలని చూస్తుండేవాళ్ళు కొందరు. అలాంటివాళ్ళల్లోఒకడు చక్రవర్తి. తనేకదా తెల్లగా అందంగా ఉంటానన్నగర్వం అతని అణువణువునా నిండిపోయి ఉండేది .నీరజ తనని చూసి పడిపోతుందనుకున్నాడు. కానీ ఆడది కనపడితేచాలు సుత్తి కొడుతూ ప్రగల్భాలు చెప్పుకోడమే కాక ఆ ఆడవాళ్ళవివరాలన్నీసేకరించాలనీ వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ రాబట్టెయ్యాలనీ చూసే చక్రవర్తి లాంటి వాళ్ళంటే నీరజకి నచ్చదు. ఉద్యోగంచేసుకునే వయసు వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత బావుంటుందనీ అదికూడా ఆడంగి అబ్బన్నలా కాక ఎంత డిగ్నిఫైడ్ గా మాట్లాడితే అంత గౌరవం ఉంటుందనీ ఎంతోమంది ఆడవాళ్ళకున్న అభిప్రాయమే నీరజది కూడా. " కబుర్లపోగులని ఆడవాళ్ళనంటారు కదా! మరి ఈ చక్రవర్తి ఏవిటి ఆడవాళ్ళని మించిపోయి నోరు తెరిస్తే అలా మాట్లాడుతూనే ఉంటాడు నాన్ స్టాప్ గా. చచ్చినట్టు వినాల్సిందే మనం. ఇంక ఎవర్నీ ఎవరితో మాటాడుకోనివ్వడు. అందరూ తన వైపే కళ్ళూ చెవులూ అప్పగించాలన్నట్టు....ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోకూడదన్నట్టు ప్రవర్తిస్తాడు" అంటూ ఓ సారి అతని లెక్చరు భరించలేక నీరజ దగ్గిర వాపోయింది కొలీగ్ శ్యామల. ఏడవలేక నవ్వినట్టు నవ్వింది నీరజ.

ఆ రోజు రాత్రి తొమ్మిదింటికి కాలింగ్ బెల్ మోగితే వింతగా అనిపించింది నీరజకి.ఆ సమయంలోతన ఫ్లాట్ కి వొచ్చే వాళ్ళెవ్వరూ లేరు.తలుపుకున్నగొలుసుకూడా ఎనిమిదిన్నరకే పెట్టేసుకుంటుంది తను ఎందుకైనా మంచిదని. ఆ గొలుసు అలాగే ఉంచి తలుపు కొద్దిగా తెరిచి చూసింది .ఎదురుగా చక్రవర్తి.....చేదు తిన్నట్టుగా అయింది పరిస్థితి. లోపలికి రావచ్చా అడుగుతున్నాడు....వినపడింది. తప్పనిసరిగా తలుపుతీసింది.ఏవిటన్నట్టుగా చూసింది. చాలా మామూలుగా రోజూ వొస్తున్నవాడిలా లోపలికి వొచ్చేశాడు.కూచోమని అనకుండానే కుర్చీ లాక్కుని కూచున్నాడు. నీరజకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వదల్చుకోలేదు...."మొదటిసారి వొచ్చాను.కాఫీ అయినా ఇవ్వరా?" నిర్మొహమాటంగా సమాధానమిచ్చింది నీరజ "వెరీ సారీ." ఇది కాఫీ తాగే వేళ కాదు అందామనుకుంది గానీ అలా అంటే అయితే రేపు కాఫీ వేళకి వొస్తానంటాడేమో అని భయపడింది .కానీ అంతకంటే మరో మెట్టు ఎక్కువే వెళ్ళాడు చక్రవర్తి . "ఓ...ఇప్పుడు కాఫీ ఏమిటి డిన్నర్ చేద్దామంటారా " గొంతు దాకా వచ్చిన కోపాన్నిఅదిమిపెడుతూ సాధ్యమైనంత మెల్లిగా అంది నీరజ "మీరు అతి చనువు తీసుకుంటున్నారు.మన పరిచయంఆఫీస్ వరకే ఆఫీస్ పనుల వరకే అయితే బావుంటుంది." పళ్ళునూరుకుంటూ లేచి బయటికి వెళ్లాడు చక్రవర్తి. ఆలోచిస్తూ నడుస్తున్న అతడికి వొంటికి కారం రాసినట్టుగాఉంది. దానిక్కారణం ఇప్పుడు జరిగిన ఈ ఒక్క సంఘటనే కాదు.ఆ మధ్య పెళ్ళి ప్రపోజల్ తీసుకొచ్చాడు తను. నిజంగా చేసుకుందామని కాదు.ఆశతో తనెక్కడికి రమ్మంటే అక్కడికి వొస్తుందనీ చుట్టూ తిప్పుకున్నన్నాళ్ళూ తిప్పుకుని పెళ్ళి వాయిదావేస్తూ ఎంజాయ్ చేస్తూ ఆమెగారి జీతం కూడా చేజిక్కించు కుంటూ పేకాటలో వాడుకోవాలని ప్లాను. పెళ్ళెప్పుడంటూ బాగా సతాయించడం మొదలుపెడితే ఆమె గారిని ఉద్ధరిస్తున్నట్టు పోజుపెట్టి పెళ్ళాడి ఆ జీతం కూడా ప్రతినెలా సొంతం చేసుకుంటుంటే తన లైఫ్ లో మజాయేమజా. చచ్చినట్టు పడుండక ఏం చేస్తుంది అనుకున్నాడు. కానీ....సారీ నాకిష్టంలేదు ఏమీ అనుకోకండి అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసింది. ఏం? తనకి ఏం తక్కువని?చిన్నదో చితకదోఒకఉద్యోగం చేస్తున్నాడు .అందం ఉంది. ఆవిడగారికేవన్నా ఆస్తిపాస్తులు పెద్ద ఆఫీసర్ అయిన తండ్రీ ఉన్నారా?ఆయనేదో కొట్లో పద్దులు రాసేవాడనీ పోయి చాలా కాలం అయ్యిందనీ తల్లి కూడా ఆ మధ్య హైబీపీతో పోయిందనీ ఇంక తనకి తోబుట్టువులు కూడా లేరనీ విషయసేకరణ అంతా చేసాకే... ఇంక దిక్కెవరూ లేరు కాబట్టి తను పెళ్ళి మాట ఎత్తగానే కాళ్ళమీద పడుతుందని అనుకున్నాడు. ఎందుకంత గర్వం? తన లాంటివాడు ఎవడు దొరుకుతాడు చేసుకోడానికి ?ఎలాగైనా ఆ గర్వంఅణచాలనుకున్నాడు....ఆ పంతంతోనే ఇంటికెళ్ళాడు .అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళడం మొదలుపెడితే మనసు మార్చుకుని దిగొస్తుందనుకున్నాడు. ఒంటరి ఆడదాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో తెలుసుకోలేని జల్సారాయుడు మొదటిదెబ్బతోనే ఔటయ్యాడు.దాంతో ఇంకా పంతం పెరిగింది. నీరజ ఎంతో మంచిదని పనిమంతురాలని ఇంతవరకూ అనుకుంటున్నఎమ్.డి. ఆమెని నమ్మకద్రోహిగా అసహ్యించుకోవాలి.అందుకోసం ఆఫీస్ లో ఆమె పరువు పోయే పనేదో తను అలోచించాలన్ననిర్ణయానికొచ్చాడు.

అనుకున్నట్టే ఆ అవకాశం వెంటనే వచ్చింది.ఆ రోజు నీరజ సెలవు పెట్టింది .ఆమె చేసే పనిలో కొంచెం అత్యవసరమైనది తనని చూడమన్నాడు ఎమ్.డి. ఆ పనికి సంబంధించిన కాగితాలు తీసుకుంటుంటే ఆమెదగ్గిర ఉండే కాన్ఫిడెన్షియల్ ఫైల్ కళ్ళ పడింది.ఈకాగితాల దగ్గిర ఈ ఫైల్ మర్చిపోయే పెట్టిందో ఏమోగానీ తనపంట పండిందనుకున్నాడు. అందులోంచి ముఖ్యమైన కాగితం ఒకటి తీసి దాచేసి సాయంత్రం ఆఫీస్ నించి సరాసరి జగ్గారావు దగ్గిరకెళ్లాడు.అతనితో పరిచయం ఉంది.తను పనిచేసే ఈ కంపెనీకి ప్రత్యర్ధికంపెనీలో పని చేస్తాడు.ఏవిటి ఇలా వొచ్చావు అంటూ అడుగుతున్నఅతనికి ఒకటే సమాధానం ఇచ్చాడు నీరూమ్ కి పద అక్కడ చెప్తాను.
ఆరోజు చాలా సంతోషంగా ఆఫీసుకి వచ్చాడు చక్రవర్తి. ఎమ్.డి. నించి నీరజకి పిలుపొస్తుందని ఘాటుగా చివాట్లు పడటమేకాదు ఉద్యోగంలోంచి తీసేస్తాడని ఎదురు చూస్తూ ఊహల్లో తేలిపోతున్నాడు.కానీ ఆశ్చర్యంగాతనకొచ్చింది పిలుపు.అయోమయంగా లోపల అడుగుపెట్టాడు.ఎమ్.డి.మొహంలోఎర్రదనం కళ్ళల్లో కోపచ్చాయలు గమనించాడు. "చక్రవర్తీ నువ్వు వెంటనే రెజిగ్నేష న్ లెటర్ రాసిచ్చెయ్యి .నిన్నుఉద్యోగంలోంచి తీసేస్తున్నాను.వేరే ఇంకెక్కడైనా చూసుకో.నీ లైఫ్ పాడవకూడదనే రిజైన్ చేసి వెళ్లమంటున్నాను." "సార్!"తెల్లబోయిన చక్రవర్తి నోట్లోంచి మరో మాట రాలేదు."చూడు చక్రవర్తీ! పని బాగా చెయ్యడమే కాదు. కంపెనీకి సంబంధించిన విషయాల్లో అత్యంత నమ్మకస్తులుగా ఉండడం కూడా కావాలి.నీలో ఆ రెండుగుణాలూ లేవు.జగ్గారావు ఒకానొక కంపెనీలోఒక ఉద్యోగిగా మాత్రమే నీకు తెలుసు.అతను నాకు చాలా దగ్గరి బంధువు." పక్కనే పిడుగు పడినట్టయింది చక్రవర్తికి. "ఈకంపెనీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని నువ్వునీరజ ఫైల్నించి దొంగతనంచేసి అతని కంపెనీ ఎమ్.డి.కి అందజెయ్యమని చెప్పావని....నీరజమీదనీకెందుకు కక్షో అదికూడా చెప్పావని అన్నీ నాకు జగ్గారావు చెప్పాడు.నేను బంధువుని కదా అని అతనెప్పుడూ వాళ్ళ కంపెనీ రహస్యాలు నాకు చెప్పడం గానీ నేను అతన్ని అడగడం గానీ ఎప్పుడూ చెయ్యం .ఆ నియమం మేమిద్దరం పాటిస్తాం."ఎమ్.డి. మాటల్తో తలెత్తుకోలేక పోయాడు.

ఉన్న ఇల్లు ఖాళీ చేసి కొన్నాళ్ళుసొంతఊరెళ్ళిపోయి మళ్లీ వొచ్చిఎన్నో ప్రయత్నాలు చేసిన మీదటతుమ్మితే ఊడే ముక్కులాంటి ఓ చిన్న ఉద్యోగం ఓచిన్నఆఫీసులోదొరికింది .పెళ్లి సంబంధం వచ్చింది మధ్యవర్తిద్వారా.ఉద్యోగం చేస్తోంది అమ్మాయి. కళ్ళ ముందు పేకాటే కనపడింది.అమ్మయ్య అనుకున్నాడు.పెళ్ళిచూపులకి వెళ్తేఅక్కడతన ఎదురింట్లో ఉండివెళ్ళినవృద్ధదంపతులుకనపడి ఖంగుతిన్నాడు.వాళ్ళు పెళ్ళికూతురితల్లికిపెద్దక్కాబావగారూ అని తెలిసింది.అమ్మాయికి తండ్రి లేడు కాబట్టి వీళ్ళే పెద్దదిక్కు.తనని చూడగానే వాళ్ళమొహాల్లో మారిన రంగుల్ని బట్టి అప్పుడే తెలిసిపోయింది వాళ్ళు తనకి పిల్లనివ్వరని.అదే జరిగింది. చేజేతులాతన ప్రవర్తనమూలంగా తనే నష్టాలు కొని తెచ్చుకున్నవాడయ్యాడు.ఆ అమ్మాయి అదృష్టవంతురాలే నిన్ను చేసుకోకపోవడంవల్ల అంది అంతరాత్మ.
ఆలోచనల్లోంచి వర్తమానంలోకి వొచ్చాడు చక్రవర్తి. కళ్ళముందు నీరజ శ్రీహర్ష నిలిచారు.తను పనిచేసినఇదివరకటి కంపెనీ ఎమ్.డి.కొడుకే శ్రీహర్ష.అప్పట్లో అమెరికాలో కొన్నాళ్ళు పని చెయ్యడానికి వెళ్ళాడు. నీరజకి ఇంత అదృష్టమా ?బాధగా మూలిగింది చక్రవర్తి మనసు.

 
     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)