శీర్షికలు  
     సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 17
 

- రచన : సత్యం మందపాటి

 
 

ఉద్యోగపర్వ
 

అది భూలోకంలో 2112వ సంవత్సరం.


స్వర్గలోకంలో రంభ ఊర్వసులు నృత్యం చేయటం అయాక, ఇంద్రుడి సింహాసనం పక్కకి వచ్చి చెరో పక్కనా నుంచున్నారు.

అప్పుడే "నారాయణ! నారాయణ!" అంటూ వచ్చాడు నారదుడు.
"రా నారదా! రా! ఎప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికే వెడతావు. ఎప్పుడో కానీ నాకు కనపడవు" అంటూ ఆహ్వానించాడు ఇంద్రుడు.

నారదుడు నవ్వుతూ, "అవును మరి! స్వర్గసుఖాలు నీలాటి వారికి కానీ, నాలాటి మునులకు కాదు కదా" అన్నాడు.
“అంతగా ఏంలేదులే ఇప్పుడిక్కడ. ఈమధ్య స్వర్గానికి వచ్చే జనాభా ఎందుకో కానీ తగ్గిపోతున్నారు నారదా! అందుకని కొంతమందిని ఇక్కడ ఉద్యోగాల్లోనించీ తీసివేయాల్సి వస్తోంది” అన్నాడు ఇంద్రుడు.

నారదుడు అటూ ఇటూ పరికించి అన్నాడు “అవును. ఇందాక రాగానే గమనించాను. రంభ ఊర్వసి మాత్రమే కనపడుతున్నారు. మేనక తిలోత్తమలు ఏరీ? ఇక్కడ ఎప్పుడూ కనిపించే మునిపుంగవులు ఏరీ? అసలేం జరిగింది? ఎందుకిలా జరిగింది?”

ఇంద్రుడు నిట్టూర్చి అన్నాడు. “చెప్పానుగా. ఈమధ్య స్వర్గానికి వచ్చేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. 1950-60 ప్రాంతాల్లో భారతదేశ జనాభాలో ప్రతి వెయ్యి మంది మగవారికి, 952 మంది స్త్రీలు వుండేవారు. భారతదేశంలోనే కాక ప్రపంచంలో చాల దేశాల్లో కూడా దాదాపు అదే నిష్పత్తి వుండేది. అప్పటి నించీ దాదాపు 1980 దాకా అటు ఆడపిల్లలు ఇటు మగపిల్లలు పుడుతూ జనాభా బాగా పెరిగింది. అప్పుడు స్వర్గానికీ నరకానికీ కూడా వారివారి కర్మలని బట్టి జనం వస్తుండేవారు. పున్నామనరకం నించీ తప్పించుకుందామని చాలమంది మగపిల్లలే కావాలని కోరుకునేవారు. 1991నాటికి భారతదేశంలో ప్రతి 1000మంది మగవారికి 934మంది ఆడపిల్లలు వుండేవారు. అప్పుడే మొదలయింది, తెలుగువారికి మాకు ఆడపిల్లలు వద్దు అనుకునే తెగులు”

“అదేమిటి? ఒక తల్లికి పుట్టినవారు, ఒక స్త్రీతో జీవితం పంచుకోవలసిన వారు ఆడపిల్లలు వద్దనుకోవట మేమిటి?” అన్నాడు బ్రహ్మచారి నారదుడు ఆశ్చర్యపోతూ.

“అదే కదా నారదా నేను చెప్పేది. సృష్టి గమనాన్ని మార్చివేస్తున్న భారతీయుల మూఢనమ్మకాలు. 2001వ సంవత్సరం వచ్చేసరికి ప్రతి 1000మంది మగవారికి 927మంది అడపిల్లలు మాత్రమే పుట్టారు. తర్వాత 2011వ సంవత్సరం వచ్చేసరికి అది 1000మంది మగవారికి 914 మంది ఆడపిల్లలుగా మారింది”

“అంటే ప్రతి వెయ్యి మంది మగవారిలో 86మందికి పెళ్లి చేసుకోవటానికి ఆడపిల్లలు లేరన్నమాట! అయ్యో పాపం! మరి మిగతా దేశాల సంగతి?” అడిగాడు నారదుడు.

ఇంద్రుడు నవ్వాడు. “మనం హిందూమతం సృష్టించుకున్న దేవుళ్ళం. ఎవరి మతాలకి వాళ్ళు వేరే దేవుళ్ళూ నరకాలూ స్వర్గాలూ సృష్టించుకున్నారు కదా! సెయింట్ పీటర్ మొదలైనవాళ్లు అవి చూసుకుంటారులే మనకెందుకు. మన సంగతి మనం చూసుకుంటే పోలా!” అన్నాడు.

“అవును, పోతుంది! అదీ నిజమే! తర్వాత ఏం జరిగింది” అడిగాడు నారదుడు.

“భార్య కడుపుతో వున్నప్పుడే పుట్టబోయేది అబ్బాయో అమ్మాయో అని తెలుసుకోవటం సాంకేతికంగా సులభమయిపోయింది. అబ్బాయి అయితే కడుపు వుంచుకోవటం, లేదా తెంచుకోవటం”
ఆ మాట వినగానే నారదుడికి బాధ వేసింది. “తెంచుకోవటానికి ఇదేమన్నా గాలిపటానికి కట్టిన దారమా? తల్లినీ పిల్లనీ ప్రేమతో కట్టి వేసిన పేగుల బంధం. మాతృత్వపు తీపి అనుబంధం” అన్నాడు.
ఇంద్రుడు కూడా బాధగా నిట్టూర్చాడు. “ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇలా చేస్తున్నవారిలో బాగా చదువుకున్నవారూ, ధనవంతులూ ఎక్కువయారు. సరేలే! ఇంకావుంది. 2012 నించీ ఇప్పటి దాకా, అంటే 2072వరకూ ఈ సంఖ్య ఇంకా ఎక్కువయిపోయింది. భారతదేశంలో ప్రతి వేయిమంది మగవారికి, రెండు వందల మంది ఆడవారు మాత్రమే వున్నారు” అన్నాడు.

నారదుడు ఆశ్చర్యపోతూ అన్నాడు “మరి సృష్టి ఎలా జరుగుతుంది? బ్రహ్మగారి ఉద్యోగానికి ఏమీ ఇబ్బంది రాదు కదా!”
“ఆమధ్య అంటే పదిహేను సంవత్సరాలయిందనుకుంటాను. ఒక్కొక్క స్త్రీ, అవిడ ఇష్టపడితే ఐదుగురు భర్తల దాకా పెళ్ళాడవచ్చని ‘ద్రౌపది చట్టం’ అని ఒక చట్టం అక్కడి ప్రభుత్వం వారు మొదలుపెట్టారు. కానీ దానికి స్త్రీలెవరూ అంగీకరించలేదు. అలాటి అనాచారం భారతంలో వుందేమో కానీ, భారతదేశంలో వుండటానికి వీల్లేదని సమ్మెలు, ధర్నాలు చేశారు. ఎందుకంటే మొదట్లో కన్యాశుల్కం అనే ఆచారంతో మగవాళ్ళు స్త్రీలను అమ్మకానికి పెట్టి వారి జీవితాలని చిన్నవయసులోనే త్రుంచి పారేసేవారు. క్రమేణా కన్యాశుల్కాలు పోయి కట్నాలు వచ్చాయి. అప్పుడు ఆ పద్ధతి తారుమారయి ఆడవారు మగవారికి పెద్ద పెద్ద మొత్తాల డబ్బు కట్నాల రూపంలో ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సివచ్చింది. అప్పుడు కూడా నష్టపడింది మళ్ళీ స్త్రీనే. మగవాళ్ళు కట్నాల ధరలు పెంచేసి దోచుకోవటం మొదలుపెట్టారు. తర్వాత కట్నాలు పోయి, గిట్నాలు వచ్చాయి” అన్నాడు ఇంద్రుడు.

“గిట్నాలా? అవేమిటి? నేనెప్పుడూ వినలేదే!” అన్నాడు నారదుడు.

“చదువుకున్న మగవాళ్ళు మొదలు పెట్టిన ఇంకొక అత్యాచారం అది. కట్నం తీసుకోవటం లేదని అదేదో త్యాగం చేసినట్టుగా చెప్పుకునేవారు. కానీ ఎంతో ఖరీదైన కల్యాణమండపాల్లో పెళ్లి చేయమనీ, భొజనాలకీ, కార్లకీ, అలంకారాలకీ, లాంఛనాలకీ, పెళ్ళవగానే ప్రేమయాత్రలకీ, తర్వాత పెళ్లికొడుకుకి కారు కొనటానికీ లేదా విదేశాలకి వెళ్ళటానికి ప్రయాణ ఖర్చులకీ... ఇలా అడ పెళ్లివారిని దోపిడీ చేయటమే గిట్నం అంటారు. కట్నానికి కొన్ని రెట్లు ఎక్కువగా వుండేది గిట్నం. అందులోను అమ్మాయి ఉద్యోగం చేసి, అబ్బాయితో సమానంగానో, ఇంకా ఎక్కువగానో సంపాదించాలి కూడానూ. అమెరికా, యూరప్ లాటి విదేశాల్లో పెళ్లి ఖర్చులు రెండు పక్షాల వారు పంచుకుంటారు. కానీ ఇక్కడ గిట్నాలు అన్నీ ఆడ పెళ్ళివారు భరించాల్సిందే” చెప్పటం ఆపాడు ఇంద్రుడు.

“భళి! భళి! అందుకేనన్నమాట స్త్రీలు ఈ ద్రౌపది చట్టాన్ని తిరస్కరించింది. అయితే మరి అంతమంది మగ వారికి, జీవిత భాగస్వాములు ఎలా?”

“మగవారు మగవారినే పెళ్లి చేసుకోవటం మొదలుపెట్టారు. ఇంతకు ముందు జీవశాస్త్ర శారీరక నిర్మాణ కారణంగా కొంతమంది మగవారు మగవారినీ, ఆడవారు ఆడవారినీ కోరుకునేవారు. అలా కాకుండా ఇది వేరే గత్యంతరం లేకపోవటం వల్ల జరుగుతున్న వింత పరిణామం”


“అయితే ఈసారి సృష్టి చేయటానికి అవకాశం లేక బ్రహ్మదేవుడిగారికి ఉద్యోగం పోవటం ఖాయం!” అన్నాడు నారదుడు.

“సృష్టికర్త! ఆయనకి ఉద్యోగం పోవటమేమిటి నారదా! ఉద్యోగాలు పోవటం కాదు. నరకంలో అవిప్పుడు బాగా ఎక్కువయిపోయాయి. ముఖ్యంగా పున్నామనరకంలో. ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ మగవారే అవటం వల్ల వాళ్ళకి మగపిల్లలు, అసలు పిల్లలు, పుట్టే అవకాశమే లేదు. అందుకని దంపతులు ఇద్దరూ పున్నామనరకానికే వస్తున్నారు. నెలనెలా కొన్ని లక్షల మంది ఒక్క పున్నామనరకానికే వస్తున్నారు. నరకంలో వాళ్ళని కనిపెట్టివుండటానికీ, వాళ్ళని నరకబాధ పెట్టటానికీ తగినంత మంది భటులు లేక యమధర్మరాజు నరకయాతన పడుతున్నాడు. స్వర్గంనించీ ఎవరినైనా భటులని నరకానికి బదిలీ చేయటానికి వీలుంటుందా అని రోజూ అడుగుతుంటాడు. నువ్వు చెప్పు నారదా! నరకాన్నించీ స్వర్గానికి బదిలీ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు కానీ, స్వర్గాన్నించీ నరకానికి రావటానికి ఎవరు అంగీకరిస్తారు?” అన్నాడు ఇంద్రుడు.


“లెస్స పలికావు మహేంద్రా! మరిప్పుడు యమధర్మరాజు ఏం చేస్తాడుట? నువ్వేమయినా సహాయం చేస్తున్నావా?” అడిగాడు నారదుడు.

“ఏం చేస్తాడు. కష్టాల్లో వున్నాడు. చిత్రగుప్తుడు నెలనెలా అన్ని లక్షల చిట్టాలు వ్రాయలేక ఉద్యోగం మానేసి, ఇంకేదన్నా స్వంతంగా వ్యాపారం చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. నాకు తెలిసిన పుత్రగుప్తుడిని పున్నామనరకం లో చిట్టాలు వ్రాయటానికి నియమించాం.

ఇప్పటి దాకా తృప్తికరంగానే పని చేస్తున్నాడనుకో. ఒక్క పున్నామనరకం లోనే కాదు, అసలు నరకంలో కూడా ఈమధ్య జనం బాగా వస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు. ఇంతకు ముందు కనీసం కొంతమంది నాయకులైనా స్వర్గానికి వెడుతుండేవాళ్ళు. ఇప్పుడు అందరూ నరకానికి వచ్చేవాళ్ళే. వాళ్లతో ఇంకొక గొడవ వుంది. ఒక్కొక్కళ్ళ దగ్గరా బస్తాలకి బస్తాలు నల్ల డబ్బు, బంగారం, వజ్రాలు రత్నాలు పొదిగిన నగలు, గదలు. అవి కూడా తీసుకు వస్తామంటారు. కట్టుబట్టలు కూడా లేకుండా వచ్చావు కనుక, బస్తాల సంగతి సరేసరి, కట్టుబట్టలు కూడా లేకుండా పొమ్మంటుంది మన మతం. చెప్పినా వినరు. అర్ధం చేసుకోరూ! మా వెనకాల గుండాలున్నారు జాగ్రత్త అంటారు. యమధర్మరాజుకి ఒళ్ళు మండి ప్రతిరోజూ ప్రోద్దున్నా, మధ్యాహ్నం, సాయంత్రం, వాళ్ళనీ వాళ్ల గుండాలనీ, ఒకే భగోణీలో మరగ కాచిన నూనెలో దోరగా వేయిస్తున్నాడు”

నారదుడు నవ్వాడు. “వేగనీ! వేగనీ! బ్రతికున్నప్పుడు ప్రజలని వేపుకు తిన్నారుగా మరి” అన్నాడు.

ఇంద్రుడు చెబుతున్నాడు “ఆమధ్య నరకానికి ఒక వ్యాపారవేత్త వచ్చినప్పుడు చెప్పాడు – పెరుగుతున్న ఉద్యోగాలకి తగిన జనం లేకపోతే బాహ్యోద్యోగాలకి వెళ్ళమని”

ఇంద్రుడు చెప్పింది ఏమీ అర్ధం కాని నారదుడి ముఖంలో ప్రశ్నార్ధకం కనపడింది.

“ప్రాత్యమో, అప్రాత్యమో కానీ ఆ భాషలో దాన్ని ఔట్సోర్సింగో, ఏదో అంటారుష. అది చేయమంటాడు. అంటే మనం చేయాల్సిన పని ఇంకోడు చేస్తే, వాడి చేతిలో తగిన పారితోషకం పడేసి, మనం చేతులు కడిగేసుకోవటం అన్నమాట. నాకూ, యమధర్మరాజుగారికీ ఇద్దరికీ దాని మీద సదభిప్రాయం కలగలేదు”

“అయితే మరి ఏం చేద్దామనుకుంటున్నారు స్వామీ!” అన్నాడు నారదుడు.
“కొంతమంది ప్రభుత్వోద్యోగులు లంచాలు బాగా తిని ప్రజలని దోచుకుని నరకానికి వస్తున్నారులే. వాళ్ళకి ఎలాగూ ఉద్యోగానుభవం వుంది కదా అని, వాళ్ళకి ఉద్యోగాలిస్తానన్నాడు యమధర్మరాజు. నన్ను సలహా అడిగితే, నాకూ అది సబబే అనిపించి, అలాగే చేయమన్నాను. అక్కడా అతను చెయ్యి కాల్చుకున్నాడు”

“అదేమిటి?” అడిగాడు నారదుడు.

“భారతదేశంలో ఒక మంచి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఒకతనికి మిత్రగుప్తుడిగా ఉద్యోగం ఇచ్చాడు. అతను చేయవలసిందేమిటంటే నరకానికి వచ్చిన ప్రతివారి పద్దులోనూ ఎంత చెడు చేశారు, ఎన్ని లంచాలు తిన్నారు, ఎన్ని మోసాలు చేశారు, ఎంత మంది బంధుమిత్రుల్ని చంపారు, ఎన్ని హత్యలు చేశారు... ఇలాటివి లెఖ్కలు వేసి, వాళ్ళని నూనెలో రోజుకి ఎన్నిసార్లు వేయించాలి, ఎన్ని సూదులతో ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గుచ్చాలి, ఎన్ని చోట్ల ఎన్నిసార్లు ఎన్ని వాతలు పెట్టాలి మొదలైన శిక్షలు నిర్ణయించి, అమలు పరచటం. అంతే! పెద్ద కష్టమైన ఉద్యోగమేమీ కాదు” అన్నాడు ఇంద్రుడు.

“అమ్మయ్య! దీనితో నరకంలో ఉద్యోగపర్వం సమాప్తమైవుంటుంది. యమధర్మరాజుగారు, ఉపిరి పీల్చుకుని దున్నపోతు మీద విశ్రాంతిగా వాహ్యాళికి వెళ్లివుంటారు” అన్నాడు నారదుడు.

ఇంద్రుడు దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు “అలా జరిగితే బాగానే వుండేది. కానీ అనుకున్నదొక్కటి, జరిగిన దొక్కటి. మిత్రగుప్తుడు భారతదేశంలోని తన అలవాటు ప్రకారం, తన కాళ్ళు ఒత్తిన వాళ్ళకీ, వీపు గోకిన వాళ్ళకీ తక్కువ శిక్షలు వేయటం, తన మాట వినని వాళ్ళకి రెండు రెట్లు ఎక్కువగా శిక్షించటం లాటివి చేయటం మొదలు పెట్టాడు. మరి ఆ చేతివాటం ఎలా పోతుంది?” అన్నాడు.
ఆ మాటలకి అదిరిపడి నోరు తెరిచిన నారదుడు, నోరు ఇంకా మూసుకోకుండానే “నారాయణ! నారాయణ!” అంటూ వైకుంఠం వేపు బయల్దేరాడు.

 

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech