సారస్వతం  
     వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 5

పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు

 
అన్నమయ్య భక్తి శృంగార మంజరి
 

సచ్చిదానందస్వరూపుడైన శ్రీ తిరువేంగళనాథుడే పరముడు, పరమేశ్వరుడు, సర్వాది, సర్వాంశి, సర్వాశ్రయుడు, సర్వేశ్వరుడు అని ప్రమాణసహితంగా ప్రతిపాదించి, వాచామగోచరమైన ఆ పరతత్త్వాన్ని వాచాగోచరీభవింపజేయటానికి కృతోద్యముడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మహాసారస్వతంలోని ఒక రమణీయార్థబంధురమైన లఘుకావ్యం శ్రీ శృంగారమంజరి. సర్వపథీనవైచక్షణ్యలక్షితమైన ఆ మహనీయుని సంకీర్తనామృతవాగ్గేయధారతో సుపరిచితులైన దార్శనికులకు మరింత మెచ్చుగొలిపే మహనీయరచన. 

 

       శృంగారమంజరి 259 మంజరీ ద్విపదలలో “తాళ్లపాక అన్నమాచార్యులు తిరువేంగళనాథునికి విన్నపం చేసిన” ఒక చిన్ని రచన. పద్యానికి రెండు పాదాలు; ప్రతిపాదంలోనూ మూడు ఇంద్రగణాలపై ఒక సూర్యగణం; పాదంలో ప్రథమాక్షరానికి మూడవ గణం తొలిఅక్షరంతో యతిమైత్రి లేదా ఆపైని వచ్చే ప్రాసాక్షరంతో ప్రాసమైత్రి - అన్న ద్విపద లక్షణాన్నే కలిగినా  - ద్విపదకు గల ప్రాసనియమం మంజరీ ద్విపదకు లేనందువల్ల దీని కూర్పు మరింత స్వచ్ఛందంగా సాగుతుంది. ఈ ఛందోగతిని అవిరళప్రచారంలోకి తెచ్చి, అపురూపమైన కావ్యరూపాన్ని సంతరించిపెట్టిన ప్రథమాంధ్రమహాకవి అన్నమాచార్యులే కావటం విశేషం. 

మాధుర్యమయ భణితి

      ఆశువు – మధురము - చిత్రము - విస్తరము అన్న చతుర్విధకవితలలో శృంగారమంజరి మధుర కవితాశాఖకు చెందుతుంది.  

            “... భక్తిఁ  దిరువేంకటాద్రీశు పేరఁ

                గారుణ్యలక్ష్మీప్రకాశుని పేర

                రాజితాఖిలలోకరక్షణు పేర

                లాలితబహుపుణ్యలక్షణు పేరఁ

                బృథులదానవసైన్యభీషణు పేర

                భూరికౌస్తుభరత్నభూషణు పేర

                గురు భరద్వాజైకగోత్రపావనుఁడు

                నందాపురీవంశనాయకోత్తముఁడు

                ననఘుఁడు తాళ్లపాకాన్నయార్యుండు

                మధురంపు శృంగారమంజరిఁ జెప్పె.” 

అని, అన్నమయ్య స్వయంగా తానే దానిని మధుర భక్తికావ్యంగా లక్షణబద్ధం చేశాడు. ఈ మాధుర్యం సోమేశ్వరుడు అభిలషితార్థచింతామణిలో “లలితై రక్షరై ర్యుక్తం శృంగారరసరంజితమ్, శ్రవ్యం  నాదసమోపేతం మధురం ప్రమదాప్రియమ్” అని వివరించినట్లు ఒక కావ్యగుణం. పదలాలిత్యమంటే నాదాక్షరాలతోడి కూర్పు వల్ల సిద్ధించే మసృణత్వం. దాని వల్ల రతిక్రీడాదికారణమైన శృంగారరసం మరింత ఉద్దీప్తమైంది.  

నామసార్థక్యం   

      దూతీకృత్యాన్ని నెరవేర్చిన నాయికాసఖి తిరువేంగళనాథునికి ఒక “శృంగారమంజరి”ని బహూకరించిన సన్నివేశకల్పన మూలాన శృంగారమంజరి అన్న కావ్యనామానికి గర్భితార్థప్రకాశకత్వం అబ్బింది. వసంతశోభకు పరవశించి, పున్నమి నాడు పుష్పాయుధునికి పూజచేసి, చెలులతో వినోదిస్తున్న నాయిక వనవాటికకు విహారార్థం విచ్చేసిన తిరువేంకటాద్రీశుని తిలకించి మరులు గొంటుంది. ఆమె విరహావస్థను గుర్తించిన ఇష్టసఖి “ప్రోడ యగు మేటిబోటి”  (అనుభవజ్ఞురాలు) కనుక, సాటి చెలికత్తెలతో  

                 “... ఈ బాల గాసిల్లియున్న

                చందంబు విభుఁడు మెచ్చఁగ విన్నవించి

                విచ్చేయునట్లు గావించి తేకున్న -

                నెచ్చెలులార ! నా నేర్పు లేమిటికి?” 

అని పలికి, నాయికను వారికి అప్పగించి, దౌత్యానికై “శరణాగతత్రాణుఁ” డైన శ్రీ వేంకటాద్రీశుని చెంతకు వెళుతుంది.    

                    “కదలి మోహనమూర్తి కడకేఁగి - యంత

                సకలసురాసురసంఘంబు లెల్ల

                నంతరాంతరములో నంతంత నుండి

                యేకాంతసుఖగోష్ఠి  నింపొందువానిఁ

                గనుఁగొని, పూగుత్తి కానుక యిచ్చి 

తరళాక్షి దురవస్థను విశ్వవిభునికి వినిపించి, “కంతుసామ్రాజ్యసౌఖ్యముల నొందింపు” మని విన్నవిస్తుంది. సంస్కృతాంధ్రకావ్యప్రపంచంలో ఎక్కడా లేని ఈ విధమైన సంచారికా సమర్పితమైన సబహుమాన సందేశరూపణను నిమిత్తీకరించి అన్నమయ్య కావ్యనామాన్ని శోభాకరంగా తీర్చిదిద్దాడు.

 

తరళ శైలి       

      అసలే సంగీత సాహిత్య సర్వాంగశోభతో విరాజిల్లే అన్నమయ్య శైలి ఈ శృంగారమంజరిలో నిరుపమాన ధీవిలాసపరిస్ఫురణతో, కొండకొమ్ము మీదినుంచి కిందికి దూకే నదీప్రవాహాన్ని పోలిన ఉరవడితో ఉద్వేజకంగా సాగిపోయింది. శబ్దార్థచిత్రాలు రెండింటినీ శ్రీహరికి అత్యంతప్రీతిపాత్రమైన యమకాల గమకాలతో వెల్లివిరియించి, సాలంకారమైన కవిత్వరచన చేశాడు. వైష్ణవీయ మధురభక్తి మధురశృంగార కావ్యాల పరంపరకు తెలుగులో ఇదే లావణ్య శ్రీకారకృతి.

 

       శృంగారమంజరిలోని శైలి తరళశైలి. సాంస్కృతికశోభకు దీటుగా అచ్చతెలుగు మఱుగుల మెఱుగులు మిఱుమిట్లుగొలుపుతాయి. సమాసభూయస్త్వం అర్థావగతికి అడ్డురాలేదు. శబ్దాలంకర్మీణత మంజరీ ద్విపదలోని తాళగతిని మరింతగా రంజింపజేసింది. అవ్యక్తుడైన నిర్గుణ నిర్వాణమూర్తి వేంకటాద్రీశ్వరుడే ఈ కథానాయకుడు. ఆయన లీలావిభూతిని కన్నులారా కనుగొన్న భక్తిపరవశ ఇందులో నాయిక. ఆమెకు “ఆత్మ నిగ్గులు” అలవడటమే ఈ భక్తి శృంగార కథలోని రసాద్యర్థం. ఆద్యంత శ్రీ మంగళమహాశ్రీల నడుమ నెలకొన్న సౌందర్యమే కావ్యాత్మ.

 

శబ్దాలంకర్మీణత

      శృంగారమంజరి శబ్దచిత్రాలకు పుట్టినిల్లు. శ్రీ వేంకటాద్రీశ్వరుని శృంగారస్వరూపునిగా నిరూపించి, 

            “గోపాంగనా కుంభకుచశాతకుంభ

                కుంభ కుంకుమచారుగురుతరాకారు”  

అంటాడు. అంతలోనే బ్రహ్మణ్యత్వంతో   

            “వేణునాదామోదు విహితప్రసాదు

                నవ్యక్తు నతవేద్యు నాద్యు నద్వంద్వు

                నధ్యాత్ము  నచ్యుతు నాద్యంతరహితు

                నిర్గుణు నిఖిలాండనిర్మాణదక్షు

                నిర్వాణు నిర్మలు నిత్యు నిశ్చింతు

                సర్వజ్ఞు సాకారు సచ్చిదానందు

                సర్వతోముఖరూపు సత్యస్వరూపు

                నఖిలహిరణ్యగర్భాండనాయకుని”

 

అధ్యాత్మతత్త్వాన్ని సవిశేషంగా చిత్రీకరిస్తాడు. భక్తిశృంగారాలను నిండైన పారవశ్యంతో మేళవించిన ఆ కల్పనలో శిల్పసౌందర్యమంతా కొలువుతీరింది. కావ్యమంతటా సాకూతవిశేషణాలు కోకొల్లలు. నాయికా సౌందర్యలక్ష్మికి దీటుగా వనలక్ష్మి పూర్ణయౌవనవీథిని వర్ణిస్తూ  

            "కోల తమాల తక్కోల కాకోల

                తాల హింతాలకోత్తాల కుద్దాల

                సాల  బాలరసాలజాల నేపాల

                తారజంబీర మందార ఖర్జూర

                గంధఫలీ కుంద ఘనపిచుమంద

                తరువులు విరువులై తలిరించి మించె." 

          అని భూజపంక్తులను పంక్తిపావనంగా నిలబెడతాడు. అందులో విరివికి విరువులు అని వింత బహువచనం. వనవీథి శోభను కన్నులకు కడుతూ 

            “కుముదాకరంబులఁ గూటంబు మాని

                కుముదాకరంబులఁ గొమరు దీపించి

                పద్మరాగప్రభాప్రౌఢిమ వంపఁ

                బద్మరాగప్రభాప్రౌఢిమ దోఁప” 

      అంటూ తన శయ్యాసౌభాగ్యలక్ష్మిని అనన్య రోచిష్ణుప్రతిభతో ప్రదర్శిస్తాడు. ఈ దళాలలోని అన్నమయ్య ఉపమలనేకం శబ్దాలంకారశ్రేణిలో చేర్పదగినవి. “స్ఫుట మర్థాలంకారా వేతా వుపమా సముచ్చయౌ కింతు, ఆశ్రిత్య శబ్దమాత్రం సాధర్మ్య మిహాపి సంభవతః” అని మమ్మటాచార్యుని కావ్యప్రకాశం.  

                    “మాధవీ నవలతా మందిరామంద

                సౌధవీథీఘనస్థలములు మెట్టి” 

          అన్నది ఇందులోని శబ్దాలంకృతికొక ఉదాహరణం. వామనుడు కావ్యాలంకారసూత్రవృత్తిలో దీనిని “సమస్తపాదాదిగతపాదానుప్రాస” మన్నాడు. మహాకవి దండి తన కావ్యాదర్శములో దీనినే “రీతిమూలక పాదానుప్రాస” మన్నాడు.  

            “రాకకు వెఱఁగంది రాకేందువదన

                రాక వెన్నెల పరాకైన కాంత” 

          అన్నప్పుడు ఈ పరిపాటి పరాంకోటి కెక్కింది.

 

రచనా కాలం

        అన్నమయ్య సంకీర్తనలలోని విదితపదావళి, ఆ పల్లవి పల్లవాలు ఈ లఘుకృతిలోని కల్పనలలో వినిపించటం విశేషం.  

            “బ్రహ్మాండమై యుండి బ్రహ్మమై యుండి

                పరమాణువై యుండి పరమమై యుండి

                సచరాచరాత్ముఁడై చరియించు సామి.” 

          వంటి పంక్తులు ఉదాహరింపదగ్గవి. ఈ కల్పనను వినగానే “బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే” అన్న సుప్రసిద్ధమైన సంకీర్తన సద్యఃస్ఫురణకు వస్తుంది.   

                “కోనేటిరాయండు కుంభినీస్వామి

                వెలలేని వలపుల వేడుకకాఁడు.”

అని మరొక దళం. ఇది కాక, 

            “లేమా విలాసంబు లేమావి మంచి

                లేమావిఁ జేచాఁపలేమా యటంచుఁ

                దిలకంబుఁ దీర్పక తిలకించి చూడు

                తిలకంబు, మానినీతిలకంబ! యనుచు”

 

వంటివి పోతనానంతరీయ కాలికతను సూచిస్తాయి. అంటే శృంగారమంజరి అన్నమయ్య బాల్యరచనం కాదని; క్రీ.శ. 1475 తర్వాత పరిణతవయస్కు డైనప్పటి పరిణద్ధరచనమనీ నిశ్చయింపగలము.

జాతీయ మంజరి

      శృంగారమంజరి లఘుకావ్యమే అయినా – వన వర్ణన, విరహ వర్ణన, దూత్య వర్ణన మొదలైన ప్రణాళీకల్పన వల్ల అనంతరీయ శృంగారప్రబంధాలకు రీతిమూలకం కాగలిగింది. జాతీయాలకు, శబ్దార్థచిత్రాలకు ఇది మనికిపట్టు. అన్నమయ్య సర్వదేవతారాధనతత్పరుడైన వైష్ణవైకాంతిక భక్తాగ్రేసరుడు. ఆయన పలుకుబడిని కేవలశైవులు కూడా పుణికిపుచ్చుకొన్నారు. నాయికా విరహనిర్వర్ణనలో  

            “పగలె మృగాక్షికిఁ బగలు గాఁజొచ్చె

                రాత్రు లింతికి శివరాత్రులై తోఁచె.” 

          అంటాడు. దీనినే మహాకవి ధూర్జటి – 

            “గీ.   నిద్రవోయెడు సుఖమెల్ల నేలఁ గలిపి

                        ప్రతిదినంబును దాఁ జేయు రత్నపూజ

                        శివునిపై నుండకుండినఁ జింతనొంది

                        రాత్రి శివరాత్రిగా జాగరమ్ము చేసె.” 

అని తన కథలో పగతో రగులుతూ చింతాక్రాంతుడై నిద్రలేకున్న సర్పరాజుకు అన్వయింపజేశాడు. శైవానురక్తి వల్లనే అన్నమయ్య బసవపురాణంలోని రుద్ర పశుపతి కథలో రుద్ర పశుపతికి శివుడు ప్రత్యక్ష మైనప్పటి సన్నివేశంలో   

            “పార్వతీసహితుఁడై ప్రమథరుద్రాది

                సర్వ సురాసురసంఘంబు గొలువ”  

అన్న దళాన్ని స్వీకరించి - 

            “సకలసురాసురసంఘంబు లెల్ల

                నంతరాంతరములో నంతంత నుండి

                యేకాంతసుఖగోష్ఠి నింపొందువాని” 

అని వేంకటేశ్వరునికి సమన్వయించాడు. విరహబాధ కోర్వలేక నాయిక 

            “రాలిన పుప్పొళ్ళు రాసులు చేసి

                యనిలంబు కెదురు మహాఫణి వ్రాసి” 

మలయమారుతాన్ని ఉపాలంభిస్తుంది. దీనికే తెనాలి రామకృష్ణకవి 

      “చ.   ... భావమునన్ విరహార్తి పెంపునన్

                గరితయు మారుతాహతికిఁ గాలఫణిన్ రచియించి ...” 

అంటూ ప్రతికృతిని మలిచాడు. వసుచరిత్రాదులలో శృంగారమంజరి అనుసరణలున్నాయి 

రూపణ కౌశలం

          అన్నమయ్య రచించిన శృంగారమంజరి లోని ఇతివృత్తం నామమాత్రమే. ప్రణాళీలాఘవం గ్రంథగౌరవాన్ని సంకోచింపలేదు. లోకేశ్వరేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వరుని ప్రాకృతలీలను కాంతాయతనమైన వాగర్థలీలతో ఈ మధుర భక్తికావ్యం రమ్యంగా ఉపదేశిస్తున్నది. సాహిత్యవిమర్శలో ఇతివృత్తశరీరానికి ఆద్యంతాలలో నిబంధింపబడిన వాక్యప్రబంధం ఆ గ్రంథతాత్పర్యాన్ని ప్రతిఫలిస్తుందనే సూత్రం ఒకటున్నది. ప్రాజ్ఞమైన ఈ నియమనం అన్నమయ్య కృతికి సార్థకంగా అన్వయిస్తుంది. కృత్యాదిని శ్రీ వేంకటేశ్వరుని లీలానువర్ణనం, త్రపాముగ్ధురాలైన ఒక బాలికకు భగవత్సంగాభిలాషారూపమైన ఇంద్రియానురక్తి, తత్ఫల విరహావస్థ, వసంతోత్సవవేళ ఆమెకు శైత్యోపచారాలు – బహిర్ముఖతావస్థ నుంచి క్రమంగా స్వాదుగతానుశీలనం, అంతంలో భగవత్ప్రసాదపరిప్రాప్తి వర్ణితాలైనాయి. సర్వేంద్రియప్రేరకుడైన భగవంతుని యందు ప్రేమను నిలిపి తరించిన ఒక భాగ్యశాలిని కేవలానుభవానందమయస్వరూపమైన జీవితగాథగా అన్నమయ్య దానిని పవిత్రీకరింపగలిగాడు. భగవత్ శ్రద్ధ, భగవదానుగత్యం, భగవన్నిష్ఠ, భగవద్రుచి, భగవదాసక్తి, భగవత్ప్రీతి, భగవదనురాగం, భగవద్భావన లోని నైరంతర్యం – భగవద్రతిగా పరిణమించిన భక్తిమయగాథను సర్వజన సాధారణీకరణ శృంగార భావ భావనగా తీర్చిదిద్ది అన్నమయ్య భక్తికి ఫలం భక్తేనన్న పరమసత్యాన్ని చాటిచెప్పాడు. ఇదంతా ఔపచారికమాత్ర రూపణకర్మమేమీ కాదని స్పష్టీకరించటానికో ఏమో, శ్రీ తిరువేంగళనాథుడు ఆమెను  

“కరఁగించి మరఁగించి కలికిఁ గావించి” 

      ఆదరించాడని అన్నాడు. కలికి శబ్దానికి ఎఱుక కలిగినది అని యౌగికార్థం. ఈ జ్ఞానగరిమనే మరింత విస్తరించి, 

“అరవిరి సిగ్గులు నాత్మ నిగ్గులును ... గలిగిన శృంగారగరిమ” 

అనటంతో ఈ ఆధ్యాత్మిక భావబంధురత వెలుగులను వెలార్చింది. “ఆత్మ నిగ్గులు” అనటానికి ఎంత శాస్త్రానుభవం, ఎంత లోకానుభవం, ఎంత కావ్యానుభవం, అన్నింటినీ మించి ఎంత ఆత్మానుభవం కావాలి!

 

సంవిధాన శిల్పం

      శృంగారమంజరిలో స్పష్టార్థప్రతిపాదనమే గాని అప్రతీత పదప్రయుక్తి లేదు. అయితే, భగవత్సంగాన్ని అభిలషించిన ఆ బాల ఎవరు? ఏ పూర్వపుణ్యం వలన ఆమె భగవత్ప్రేమకు నోచుకొన్నది? చెప్పకుండానే ఆమె విరహావస్థను గుర్తించిన చెలికత్తెలు ఆమె నిర్ణయంలోని బాగోగులను తర్జనభర్జన చేయక ఎందుకు శైత్యోపచారాలకు పూనుకొన్నారు?  తనయందు అనురక్తురా లన్నంత మాత్రాన మన్నించి తిరువేంగళనాథుడు ఎందుకు ఆమెకు తన సన్నిధిరూపమైన పెన్నిధిని అనుగ్రహించాడు? వంటి కథోత్థాపనీయ సందేహాలకు తావీయని వేగంతోనూ, పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేసే కాథికకౌశలంతోనూ అన్నమయ్య దీనిని అమిత చాకచక్యంతో నడుపుకొనిపోతాడు. సామాన్యములని భాసించే సన్నివేశాలనే వజ్రానికి ముఖాలను కల్పించినంత నేర్పుతో చిత్రికపట్టి ఆశ్చర్యచకితులను చేస్తాడు. వజ్రపు కాంతి అందులోని పొరలను మఱుగుపుచ్చినట్లు శృంగారభావనలో నిబిడమై ఉన్న భక్తిభావనను కల్పనావసానంలో సాంద్రతరీకరించేటంత వరకు కథను కదనుతొక్కిస్తాడు. అటు పురాణత్రేతకూ ఇటు ప్రబంధ ద్వాపరానికీ నడిమి సంధియుగంలో జన్మించి ఉండకపోతే శ్రీ వేంకటేశ్వర లీలా ప్రబంధరచనకే పూనుకొని ఉండేవాడు.

రూధే విర్శ

      సంస్కృతంలో శృంగార మంజరీ కావ్యకర్తలు అనేకులున్నారు. క్రీస్తుశకం పదవ శతాబ్దిలో కన్నడ కవి నేమిచంద్రుని గురువు అజితసేనుడు 128 శ్లోకాలలో చెప్పిన శృంగారమంజరి రసలక్షణనిరూపకమైన శాస్త్రగ్రంథం. కావ్యకోటి లోనికి రాదు. మాధవ విద్యారణ్యుల తమ్ముడు భోగనాథుడు చెప్పినది కూడా ఇటువంటి ఆలంకారిక రచనే. దానిపేరు కూడా శృంగారమంజరియే. ఇక, విశ్వనాథుని శృంగారమంజరి ఓఢ్రదేశంలో జగన్నాథోత్సవసంరంభాలను వర్ణించే భాణ రూపకం. రతికరుని శృంగారమంజరి విటీవిటసంవాదాత్మకమైన మరొక భాణం. మాధవానలుని కామకందళం వంటిది. మహారాష్ట్రుడైన అప్పా కవి  రచన ఇంకొక శృంగారమంజరీ నాటకం ఉన్నది. అది తంజావూరి ప్రభువు సహజీని వలచి వలపించుకొన్న ఒక నాయిక కథ. అన్నమయ్య రచనకు అనంతరకాలికం. ఇవి కాక సంస్కృతంలో రామ మనోహరుడు, మాన కవి, ప్రాకృతంలో విశ్వేశ్వరాచార్యుడు, మహారాజ కేరళ వర్మ చెప్పిన శృంగారమంజరీ కావ్యాలు వైభావిక వర్ణనలే కాని కథాసంపుటాలు కావు. కాగా, మహాకవి భోజరాజు చెప్పిన శృంగారమంజరీ కావ్యం ఒక్కటే అన్నమయ్యకు పూర్వం ఈ శాఖలోని సుప్రసిద్ధమైన రచన. అయితే, అది గద్యప్రబంధం. ఒక ప్రాకృతవనిత తన దేశపు రాజకుమారుని వలచి వలపించుకొన్న ఉదంతమే అందులోని ఇతివృత్తమూ అయినప్పటికీ అన్నమయ్య కథలో దానిలో చిత్రితాలైన  మలుపులేవీ లేవు. భోజరచితం ఆయనకు ఆదర్శం కాదు. భాషలో, భావంలో రెండింటికీ ఎటువంటి పోలికా లేదు. రెండు కావ్యాలనూ పరిశీలించినవారికి భోజుని కవితను అన్నమయ్య చూచి ఉండడనే విశ్వాసమే కలుగుతుంది.  ఇతివృత్తకల్పనం, పాత్రల మనస్తత్త్వనిరూపణం, వర్ణనాబాహుళ్యం మొదలైన కావ్యకళాధర్మాల గుణోత్కర్ష ఉన్నప్పటికీ భోజుని కావ్యం కేవల లౌకికత వల్ల మనస్సు లోతులలోకి చొచ్చుకొనిరాదు. భక్త్యున్ముఖత యొక్క సుకృతబలం చేత భక్తిమార్గమందు శ్రద్ధ ఉదయించి భగవత్సంగానికై ఉవ్విళ్ళూరిన నాయికా మనోవస్థను ఏకాంతభక్తిగా తీర్చిదిద్ది అన్నమయ్య కావించిన నిరూపణ ముందు మాంసలమైన భోజరాజు కృతి వెలవెలపోతుంది. అన్నమయ్య కృతిలో భగవన్నామ రూప గుణాలతో ఐక్యానుసంధానం భజించి అమలచిత్తంతో భగవద్రతిని కాంక్షించిన నాయిక హృదయంలో వేంకటేశ్వరుని లీలాస్ఫూర్తి ఉదయిస్తుంది. భోజుని కృతి నాయికా నాయక సమాగమంతో ముగుస్తుంది.  ఉభయకావ్యాల పేర్లు, కొంతవరకు కథాసామ్యం ఉన్నందువల్ల రెండింటి తారతమ్యనిరూపణ ప్రసక్తమయింది కానీ రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాల వంటివి.  శ్రీ వేంకటేశ్వర నామభజనం, మనోనేత్రంతో త ద్రూపదర్శనం, చిత్తంలో త ద్గుణగణసంభావనం, సమాధిలాభాన్ని పొందిన ఆత్మలో తిరువేంగళనాథుని లీలాస్ఫూర్తి - అన్న దశాక్రమాన్ని ఉత్తరోత్తరబలీయంగా వర్ణింపగల సాధన పరమావస్థ విషయానికి వస్తే అన్నమయ్యకు సాటిరాగల కవులు ఏ భాషలోనైనా ఎంతో అరుదుగా ఉంటారు. ఆయన చిత్రణలోని ఆర్ద్రత, ఉల్లాసం, మసృణత్వం, రుచి, ఆసక్తి మొదలైనవన్నీ భక్తిశాస్త్రంలోని అవస్థాభేదాలుగా పరిగణిస్తే ఆయన వంటి తత్త్వవేత్త కవితావ్యాసంగానికి పూనుకోవటం నిజంగా తెలుగు జాతి అదృష్టవిశేషమే.

        శృంగారమంజరి అన్నది కేవలం కావ్యనామధేయమే గాక రూపధేయాన్ని సైతం సూచించే ప్రక్రియావిశేష శీర్షిక. శృంగార రస ప్రాధాన్యకరణం తోడి మంజరీచ్ఛందమన్న నిగమనమే కానీ – శృంగారమంజరి అనే కావ్యభేదం ఒకటున్నదని సంస్కృత లాక్షణికులెవరూ పేర్కొనలేదు. ఇది ఆంధ్రదేశీయమౌలిక మందామా? అంటే, ఆంధ్రులలో ముఖ్యులైన ప్రతాపరుద్రీయ కర్త విద్యానాథుడు, రసార్ణవసుధాకరకారుడు రేచర్ల సింగభూపతి, చమత్కారచంద్రికా కర్త విశ్వేశ్వరుడు, అలంకార సంగ్రహ నిర్మాత అమృతానందయోగి, లక్షణదీపికా రచయిత గౌరన, సాహిత్యచింతామణీ విధాత పెదకోమటి వేమారెడ్డి, లబ్ధోదాహృతులను బట్టి వసంతరాజీయ కర్త కొమరగిరి రెడ్డి, సంగీత సుధా కల్పయిత రఘునాథ నాయకుడు, సాహిత్య రత్నాకరంలో ధర్మసూరి, అలంకార ముక్తావళిలో కృష్ణయజ్వ -  కొంత ఆంధ్రదేశ పరిచయం ఉన్న ఏకావళీ కర్త విద్యాధరుడు; సంస్కృతాలంకారిక గ్రంథాలకు, కావ్యాలకు వ్యాఖ్యలను నిర్మించిన మల్లినాథ - కుమారస్వామి సోమపీథ్యాది విద్వన్మణులెవరూ  - నాకు దృష్టిగోచర మైనంతలో - శృంగార మంజరి అనే సాహిత్యప్రక్రియ ఒకటున్నదని స్మరింపలేదు. క్షుద్రప్రబంధ సాంగ్రహికాలలో ఉదాహరింపలేదు.  ఈ విధంగా పూర్వోపదిష్టం లేనప్పటికీ, మంజరిని ఒక లఘుకావ్యవిశేషంగా నిర్ణయించినవాడు తెలుగులో భట్టుమూర్తి ఒక్కడే కనుపిస్తున్నాడు. తన కావ్యాలంకార సంగ్రహం (2-172)లో ఆయన 

              “క.   తరుణీమణి శృంగారము,

                        విరహము, మధుమదనగర్వవిభవంబు, సరో

                        వరఖేలనంబులు గల

                        దరయన్ మంజరి యనంగ నభినుతి కెక్కున్.”  

అని మంజరిని సరికొత్తగా నిర్వచించాడు. శృంగారం, విరహం, వసంతవైభవం, మన్మథవిజృంభణం, జలక్రీడాదులు అందులో వర్ణనీయాలన్నాడు. ఈ విధమైన ఇతివృత్తం కలిగిన మంజరి ఆయన ముందున్నది ఒక్క అన్నమయ్య రచనమే కాబట్టి, దానికే ప్రక్రియాకల్పనం చేశాడనుకోవాలి. తన ఉపాస్యదేవత అయిన వాగ్దేవి యొక్క పాదాంబుజాల చెంత ఆమె దయతో వ్యక్తిత్వాన్ని సంతరించుకొన్న మహాకవి స్వస్వరూపానుసంధానపూర్వకంగా సమర్పించుకొన్న కృతిప్రసూనం ఆలంకారికశిరోధార్యం కావటంలో వింతేముంటుంది? 

       అన్నమయ్య కృతి శృంగారమంజరి తొలిసారిగా తెలుగులో వెలసిన కొద్దికాలానికే లాక్షణికులనే గాక సంస్కృతాంధ్రకవులను కూడా ఆకర్షించింది. ఆయన కొడుకే పెదతిరుమలాచార్యులు చక్రవాళమంజరిని వ్రాసి, అచ్చపు నకలు నవీసు పని చేశాడు. క్రీ.శ. 17-వ శతాబ్ది నాటి సయీద్ షాహ్ కలీముల్లాహ్ హుసైనీ తన శృంగారమంజరిలో అన్నమయ్య పేరును పేర్కొనకపోయినా, ఆ పేరిట వెలసిన తన తెలుగు కృతికి సంవాదం కల్పిస్తున్నానని స్పష్టంగా వ్రాశాడు:

 

              “సఫల బడే సాహెబ్ శుభనామా రామాభిరామగుణః

                జగతి విబుధవరలక్ష్మీ ర్జయతి బహుశ్రేయసాం సుశ్రీః.

                తే నాంధ్రభాషయాయం రచితః శృంగారమంజరీ గ్రంథః

                స్వయ మకబరేణ భూభృన్మకుటమణిరంజితాంఘ్రికమలేన.

                తద్విరచితాంధ్రభాషాకలితాం శృంగారమంజరీ చ్ఛాయాం

                సేవధ్వం సురవాణీరచితాం రసతోషతా రసికభృంగాః.”  

అన్నాడు. భట్టుమూర్తి లక్షణం ఆయనకు సుపరిచితమే. గ్రంథాదిని “సుందర శృంగార నరసకావ్య విలాస రత్నాకర ప్రముఖగ్రంథాన్ సువిచార్య” అని వేటివేటినో కొన్నింటిని పేర్కొన్నాడు. వాటిలో నరసకావ్యం అంటే భట్టుమూర్తి నరసభూపాలీయం అన్నమాట. అన్నమయ్య శృంగార మంజరినీ చూసే ఉంటాడు. అందుకే, “ప్రాచీ నాంధ్రభాషోదాహరణా ద ప్యయ మర్థః” అని మరొక్కసారి నిర్ధారించాడు.   

కావ్యగుణ గౌరవం

      శృంగారమంజరి కృతిపరిమాణం చేత లఘుతరమే కాని గుణగౌరవం వల్ల గురుతరమైనది. ఆ ప్రక్రియ కది ఆద్యమే గాక అనంతరీయ ప్రబంధాలకు అందులోని పదబంధాలు ప్రాణంపోశాయి. అన్నమయ్య ఉత్తరవయోరచితం కాబట్టి 15-వ శతాబ్ది చరమపాదంలోని రచనమని నిశ్చయించాము. తెలుగులో పట్టాభిరామ కవి కృతులతో కొంత తులనీయత కనబడుతుంది. కృత్యాదిలో – 

                “శ్రీకామినీవక్షు నతహిరణ్యాక్షు

                భువనపాలనదక్షు పుండరీకాక్షు

                వివిధగీర్వాణాద్యు వేదాంతవేద్యుఁ

                బరమతత్త్వాపాద్యు భవరోగవైద్యు” 

అని తన ఇష్టదైవాన్ని సన్నుతించాడు. ఈ “భవరోగవైద్యు” డన్న పదబంధం పట్టాభిరామ కవి వజ్రపంజర శతకం లోనిదిగా ప్రసిద్ధం. అంతకు పూర్వమూ ఉన్నదేమో.              

       “ఉ.   శ్రీగజగామినీమణిని సీతనుగా నిరపాయిగాఁ ద్రిలో

                కీ గృహమేధిగా గరుడకేతనుగా భవరోగవైద్యుగా

                నా గురువాన, నిన్నె మది నమ్మితి, వేఱొక వేల్పుఁ గొల్వ, నీ

                వే గతి కావవే రఘుపతీ! శరణాగతవజ్రపంజరా!”

 

అని అప్పకవి ప్లుతయతికి ఉదాహరించాడు. ఇటువంటివి ఉదాహరణీయాలు ఇంకా మరికొన్ని ఉన్నాయి. 

సుందర పదచిత్రావళి

      శబ్దబృంహణ వల్ల రూపొందే పదచిత్రాలకు శృంగారమంజరి పుట్టినిల్లు. విద్వన్మనోరంజనార్థం ఒక్క చిత్రాకృతిని ప్రదర్శిస్తాను:

              “అరకంట సిరితోడ నలిగి, భూకాంతఁ

                గలసి, యిద్దఱలోనఁ గైలాట మిడుచు.”

        ఈ కల్పనలోని తొలిభాగాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో

 

        “మ. సిరి నొక్కప్పుడు గన్మొఱంగి హరి దన్జేరం బ్రహర్షించు ను

                ర్వరఁ గూడన్” 

 

అని వినియోగించుకొని, రూపాంతరాన్ని కల్పించాడు.  

       మరొక చిత్రాకృతి ఇది: 

              ఎండ  వెన్నెలతోడ నేకమై కూడి

                రెండు కన్నుల సంధి రెట్టింపుచున్న

                గగనంబుఁ దాఁకిన కన్నులవాని ...” 

అని. ఇటువంటి భక్తి శృంగార రూపణలకు అన్నమయ్యే సర్వస్వామ్యానుభవికు డని చెప్పాలి. 

       శృంగారమంజరి నిజంగా భక్తి శృంగార నిర్ఝరి.  దీనిని అనుసరించి పెదతిరుమలాచార్యులు కూర్చిన చక్రవాళ మంజరి కూడా యమకరత్నాకరమే. తమనోట పలికిన ప్రతిపలుకును శ్రీ వేంకటేశ్వరస్వామి పావన పాదారవిందాల చెంత నిలిపి, ఆ స్వామికి కట్టిన గుడిలో స్వయంగా పాడి వినిపించి, తమ ఒక్కొక్క పలుకుతో పాటతో తాళ్లపాక కవులు సాహిత్య  సంగీత రసజ్ఞుల ఒక్కొక్క గుండెలో ఒక్కొక్క శేషశైలేశమందిరాన్ని నిర్మించి, “కలౌ వేంకటనాయకః” అన్న సూక్తిని విశ్వమంతటా నిజం చేశారు.  

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech