కబుర్లు  
     వార్త - వ్యాఖ్య

- రచన : భండారు శ్రీనివాస రావు

 

కష్టాల్లో కాంగ్రెస్

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టు చందంగా వుందన్న సంగతి అధిష్టానానికి ఇన్నాళ్లకు తెలిసివచ్చినట్టుంది. కేంద్రంలో ఆరోగ్యశాఖ చూస్తున్న ఆజాదే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా వున్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని పట్టిపీడిస్తున్న జబ్బేమిటో ఆనవాలు పట్టలేకపోయారు. ఇక ఇంగ్లీష్ వైద్యంతో పనికాదనుకున్నారో యేమో కానీ హఠాత్తుగా ఢిల్లీ నుంచి కేరళ మూలికా వైద్యుడు వాయలారు రవి గారిని రోగనిర్ధారణ కోసం పంపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో వున్న సమయంలో అదే ఢిల్లీ నుంచి వాయలార్ మహాశయులవారు హైదరాబాదు రావడం లేనిపోని అనుమానాలకు బీజం వేసింది. నేడో రేపో ముఖ్యమంత్రి మార్పు తధ్యం అన్నంతవరకు ఊహాగానాలు గుప్పుమన్నాయి. అయితే, వీటితో సంతోషపడ్డవారూ కాంగ్రెస్ లో వున్నారు. అయ్యో యెట్లా అనుకున్న వారూ అదే కాంగ్రెస్ లో వున్నారు. కాంగ్రెస్ పార్టీకి వున్న బలం, బలహీనత ఇదే సుమా! అని విశ్లేషించిన వాళ్ళూ లేకపోలేదు.
వచ్చారు, చూశారు, వెళ్లారు అన్న తరహాలో వాయలార్ వారి రాష్ట్ర పర్యటన ముగిసింది. పోతూ పోతూ షరా మామూలు తరహాలోనే, ముఖ్యమంత్రికీ, పీసీసీ అధ్యక్షుడికీ నడుమ ఎలాటి విబేధాలు లేవని మీడియాకు నొక్కి వక్కాణించి మరీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి అధినాయకురాలికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై `ప్రత్యక్ష సాక్షి' కధనాన్ని నివేదిక రూపంలో అందచేసారని భోగట్టా. ఇంతకీ ఆయన అయినా రోగనిర్ధారణ చేసారా అన్నది సమాధానం దొరకని ప్రశ్నే.
ఈలోగా పులిమీది పుట్రలా పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు ఎంతో కొంత వ్యవధానం వుంది, ఏదో ఒక మేరకు సర్డుకోలేకపోతామా అని కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలపై, ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్న ప్రకటన బిందెడు నీళ్ళు గుమ్మరించింది. ప్రజాపధం పేరుతో, లేదా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల పేరుతో సర్కారు డబ్బులు వెదజల్లకుండా ఈ నియమావళి మోకాలొడ్డింది. నిజానికి ఈ ఎన్నికల్లో మిగిలిన పార్టీల మీద కాంగ్రెస్ పార్టీకి వున్న వెసులుబాటు ఇదొక్కటే. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలో వుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ వ్యవధానం వుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులను ఆకట్టుకోవడానికి, చోటా మోటా నాయకులను చేరదీసి పోలింగు బూతుల పరిధుల్లో కోరుకున్న విధంగా వోటింగు జరిగేలా చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి వున్న వీలు సాళ్ళు ఇతర పార్టీలకు లేవు. కానీ, ఎన్నికల నియమావళి పుణ్యమా అని ఇప్పుడా వీలు లేకుండా పోయింది. రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విధమయిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అనుకున్న వ్యవధిలో జరుగుతాయనుకున్న అసెంబ్లీ ఎన్నికలు బాగా వాయిదా పడిపోవడంతో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నెలల తరబడి కొనసాగాల్సి వచ్చింది. పేరుకు ముఖ్యమంత్రి అయినా ఏమిచేయాలనుకున్నా చేయలేని పరిస్థితి. అన్నింటికీ ఎన్నికల కమిషన్ లక్ష్మణ రేఖలు. మండే ఎండాకాలం. చిన్నా చితకా పనులు చేయాలన్నా కనబడని ఆంక్షలు. జనాలకు అవసరమయిన పనులు చేసిపెట్టలేని అశక్తత. ఫలితం ఏమిటన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడు అదే వాతావరణం పునరావృతమవుతోంది. ఎండలు మండుతున్నాయి. దాహార్తితితో జనం ఎండుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి. ఆనవాయితీకి భిన్నంగా ఉప ఎన్నికల షెడ్యూల్ కు, ఎన్నికల నోటిఫికేషన్ కు నడుమ వ్యవధి కాస్తా ఇరవై అయిదు రోజులకు పెరిగింది. సాధారణంగా ఇది వారం, పది రోజులకు మించి వుండదు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం సుమారు వంద కోట్ల రూపాయల పైచిలుకు అభివృద్ధి పనులు మంజూరు చేసిన విషయం పిర్యాదుల రూపంలో ఎన్నికల కమిషన్ కు అందడం ఇంత ముందుగా షెడ్యూల్ ప్రకటించడానికి కారణంగా చెప్పుకుంటున్నారు.

ఉప ఎన్నికలు జరిగి తీరుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా అసలు జరుగుతాయా లేదా అన్న విషయంపై చాలా రోజులుగా సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల లోపల ఆయా రాష్ట్రాల శాసన సభల్లో ఏవయినా ఖాళీలు వుంటే, వాటిని భర్తీ చేయడం అన్నది సంప్రదాయమే కాని నిబంధన కాదని, ఎన్నికలకు వెనుకంజ వేసే ప్రభుత్వం ఏదో ఒక కారణం చూపి వాటిని వాయిదా వేయించడానికే ప్రయత్నిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రతిపాదన వీటిల్లో భాగమే అని కూడా వార్తలు వెలువడ్డాయి. కాని ఈ వదంతులను పటాపంచలు చేస్తూ ఎన్నికల సంఘం అనుకున్న దానికంటే కొంత ముందుగానే ఎన్నికలు జరపాలని నిర్ణయించడం ఆయా పార్టీల వారిని నివ్వెర పరచింది. ఉప ఎన్నికలు ముందు నుంచి ఊహించినవే కాబట్టి, అందరూ వాటికి సంసిద్దంగానే వున్నరనుకోవడం పొరబాటు. వరస పరాజయాలు ఎదుర్కుంటున్న పార్టీలు, ముఖ్యంగా పాలక పక్షం, ఏదో ఒక కారణంతో పోలింగు వాయిదా పడాలనే కోరుకోవడం సహజం. కానీ, - అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని- అన్నట్టుగా ఎన్నికల తరుణం ముందుకు తోసుకు వచ్చింది.

అసలే ప్రతికూల వాతావరణం. పైపెచ్చు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. వాటికి తోడు, ఈసారి కాంగ్రెస్ పని అయిపోయినట్టే అని వెలువడుతున్న ఎన్నికల సర్వేలు. ఇవన్నీ కాకుండా, పోటీ చేసే అభ్యర్ధులను కూడా సకాలంలో ప్రకటించలేని పరిస్థితి వెరసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారయింది.

ఈ నేపధ్యం ఇట్లా వుంటే, ఇవన్నీ సరిపోలేదన్నట్టు రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడూ, సాక్షాత్తూ పీసీసీ అధ్యక్షుడు అయిన బొత్స సత్యనారాయణ విజయనగరంలో ధర్నా చేయడం, మరోపక్క పార్లమెంటులో అధికార పక్షానికే చెందిన సభ్యులు, తెలంగాణా కోసం సభా కార్యక్రమాలకు అడ్డు తగిలి, నాలుగు రోజులపాటు సస్పెన్షన్ కు గురికావడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మరింత ఇరకాటంలో పడేసాయి. రామాయణంలో పిడకల వేటలా ఉప ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టుకోవాలో లేదో అని పార్టీలో చెలరేగిన మీమాంస పార్టీని అతలాకుతలం చేసింది.

ఒక రోగం అయితే ఏదో వైద్యం చేసి సరిదిద్దవచ్చు. అనేక రోగాలాయే. ఒకదానికి చేసే చికిత్స మరో దానికి వికటిస్తుంది. క్షయ, షుగర్ వ్యాధులతో సతమతమయ్యే రోగికి ఒక రోగ నిదానానికి చేసే చికిత్స మరో వ్యాధికి పొసగదు. క్షయ రోగానికి పుష్టీ బ్రాండ్ ఆహారం తీసుకోవాలి. కానీ, షుగర్ వ్యాధి కూడా వున్నప్పుడు అలాటి ఆహారం తీసుకోవడం కుదరని పని.

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ప్రస్తుతం ఈ రెండు వ్యాధులు సోకిన రోగి మాదిరిగా వుంది.
వైఎస్సార్ అభివృద్ధి పధకాలు కావాలంటే మరో పక్క ఆయన హయాం లోని అవినీతి మరక అంటుకుంటుందని భయం. అభివృద్ధి కాదనుకుంటే ప్రజలు కాదంటారని సంకోచం. ఇన్ని సంకటాల నడుమ కిరణ్ కుమార్ రెడ్డి పాలన సాగుతోంది.

పాలన సాగుతోందని అంటే దానికి కూడా అభ్యంతర పెట్టేవాళ్ళు ఆ పార్టీలోనే చాలామంది వున్నారు. కొంతమందికి వైయస్సార్ పనికిరాడు. ఆ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి అవసరం వారికి వుంది. అదీ ఎంతవరకు? మరొకరికి అధిష్టానం అవకాశం ఇచ్చేవరకు. ఇస్తే, మరుక్షణం నుంచి వారి విధేయతలు మారిపోతాయి. ఎందుకంటే ఈనాటి రాజకీయాల్లో విధేయతలూ, విశ్వాసాలూ అన్నీ కుర్చీలకే పరిమితం. అవకాశం రావాలే కానీ, ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతున్న అధినాయకులతోనే, ముఖ్యమంత్రి పదవి కోసం బరిలోకి దిగడానికి అలాటివాళ్ళు ఎప్పుడూ సిద్ధమే. దీనికి కారణం వుంది. మంత్రి అనిపించుకోవాలన్నా, ముఖ్యమంత్రి అనిపించుకోవాలన్నా ఇక మిగిలిన పుణ్య కాలం రెండేళ్ళే! ఆ తరువాత ఏదో మహాద్భుతం జరిగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ వరసగా మూడో పర్యాయం అధికారంలోకి రావడం కల్ల. అందువల్ల, ముఖ్యమంత్రి కావాలనే కల నెరవేరాలన్నా, ఆ దరిమిలా పదికాలాలపాటు మాజీ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోవాలన్నా వున్న వ్యవధి ఈ రెండేళ్ళే అన్న వాస్తవం మూడు రంగుల కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటారు. మరి కుర్చీ ఖాళీ లేకపోతే ఏం చేస్తారు? ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదేనేమో!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 







సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech