అనగనగా ఒక కథ - నవ్వులాటకు (1928 కాలం నాటి కథ)

- రచన : మునిమాణిక్యం నరసింహా రావు   


 

సమీరుడు నాకు బావమరిది వరస. అతడు చామన చాయగల పొట్టి మనిషి. అయితే స్ఫురద్రూపి. మాకు చిరపరిచితుడు. అందుచే మా కాంతం తో చనువుగా మాట్లాడతాడు. అతడు వచ్చి వీధి గదిలో కూర్చున్నాడు. నాకు లోపలికి కబురు వచ్చింది.

నేనూ స్నేనం చేసి ధౌత వస్త్రము ధరించి కేశ సంస్కారము చేసుకొని వచ్చినాను. ఇద్దరం చెరియొక కుర్చీలో కూర్చున్నాము. సమీరుడుకి ఒక సిగరెట్టు ఇచ్చి నేనూ ఒకటి వెలిగించాను. అతను అన్నాడు.

అయితే నామీద నీకు దయ తప్పినట్లుంది?
ఎందుకు అల్లా అంటున్నావు? అలా జరుగుతుందా? మన స్నేహం ఆ చంద్ర తారార్కం అల్లా ఉండాల్సిందే!!

ప్రతి సంవత్సరాదిని మనము అంతా కలిసి కొంత కాలము హాయిగా గడుపుదామని అనుకొన్నాము. మొన్న మొన్నటి వరకు అట్లాగే జరిగింది. కాని మొన్న పోయిన సంవత్సరాదికి నీవు నన్ను ఆహ్వానించక పోవడం నాకు చాలా మనస్తాపం కలిగించినది. నన్నెందుకు పిలవలేదు?

కొంచెము నిదానించు. తెలుసుగా మీ చెల్లెలు కాంతం విషయమై!

మా చెల్లెలు కాంతం విషయమై పూర్తిగా తెలుసు. ఆమెను ఏ విషయంలోను ఏమి అంటానికి ఆస్పదం లేదు. ఆమె దొడ్డ ఇల్లాలు. నాయందు ఆమెకు మిక్కిలి దయ. ఆమె నాకు ఆహ్వానం పంపద్దు అని అన్నదని కాని ఆమెకు నాయందు దురభిప్రాయము ఉందని కాని అంటే నేనది విశ్వసించను.

సమీర్! ఆమె విషయమై నీవు ఇట్టి అభిప్రాయాన్ని వెలుబుచ్చటం నాకు నిజంగా మనోరంజకంగా ఉంది. నీకు ఆమె యందుండే అభిమానం కూడా మహ గొప్పది అయితే, నిజం చెప్పక తప్పదు కదా? నిన్ను పిలుచుటకు ఆమెకి ఇష్టం లేక పోవడం చేతనే యీ ఉగాదికి మిమ్ములను పిలువలేదు.

నీ మాటలు చాలా చిత్రంగా ఉన్నవి. ఆమె ఇదివరలో నాయందు చూపిన ఆదరము, ప్రేమ అద్వితీయము. ఇట్లు నిన్ను పిలవవద్దు అంటానికి కారణం ఏమి?

ఇట్టి భావ విప్లవానికి కారణం యేమో నాకు చెప్పాలి?
చెపుతాను, మన రాముడు మీకు తెలుసును కదూ?

రాముడూ..ఎవడు వాడు?
మా రాముడుని ఎరుగవా? మా నౌకరు రాముడు.!!

వాడా, అవును..వాడిని ఎరుగకేమి? ఎరుగుదును. వాడు చాలా మంచివాడు సుమీ!

అల్లాగే వాడిని సేవా పరాయణత్వములో హనుమంతుడితో పోల్చవలె. ప్రతి పని కూడా బహుచక్కగా చేస్తాడు. నా బూడ్సు జోడుకు రంగు వేశాడా అంటే అవి నల్లగా జీడిగింజల వలె నిగనిగ లాడుతూ ఉంటవి. వాడు బట్టలు ఉతికినాడా అంటే అవి మల్లె పువ్వులవలె తెల్లగా నుంటవి. నేను తాగే మందు ఎక్కడి నుంచి తేవలెనో, ఎంత మోతాదు ఇయ్యవలెనో మెలకువలన్నీ తెలుసు.

అల్లాగా? అయితే అది చాలా గొప్ప విషయం.
అంతే కాదు. వాడు ఎటువంటి వాడనుకొన్నావు?
బంగారం బజారులో కనిపించినా అసహ్యమైన వస్తువులాగ చూస్తాడు. పిల్లలను వాడి చేతికిచ్చి షికారు పంపితే జాగ్రత్తగా కాపాడతాడు. పైకం ఇచ్చి సంతకు పంపినా, బజారుకు పంపినా బహు నేర్పుగా బేరం చేసి సరుకులు తేవటమే కాక ఒక పైసా అయినా తన స్వంతానికి వాడుకోడు.

అల్లాగా! నౌకరులలో అంత మంచివాడు ఉండటం అరుదు సుమీ!
నీకూ ఆమాటే తోచిందీ? అయితే వాడికి ఒక దుర్గుణం ఉంది. అదేమిటో తెలుసునా సౌందర్య పిపాస. ఇదొక్కటే వాడికున్న కళంకం.

దానికేమిలే! అదొక పెద్ద నీచ గుణంగా ఎంచనక్కరలేదు. వయసు తనంలో అది క్షమార్పణీయము. వయసుకు, వలపు చింతకు పులుపు సహజము. సౌందర్య పిపాసాపీడితుడు వీడు. ప్రేమైక జీవి. అదీ కాక నిష్కళంకమైన శీలము గల దేహి యెవడు? చంద్రుడికి కళంకం లేదా? భగవానుడు అనే అఖండ తేజోమూర్తి అయిన సూర్యునికి సిద్ధాంతం ఉంది. దాని విషయమై నీవు విచారించ వలసిన పనిలేదు. కాని నేను అడిగిన విషయమేమిటి? నీవు చెప్పే సంగతి ఏమిటి?

సమీరూ! నీవు నిజంగా సహృదయుడవు కాబట్టి వినతగిన మాట అన్నావు. ఆ ఒక్క కళంకం ఉందని అతనిని పనిలోనుంచి తీసివేయడం న్యాయమా?

ఛీ - ధర్మము కాదు!

అట్టివాడు ఏదో తప్పుచేస్తే నా భార్య వినిని పనిలోనుంచి తొలగించమంటే, వాడి పక్షం వహించి ఏదో విధంగా వాడిని రక్షించడం నాకు ధర్మము అంటావా, అనవా?

ధర్మాలలో కెల్లా అది ఉత్తమ ధర్మము. అట్టి నౌకరు ఉంటే, నేను వాడి పక్షం వహించి అబధ్దాలైనా ఆడి వాడిని కాపాడతాను. కానీ ఏమిటీ గొడవ! నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఏవో అల్లి బొల్లి కబుర్లు చెప్పి నన్ను మాఱుపుచ్చాలని చూస్తున్నావు.

కాదు, కాదు, విను. నిన్ను చూస్తే నాకు నీయందు గౌరవమూ, అభిమానమూ ఎక్కువ అవుతున్నది. నిజంగా నీ హృదయము కరణార్ధ్రము. వాడి సేవా ప్రియత్వము, మొదలైన సుగుణాలు నీవు స్వయంగా చూశావు కాబట్టి నీకు వాడిమీద అంత అభిమానమనుకొంటా?

ఎప్పుడు చూశాను.

రాముడుని నీవు తిరుణాలకు మంగళగిరి తీసుకుని పోయినావు.

అవునవును. నాకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నాకు వాడు చాలా సేవ చేసినాడు. వాడేదో పిచ్చిపని చేస్తే వాడిని వెనకేసుకుని పోట్లాడినాను.

పిచ్చిపని యేముందీ? వడ్రంగి సోమయ్య భార్యను చూసి సౌందర్య పిపాసా బాధితుడై ఏదో అన్నాడట.

అవును. జ్ఞాపకమే! కానీ ఏమిటీ గొడవ?

తరువాత మా కాంతంతో ఆ విషయము అంతా ఎవరో చెప్పి, వాడు చేసే వన్ని ఇట్టి పనులే, ఫలాని వారి నౌకరు ఇటువంటి పనులు చేస్తున్నాడంటే మీకే అప్రదిష్ట. వాడిని మీఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి అన్నారట. వాడిని తీసివేయమని కాంతం పట్టుబట్టి నన్ను వేధించడం మొదలు పెట్టింది. అప్పుడేమి చెయ్యాలె?

మీరు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం అవివేకం. అట్టి మంచి నౌకరు దొరకటం దుర్లభం. ఏదో ఒక దుర్గుణం ఉన్నా సహించి ఊరుకోవాలె!

మనం మొగాళ్ళం సహిస్తాము. ఆడవాళ్ళు ఇటువంటి విషయాలలో బొత్తుగా సహనం చూపరు!!

అయితే ఒకటి చేయకపోయినావా? మా చెల్లెలు కాంతం చాలా మంచి మనిషి. ఏమి చెప్పినా నమ్ముతుంది. ఏదో మాట చెప్పి ఆ విషయం సద్దక పోయినావా?

అబద్ధం ఆడవచ్చు అంటావా?
సందేహం ఏమిటీ? అటువంటి విషయాల్లో కాకపోతే ఇంకెప్పుడు అబద్ధం ఆడటం?

భేష్! మంచిమాట అన్నావోయ్.. ఈ మాటే కలకాలం ఉండాలె. వెధవ నౌకరును రక్షించడానికి వాడిని వెనకేసుకొని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్యతో అబద్ధాలు చెపుతారా, అంటావనుకొన్నాను. అయితే అప్పుడేమి చేశాననుకొన్నావు? అబద్ధం ఆడాను.

మంచి పనిచేశావు. కాని నన్ను పండుగకు పిలువవద్దని కాంతం అంటానికి ఆమెకు నాపై కోపం ఎందుకు వచ్చిందో ఇంతవరకూ చెప్పకుండా నన్ను మరపించాలని చుస్తున్నావు.

లేదోయి. ఆ పాయింట్ కే వస్తున్నా. అప్పుడేమి అబద్ధం ఆడినానో విన్నావా.. సోమయ్య భార్యను దుర్భాషలాడింది రాముడు కాదనిన్నీ వాదితో వెళ్ళిన నీవే ఆ పనిచేశావు అని చెప్పి నమ్మక పోతే ఎన్నో అబద్ధాలు ఆడి మాయపుచ్చి నమ్మించాను..

అట్లా చూస్తావెందుకు?...ఇప్పుడే కదా అన్నావు. అట్టి నౌకరును అబద్ధం ఆడైనా ఆదరించాలని. అసలు కథ విను. అపుడు కాంతానికి రాముడి పైనున్న కోపం అంతా గిరుక్కున వెనక్కు తిరిగి నీమీద పడ్డది. అందుకని నిన్ను పండగకు పిలువవద్దు అన్నది. తెల్లబారిన మొఖంతో ఎంతపని చేశావోయ్..కాంతంతో ఇప్పుడే నిజం అంతా చెపటానికి నే వెళ్తున్నాన్లే. కథ అడ్డంగా తిరుగుతుంది చూసుకో. అని సమీరడు లోపలికి పోయినాడు. నేను ఆరిపోయిన సిగరెట్టును పారవేసి క్రొత్త సిగరెట్టుని వెలిగించుకొని కుర్చీలో పడుకొన్నాను.

 
     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)