సుజననీయం  
   

   తాజమహల్ షాజహాన్ కట్టిచిందేనా?

జైనులదా, హిందువులదా?-   (ఆరవ భాగం)

- రచన : రావు తల్లాప్రగడ

 

2500వ మహావీర వర్ధంతి సందర్భంగా, నవంబర్ 13, 1974 నాడు భారతప్రభుత్వం విడుదల చేసిన స్టాంపు

 

ముందు భాగాలలో (గత ఐదు మాసాలలో) తాజమహల్లో వున్న హైందవ చిహ్నాలను, చారిత్రాత్మక ఆధారాలను, వాస్తుకళలనూ, వయస్సును, బల్బు గోపురాలను, మినారులను పరిశీలించాము.  బల్బుగోపురాలు భారతదేశంలో ముందునుంచే వున్నాయని తెలిసింది. అలాగే మినారులు కూడా భారతదేశం నుంచే ఉద్భవించాయని తెలిసింది. ఇది ఊరికే అంటున్నామా, లేక గోపురాలు మినారులు కలిగిన తాజమహల్ వంటి నిర్మాణం మరెక్కడైనా జరిగిందా, అన్న అనుమానం రావచ్చు. ఈ అనుమానం తీరాలి అంటే బీహార్‌లోని పావపూరి అనే ఊళ్ళో ఉన్న జైనుల జల్ మందిర్‌ని దర్శించి తీరాల్సిందే. ఇది తాజమహల్ అంత పెద్ద కట్టడం కాకపోయినా, దీని నక్షా (ప్లాను) మాత్రం తాజమహల్‌ని గుర్తుకు తీసుకురాక మానదు.

జైనుల తీర్థంకారులలో 24వాడు, చివరి వాడు అయిన మహావీర భగవానుడు, ఈ ప్రాంతంలో, క్రీ.పూ 500 కాలంలో, నిర్యాణం చెందాడట. ఆయనకి దహనసంస్కారాలు చేసిన తరువాత మిగిలిన  బూడిదమట్టిని పవిత్రమైనదిగా భావించి, దానికోసం  కోసం భక్తులు ఆ ప్రాంతాన్ని త్రవ్వుకుని, ఎవరికి  దొరికినంతమటుకు వారు, తలా కొంత మట్టిని పట్టుకుపోయారట. అలా ఎందరో మట్టిని పట్టుకుపోయేసరికి, అక్కడ ఒక పెద్ద గుంట ఏర్పడి, దానిలో ఒక కొలను ఏర్పడిందని స్థానిక కథనం.  తరువాత ఆ కోనేటి మద్యలోనే ఒక పాలరాతి మందిరాన్ని నిర్మించుకున్నారని, అదే ఈ జల్ మందిర్‌గా ప్రసిద్ధి పొందినది, అని అక్కడి స్థల పురాణం. ఆ కోనేరు ఒక తామర కొలనుగా (లేక ఒక పద్మాకరంగా) విలసిల్లిందట.

పావపురి జల్ మందిర్

తాజమహలు పైన ఉన్నట్లే, జల్ మందిర్ గోపురాలపైన కూడా పద్మఛత్రాలు ఉంటాయి. ఈ మందిరం పద్మాల కోనేటిలో ఉంటుంది.  ఇందులో ఉన్న పాలరాతి మందిరాన్ని, డోము గోపురాలని, చుట్టూతా నాలుగు దీపపు స్థంభాలను (మినారులని) గమనించండి. దీపపు స్థంభాలు (మినారులు) కూడా ముఖ్య కట్టడానికి దూరంగా, ముఖ్యకట్టడాని కన్నా పొట్టిగా ఉంటాయి.  తాజమహలు ఈ వాస్తు కళలో కట్టినదే అని నిరూపించడానికి మరి ఇంకేమి కావాలి?

పావపురి జల్ మందిర్

పావపురి మందిరపు దీపపు స్తంభము(లేక మినారు)

ఇంకా దగ్గిరగా వెళ్ళి చూస్తే ఆ దీపపు స్థంభాలపైన (మినారులపైన), గోపురాలపైన కూడా పద్మ ఛత్రాలు కనిపిస్తాయి. తాజమహలోని గోపురాలపైన కూడా ఈ పద్మ చత్రాలు ఉన్నాయని మొదటి అధ్యాయంలోనే చెప్పుకున్నాము.  ఇది కూడా తెల్ల పాలరాతితోనే కట్టబడింది.  ఇలా ముఖ్యకట్టడానికి దూరంగా పొట్టి మినారులతో, పద్మఛత్రాలతో,  పాలరాతితో కట్టబడ్డ  భవనం, తాజమహల్ సముదాయంలో తప్ప, వేరే ఏ మహమ్మదీయ కట్టడములోను కనిపించదు అంటే - - తాజమహల్ కూడా మహమ్మదీయ కట్టడం కాకపోవచ్చుననే అనుమానమే ఇప్పుడు నమ్మకంగా మారిపోవడం లేదూ?

ఐనా కొంతమదికి ఈ జైనమందిరమే తాజమహలును చూసి అనుకరించి కట్టించ్చుకున్నారేమో అన్న అనుమానం కూడా రావొచ్చు. ఈ అనుమానాలలో కూడా తప్పులేదు! ఎందుకంటే ఈ పావపూరీ మందిరం ఎంతో పురాతనమైనదే కానీ, ఇప్పుడు కనిపించే కట్టడం మాత్రం మళ్ళీ 17వ శతాబ్దిలో పునర్నిర్మించినదే. 17వ శతాబ్దికి ముందున్న ఆలయపు ఫొటోలు లేవు కనుక, ఆ నాటి పురాతన మందిరం ఎలా వుండేదో మనం ఖచ్చితంగా చెప్పలేము. భారతదేశం మొత్తం తిరిగి అధ్యయనం చేసిన ఫర్గూసన్, 18వ శతాబ్దిలో ఈ కొత్త మందిరాన్ని కూడా చూసాడు. ఈ మందిరాన్ని పరీక్షించి ఆయన ఇలా అన్నాడు -- "ఈ పావపూరి మందిరంలో డోము గోపురాలు ఉన్నాయి కానీ, అవి ఇటీవల జరిగిన పునర్నిర్మాణంలో కట్టినవే అయి వుండవచ్చు. మొగలుల ప్రభావంవల్ల అనేక ప్రదేశాలలో ఈ డోము గోపురాలు ఇలా కనిపిస్తూవుండి వుండవచ్చు". ఇలా చెప్పిన ఫర్గూసన్, మళ్ళీ మరొకచోట ఇలా అన్నాడు "కానీ జైనులు తమ మందిరాలను పునర్నిర్మాణం చేసేటప్పుడు, ఆ మందిరాలను మళ్ళీ పురాతన శైలిలోనే నిర్మిస్తారు". ఇలా సందిద్గతతో ఒదిలేసాడు. సరే ఫర్గూసన్ చెప్పినట్టు జైనులు ఇక్కడ మొగలాయులను అనుసరించి డోము గోపురాలు మినారులు కట్టుకున్నారే అనుకుందాము. కానీ ఫర్గూసన్ జైనులు సామాన్యంగా అలా "పునర్నిర్మాణంలో తమ ఆలయాల శైలిని మార్చరు" అని చెప్పాడు కనుక, మరింకడేక్కడైనా కూడా ఇటువంటి శైలి కనబడితే, కనీసం ఇది జైనుల సొంత శైలే; ఇది అనుకరణ శైలి కాదు అని నిర్థారించవచ్చు.  అందుకని మరికొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

సమోశరణ్ జైన మందిరం

ఈ పావపురి దగ్గరే సమోశరణ్ జైన మందిరంలో, ఇలాంటి వాస్తే కనిపిస్తుంది. పాలరాతి కట్టడం, చుట్టూతా ముఖ్యకట్టడానికి దూరంగా, పొట్టివైన మినారులు కనిపిస్తాయి. ఇది కూడా మహావీరుని ఆలయమే. ఈ ఆలయానికి భక్తులేకాక, అక్కడి శిల్పవాస్తుకళలను చూసి ఆనందించడానికి కూడా అనేకులు వెళ్ళివస్తారు, అనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ మహావీరుడు, తన ఆఖరి ప్రవచనం చెప్పాడని అంటారు.

కాత్రజ్ జైన మందిరం

అలాగే పూనా దగ్గిర కాత్రజ్-సతారా హైవే మీద, ఒక చిన్న కొండపైన, మరొక జైన మందిరం కనిపిస్తుంది. దీనిని కాత్రజ్ జైన మందిరం, లేక ఆగమ మందిరం అని పిలుస్తారు. దీని చుట్టూతా కూడా కోనేరు ఉంటుంది. ఇందులో కూడా మహావీరుని విగ్రహమే కనిపిస్తుంది. పద్మాసనాశీనుడైన 12 అడుగుల ఎత్తైన మహావీర విగ్రాహాన్ని ఐదు వేల కిలోల పంచధాతువులతో చేసి ఇక్కడ ప్రతిష్ఠించారు. తాజమహల్ లో ఖురాను వ్రాతల ఫలకాలు కనిపించినట్లు, ఇక్కడ జైనుల సూత్రాలు ఫలకాలు కనబడతాయి. ఇక్కడి మినారులు కూడా ముఖ్యకట్టడానికన్నా పొట్టిగా, దూరంగా ఉండటం గమనించదగ్గ విశేషమే.  

ఇలాంటి వాస్తు అంశాలు, తాజమహల్ తప్ప మరే మహమ్మదీయ కట్టడాలలోనూ కనిపించవు. పోని, ఇలాంటి మరో జైన మందిరం ఉందా, అంటే - ఉన్నాయి.. .. ఎన్నో ఉన్నాయి అని తెలుస్తుంది. అన్ని జైను మందిరాలను తాజమహలునే అనుకరించుకట్టుకున్నారని ఎవరూ వాదించనూ లేరు. ఇంతకీ దీని వలన తెలిసేదేమిటంటే, పాలరాతి మందిరాలను కట్టుకోవడం, మినారులను, డోములను కట్టుకోవడం భారతీయులకు కొత్తేమీ కాదు. మహమ్మదీయ దేశాలు నేర్చుకుంటే వీటిని భారతీయుల దగ్గిర నేర్చుకున్నారేమో గానీ, వారు భారతీయులకు నేర్పే అవకాశం మాత్రం లేదని ఖచ్చితంగా నిర్థారించి చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఈ మినారులను లేక దీపపుస్తంభాలను గమనించాక, కొన్ని జైన మందిరాలను పరిశీలించాక, తాజమహల్ మహమ్మదీయ కట్టడం మాత్రం కాదని చెప్పవచ్చు.   

ముందు అధ్యాయంలో, తాజమహల్ లోని మినార్లు కనీసం మహమ్మదీయ వాస్తుని కూడా అనుసరించలేదని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ మినార్లు హైందవజైన దీపపు స్తంభాల వాస్తు ప్రకారం కట్టినవే అని ఋజువు చేసుకున్నాము.  అలాగే  తాజమహల్ పైన ఉన్న డోము గోపురాలు కూడా జైన, హిందువుల ఆలయాలకి కొత్త కాదని కూడా తేలింది.  ఇహపోతే ఈ హిందూజైనమందిరాలపైన, తాజమహలుపైన కనిపించే పద్మఛత్రాల చరిత్రను మరొకసారి పరిశీలిద్దాం.

పద్మ ఛత్రాలు: హిందూజైన ఆలయాలపైన పద్మఛత్రాలు ఉండటం అన్నది, మొదటి నుంచీ వీరి మందిరవాస్తుశాస్త్రంలో ఒక భాగమే. ముందు అధ్యాయాలలో చెప్పుకున్నట్లు మౌంట్ అబూ, ఉదయపూర్, గిర్నార్ కార్లా, మైలాస్ మున్నగు ఆలయాల పైన పద్మఛత్రాలు 4వ శతాబ్దికాలం నుంచీ ఉండేవి. "వీటి గోపురాలు వేరువేరు ఆకృతులలో ఉన్నా, అన్నిటిపైనా బోర్లించిన ఆకారంలో పద్మాలను గోపురాల పైన చెక్కడం, ఆ పద్మాల కాడలనే కలశాలుగా మలచడం, ఇలా ఎన్నోచోట్ల కనిపించడం,"  ...  ఇది ఒక సాధారణ డిజైనో, లేక కాకతాళీయమో మాత్రం కాదు. సోనాగర్, ముక్తగిరిలోని ఆలయాల పైన ఉన్న డోము గోపురాలను కూడా ఇంతకు ముందు అధ్యాయాలలో గమనించాము. వాటి పైన కూడా పద్మ ఛత్రాలు ఉంటాయి. అలాగే తాజమహలు లోని ప్రతి గోపురం మీద కూడా పద్మ ఛత్రాలు కనబడతాయి.

తాజమహల్ డోము గోపురాన్ని, దానిపైన ఉన్న పద్మ ఛత్రాన్ని చూపిస్తూ, "ఈ గోపురం హిందూశిల్పశాస్త్రానుసారం కట్టబడినదదే" అని హావెల్ (22-26 పేజీలలో) నిరూపిస్తూ, హిందూ శిల్పశాస్త్రంలోని విమానాల పైన (గోపురాలపైన) ఉండే "స్తుపి" లోని "మహాపద్మమే" ఈ తాజమహలుపైన కనబడే పద్మఛత్రము, అని పేర్కొన్నాడు. హిందువులకు జైనులకు పద్మాలు చాలా పవిత్రత కలిగిన పుష్పాలు. కానీ మహమ్మదీయులకు పద్మాల పైన ఎటువంటి ఆసక్తి,  పవిత్రభావన ఉండదు. అటువంటప్పుడు, ఆ పద్మాలను ఆ విధంగా  తాజమహల్ గోపురాలన్నిటి పైనా వేసుకోవలసిన అవసరమేమీ లేదు. అంతే కాదు, సార్సెనిక్ వాస్తుతో నిర్మింపబడ్డ ఏ సమర్ఖండ్ భవనంపైన కానీ, పర్షియాలోని భవనంపైన కానీ, బాగ్దాదులోని భవనంపైన కానీ, ఈజిప్టులోని భవనంపైన కానీ, ఈ పద్మఛత్రాలు కనబడవు.

అంతే కాకుండా, తాజమహల్లోని గోపురాలను గమనిస్తూ ఈ.బి.హావెల్ (22-23 పేజీలలో) ఇలా అన్నాడు. "తాజమహల్ ముఖ్యభవనం పైన మొత్తం ఐదు డోములు కనిపిస్తాయి. ఇందులో సార్సెనిక్ వాస్తు ప్రేరణ కనిపించడం లేదు. ఇది ఖచ్చితంగా హిందూశిల్పశాస్త్రంలోని "పంచరత్న" సూత్రం ప్రకారం కట్టినదే". ఆదిశంకరాచార్యులు నిర్దేశించిన పంచాయతన పూజలో శివుడు, విష్ణువు, దేవి, సూర్యుడు, వినాయకుడు, వీరు ఐదుగురిని కలిపి ఆవాహనచేసి పూజించడం, స్మార్తులలో సర్వసాధారణం. అందుకే ఐదుగురినీ ఉద్దేశిస్తూ ఐదు గోపురాలు. అలాగే పంచముఖపరమేశ్వరునిగా శివుడిని పూజించడం కూడా ఒక ఆచారమే. క్రీ.శ.1098నాటి జావాలోని ప్రాంబనచండీసేవ ఆలయంలో ఇటువంటి  ఆచారమే కనిపిస్తుంది. అలాగే తాజమహల్ ముఖ్యద్వారంపైన 11 కలశాలు, అంటే ఏకాదశ కలశాలు కూడా శివాలయాన్నే సూచిస్తున్నాయి. అలాగే ముఖ్యగోపురం పైన ఉన్న త్రిశూలకలశాలు, చంద్రవంక మున్నగునవి కేవలం శివుడినే సూచిస్తున్నాయి. ఈ రకంగా తాజమహల్లోని గోపురాలను విశ్లేషిస్తే, ఇందులో మహమ్మదీయత కనిపించదు. అలాగే ఇందులో జైన మతం కూడా కనిపించదు.

ఐతే ఇది జైన మందిరమా? లేక హిందూ మందిరమా? అంటే, మరికొంత ఆలోచించాల్సి వస్తుంది.  నిజానికి ఇది తేల్చడం చాలా క్లిష్టమైనదే. హిందూబౌద్ధజైన ఆలయాలు ఒకదాని నుంచీ మరొకటి అభివృద్ధిచెందాయి. మూడిటిని కలిపి భారతీయ వాస్తుకళ అని పిలవచ్చు. ఈ మూడూ వాస్తులూ ఒకదానితో ఒకటి కలిసిపోయి కనిపిస్తాయి. కాని, జాగ్రత్తగా వెతికి చూస్తే, పైన గోపురాల గురించి చెప్పుకున్నట్లు, వీటిల్లో కూడా కొన్ని చిన్నచిన్న ప్రత్యేకతలు కనబడతాయి. జైనులలో ముఖ్యంగా రెండు శాఖలు ఉన్నాయి. మొదటిది దిగంబర జైనులు. రెండవది శ్వేతాంబర జైనులు. స్వేతాంబర జైనుల ఆలయాలు హిందువుల ఆలయాలను పోలి వుండటమే కాకుండా, వీరు అనేక మంది హిందూ దేవతలను కూడా పూజిస్తారు. హిందూజైన మతాలు రెండూ కర్మ, అహింస సిద్ధాంతాల వంటివి నమ్ముతాయి. హిందూజైనబౌద్ధ మతాల మద్య దగ్గిర పోలికలు సారూప్యతలు ఉండటం చేత, మందిర నిర్మాణశాస్త్రాలు కూడా చాలా దగ్గిరవి అవడం చేత, ఒకరి ఆలయాలు మరొకరి ఆధీనంలోకి వెళ్ళిన సందర్భాలు కూడా చరిత్రలో అనేకము కనబడతాయి.

ఐతే, "హిందువులకు జైనులకు బౌద్దులకు మద్య అనేక ఆలయాలు చాలామటుకు శాంతియుతంగానే చేతులు మారాయి", అని ఫర్గూసన్ కూడా పేర్కొన్నాడని ఇంతకు ముందు అధ్యాయాలలో చదువుకున్నాము. హుయెన్ సియంగ్ అనే చీనీ యాత్రికుడు, తన క్రీ.శ. 643 నాటి  భారతదేశ పర్యటన తరువాత, తన స్మృతులలో ఇలా వ్రాసుకున్నాడట. "ప్రయాగ (నేటి అలహాబాదు) ప్రాంతంలో ఒక గొప్ప పండుగని  చూసాను. రాజా శిలాదిత్యుని ఆధ్వర్యంలో జరిగిన ఆ పండుగలో వచ్చిన వారందరికీ, బౌద్ధబిక్షువులకు, బ్రాహ్మణులకు, అన్ని కులాలకు చెందిన పేదలకు, ఎన్నో దానాలను చేసాడు. పదులవేలకు మించిన ఆ జనసమూహంలో ఎన్నో తెగలు జాతులు, మతాలు ఉన్నా - ఎవరి మద్య విరోధభావం గాని, అసూయ కాని, ఎక్కువ తక్కువలు కాని లేవు. ఎవరి మద్య స్పర్ధలు తగువులాటలు లేవు". అంటే ఒక మతం రెండవ మతం కన్నా గొప్ప అని కాని, పోట్లాడుకోవడం కాని లేవు, అని చాలా చక్కగా చెప్పాడు, ఈ యాత్రీకుడు. జైనహిందూమతాల మద్య కూడా ఇలాంటి సంబంధ బాంధవ్యాలే వుండేవి. అవి ఈ నాటికి కూడా కనబడతాయి. వీరి మద్య మందిరాల ఆధీనత మారింది అంటే, అక్కడ ఏదో యుద్ధమో, బలవంతపు మతమార్పిడో జరిగిందని మాత్రం అనుకోనక్కరలేదు.  ఈ మతాలు ఇలా కలిసిమెలసి ఉండటం చేతనే, ఒకరి వాస్తుకళ మరొకరిదానితో కలిసి మరింత సుందరంగా అభివృద్ధిచెందాయి. ఐనా పరిశీలించి చూస్తే, హిందూమతంలోని శైవ వైష్ణవాలయాల మద్యే కొన్ని తేడాలు కనబడతాయి. అలా పరిక్షిస్తే జైన శైవ ఆలయాలమద్య కూడా కొన్ని తేడాలు తప్పక పట్టుకోవచ్చు.

ఇది హిందువులదా జైనులదా అన్న విషయం తేల్చుకోవాలి అంటే...  వెతకాలే కానీ, తాజమహల్ వంటి అతివిస్తారమైన కట్టడంలో మనకు అనేక అధారాలు దొరుకుతాయి. ఈ విశ్లేషణ సరిగ్గా జరగాలీ అంటే, దానికన్నా ముందుగా, ఉజ్జయిని లోని (మద్యప్రదేశ్) మహాకాలేశ్వరాలయాన్ని (లేక మహాకాళేశ్వరాలయాన్ని) ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఈ మహాకాలేశ్వరునికి ప్రపంచంలోనే ఒక విశిష్ఠత వుంది. మొదట్లో ప్రపంచంలో ఏ మతమూ పుట్టక ముందు, ప్రపంచమంతా వైదీకధర్మమే ఉండేది.  ఆ కాలంలో హిందూమతం (లేక అసలు మతం) అన్న మాట కూడా పుట్టలేదు. ఆ రోజుల్లో వైదీక పంచాంగాన్నే ప్రపంచం మొత్తం అనుసరించేవారు. (వివరాలకు ఈ లంకె పైన నొక్కండి  # http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr11/sujananeeyam.html # ). ఆ నాటి లెక్కల ప్రకారం, ముఖ్యకాలమాన రేఖాంశం (ఈ నాటి గ్రీనిచ్ రేఖ మాదిరిగా అనుకోవచ్చు) ఉజ్జయిని మీదుగా ఉండేదట. అక్కడ వెలసిన మహాకాలుడే, కాలానికి అధిపతి అని విశ్వసించేవారు.

మహాకా లేశ్వరాలయం, ఉజ్జయిని 

తాజమహల్‌లో అనేక నేలమాళిగల అంతస్తులు ఉన్నాయని ముందే చదువుకున్నాము. ఇలా అనేక అంతస్తులు కట్టుకునే ఆలయసాంప్రదాయం హిందువులదే అని చెప్పవచ్చు. ఉదాహరణకు ఉజ్జయిని ఆలయాన్ని ఐదు అంతస్తులుగా కట్టారు. అందులో ఒక అంతస్తుని భూమికి క్రింద, అంటే నేలమాళిగగా కట్టారు.

క్రింద అంతస్తులో స్వయంభువు అయిన మహాకాలేశ్వర లింగముంటుంది. దాని పైన అంతస్తులో ఓంకారేశ్వరమహాదేవ లింగం ఉంటుంది. మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వరలింగం ఉంటుంది. ఈ మూడవ అంతస్తుని నాగ పంచమిరోజు మాత్రమే తెరుస్తారు. ఈ 3 శివలింగాలే కాకుండా, ఇంకా అనాదికల్పేశ్వరుడు, త్రివిశ్తపేశ్వరుడు, చంద్రాదిత్యేశ్వరుడు, స్వప్నేశ్వరుడు వంటి అనేక శివలింగాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. తాజమహలోని ప్రతి అంతస్తు కూడా ఇలా ఒక్కో శివలింగానికి చెందినది అయివుండవచ్చు. లేక వేరే శివాలయ సాంప్రదాయ కర్మలకు ప్రణాళికగా కట్టి వుండవచ్చు. ఇలా అనేక అంతస్తులు కట్టుకునే అచారం ఉజ్జయినిలో మాత్రమే కాదు, దేశం మొత్తం, అనేక శివాలయాలో కనిపిస్తుంది. ఉదాహరణకి ఈ క్రింది శివాలయాలను కూడా చూడండి.

(1) ఎల్లోరా కైలాస మందిరం (2) పశుపతినాథ మందిరం, నేపాల్

(1) కుమారారామం, సామర్లకోట (2) ద్రాక్షారామం, ద్రాక్షారామం (3) అమరారామం, అమరావతి

పైన చూపిన ఆలయాలన్నీ అనేక అంతస్తులలో ఉంటాయి. మన ఆంధ్రదేశంలోని ద్రాక్షారామం, కుమారారామం, అమరారామాలలో కూడా పూజలు పై అంతస్తులలోనే చేస్తారు. ఇలా అనేక అంతస్తులలో ఆలయాలు ఉండటం, వాటి చుట్టూ అనేక భవనమందిర సముదాయాలు ఉండటం, శివాలయాలకు పరిపాటే కానీ, జైన మందిరాలకు కాదు (మహమ్మదీయ సమాధులకు కూడా కాదు). మరి దేశం మొత్తం ఇన్ని శివాలయాలు, ఇదే విషయాన్ని ధృవపరుస్తూ, శివాలయాలలో అనేక అంతస్తులు, గదులు ఉండటం అన్నది సర్వసాధారణమే, అని నిరూపిస్తూ ఘోషిస్తూ వుంటే, మరి ఈ మహాకాలేశ్వరమందిరం గురించే చర్చ దేనికి, అని అనుమానం రావచ్చు.  ఎందుకంటే ఉజ్జయినిలో తాజమహల్ విశ్లేషణకు సంబంధించిన మరికొన్ని ప్రత్యేక అంశాలు కూడా కనబడటమే! ఉజ్జయినిలోని మహాకాలుడు దక్షిణామూర్తి కూడా కావడమే!

మహాకా లేశ్వరాలయం, ఉజ్జయిని

తాజమహల్ ముఖద్వారం దక్షిణముఖంగా ఉంది, అని తాజమహల్ వాస్తుని పరిశీలించినప్పుడు తెలుసుకున్నాము. ఈ ఉజ్జయినిలోని శివుడుకూడా దక్షిణామూర్తే, అంటే ఈ శివుడు కూడా దక్షిణ దిక్కుగానే చూస్తాడు. అందుకే ఉజ్జయిని మందిర వాస్తుతో పోల్చి చూస్తే, తాజమహల్ శివాలయమే అని ఎందుకు అనిపిస్తుందో తెలుస్తుంది. దక్షిణముఖంగా కట్టడం మహమ్మదీయులకి, జైనులకే కాదు, ఒక్క దక్షిణామూర్తికి తప్ప, మిగితా హిందు దైవాలకు కూడా పనికిరాదు. తాజమహలుకు ఉత్తరదిశలో నౌకామార్గము, తూర్పుపశ్చిమదిక్కులలో మరో రెండు భవనాలు, దక్షిణదిక్కున ముఖ్యద్వారము ఉన్నాయని ముందు అధ్యాయాలలో తెలుసుకున్నాము. ఉజ్జయిని ఆలయంలో కూడా  తూర్పుపశ్చిమ దిక్కులలో కార్తికేయవినాయకుల ఆలయాలు ఉన్నాయి. తాజమహలులో  మసీదు, గెస్టుహౌసులుగా పిలువబడే ఆ రెండు భవనాలు కూడా ఒకనాటి కార్తికేయవినాయకుల ఆలయాలే అయి వుండవచ్చు(మసీదు, గెస్టుహౌసులుగా పిలువబడే ఆ రెండు భవనాలలో కూడా తాజమహల్ ముఖ్యభవనంలో లాగా మూసివేయబడిన అనేక అంతస్తులు గదులు ఉండటం గమనార్హమే). శివుడు దక్షిణదిశగా తిరిగి వెలిసాడు కనుక, నందీశ్వరుడు దక్షిణదిక్కులోనే దర్శనమిస్తాడు.   

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం లాగా, ద్వాదశజ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశశక్తిపీఠాలలో ఒకటిగా ఉండే విశిష్ఠత ఉజ్జయినికే దక్కుతుంది. ఐతే, ఉజ్జయిని మందిరాన్ని ఒక తాంత్రిక మందిరంగా భావిస్తారు. "తాజమహల్ నక్షా చూస్తే అది ఒక తాంత్రిక చిహ్నాన్ని పోలివుంటుంది" అని మార్విన్ మిల్ల్స్ తన ఉపన్యాసంలో ప్రకటించాడు.

తాజమహల్ నక్షా

ఈ ఆలయం చరిత్ర చూస్తే, పురాణాల ప్రకారం దీన్ని ప్రజాపిత బ్రహ్మ నిర్మించాడు. అలాగే ఈ ఆలయ నిర్వాహకునిగా కుమారసేనుని క్రీ.పూ. 6వ శతాబ్దిలో చంద్రప్రద్యోతుడు నియమించాడని ఆలయచరిత్ర తెలుపుతోంది. క్రీ.పూ 4వ శతాబ్ది నాటి ఉజ్జయిని నాణాలపైన ఈ మహాకాలుని చిత్రం ఉంటుంది. ఈ ఉజ్జయిని ఆలయం వారి వెబ్బుసైటు ప్రకారం,  కాళిదాసు తన రఘువంశం, మేఘదూతం వంటి కావ్యాలలో ఈ మందిరాన్ని ఇలా వర్ణించాడట. " ఈ మందిరాన్ని కలిగిన ఈ ఉజ్జయినీ నగరం, అనేక అంతస్తులు కలిగిన భవనాలతో అలరారేది. ఆ ఆలయంలో నుంచీ వచ్చే వివిధ వాయిద్యడోలకుల మోతలతో నగరమంతా హోరెత్తిపోయేది. ఆ ఆలయంపైన ఉన్నదీపాలతో నగరం మొత్తం ప్రకాశించేది. ఆ మందిరం ఎంతో ఎత్తైన గోడలు కలిగి, పెద్దపెద్ద ద్వారాలతో రాజసంగా ఉట్టిపడేది. ఈ ఆలయంలో నుంచీ ఎప్పుడూ వినిపించే జయజయధ్వానాలతో నగరం దద్దరిల్లేది. వేదమంత్రఘోషలతో ఎంతో పవిత్రత నిండిన వాతావరణం నలుదిక్కులా వ్యాపించేది. ఆ ఆలయనిర్మాణ  కౌశలం అలనాటి ఉత్తమస్థాయి వాస్తుకళకు అద్దంపట్టేది. " నిజానికి ఈ కాళిదాసు చేసిన ఈ ఉజ్జయిని వర్ణనలు అన్నీ, తాజమహలుకి కూడా సరిగ్గా సరిపోతాయనే అనిపిస్తుంది. అందుకని ఈ వర్ణనని తాజమహలు పరంగా వివరంగా పరిశీలిద్దాం.

"ఆలయంచూట్టూ ఎన్నో అంతస్తుల్లున్న భవనాలు వుండేవట": తాజమహల్ భవన సముదాయాన్ని చూస్తే ఎన్నో రాజపుత్రుల శైలిలోని భవనాలు, సౌధాలు, రహదారులు కనిపిస్తాయి. అసలు తాజమహలే ఏడంతస్తుల భవనం అని ముందు అధ్యాయాలలో చదువుకున్నాము.

"ఆ ఆలయంలోనుంచీ వచ్చే వివిధ వాయిద్యడోలకుల మోతతో నగరమంతా హోరెత్తిపోయేదట":  తాజమహల్ సముదాయంలో ముఖ్యభవనానికి ఎదురుగా నగర్ఖానాలు అనబడే రెండు భవనాలు కనిపిస్తాయి. వీటినే డ్రమ్ము హౌసెస్ అని పిలిస్తారు. అంటే సంగీత వాయుద్యాల ఘోష కోసము కట్టిన భవనాలన్న మాట. ఒక మహమ్మదీయ సమాధిలో నిశ్శబ్దమే ప్రధానము. సమాధిలో మృదంగధ్వానాలకు తావే లేదు. కానీ శివాలయాలో ఈ వాయిద్యాల నాదం, ముఖ్యంగా మృదంగ, డోలకుల వంటి వాయిద్యాలు శివునికి ముఖ్యమైనవి. అందుచేత డ్రమ్ము హౌసు అన్న ఆంగ్లనామం శివాలయ ప్రాంగణంలోని భవనానికి ఖచ్చితంగా సరిపోతీంది.

"అప్యన్యస్మిఞ్జలధర మహాకాళమాసాద్య కాలే

స్థాతవ్యం తే నయనవిషయం యావదత్యేతి భానుః

కుర్వన్సంధ్యాబలిపటహతాం శూలినః శ్లాఘనీయా

మామంద్రాణాం ఫలమవికలం లప్యనే గర్జితానాం (38)

                                                                        -కాళిదాస మేఘసందేశం

 తా. ఓ మేఘుడా ఈ మహాకాలక్షేత్రమునందు సాయంత్రము వరకు యుండి, ఆ సమయమున పూజ జరుగుచుండగా ఉఱిమితివేని పటహములు వాయించినట్లు ఉండును. నీకు గంభీరములైన ఉఱుములు ఉన్నందుకును, అవి భగవత్సన్నిదిలో ఉపయోగించుటవలనను  పరమ శ్రేయోలాభము కలుగును.  "

మేఘసందేశంలో, మేఘాన్ని మహాకాలుని దగ్గర ఘర్జించి శబ్దం చెయ్యమని, ఒక యక్షుడు అలా కోరతాడు. శివాలయంలో శబ్ధానికి అంత ప్రాముఖ్యత వుంది కనుక, నగర్ఖానాలనబడే రెండు  డ్రమ్ము హౌసులను కట్టుకోవడంలో ఏమీ ఆశ్చర్యం లేదు.

"ఆ ఆలయం పైన ఉన్నదీపాలతో నగరం మొత్తం ప్రకాశించేది": తాజమహలు గోపురాన్ని బాగా దగ్గిరగా చూస్తే మనకు కొన్ని వందల రింగులు కనిపిస్తాయి. ఒక సమాధిలో వీటి ఆవశ్యకతే లేదు, అలాగే వీటిని తాజమహలులో మహమ్మదీయులు ఎప్పుడూ వాడిన దాఖలాలు కూడా లేవు. కానీ ఈ వర్ణన ప్రకారం, ఈ రింగులకి హిందువుల నూనె దీపాలను తగిలించుకునే ప్రయోజనం, ఆచారం ఉండేదని తెలుస్తోంది.

(1) తాజమహల్ గోపురంపైన రింగులు  (2) దీపాలతో మహాకాలేశ్వరాలయం, ఉజ్జయిని  

మహాకాలేశ్వరుని ఆలయాన్ని ఈ నాటికి కూడా విద్యుద్దీపాలతో అలంకరిస్తారని, మనకు పైనున్న ఫొటోల ద్వారా తెలుస్తోంది. తాజమహల్ ఒకప్పుడు శివాలయమయి వుండి వుంటే, ఆనాడు వీటిని నూనె దీపాల కోసమే నిర్దేశించి వినియోగించుకుని వుండివుంటారని ఊహించడమేమి అంత కష్టం కాదు. హిందువులకు తమ ఆలయాల గోపురాలను దీపాలతో అలంకరించుకునే ఆచారం ఎప్పుడూ ఉంది. నేడు విద్యుత్తుదీపాలతో అలంకరించుకుంటున్నారు, అవి లేని నాడు మట్టికుండలలోని దీపపు కాంతులతో అలంకరించుకునేవారు.   

అంతే కాదు తాజమహలు చుట్టూతా నాలుగు దీపపు స్తంభాలున్నాయని (వాటిని నేడు మినారులుగా పిలుచుకుంటున్నామని) తెలుసుకున్నాము. వాటి నుంచీ కూడా ఎంతో కాంతి వచ్చి నగరమంతా ప్రకాశవంతమైవుంటుంది. ఈ దీపపు స్తంభాల గురించి మరింతగా విశ్లేషణ చేసుకోబోతున్నాము.

"ఆ మందిరం ఎంతో ఎత్తైన గోడలు కలిగి పెద్దపెద్ద ద్వారాలతో రాజసంగా ఉండేది": తాజమహలుకి ఉన్న ద్వారం కూడా ఎంతో పెద్దది. నిజానికి అది ఏ భవనానికీ కూడా తీసిపోదు. దానిలో కూడా అంతస్తులు, ఎన్నో మూసివేయబడ్డ గదులున్నాయని, ముందు అధ్యాయాలలో చదువుకున్నాము. ఇక ప్రహరీ గోడ సంగతికొస్తే, అది ఒక పెద్ద కోటకి కట్టే గోడలాగా ఉంటుంది. అసలు ఈ గోడలను చూసే, చాలా మంది ఇది సమాధి కాదని నిర్ధారించారు. ఇది ఒక రాజభవనమే లేక కోట అనీ, ఈ గోడల పైన నుంచీ యుద్ధాలు చేసేవారని తీర్మానించారు.

తాజమహలు ముఖ్యద్వారం-థామస్ డేనియల్ 1789లో వేసిన చిత్రం

తాజమహలు ముఖ్యద్వారం లోపల

తాజమహలు పశ్చిమ ప్రహరీలోని గదులు వరండాలు(వేదపఠనానికి అధ్యయనానికి అయివుండవచ్చు)

కానీ ఈ వర్ణన చూస్తే, ఆలయప్రహరీగోడలను అలనాడు ఇలా పెద్దగా ఇత్తుగా, లావుగా కట్టుకునేవారని తెలుస్తోంది. అందుకని తాజమహల్ గోడలు కూడా ఒక తాంత్రిక శివాలయము అని నిర్ధారించుకుంటే ఈ గోడలు ఇలా ఇంత పెద్దగా ఎందుకు ఉన్నాయో తెలుస్తుంది.

"ఆ ఆలయనిర్మాణ  కౌశలం అలనాటి ఉత్తమస్థాయికళకు అద్దం పట్టేది": తాజమహల్ నిర్మాణం నిజానికి అలాగే ఉత్తమస్తాయికి చెందినదిగా కనిపిస్తూ, ఈ నాటికి కూడా మనలను ఊరిస్తూ, ఆకర్షిస్తూ, చివరికి ఆ షాజహానుని కూడా ఆకర్షించి, అతనికే బలి అయిపోయి వుండవచ్చు.

ఐతే ఇలా తాజమహలు లాగా కాళిదాసుచే వర్ణింపబడ్డ మహాకాలుని ఆలయం, ఈ రోజు మనకు కనపడే మహాకాలుని ఆలయం కాదు. కాళిదాసుని కాలంలోని భోజుని తరువాత, ఎందరో రాజులు మారినా, ఆ అవంతీరాజ్య ప్రాంతమంతా ఎన్నో శివాలయాలతో నిండినా, ఈ మహాకాలుని  ఆలయమే అన్నిటినీ మించి ప్రకాశించినా,  .... చివరికి 1180లోని మహమ్మదీయుల ఆక్రమణలో, ఈ కాళిదాసు వర్ణించిన మందిరం కూడా కోల్లగొట్టబడి, ధ్వంశంచేయబడింది. కానీ ఆ కాళిదాసు వర్ణనకు సమతూగుతూ, మరొక దక్షిణామూర్తి ఆలయంగా, ఈనాడు తాజమహల్ మనకు కనిపించడం ఒక విశేషం. మహమ్మదీయ ఆక్రమణకు బలి అయిన ఉజ్జయిని మహాకాలుని ఆలయం, మళ్ళీ ఉదయాదిత్యుడు, నరవర్మల కాలంలో పునర్నిర్మించబడిందని, ఒక శిలాశాసనం చెబుతోంది. తరువాత మాల్వా సుల్తాను కూడా ఉజ్జయిని  మహాకాలుని భక్తుడయ్యి, తన రాజ్యం సుభిక్షంగా వుండాలని, అక్కడ పూజలు చేయించుకునేవాడట. అలా ఉజ్జయిని ఆలయం ఊపిరి పోసుకుని మనకు కనపడుతోంది. తరువాతి కాలంలో ఈ ప్రాంతం మరాఠాహిందువుల పాలనలోకి వచ్చినప్పుడు, వీరి దివాను అయిన సుక్తాంకర్ రామచంద్రబాబా ఈ మందిరాన్ని ఎంతో ఖర్చుపెట్టి పునరుద్దరించాడట.

మహాకాళేశ్వరాలయ గర్బగుడి పైకప్పు

మొదటి అధ్యాయంలో తాజమహల్ పైకప్పుల పైన వైదీకయంత్రాల చిత్రాలను చూసాము. ఉజ్జయిని పైకప్పుల మీద కూడా (పైన చూపిన విధంగా) అటువంటివే ఉండటం గమనార్హం. తాజమహల్ గోడలపైన ఖురాను వ్రాతల ఫలకాలు ఉన్నాయని తెలుసుకున్నాము, అంతకుముందు అక్కడ హిందూదేవతల విగ్రహాలో లేక హైందవ వ్రాతలో ఉండివుండవచ్చునని అనుమానించాము. ఉజ్జయినిలో కూడా ఇలా హైందవ వ్రాతలు కలిగిన ఫలకాలు పైన చూపిన విధంగా కనిపిస్తాయి. అంటే తాజమహలులో కనిపించే ఖురానువ్రాతల ఫలకాల స్థానాలలలో, హైందవవ్రాతలు లేక హైందవశిల్పాలు వుండివుండవచ్చు. షాజహాను వాటిని పీకించి, ఖురానువ్రాతల ఫలకాలను అంటించుకుని వుంటాడు.

తాజమహలులో ముంతాజు సమాధి  ఉన్న చోటికి పై నుంచీ ఒక గొలుసు వ్రేలాడుతూ కనిపిస్తుంది. అది పైన చూపిన విధంగా (ఉజ్జయిని ఆలయంలో) శివాభిషేక కలశానికై కట్టిన గొలుసుగా నిర్దేశించబడినదని ఊహించుకోవచ్చు. నేడు సమాధిగా మిగిలిన తాజమహలులో ఆ గొలుసుకి సరైన ప్రణాళికే కనబడదు.

ఉన్న నాలుగు మినార్ల క్రింద ఏనుగుల తలలు. జంతుచిహ్నాలు ఇస్లాంలో నిషిద్ధం.

తాజమహలులో వాడిన మినారులు కూడా జైనుల దీపపు స్తంభాలను పోలి ఉన్నాయని అని ఈ అధ్యాయంలోనే తెలుసుకున్నాము. కానీ తాజమహల్ మినారుల పైన కనబడే ఏనుగు తలలను చూస్తే మాత్రం ఇది హిందూదీపపు స్తంభమే అని తేలుతుంది (జైనులది కాకపోవచ్చు). మినారులపైన ఏనుగు తలలేకాదు, ఏ జంతుచిహ్నాలైనా కూడా అవి ఇస్లాంలో నిషిద్ధమే కనుక, ఇది ఇస్లాం మినారు కాదని చెప్పడం తేలికే. ఏనుగు తల వినాయకుని చిహ్నం కనుక, వీటిని శివాలయ దీపపు స్తంభాలుగా ఊహించుకోవచ్చు. ఐతే హిందువులకు ఈ దీపపు స్తంభాల ఆచారం వుండేదా, అన్న ప్రశ్న మాత్రం ఉదయిస్తుంది. ఆ ఆచారం గురించి గోవాకి వెళ్ళి చూస్తే మన ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ఆ గోవా హైందవ ఆలయాల గురించి, అక్కడ కనబడే దీపపుస్తంభాల గురించి వచ్చే అధ్యాయంలో చర్చించుకుందాం.

ఇలా ఉజ్జయిని ఆలయంతో పోల్చి చూసి, మనకు కనబడిన అంశాలను విశ్లేషిస్తే, తాజమహలు జైన ఆలయం కాదు శివాలయమే అని తేలుతుంది. అంతే కాదు, ముందు అధ్యాయాలలో చెప్పుకున్న గోపుర కలశాన్ని, హైందవ చిహ్నాలను, వాస్తును, గోపురాలను, మినారులను ఒక్కసారి అన్నీ గుర్తు తెచ్చుకుంటే,  తాజమహలు నిండా శివాలయ చిహ్నాలే కనిపిస్తున్నాయి. కనుక ఇది హైందవ ఆలయమే అని నిర్ణయించవచ్చు. కొంత జైన ప్రభావం ఉన్నా, అది శివాలయాని అనుగుణంగానే ఆ ప్రేరణను కూడా స్వీకరించడం జరిగింది అని నిర్థారించవచ్చు. అన్నిటికన్నా ముందుగా ఇది షాజహాన్ కట్టించింది కాదని, ఇందులో మహమ్మదీయ లేక సార్సెనిక్ వాస్తు లేదని తెలుస్తోంది.

ఈ అధ్యాయంలోని విశ్లేషణతో, తాజమహల్ అన్న కట్టడం, ఉజ్జయిని మహాకాలేశ్వరాలయం వంటి ఒక తాంత్రిక దక్షిణామూర్తి ఆలయమేనని తెలుస్తోంది. మరి ఇది శివాలయమే ఐతే, దీని గురించి చరిత్రలోనో లేక కావ్యాలలోనో ఎక్కడో ఒకచోట ఏదో ఒక ప్రస్తావన అయినా వచ్చి ఉండాలి కదా? దాని సంగతిని కూడా వచ్చే అధ్యాయంలో చర్చించుకుని ఈ తాజమహల్ విశ్లేషణని ముగిద్దాం. (సశేషం)

మీ

రావు తల్లాప్రగడ


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech