శీర్షికలు  
 సంగీత సౌరభాలు - 5

 - రచన: సంగీతాచార్య డా|| వైజర్సు బాలసుబ్రహ్మణ్యం

 
 

సద్గురు శ్రీ త్యాగరాజ శిష్య శిరోమణి శ్రీ వాలాజాపేట వేంకటరమణ భాగవతార్ - జీవిత విశేషములు

(క్రితం మాసం తరువాయి భాగం)
 

వివాహం

వీరు తమ జీవితంలో సంగీతానికి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారంటే వివాహము చేసుకోవడానికి కూడా అంగీకరించలేదు. వివాహము చేసుకుంటే గురువుగారికి, సంగీతానికి దూరమవుతాననే భయం వారిలో ఉండేది. అయితే ఈ విషయంలో వీరి తండ్రిగారు త్యాగరాజ స్వామి వారి సహాయం కోరగా గురువు గారి సలహా, ప్రోద్భలములతో చివరికి అంగీకరించారు. తన 41వ యేట ముత్తులక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకుని అయ్యంపేటలో ఉంటుండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు - ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారునికి తన గురువుగారి ఇష్టదైవమైన కృష్ణుని పేరు - కృష్ణస్వామియని, రెండవ కుమారునికి రాముని పేరు - రామస్వామి యని పేట్టారు. వీరి కుమార్తె పేరు తులసి అమ్మాళ్.

వాలాజాపేటలో స్థిరపడడం

వేంకటరమణ భాగవతార్ గారిని కార్వెటినగరం జమీందారు సత్కరించి వారిని అయ్యంపేట నుంచి అప్పుడప్పుడు కార్వెటినగరానికి పిలిపించి సంగీతం నేర్చుకునేవారు. తరచూ ఈవిధంగా వెళ్ళిరావడం ఇబ్బందిగా ఉండడంతో, 1834లో ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని వాలాజాపేట వాస్తవ్యులైన నారాయణస్వామి చెట్టియార్, తహశీల్దారు లక్షణనాయుడు మరియు కంబలి మునుస్వామి చెట్టియార్ అనువారు రావుజీ వీధిలో వీరికి ఒక ఇల్లును కొని ఇచ్చారు. కాలగమనంలో ఈ వీధికి వేంకటరమణ భాగవతార్ అని పేరు వచ్చింది. వాలాజాపేటలో వీరు స్థిరపడిన తరువాత నుండి వీరు వాలాజాపేట వేంకటరమణ భాగవతార్ గా పేరుగాంచారు.

వాలాజాపేటకు వచ్చిన తరువాత, వీరు తన శిష్యుడైన వేంకటసూరికి ఒక నరసింహస్వామి విగ్రహాన్ని బహుకరించారట. అది చూసి వేంకటసూరిగారు ఆశువుగా శ్రీ నరహరి దరిసెన కరిసె అనుకృతిని పాడారట. వేంకటసూరి గారు రామ నాటకం అనే గేయనాటకాన్ని కూడా వ్రాసారని తెలుస్తోంది.
వేంకటరమణగారు వాలాజాపేటలో స్థిరపడినప్పటికీ గురువుగారితో సత్సంబంధాలు కలిగి వుండేవారు. త్యాగరాజస్వామి వారి కుమార్తె వివాహ సందర్భములో శిష్యులైన వేంకటరమణ భాగవతార్ బహుకరించిన కోదండరామస్వామి చిత్రపటమును చూసి ఆనందోత్సాహముతో ననుపాలింప నడచివచ్చితివో అను కృతిని మోహన రాగములో త్యాగరాజస్వామివారు ఆశువుగా పాడారని తెలుస్తోంది. ఈచిత్రపటాన్ని వేసినది వేంకటరమణ భాగవతార్ శిష్యులైన పల్లవి ఎల్లయ్యర్.

ఒకసారి వేంకటరమణ గారు త్యాగరాజస్వామి వారిని వాలాజాపేటలోని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించగా, త్యాగరాజస్వామి తన శిష్యుని కోరిక మేరకు 12 రోజులు వీరింట్లో ఉన్నారట. ఈ 12 రోజులూ భజన గోష్ఠులతో, సంగీతంతో,సత్కాలక్షేపము జరిగినదట. చివరిరోజున త్యాగరాజస్వామి వారిని ఊరేగింపుగా తీసుకువచ్చిన సందర్భములో వేంకటరమణ శిష్యుడైన మైసూరు సదాశివరావు త్యాగరాజు వెడలిన అను కృతిని తోడి రాగంలో రచించి పాడారట.

త్యాగరాజ గారు వాలాజాపేట నుండి తమ ఇంటికి బయలుదేరుతుండగా, వేంకటరమణ గారు తన తనయుడైన కృష్ణస్వామిని కూడా వారి శిష్యునిగ స్వీకరించమని అడగగా, వారు వెంటనే ఒప్పుకున్నారట. ఈ విధముగా కృష్ణస్వామి భాగవతారు గారు కూడ త్యాగరాజస్వామి వారి శిష్యులైనారు.
కృష్ణస్వామి గారు త్యాగరాజు గారి వద్ద మూడు సంవత్సరముల పాటు సంగీతభ్యాసము కొనసాగించిన తరువాత త్యాగరాజ స్వామివారు సిద్ది పొందారని తెలియవస్తోంది.

గురు భక్తి - సంగీత సేవ

వేంకటరమణ భాగవతారు గారు చేసిన ఎనలేని సంగీతసేవకు వారికి లభించిన ప్రశంస, గుర్తింపు చాలా తక్కువగానే కనిపిస్తున్నది. వీరు ఎంతో గొప్ప విద్వాంసులే కాక కవి, గాయకుడు, వాగ్గేయకారుడు మరియు రచయిత. అన్నింటినీ మించి ఆదర్శవంతమైన శిష్యుడు. వీరికి గురువును మించిన దైవం కానీ, గురువుగారి రచనలను ప్రాచుర్యంలోకి తేవడం కన్నా మరొక జీవితాశయము కానీ లేదు.

వాలాజాపేటలోని వీరినివాసములో ఒక భాగమును వీరు భజన మందిరముగా వినియోగించారు. ఈ మందిరములో త్యాగరాజ స్వామివారి చిత్రపటమును పెట్టి, నాదయోగియైన గురుస్వాములవారు తమ ఇంట చిత్రపట రూపములో కొలువై యున్నారని ఏ కళా కలితుండు అను సీస పద్యము పాడుట ద్వారా తెలియపరచారని తెలుస్తోంది.


వీరు వ్రాసిన గురుస్తోత్ర అష్టకములో తమ గురువుగారైన త్యాగరాజును వేదముల పరిశీలన, అద్యనములలో వ్యాసునితో, సముచితమైన, అందమైన పదముల వాడుకలో వాల్మీకితో, విషయ పరిత్యాగమునందు శకునితో, భక్తి తత్త్వమునకు ప్రహ్లాదునితో, సాహిత్యమున బ్రహ్మతో, సంగీతమున నారదునితో, రామనామ రసపానములో శివునితో సరిపోల్చారు.వీరు తమ గురువును గురుస్వాములవారు అని తాము వ్రాసిన రచనలలో సంభోధించారు.

వేంకటరమణ గారికి గురువుగారంటే ఉండే అమితమైన భక్తి వలన ఈక్రింది సంస్కృత, తెలుగు రచనలు చేశారు. వీటిలో వారి జీవిత విశేషములు మరియు దైవత్వము తెలిపే ఎన్నో విషయములు పొందుపరబడి ఉన్నవి.

1. శ్రీ గురు అష్టకం - సంస్కృతం (ధ్యాన శ్లోకము)
2. శ్రీ గురు మంగళాష్టకం - సంస్కృతం
3. ఆది గురు అష్టోత్తర స్తోత్ర పంచాంగం - తెలుగు
4. శ్రీ కాకర్లాన్వయ రత్నసార - మణిప్రవాళ వచన కవిత్వం ( తెలుగు, సంస్కృతం, సౌరాష్ట్రం)
5. గురుచరణం భజరే - శంకరాభరణం రాగం - ఆదితాళం - కృతి (సంస్కృతం)
6. గురువరు మహిమల - ఆనందభైరవి రాగం - ఆదితాళం - కృతి (తెలుగు)
7. వద రసనే - పూర్వికళ్యాణి రాగం - ఆదితాళం - కృతి (సంస్కృతం)
8. శ్రీ రామబ్రహ్మము - బేగడ రాగం - ఆదితాళం - కృతి (తెలుగు)
( శ్రీ త్యాగరాజు గారి తండ్రిని స్తుతిస్తూ చేసిన రచన)

వీరు త్యాగరాజుని పై చేసిన గురువరు మహిమల అనే ఆనందభైరవిరాగ కృతిలో గురుస్వామి వారు ఒకనాటి రాత్రి తనకు కలలో కనిపించి విష్ణువును స్తుతిస్తూ రచనలు చేతనన్నారని చెప్పారు.

త్యాగరాజ స్వామి వారి రచనా శైలిని బాగా ఆకలింపు చేసుకుని వీరు కూడా గురువుగారి వలె అనేక సంగీత రచనలు చేసి గొప్ప వాగ్గేయకారులుగా ప్రఖ్యాతి గాంచారు. వేంకటరమణ భాగవతారు గారికి సంస్కృతాంధ్రములలో గల పాండిత్యము మరియు త్యాగరాజస్వామి వారు ఎక్కువగా రచనలు చేసిన కాలములో వారితోగల సాన్నిహిత్యము వలన వేంకటరమణ భాగవతారు గారి పలు విధములైన రచనలు కూడా ఎంతో గొప్పగానుండి వీరిని ఉత్తమ వాగ్గేయకారునిగా నిలబెట్టినవి.


వేంకటరమణగారు సుమారు 30 సంవత్సరములు గురువుగారి వద్ద ఉండిపోవడం వలన గురువుగారి జీవిత విశేషములన్నీ తెలిసియుండి, ఈ వివరములన్నిటినీ చేర్చి త్యాగరాజస్వామివారి జీవితచరిత్రను కూడా వ్రాసారు. త్యాగరాజస్వామి కృతులు ప్రచారం చేయడానికి కూడా ముఖ్య కారకులు శ్రీ వాలాజా పేట వేంకటరమణ భాగవతారు. తన శిష్యులైన అనేకమంది ద్వారా వీరు ఈ కృతులను ప్రచారం చేసారు.

వీరి కుమారులు, శిష్యులైన కృష్ణస్వామి భాగవతారు కూడా త్యాగరాజస్వామి వారి శిష్యరికం చేసారు. వీరు కూడా త్యాగరాజస్వామి వారి జీవిత విశేషాలను, రచనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్రను పోషించారు. వీరు సుమారు 800 త్యాగరాజ కృతులకు స్వరలిపి వ్రాశారని తెలుస్తోంది.

వేంకటరమణ గారి మనుమడు శ్రీ కె.కె. రామస్వామి భాగవతార్ కూడ వీరి ఆశయములను అత్యంత శ్రద్ధాభక్తులతో పుణికి పుచ్చుకొని, తమవంతు సేవలనందించారు. వీరు భద్రపరిచిన వ్రాతప్రతుల ఆధారంగానే త్యాగరాజస్వామి వారు 3గేయనాటకములు (ప్రహ్లాద భక్తి విజయము, నౌకా చరిత్రము,సీతారామ విజయము) వ్రాసినట్లుగా తెలియుచున్నది.

తండ్రీ-తనయులిద్దరూ కూడా వ్రాసిన త్యాగరాజస్వామి వారి జీవిత చరిత్ర సమకాలీన విలువలు కలిగి ఉన్నవి. అయితే,వేంకటరమణ భాగవతార్ తాళపత్రముపై వ్రాసిన చరిత్రలో త్యాగరాజు గారి ద్వితీయ వివాహానంతరము జరిగిన విశేషములు వ్రాయబడలేదు1. కానీ వీరి తనయుడు కృష్ణస్వామి భాగవతారు కాగితపు పుస్తకములో వ్రాసిన జీవిత చరిత్ర సంపూర్ణముగా నున్నది.

వేంకటరమణగారి దస్తూరి చాలా అందంగా ఉండేదని తెలుస్తోంది. దీనికి తార్కాణం వీరు స్వదస్తూరితో వ్రాసి గురువుగారి షష్టిపూర్తి మహొత్సవంలో వారికి బహుకరించిన పోతన తెలుగు భాగవతము. ఈ తాళ పత్ర గ్రంధములన్నీ ఇప్పటికీ మదురై సౌరాష్ర్ట సభ తాళపత్ర గ్రంధాలయమునందు భద్రపరచబడి ఉన్నవి. ఈవాలాజా పేటా సంగీత తాళపత్ర గ్రంధములు, ఇప్పటి వరకు గల వ్యక్తిగతమైన సేకరణలలోకెల్ల అత్యధికమైనవని" ప్రొ ఫెసరు సాంబమూర్తిగారు పేర్కొన్నారు. ఈ సేకరణలో వేంకటరమణగారు త్యాగరాజు గారి నుండి పొందిన తాళాపత్రములు కూడా చేర్చబడియున్నవి.

ఈ వాలాజా పేట శిష్యపరంపరకే చెందిన శ్రీ నాగస్వామి భాగవతారు అనే విద్వాంసుడు ఎన్నో అపూర్వమైన త్యాగరాజ కీర్తనలను గానం చేయగా విన్నానని శ్రీ మదురై మణి అయ్యరు గారు ఒక ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారని తెలుస్తోంది. అయ్యంపేట వాసి, విద్వాంసులైన శ్రీ అతియ రామస్వామి భాగవతార్ గారి శిష్య పరంపరకు చెందినవారు.

వేంకటరమణ గారి మనుమడు శ్రీ కె.కె. రామస్వామి భాగవతార్ గారు 1935లో శ్రీ త్యాగబ్రహ్మ ఉపనిషత్ (దీనికే సంగీత రహస్య సిద్దాంత సూర్యోదయం అని కూడా పేరు కలదు) అను గ్రంధము వ్రాసారు. ఇందులో మహా విద్వాంసులైన వీరి తాతగారి జీవితచరిత్రను కూడా వ్రాసారు. ఇదియే నేడు వేంకటరమణ గారి జీవిత విశేషములు మనము తెలుసుకొనుటకు ముఖ్యమైన ఆధార గ్రంధము.


వేంకటరమణ గారు త్యాగరాజస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రులైన శిష్యులు. త్యాగరాజు గారు తాను ఎప్పుడు సిద్ది పొందుతారో తెలిసి, ఆ విషయమును వారు ముందుగానే శిష్యులకు తెలియచేశారట. అయితే త్యాగరాజు గారు తనువు చాలించిన పుష్య బహుళ పంచమి రోజున వేంకటరమణ భాగవతార్ గారు వేరే ఊరిలో ఉండడం వలన వారికి ఈ విషయం తెలియదు. కాని ఆ రోజున వారు వేంకటరమణ భాగవతార్ గారికి కలలో కనిపించి, "నేను ఈ రోజు మరణించిననూ ఈ ఏకాదశి వరకు కంచి,తిరుపతి, శ్రీరంగం మొదలగు పవిత్ర స్థలములలో విహరించుచుందును.ఏకాదశి నాటికి వైకుంఠమునకు చేరుదును" అనిచెప్పారట. అందువలననే వాలాజా పేట వారి సాంప్రదాయమువారు త్యాగరాజు గారి వర్థంతిని పుష్య బహుళ పంచమి నాడు కాక, పుష్య బహుళ ఏకాదశి నాడు జరుపుతారు.

త్యాగరాజస్వామి వారు సిద్ది పొందిన తరువాత వారి తంబుర, శ్రీరామ పాదుకలు, పూజాసామాగ్రి, పారాయణ గ్రంధములు మొదలగునవి వేంకటరమణ భాగవతారు గారికే అప్పగించునట్లు ఏర్పాటు చేసిరి. దీనినిబట్టి వేంకటరమణ భాగవతార్ త్యాగరాజస్వామి వారికి ఎంత ఆతరంగిక శిష్యులో అర్థమవుతుంది. వేంకటరమణ గారికి త్యాగరాజస్వామి వారి నుండి లభించిన ఈ వస్తుసామాగ్రి అంతా నేటికీ మదురై సౌరాష్ట్ర సభయందు భద్రపరచబడి ఉన్నవి.

శిష్యవర్గం

వేంకటరమణ భాగవతారు గారి శిష్యులలో ప్రముఖులు:

1.మైసూరు సదాశివరావు - లక్ష్య-లక్షణ విద్వాంసులు మరియు వాగ్గేయకారులు

2.పల్లవి ఎల్లయ్యర్ - కోదండారాముని చిత్రపటమును గీసిన కళాకారులు

3.మునుస్వామి అప్ప - బెంగుళూరు నాగరత్నమ్మ గారి గురువుగారు

4.లోకనారాయణ శాస్త్రులు - త్యాగరాజ విరచిత సీతారామ విజయం అచ్చు వేయించినవారు (గ్రంధము అలభ్యము)

5.కవి వేంకట సూరి - రామనాటకం అనే గేయనాటకం వ్రాసివారు

6.అరుణాచల ఆచారి - కాంచీపురమునకు చెందిన విద్వాసులు

7.తిరువత్తియూర్ ఎస్. ఎ. రామస్వామి అయ్యర్ - త్యాగరాజ కీర్తనలు మొదటగా ప్రచురించిన కళాకారులు

నిర్యాణం

వేంకటరమణ భాగవతారు గారు భావ నామసంవత్సర మార్గశిర శుద్ద సప్తమి, మంగళవారము, అనగా 15-12-1874 నాడు తమ 93వ సంవత్సరములో ముక్తిని పొందారు వీరు వ్రాసిన తాళపత్రములు, పూజించిన రాముని విగ్రహము, ఉపయోగించిన పూజాసామాగ్రి, పాదుకలు మరియు తంబుర మొదలగునవన్నీ వీరి గురువు గారైన త్యాగరాజస్వామి వారి వస్తు సామాగ్రితోపాటు మదురై సౌరాష్ట్ర సభలో భద్రపరచబడి ఉన్నవి.

ఆరాధన

వేంకటరమణ గారి జయంతి ఉత్సవాలు ఇప్పటికీ అయ్యంపేటలో ప్రతి సంవత్సరం సౌరాష్ట్రులచే ఘనంగా జరుపబడుతుంటాయి. త్యాగరాజు గారి ముఖ్య శిష్యులే కాక గొప్ప పండితులు, విద్వాంసులు మరియు వాగ్గేయకారులు అయిన వాలాజా పేట వేంకటరమణ భాగవతారు గారి సంస్మరణార్థం ఈ ఉత్సవం జరపడం వీరికి ఇచ్చే ఎంతో సముచితమైన గౌరవం. ఈ ఉత్సవాలలో అనేకమంది వేంకటరమణ గారి ప్రశిష్యులు, సంగీతాభిమానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారిని ఆరాధించి, తమ శ్రద్దాంజలిని సమర్పిస్తుంటారు.

ఇప్పటికీ అయ్యంపేటలోని ఎంతో మంది సౌరాష్ట్రుల కుటుంబాలలో వేంకటరమణ భాగవతార్ విరచిత కృతులను తమ నిత్య పూజా విధులలో పాడుకొంటూ ఉటారని తెలుస్తోంది. ఉదా: నీవే నన్ను (దర్బారు), రామా రవికుల సోమ (కేదారగౌళ), భజ శ్రీరామ (కాంభోజి),కుచేల పరిపాల (శంకరాభరణం), పరవశమాయెనురా (నాదనామక్రియ), రామచంద్ర నన్ను (ఆనందభైరవి) మొదలగునవి.

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech