అన్నమయ్య కీర్తనలు

- రచన : జి.బి.శంకర్ రావు   


 

కడలుడిపి నీరాడగా

కడలుడిపి నీరాడగా తలచువారలకు
కడలేని మనసునకు కడమ యెక్కడిది

దాహ మణగిన వెనక తత్వమెరిగెదనన్న
దాహమేలణగు తా తత్వమే మెరుగు
దేహంబు గలయన్ని దినములకును పదార్ధ
మోహమేలణగు తా ముదమేల కలుగు

ముందరెరిగిన వెనక మొదలు మరిచెదనన్న
ముందరే మెరుగు తా మొదలేల మరచు
అందముగ తిరువేంకటాద్రీశు మన్ననల
కందువెరిగిన మేలు కలనైన లేదు


అద్భుతమైన తాత్త్విక సందేశ సంకిర్తన! సముద్రతీరానికి వెళ్ళి, అలలు ఆగిపోయిన తర్వాత స్నానం చేద్దామనుకుంటే అలలు ఎప్పటికీ ఆగవు కదా! అలాగే మన జీవితంలో కోరికలు నశించిన తర్వాత తత్త్వం తెలుసుకుందామనుకుంటే అది ఎన్నటికీ జరగని పని!
కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో, ఆత్మసంయమనంతో కోరికలు నియంత్రించుకుని తత్త్వసారాన్ని ఒంటపట్టించుకోవాలంటున్నాడు అన్నమయ్య! అలాగే, 60 ఏళ్ళు వచ్చాక, జీవిత తత్త్వాన్ని పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకుంటామంటే సరికాదు, మనకి జ్ఞానం వచ్చినప్పటి నుండి ఈ ప్రక్రియ మొదలవ్వాలి, నిరంతరం కొనసాగుతూ ఉండాలి.
కడలు = సముద్రపు అలలు;
ఉడిపి - ఆపి (ఆగిన తర్వాత);
నీరాడగ = స్నానం చేయడం;
కడలేని = తుద లేని, అంతం లేని;
కడము = ఇతరము;
దాహము = తృష్ణ;
తత్త్వము = ఆత్మ తత్త్వము, బ్రహ్మ స్వరూపము;
పదార్ధమోహము = భౌతిక వస్తువుల యందలి తగులము;
ముందర = రానున్నది;
మొదలు = కడచినది;
కందువ = జాడ, స్వరూపము.

కడు నడుసు

కడు నడుసు చొరనేల కాళ్ళు కడుగ గనేల
కడలేని జన్మసాగర మీద నేల

దురితంబునకు నెల్ల దొడవు మమకారంబు
లరిది మమతలకు దొడ వడియాసలు
గురుతయిన యాసలకు కోరికలు జీవనము
పరగ నిన్నిటికి లంపటమె కారణము

తుదిలేని లంపటము దుఃఖ హేతువు దుఃఖ
ముదటయిన తాపమున కుండగ జోటు
పదిలమగు తాపంబు ప్రాణ సంకటములీ
మదము పెంపునకు దన మనసు కారణము

వెలయ దనమనసునకు వేంకటేసుడు కర్త
బలిసియాతని దలుచుపనికి దా గర్త
తలకొన్న తలపులివి దైవమానుషముగా
దలచి యాత్మేశ్వరుని దలపంగవలదా

ఈ పాటలో అన్నమాచార్యుల వారు సంసార సాగరాన్ని కడలేనిది అంటే అంతులేనిది అంటూ; దానిని అడుసుతో పోలుస్తున్నారు! బురదలో కాలు పెట్టడమెందుకు? మరలా ఆ బురదను వదిలించుకోవడానికి కడుగుకోవటమెందుకు? అంటూ జ్ఞానబోధ చేస్తున్నారు. మమకారము, ఆశ, మోహము, కోరికలు, లంపటాలు (వదలని బంధాలు) ఇవన్నీ జీవన దుఃఖానికి హేతువులు! వాటిలో పడరాదంటాడు అన్నమయ్య! మనందరి మనసులలో అంతర్యామిగా ఉన్నవాడు, సర్వానికి కర్తయైన శ్రీ వేంకటేశ్వరుని చింతించమని జ్ఞానబోధ చేస్తున్నాడు.

అడుసు = బురద;
కడలేని = అంతులేని;
దురితము = పాపము;
తొడవు = భూషణము, అలంకారము;
అరిది = అరుదైన;

 
     
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)