కబుర్లు  
     పట్టాభిరామాయణం

- రచన : బి.వి.పట్టాభిరాం

 

మిస్టర్ పెళ్ళాం మేనేజ్ మెంట్
 

 "అప్పో సప్పో చేసి ఏదో చిన్న ఇందస్ట్రీ పెట్టాను. ఒకపక్క ఇది మేనేజ్ చెయ్యలేక తల ప్రాణం తోకకొస్తూంటే, మా ఆవిడ ఇంట్లో పెట్టే పోరు భరించలేకపోతున్నాను. దీనివల్ల నేనెంతో ఒత్తిడికి లోనవుతున్నాను. నా తల ఎప్పుడో ముక్కలైపోతుందని భయంగా వుంది. దీనికి మీరు నాకు ఏదైనా సహాయం చేయగలరా?" అని ఓ నలభైయేళ్ల పారిశ్రామికవేత్త అడిగాడు.
"తప్పకుండా సాధ్యమే. మీ ఇండస్ట్రీలో వచ్చే సమస్యలు ఏవున్నాయి?"అని అడిగాను.
"ఒకటారెండా? నిండా సమస్యలే, ఒక్కడూ సరిగ్గా పని చెయ్యడు. అన్నీ నేనే చూసుకోవాలి. నిన్న కాక మొన్న ఫ్యాక్టరీలో డీజిల్ అయిపోవడం వల్ల, ఒకరోజు పనంతా ఆగిపోయింది. అది మావాళ్ళు ముందే చూసుకోవద్దా? ఏ ఒక్కడూ బాధ్యత తీసుకోడు. నేనెవరినీ నమ్మలేకపోతున్నాను. ఇటు ఆఫీసు పని చూసుకోవాలా? అటు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ లైసెన్సులూ, పర్మిట్ల కోసం తిరగాలా? లేదా అటు ఆవిడగారు చెప్పే కబుర్లు వింటూ బుర్ర ఊపాలా?" ఆవేశంగా అడిగాడు.
"ఆవిడ ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు?" "ప్రతి నెలా కొంత సొమ్ము బ్యాంకులో వేయాల్ట. ఉన్న అప్పులకు వడ్దీ కట్టడానికే సరిపోటం లేదు. అలాగే రోజూ త్వరగా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవాలట. ఇంత టెన్షన్ లో వుంటే అన్నీ వదిలేసి ఇంటికెలా వెళ్లాలి? మీరే చెప్పండి. అసలు నిద్ర ఎలా వస్తుంది.?"
"మీరేమనుకోనంటే, మీ శ్రీమతి చెప్పినట్లు వినండి.మీ టెన్షన్ దానికదే ఎగిరిపోతుంది."
"వాట్? మీరేమంటున్నారు? ఇంట్లో కూర్చునేవాళ్లకేం తెలుస్తాయండీ మన సమస్యలు? మీరు ఆమె మాట వినమంటున్నారేంటి?"
"కరక్టే. వాళ్ల మాట వినటమే కాదు, వాళ్ల నుంచి మనం ఎన్నో పాఠాలూ, మేనేజ్ మెంట్ పద్ధతులూ నేర్చుకోవచ్చు. ఉదాహరణకు మీ ఇంట్లో సరుకులు ఎప్పుడైనా పూర్తిగా అయిపోయాయా?"
"లేదు"
"అందుకు కారణం, అవి అయిపోతాయని తెలుసుకున్న మూడు-నాలుగు రోజులకు ముందే తెచ్చిపెట్టుకోవడమే. వంటగ్యాస్ కూడా అయిపోయేముందే బుక్ చేస్తారు."
"నిజమే".
"మరి అది మేనేజ్ మెంట్ లోని అతిముఖ్యమైన ఇన్వెంటరీ కంట్రోల్ కాదా? ఆఫీసులో కూడా ముడిపదార్ధాల అవసరం ముందుగానే గుర్తించి, వారిని హెచ్చరిస్తే దానికోసం మనిషిని నియమించే పనివుండదు. అన్ని పనులూ మీరు చేసుకోవటం కాక అందరినీ నియోగించాలి. ఇంట్లో అన్ని పనులనూ మీ ఆవిడే చేస్తున్నప్పుడు మీరెందుకు ఆమెనుంచి నేర్చుకోకూడదు?"
"కొన్ని పనులు మా పెద్దమ్మాయి కూడా చేస్తుంది."
"డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటే అదే ఎప్పుడైనా మీ ఆవిడ సీసా మూతో, జాడీ మూతో తీయమని మిమ్మల్ని సాయానికి రమ్మన్నారా?"
"ఆ! నే వెళ్లి రెండు సెకెన్లలో తీసిచ్చేవాడిని"అన్నాడతను గర్వంగా.
"ఆ మూత ఆవిడ తీయలేక కాదు. మీలో కూడా శక్తి ఉందని మీరు ఫీల్ అవ్వాలని. ఇదో మేనేజ్ మెంట్ టెక్నిక్. ఇదే ట్రిక్కును మీ ఆఫీసులో డల్ గావుండె మేనేజర్ల మీద ప్రయోగించి చూడండి."
"ఓరి నాయనోయ్! మేనేజ్ మెంట్ లో ఇన్ని కుట్రలున్నాయా?" అన్నాడాశ్చర్యంగా.
"అది ప్రేరణ కలిగించే పధ్ధతి. మీ మేనేజర్లకు భవిష్యత్తులో లాభాలొస్తే ప్రమోషన్లు, గిఫ్ట్ లుకూడా ప్రకటించండి. వాళ్ళూ కష్టపడి పనిచేస్తారు, మీకూ లాభం, శ్రమ తప్పుతుంది. ఒక్కోసారి నా దగ్గర డబ్బు అయిపోతే, మా ఆవిడ పోపుల డబ్బాలోంచి తెచ్చిస్తూవుంటుంది."అన్నాడు.మరందుకే ఆవిడ పొదుపు చేయమనేది! మీరు చేయటమే కాక మీ స్టాఫ్ కంతటికీ కూడా చెప్పాలి. నిజంగా సమస్య వస్తే ఆత్మవిశ్వాసం కలిగేలా వుండాలి పరిస్థితి!"
"నిజం చెప్పారండీ. మా ఆవిడకు చాలా ఆత్మవిశ్వాసం, ధైర్యం వున్నాయి. ఓసారి నాకు చాతీలో నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. అది టెన్షన్ వల్లొచ్చిందన్నాడు డాక్టర్. అప్పుడు నాకు మా ఆవిడ ఝాన్సీలక్ష్మీలా, రుద్రమదేవిలా కనబడింది. నేను ఆవిడతో అన్లేదనుకోండి."
"అదే మరి పురుషాహంకారం అంటే! భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అభిమానించుకోవాలి, అభినందించుకోవాలి, అవసరమైతే విమర్శించుకోవాలి. అంతే కానీ అహంకారంతో పరస్పరం దూరం కాకూడదు. నేటి యువతరం వివాహబంధంలోని అంతరార్ధాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అడవిలో సింహానికి అడవి రక్షణ. అలాగే సింహం వల్ల అడవికి రక్షణ. అలాంటిదే భార్యాభర్తల బంధం కూడా."
థ్యాంక్స్!ఇప్పుడే ఇంటికి వెళ్లి మా ఆవిడకు పార్టీ ఇస్తాను."అంటూ లేచాడాయన

 

Dr. బి.వి. పట్టాభిరాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బి.వి. పట్టాభిరాం రచనల సమాహారం ఈ "పట్టాభిరామాయణం".

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech