ఎందరో మహానుభావులు - కొచ్చెర్లకోట రామరాజు

- రచన : తనికెళ్ళ భరణి    


  పోలవరం ఒకప్పుడు సంస్థానం... ప్రస్తుతం శిథిలమైన పేద్ద దివాణం.. ఒకప్పుడు ఎంత వైభవంగా వెలిగిందో తలుచుకుంటే బెంగ కలిగింది.

వార్ధక్యంతో పెచ్చులూడిపోయిన గోడలు..

గాజు కళ్ళతో గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నట్టు ఉన్న పైకప్పూ..
ఎంతమంది మహానుభావులు నా గుండా వెళ్ళారో అని గుండెలు బాదుకుంటున్న సింహద్వారం!
పడిపోడానికి సిద్ధంగా ఉన్న తలుపులూ..

సంగీత సాహిత్యాల హోరులో కళకళ్ళాడి ప్రస్తుతం.. శ్మశాన నిశ్శబ్దంగా బావురుమంటూ బంగళా...

రాజువారి కిరీటం లోంచి తొంగిచూసే తురాయిలాగా...
గోడ సందుల్లోంచి ఎండిపోయిన గడ్ది పరకలూ..
ఏదైనా ఇంతే కాబోలు.. కాలపురుషుడు ఎంత దయలేనివాడు..
కారే రాజులు రాజ్యముల్ కలుగవే.. వారేరీ సిరి మూట కట్టుకుని పోవం జాలిరే.. అంటాడు పోతన భాగవతంలో..

కొచ్చెర్లకోట ప్రభువులు..సిరిమూట కట్టుకుపోలేదు గానీ..
బోల్డంత కిర్తిని మాత్రం మూటకట్తుకున్నారు.
ఆ కిర్తి పరిమళాలు ఇంకా ఆంధ్రదేశమంతా వ్యాపిస్తూనే ఉన్నాయ్.
కొచ్చెర్లకోట వంశం వారు ఆరువేల నియోగులు..
కొచ్చెర్లకోట వేంకట జగన్నాథం గారు..పోలవరాన్ని పాలించిన మొదటి పాలకులు..
పోలవరమ్ సంస్థానాధీశులు దైవభక్తులు..
పక్కనే ఉన్న పట్టిసీమ శైవక్షేత్రానికి వంశపారంపర్యంగా ధర్మకర్తలు.
ప్రస్తుతం.. కొచ్చెర్లకోట వారు.. ఎక్కువమంది విదేశాల్లో స్థిరపడ్డా.. ప్రతీ సంవత్సరమ్ శివరాత్రికి ఆ వంశం వారంతా అక్కడికి చేరి అభిషేకాలు చేస్తారని తెలిసింది. వాళ్ళకి వాళ్ళ కుటుంబం పట్లా..
ఆ సంస్కృతి సంప్రదాయాల పట్లా ఉన్న గౌరవానికి నమోవాకాలు..
పోలవరం సంస్థానం పచ్చగా ఉండే రోజుల్లో ఎంతోమంది సంగీత కళాకారుల్ని సాహితీ వేత్తల్నీ గౌరవించి పోషించింది!

ఆ సంస్థానానికి చెందిన సంగీత విద్వాంసుడే కొచ్చెర్లకోట రామరాజు గారు...తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ గ్రామంలో 1878 లో జన్మించారు. బాల్యం నుంచీ సంగీత సాహిత్య విద్యాధురీణులైన నాదయోగి బ్రహ్మశ్రీ చేబోలు వెంకటరత్నం గారి దగ్గర సంగీత సాధన చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యులైన సి.యస్. కృష్ణస్వామి దగ్గర కొంతకాలం..
జంత్రగాత్రాలని అభ్యసించారు.

సాధన అంటే రాక్షస సాధన రాజు గారిది.
అదే దీక్ష.. అదే పట్టుదల.. అదే ధ్యాస.
అసలు అదే రహస్యం. ఏ విద్యన్నా పట్టుపడాలీ అంటే అర్జునుడికి కనిపించిన పక్షి కన్నులాగా..
మరో దానిమీద దృష్టి ఉండకూడదు. అదే గదా తపస్సంటె...
వాయులీనాన్ని ఆవాహన చేసేసుకున్నాడు రామరాజు..
రాముడి కోదండం లాగా.. రామరాజుకి వాయులీనం.
కమాను సంధించాడంటే నాద వర్షం.
ఆఖరికి వాయులీన రహస్యాల్ని ఎంత ఆకళింపు చేసుకున్నాడంటే...
కమాను లేకుండా.. కేవలం చేతివేళ్ళతో తీగల్ని మీటే
కావల్సిన ధ్వనుల్నీ...రాగాల్నీ వాయించే స్థితికొచ్చాడు...
అంటే వాయులీనం ఆయన ఉఛ్ఛ్వాస...నిశ్వాసం..
వాయులీనం...ఆయన గుండెకాయ..
వాయులీనం...ఈయనలో విలీనం.

సరళీ స్వరాలు, జంట స్వరాలు సంగీతాభ్యాసకులు ఉపయోగపడే విధంగా గాయక మనోరంజని అనే సంగీత గ్రంథాన్ని రాశారు. స్వరపల్లవులు గూడా రాశారు. శ్రీ కృష్ణ కర్ణామృతం నూట యెనిమిది కీర్తనలు కూడా రాశారు.
ఈయన కీర్తి ప్రతిష్టలు వినీ పోలవరం సంస్థానాధీశులు కొచ్చెర్లకోట కృష్ణారావు గారు రామరాజు గారిని ఆస్థానానికి ఆహ్వానించి కచేరి పెట్టించారు. పోలవరం సంస్థానంలో జరిగిన... అద్భుతమైన కచేరీలో ఇదొకటి గా శాశ్వతమైన అనుభూతి మిగిల్చిందట!

అలాగే శ్రీరామకీర్తన కర్ణామృతం అనే మరో సంగీత గ్రంథం రాశారు. అది పాడుకోడానికి సులువుగాను..మధురంగానూ కూడా ఉందని.. మిత్రులు కొంత మంది కోరగా.. అది ప్రింటు కావడం జరిగింది. అందులో శంకరాభరణం, ఖరహరప్రియ, కేదార, బిళహరి హరికాంభోజీ, పుష్పతిలక, జంఝాటి, కానడ, నాదనామక్రియ, దర్బార్, చక్రవాకం వంటి ప్రసిద్ధ రాగాల్లో ఎన్నో కీర్తనలు రాశారు.!

ఉదాహరణకి, ఖరహరప్రియ రాగంలో.. రాముడి చరితం..

పల్లవి : శ్రీ రఘురాముని చరితము వినుడీ
రాతిని ప్రేమతో నాతిగ జేసి, ఖ్యాతిగ విల్లుద్రుంచీ
సీతను గైకొని భూతలేశుడని పౌరులు పొగిడిన
వానర వీరుని వాలిని ద్రుంచీ, దినకరపుత్రుని ఘనమున బ్రోచీ అనిల సుతునికెంతో
ఆదరమొసిగిన
దారి కొరకు బలు వారధి కట్టి క్రూరుని లంకేశుని కూలగసేసి నీరజనేత్రని నేర్పుతో తెచ్చిన..

కృతికీ కీర్తనకూ గల లక్షణాలలో కృతికంటె, కీర్తనలో సాహిత్యానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది.
కిర్తన పురాతనమైన రచన..రామరాజుగారు అదే పాటంటారు..
అలాగే..దైవాన్ని నిలదీసి..దెప్పి పొడిచి.. తన కోరిక తీర్చమనే నిందాస్తుతి..

ఏరా.. నాపై దయరాదు నేనెంత వేడుదునో రామా
చిన్ననాటి నుండి సేవ చేసెదనని చెప్పుకొంటి
జావుమని కరి రాజు ప్రార్ధింపగా...గక్కున ఏలుట అబధ్దమా!
మిత్రునితో బ్రోవ వచ్చేవు..
వంటివి.. ఎంతో ఆర్ధ్రంగా.. హృద్యంగా ఉంటాయ్.!

1930 లో రాజోలులో వకీలు సంఘం వారు.. రామరాజుగారి షష్టిపూర్తికి ఘనంగా సన్మానం చేశారు. సన్నాయిమేళం ఏర్పాటు చేసీ.. ఏనుగు.. అంబారీపై ఊరేగించారు..

ఆ సాయంత్రం ఏర్పాటు చేసిన పౌరసభలో ...ఊరు ఊరంతా చప్పట్లతో దద్దరిల్లి పోయేలా..
మహామహోపాధ్యాయ అన్న బిరుదు కూడా ప్రదానం చేశారు.

ఎన్నో సత్కారాలూ..సన్మానాలూ...పొందిన..కొచ్చెర్లకోట వారు నిగర్వి.. నిరాడంబరులు..చివరి దశలొ తాను గోదావరి ప్రాంతంలోని తాటిపాక లో స్థిరపడి..అక్కడ తన ఇంటినే పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి.. ఉచితంగా సంగీతాన్ని నేర్పించేవారు..

సంగీతం కోసం తమ సర్వస్వన్నీ త్యాగం చేసిన...మహానుభావులు ఎందరో..
వారిని స్మరించుకోవడం...మన అదృష్టం..
 
     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)