సారస్వతం  
 సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (12వ భాగం)
 

- రచన : " విద్వాన్" తిరుమల పెద్దింటి  నరసింహాచార్యులు. M.A.,M.Phil

 

 

17.  కాక తాళీయ న్యాయం:---

 

 కాక=కాకి. తాళ=అనగా తాటిపండు.ఒక కాకి వచ్చి బాగా పండిన తాటి పండు మీద వాలింది,ఆ పండు క్రింద పడింది.దీనినే కాకాగమన తాళ పతనం.అంటారు.అనగా కాకి రావడం,పండు పడటం అని భావం. ఇలా అనుకోకుండా ఒక పని జరిగితే దానిని “కాకతాళీయంగా”జరిగింది అని తెలుగులో వాడుక వుంది.ఈ న్యాయాన్ని మనం రెండు విధాలుగా చెప్ప వచ్చు. ఆకలితో తాటిచెట్టు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి తాటిపండు లభిస్తే బాగుంటుంది అనుకొన్నాడు.అప్పుడే కాకి వచ్చి పండుమీద వాలడం,పండు క్రింద పడటందానిని తీసుకొని, అతడు ఆనందించడం జరిగింది.ఇదే కాకతాళీయ న్యాయం.దీనినే వేరోకవిధంగా చూద్దాం. తాటి చెట్టుకింద నిలబడిన వాడి తలమీద ఆ పండు పడితే దురదృష్టం గా చెప్పవచ్చు.దీనిని ఒక సుభాషితం ద్వారా వివరంగా తెలుసు కొందాం.ఈ పద్యం అందరికి బాగా తెలిసినదే—

“ధర ఖర్వటుడొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై
త్వర తోడన్ పరువెత్తి చేరి నిలచెన్ తాళద్రుమచ్చాయ త
చ్చిరమున్ తత్పల పాత వేగ మున విచ్చెన్ శబ్ద యోగంబుగాన్
పొరి దైవోపహతుండు పోవు కడకున్ పోవున్గదా యాపదల్”

“ఒక బట్ట తలవాడు ఎండలో నడచి వెళ్తున్నాడు.వేడికి తల, కాళ్ళు కాలి పోతుంటే దగ్గరలో నున్న,తాటి చెట్టు మొదట్లో కొంచం నీడ ఉంటె వెళ్లి నిలుచున్నాడు.అప్పుడే కాకి వచ్చి తాటి పండు మీద వాలటం,ఆ పండు ఆ బాటసారి బట్ట తల మీద పడటం, తల పగిలి మరణించటం చూస్తే దైవంచే విడువ బడి నవాడు ఎక్కడకి వెళ్ళిన ఆపదలు వాడి వెంటే వెళ్తాయి”అని పై పద్య భావం.కాకి రావటం,పండు పడటం,తల పగలటం అన్ని అనుకోకుండా జరిగినవే.ఇది “కాక తాళీయ న్యాయానికి”చక్కని ఉదాహరణగా చెప్ప వచ్చు. ఈ న్యాయంలో కాకి,తాటిచెట్టు ఉన్నాయి కనుక వాటి విశేషాలతో ఈ న్యాయాన్ని వివరిస్తాను.

“ఇదం అంధ తమం కృత్స్నం జాయతే భువనత్రయం /యది శబ్దాన్వయం జ్యోతిరాసంసారం ప్రదీప్యాతే.” అనగా శబ్దమనే జ్యోతి లేకుంటే మూడులోకాలు అంధకారంలో ఉండేవి అని లాక్షణికుల మతం.నిజమే అక్షరాలు లేకుంటే మన మనుగడే ప్రస్నార్ధకంగా మారేది. ప్రాచీన వారసత్వ సంపద ఐన వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు,కావ్యాలు,నాటకాలు,ప్రబంధాలు వంటివి మనకి లభించడానికి కారణమైనవి తాళ పత్ర గ్రంధాలు.అంటే తాటాకులు కదా!

తాటి కమ్మలనుండి తాటాకులు జాగర్తగా తీసి,వాటిని కొన్ని తైలాలు,లేదా పేడ (గోమయం)కలిపిన గోరు వెచ్చని నీటిలో నాన బెట్టి,తరువాత నీడలో ఆరబెట్టి,ఆరిన తరువాత, చుట్టలుగాచుట్టి దాచుకొనేవారు.వాటకి “అలేఖ్యములు”అనిపేరు. అవసరమైనపుడు వాటిని విప్పి,జాగర్తగా సాపుచేసి, బొత్తిగా చేసికొని పొత్తము (మనం అనే పుస్తకము)గా అయాక, దానిపై గంటము అనేసాధనతో లిఖించేవారు. కనుక మన ప్రాచీన సంపదకి మూలం తాళ వృక్షం (తాటిచెట్టు)అనుటలో అతిశయోక్తి లేదు కదా. అట్లే వివాహ కార్యక్రమంలో ముఖ్యమైనది “తాళిబొట్టు.”పూర్వం దానినికుడా తాటియాకుతోనే తయారు చేసేవారుట,అందుకే దానికి “తాళిబొట్టు” అని పేరు వచ్చింది.అలాగే స్త్రీలు ధరించే చెవి కమ్మలు కూడా తాటి అకుతోచేసేవారు.తాటిమట్టలకి,తాటి కమ్మ అనివ్యవహారం.ఇంటిని కమ్మలతోనేసేవారు కనుక కమ్మలిల్లు అని పేరు.ఇలా తాటిచెట్టు ప్రాచీనుల జీవితాలలో ఒకభాగమై పోయింది.”పరోపకారాయ ఫలంతి వృక్షాః”అన్నసుభాషితానికి తాళ వృక్షం నిదర్శనం.”

ఇక కాకః=అంటే కాకి.దీనినిగూర్చిరామాయణంలో ఉన్న కాకాసుర వృత్తాంతాన్ని ఉదహరిస్తాను.”అరణ్యవాసంలో ఒక చోట రాముడు సీతాదేవి తొడపై తలపెట్టుకొని నిద్రిస్తుండగా ,ఒక కాకి సీతమ్మ వక్షాన్నిపండుఅనుకొని ముక్కుతోపోడవడం,ఆ తల్లి బాధపడటం,రాముడు కాకిపై కోపంతో దర్భను మంత్రించి, బ్రహ్మాస్త్రంగా వదలటం,ఆ కాకి ముల్లోకాలు తిరిగి, ఎవరు కాపాడాలేకుంటే, తిరిగి రాముడినే శరణు వేడటం, ఒక కన్నునిపోగొట్టి రాముడు కాపాడటం.అనేకథ అందరికి తెలిసిందే.

కాని ఈ కథ మన న్యాయం ప్రకారం “కాకతాళీయంగా”జరుగలేదు.రామాయణ రహస్యాలలో ఇదిఒకటి(కాకి కథ) అనిపెద్దలు చెపుతారు.అది ఎలాగో చూద్దాం. రావణ వధకి దేవతలుఒక ప్రణాళిక సిద్ధం చేసారు.తత్ఫలితమే దేవతలు వానరులుగా,శ్రీహరి నాలుగు అంశలతోనలుగురిగా,శివుడు తన అంశతో హనుమగా అవతరించడం జరిగింది.ఇంకా మంధర కైకని ప్రేరేపించడం,కైక వరాలడగడం,రాముడు అరణ్యాలకి వెళ్లడం.అనేవి జరిగాయి. కాని అరణ్యంలో కూడా సీతారాములు హాయిగా,ప్రేమానురాగాలతో విహరిస్తూఉంటే, రావణ వధ ఎలాజరుగుతుంది.”స్మిత పూర్వభాషి,పుంసాంమోహన రూపుడు,శాంత గంభీర వదనుడు.” అయిన రామునికి కోపం రావాలి.అంటే రాముని ప్రాణమైన సీతకి కష్టం కలగాలి,అలా సీతకి కష్టం కలిగితే రాముడికి కోపం వస్తుందో,రాదో తెలుసుకోడానికే ఈ కాకాసుర వృత్తాంతం దేవతలచే కల్పించబడింది. కాకి చేసిన చిన్న తప్పుకే బ్రహ్మాస్త్ర్రాన్ని ప్రయోగించేంత కోపం రామునికి వచ్చింది కనుక,సీతని అపహరిస్తే రావణవధ తప్పక జరుగుతుంది.అని దేవతలకి నమ్మకం కలిగింది. మామూలు అల్ప ప్రాణి ఐన కాకి ఇలా చేయగలదా! అందుకే ఇంద్రకుమారుణ్ణి కాకిగా పంపుతారు దేవతలు. ఇంకా రాముడు మాటిమాటికి “ఆత్మానం మానుషం మన్యే” నేను మామూలు మనిషిని,అని పదేపదే చెప్పడానికి కారణం దేవతలచేతకాని,దేవతాంశలచేతగాని రావణునుకి మరణంలేదు.నార,వానరులచేత మాత్రమే,సంహరింపబడతాడు.అది అసలురహస్యం.రాముని కార్యంలో పక్షిజాతికుడా సహకరించింది అనడానికి “కాకాసురుడు,జటాయువు,సంపాతి”వృత్తాంతాలని ఉదాహరణగా చెప్పవచ్చు.ఇలా ఎప్పుడో చెప్పాలనుకొన్న ఈ కథని” కాకతాళీయంగా” పై న్యాయానికి వివరణగా ఇప్పుడు ఉదాహరించేను.

(వచ్చేనెల ఇంకోన్యాయం.)
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech