సారస్వతం  
              శకుంతల (పద్యకావ్యం) - 4

రచన :  డా.అయాచితం నటేశ్వర శర్మ

 

పిదప పలికెను సాధుహృద్వేద్య! నాకు 
తగును మునివాటికల రక్ష ధర్మ మదియ
గాన మీ శాసనమ్మును గౌరవింతు 
మృగవధంబును మానుచు ఋషివరేణ్య!                    16

వ్యాఖ్యానం
దుష్యంతుడు వైఖానస మునికి నమస్కారం చేసి ఇలా అన్నాడు- `సాధుజీవుల మనస్సులను తెలిసిన ఓ మునివరేణ్యా! నాకు మునివనాలను రక్షించడమే ధర్మం. కనుక మీ ఆజ్ఞను శిరసావహించి ఈ లేడిపిల్లను వేటాడే పనిని మాని వేస్తున్నాను.

వెండి వైఖానసుండనె విజ్ఞచరిత!
తగును నీకిటు పురువంశతనయ! శమత
నీ సమానుని తనయుని నిఖిలలోక
చక్రవర్తిని పొందుము సమయమందు.                        17

వ్యాఖ్యానం 
దుష్యంతుడు అలా మాట్లాడగానే వైఖానసుడు -`విజ్ఞతతో కూడిన శీలాన్ని కలిగిన ఓ రాజా! ఉన్నతమైన పూరు వంశంలో పుట్టిన నీవు ఇలా శమస్వభావాన్ని అలవరచుకోవడం ఉచితమైనదే. కనుక మా విన్నపాన్ని మన్నించిన నీకు మంచి జరుగుతుంది.నీవు అచిరకాలంలోనే నీతో సమానుడై,నిఖిల లోకాన్ని పరిపాలించగల చక్రవర్తి కాబోయే పుత్రుణ్ణి నీవు తప్పక పొందుతావు ' అని దీవించాడు.

ఇట్లు పలికిన మునిపల్కు నీశవరము 
పోల్కి భావించి ముదమున పోవుచుండ 
నిలువరించుచు పల్కె నా నియమవిదుడు 
గురుత రాజర్షి జూచుచు పరమభక్తి.                18

వ్యాఖ్యానం
వైఖానస ముని అలా తనను అభినందించి ఆశీర్వదించి పుత్రప్రాప్తి రూపమైన వరాన్ని ప్రసాదించగానే ఆ రాజు ఎంతో సంతోషించి ఆ ముని పల్కులు ఈశ్వరుని వాక్కులుగా భావించి అక్కడినుండి బయలుదేరబోయాడు. ఇంతలో ఆ వైఖానస ముని ఆ రాజును నిలువరించి ఎంతోఅ గౌరవంతో ఇలా అన్నాడు-

జనతను ధర్మమార్గమున చల్లని చూపుల జూచువాడ! మా 
యునికి సమీపమందు పదమూనితివీవు విశేషరీతి మా
వినతిని గౌరవించి వెనువెంటనె కణ్వనివాసమైన ఈ 
మునివనవాటికన్ పదము బూనుము చూడగ మౌనికర్మలన్.                19

వ్యాఖ్యానం
ప్రజలను ధర్మమార్గంలో నడుపుతూ చల్లగా కాపాడుతున్న ఓ రాజా! మా నివాసమైన ఈ మునివనానికి సమీపంలో నీవు సంచరిస్తున్నావు. నీవు విశిష్టుడవైన అతిథివి. కనుక మా విజ్ఞప్తిని మన్నించి నీవు వెంటనే ఈ కణ్వముని తపోవనంలో పాదాన్ని మోపి ఇక్కడ మునులు చేస్తున్న ధార్మిక క్రియాకలాపాన్ని చూసి వెళ్ళగలవు. ఇది నీకు ధర్మం'అని ఆ ముని పలికాడు.

కులపతి సాగె తత్తనయ గూరిచి పుణ్యకసోమతీర్థమున్
నిలువగజేయ దుర్విధిని నిష్ఠల తోడ జపాదికర్మలన్
వలదిసుమంత సంశయము భాగ్యమటంచు సమాదరింపగా
నిలుచు శకుంతలాసుత సునిశ్చిత రీతి సఖీద్వితీయయై.            20

వ్యాఖ్యానం
ఓ రాజా! కులపతి ఐన కణ్వుడు తన పెంపుడు కూతురు ఐన శకుంతల జాతకంలో పొడసూపిన అరిష్టాన్ని నియమాలతోనూ, జపాదులతోనూ,ఉపశమింపజేయడానికి పుణ్యప్రదమైన సోమతీర్థానికి వెళ్ళాడు. అందువల్ల కులపతి ఆశ్రమంలో లేడు అని సంశయించకుండా నీవు ఆశ్రమంలోనికి రాగలవు. నీకు ఆతిథ్య మర్యాదలు చేయడానికి మునిసుత ఐన శకుంతల వేచి ఉంటుంది. ఆమెకు తోడుగా ఆమె చెలులు అనసూయా ప్రియంవదలు కూడా ఉన్నారు.

 

                                                                                    - (సశేషం)    


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech