శీర్షికలు  
     శ్రీ శనీశ్వర శతకం-7
 

- రచన : అక్కిరాజు సుందర రామకృష్ణ

 


జీవుడు పెద్ద దొంగ; మరి చెప్పడు పెట్టడు వాడదేమిటో
ఏ విధి నెన్ని నాళ్ళు ధర నెవ్వరి నేగతి టింగురంగడౌ
పూ విలు కానిరీతి కడు పొల్పుగ వెల్గగ జేయ జాలునో;
చావగ గొట్టునో తెలియ శక్యము గాదుర - శ్రీ శనీశ్వరా! 51

కాయము నాదియంచు అధికారము శాశ్వతమంచు, పైకి కం
దోయికి కాన వచ్చు నవ తోయజనేత్రల దృగ్విలాసపున్
మాయ నిజంబటంచు తన మానస మందున నెంచుచుండురా
ధీ యుతుడయ్యు మానవు;డి దెక్కడి చోద్యమొ? - శ్రీ శనీశ్వరా! - 52

దంతము లూడి సాంతముగ దౌడలు చిత్ర విచిత్ర మౌగతిన్
వింతగ గాక ముందె; తన పిల్లలె మాసము కొక్క యింటిలో
వంతుల వారి చూచుకొను భాగ్యము గల్గక ముందె దేవ; నా
తంతు ముగింప వేడెదను; తప్పును బట్టకు - శ్రీ శనీశ్వరా! - 53

అంతయు దేవరా! కనెడి దంతయు మాయెయె; సృష్టియంతయున్
భ్రాంతి యటన్న అక్కజపు పచ్చి నిజంబు నెరింగి గూడ, పల్
చింతల మన్గుచుండటలు జీవుని లక్షణ మిద్ది చూడగన్
వింతగు జీవి మానవుడె విశ్వము నందున - శ్రీ శనీశ్వరా! - 54

మా‘ఫి’ని జేయుమో రవి కుమారక తొల్లిటి నాదు పాపముల్
‘సాఫి’ గ నా ముగింపు భువి సల్పుము! వద్దుర ‘అంబులెన్సు’లున్
‘ట్రాఫికు’ జాము లొల్లి; గృహలక్ష్మి కి కన్ను ‘సు’ పుత్రకాళికిన్
ఏ ‘ఫిక’ రీ యకే నను యధేచ్ఛగా పంపర - శ్రీ శనీశ్వరా! - 55

ఆరయ మానవుండు అసహాయపు శూరుడు వీరుడైననున్
మీరిన క్రౌర్యమున్ బరగి మేదినిపై తుద కక్కటక్కటా
దారుణ మౌగతిన్ కరము దైన్యము నందుట కాంచుచుంటి నో
‘సౌరి’ - పరాకు లేక నను చల్లగ సాకర - శ్రీ శనీశ్వరా! - 56

ఆ సకలేశు సత్కృపను హాయిగ జీవిత మిద్దినాకు - ఆ
యాసము సుంత లేక అలరారుచు నుండెను నేటికిన్ - దుర
భ్యాసము లెవ్వి లేని సుకృతాత్ముడ - దైన్యమెరుంగ - నాకనా
యాసపు మృత్యువిమ్ము తుద కయ్యది చాలుర - శ్రీ శనీశ్వరా! - 57

ఆస్తులు పాస్తులున్ పసిడి హారము లయ్యని నాకు వద్దు; ముం
దస్తుగ మేని చాటున సదా వెలుగందెడు ఆస్థి పేటికిన్
స్వస్తిని గూర్చి ప్రోవు మిదె చాలుర నాకిపుడీ వయస్సునన్;
నిస్తుల భక్తునన్ను కరుణింపుము దేవర! శ్రీ శనీశ్వరా! - 58

రాసులు గాగ విత్తములు రావలె కావలె నన్నగొప్ప పే
రాసలు లేవు; తృప్తి నలరారెడి జీవిని; జీవితాన, నే
రోసితి తుఛ్చ శీలురగు ‘లోఫరు’ గాండ్ర దురాగతాలతో!
గాసిలి పెట్టకింక నను గావర దేవర! శ్రీ శనీశ్వరా! - 59

సిరులవి ఎక్కువైన కడు చిత్రము లౌగతి నన్నదమ్ములన్
హరిసతి లక్ష్మి సాక్షి పలు హత్యలు కుట్రలు వృద్ధి యౌటలీ
ధర పయి చూచుచుంటి మిగదయ్య ‘మహాజను’ లైన వారి వౌ
సురుచిర గాథలన్ - సిరు లసూయలు పెంచుర - శ్రీ శనీశ్వరా! - 60
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech