శీర్షికలు  
     పద్యం - హృద్యం

- నిర్వహణ : రావు తల్లాప్రగడ

 

"సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు మే 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము

 

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

ఈ  మాసం సమస్యలు 

తే.గీ.|| తెలుగు చదువుట మాని ....

(వేదుల బాలకృష్ణగారిచ్చిన సమస్య)

వర్ణన: మంగళవాద్య కళను వర్ణిస్తూ (స్వేచ్ఛావృత్తంలో)

క్రితమాసం సమస్యలు  

ఆ.వె.|| చిటికెలోని పనికి చేయిరాదు 

వర్ణన --  "వసంతశోభ" (స్వేచ్ఛావృత్తంలో)

 

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

 

మొదటి పూరణ - ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం.,  హైదరాబాద్ ,   

చ.|| తెల తెల వారుచుండె, మది తీయని స్వప్నము తోడ నిండె, నే

నల ‘ఖర నామ వత్సరికి హారతులిచ్చుచు వీడు కొల్పుచున్,

తులుచన లేచి చెంత గల తొటకు నేగితి దైవపూజకై

నలరులు కోయగా - నట నబ్బురమొప్పగ ప్రస్ఫురిల్లె క

న్నులు మిరుమిట్లు గొల్పగ వినూతన దృశ్యము లొక్కపెట్టునన్.

 

తే.గీ.|| అపుడె ఉదయించు నాదిత్యు నరుణకాంతి

కొలది కొలదిగ దిక్కులన్నియును కవిసి

నేల తల్లికి పారాణి నిమిరెననగ,

ప్రకృతి కాంత కనబడె నవ వధువు వోలె.

 

తే.గీ.||మొల్ల, సంపంగె, తంగేడు, పొగడ, మల్లె

మొల్లముల నుండి బహువర్ణ పుష్పవృష్టి 

నింగి హరివిల్లు నేలకు వంగుచుండె

ననగ నానంద పరచె  నా మనము నందు.

 

తే.గీ.||మొన్న మొన్నటి అవనతాంబురుహ కుట్మ

లాంగనలు ఫుల్లమై లేచి  భృంగ తతికి

నధర మకరంద నిష్యంద మధురములగు

చెఱుకు విలుతు లకోరీల  బఱపె నపుడు.

 

తే.గీ.||రంగు రంగుల పువ్వుల రంగశాల,

రంగశాలను నర్తించు భృంగచయము

లింపుగా తోచె కమనీయ దృశ్యముగను

హోలి యాడెడు రంగారు యువత వోలె.

 

తే.గీ.||        పిల్ల గాలికి పూబాల ప్రేంకణములు,

ప్రేంకణంబుల చెలరేగి ప్రీతిగొల్పు

సరస పరిమళ సుమగంధ సౌరభంబు

లపుడు ప్రకటించె నవ వసంతాగమమ్ము.

 

మధుమతి:

వనము చూడగ నా

మనము సంతసిలెన్

తనువు ఝల్లుమనెన్

కనుల పండువయెన్.

 

తురగవల్గన రగడ:

ఆమని సొగసుల వఱలిన ఆ వని నయ సోయగములు

కామకళా కుసుమ మధుర గంధ సాయకములు,

కూజిత గానములు భ్రాంతి గొలుపు హృదయ మోదకములు

వీజిత మృదు శీకరములు, ప్రేమికజన రంజకములు.

 

నవమయూరము: 

విప్పినవి పింఛములు విందులను సేయన్,

కప్పినవి భూతలము కన్నులకు హాయై

త్రిప్పినవి కంఠములు  తీరుపులతోడన్,

ఒప్పినవి ఆ వనమయూరములు ప్రీతిన్.

 

కుసుమ విచిత్రము:

వనమున పూవుల్ వలపుల జూపన్

ఘనముగ చెట్లన్ కలయగ పూచెన్

మనమున ప్రీతై మమతల నింపెన్

కనగను హాయై తనువు తలర్చెన్.

 

నవనవలాడెన్ నవ వనమంతన్

అవని సరాగం బాకృతి దాల్చెన్

కవనము చెప్పెన్ కలువల కన్నెల్

యువకుల డెందా లోటమి పొందెన్.

 

భ్రమర విలసితము:

సంజన్ కాంచంగ స్మరుని శరముల్

జంజాటంబుల్ విసరెను హృదులన్,

మంజిష్టంబౌ సుమసముదయముల్

రంజిల్లన్ జేసె రసిక యువతన్.   

 

కనక లత:

అలరు విలతుని కుసుమ శర హరువుల విరసమునన్

కెలవున చిలుకలు జతలై కిలకిలమని కులికెన్

కలువలు తలకెను నటు నిటు కలపడి విరహమునన్

నలిగొని యువకుల మనములు నలువుగ కలుచవడెన్.

 

ఉ .|| ఏమిది నేడు భూమి వసియించెడు స్థావర జంగమ వ్రజం

బామని శోభ దేలుచు సుఖాయుత దివ్య మనోజ్ఞ  నాట్య గీ

తామృత  మాస్వదించుటకునై మది నీ విధి నిశ్చితార్థులై 

కామనతో వసంత సభ కాముని పండువుగా రచించిరో!

 

తే గీ.|| సురభి పొంగారు ఆమని శోభ కనగ,

పృథివి చిగురించి మకరంద మధువు కురిసి

నట్టు లనిపించి నా మస్సనంత నిండె

తేనె తరగల అనుభూతి దివ్యముగను.

 

తే.గీ.|| దివ్యమయిన ఆ అనుభూతి తీరు చూడ

భవ్య నూతన ‘నందన వత్సరంబు

మనల కాయురారోగ్య కామ్యముల నిచ్చి

బ్రోచు నను ఆశ మనమున తోచె నాకు.     

 

రెండవ పూరణ - గండికోట  విశ్వనాధం హైదరాబాద్ ,   

ఆ.వె.|| లక్ష,కోట్ల కొలది లాభమే బహుమతి

స్వల్ప కాన్క కాంక్ష అల్ప మవదె?

పెద్ద పనులు చేయ ముద్దు నాకెప్పుడు

చిటిక లోన పనికి చేయి రాదు.

 

మ.|| చిగురింపన్ ఫల పుష్ప రాజములు, సూచింపన్ నవోల్లాసముల్

చిగురుం కొమ్మల కోకిలా రవములున్, శ్రీ రామ కళ్యాణ ముల్

పొగడం జాలు ఊగాది పచ్చడి రుచుల్, పొంగార సేవించుటల్    

సొగసుల్ జల్లెడు మల్లెలున్ , కవులతో సొంపారు సమ్మేళనల్

తగు పంచాంగ ఫలార్ధ భావములతో తర్కించు సంభాషణల్

మగువల్ దాల్చిన నూత్న భూషణములన్ భాసిల్లు లోగిల్లతో

జగతిన్ తెల్గు జనాల వేడుకల నాస్వాదింప ఆహ్వానమై

అగుపించున్ పలు శోభలన్ నవ వసంతారంభ సంరంభముల్

 

మూడవ పూరణ - వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం

ఆ.వె.|| పెద్ద పనులు చేసి పేరు సంపాదింప

కాంక్షచేయువారు కరుణతోడ

బడుగు వర్గములకు కడగి మేలును కూర్చ

చిటికలోని పనికి చేయిరాదు

 

సీ.|| తొలకరి వర్షింప తలిరాకు జొంపముల్

తరులందు అలరులు విరియపూచె

బంతి సంపెంగ చామంతి మందారాలు

తోరణాల్ కట్టిరి ద్వారములకు

బే కపిల్ పికముల భేరి మృదంగాల

మంగళ వాద్యాలు మారు మ్రోగ

మధుమాసమందున మంచి ముహుర్తాన

జరుగు కళ్యాణ ఉత్సవమునకును

 

తే.గీ.|| సుందర వసంతశోభలనందచేయు

చిలుక రధమెక్కివచ్చెను చిత్రరధుడు

మాధవీలత పెండ్లాడు మావి వరుని

అందరును రండు దీవెనలందజేయ!

 

నాల్గవ పూరణ- నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ 

ఆ.వె.|| మంచి పనులన్న మనిషికి కొంచ మైన

పిలిచి పదవిచ్చి బ్రతుకన్న విలువ లేదు

గగన మందుండు కోరిక గగన మైన

చిటిక లోని పనికి చేయి రాదు !

 

కం.|| సాయం సంధ్యల సొగసులు

కోయిల గళమందు మధుర గానము కురియన్ !

పూయించె కొలను కలువల

రాయంచ  మంద గమనము  రాతిరి జ్యోత్స్నల్  !  

 

ఐదవ పూరణ -యం.వి.సి. రావు, బెంగళూరు

ఆ.వె.|| తనదు శక్తినెరిగి తగు సాయమడిగిన

చేసి తీరవలయు సేవయనగ

తప్పుకొనెడి వారె తండోపతండంబు

హిటికెలోని పనికి చేయిరాదు

 

మ.|| మెరిసెన్ భూజములెల్ల నవ్యవిరులన్ మిన్నంత హృద్యంబుగా 

గురిసెన్ తేనెలు కోకిలమ్మ గళమున్ క్రొంగొత్త రాగాలతో 

మరిపించెన్ శిశిరాంత శైత్యభరముం నానంద ముప్పొంగగా

నరుదెంచెన్ నవయవ్వనంపు పటిమన్ వాసంత మవ్వేళలన్ 

 

ఆరవ పూరణ జగన్నాథ  రావ్  కె.  ఎల్. , బెంగళూరు

ఆ.వె.|| కత్తి  పోటు  కన్న  కలము  పోటే  మిన్న

నీతి   బాహ్యుడనెడు  నింద  మోయ

సాహసించ లేడు  సంతకమును  జేయ

చిటికె లోని  పనికి  చేయి  రాదు

 

కవిత||  అలసిపోయి  పచ్చ పచ్చని  ఆకులలో  మాయమై

వసంత శోభ  మేలుకొల్ప ,  పులుముకొంది   కొత్త  రంగు

ఈ ప్రకృతి   చెరువులోని   కప్పతో  సహా .

మట్టి రంగు  నిట్టూర్పులు, ఎరుపు  పచ్చ  వగర్పులు ,

హమ్మయ్యా  అనుకుంటూ 

ఆకు పచ్చ కన్ను బొమ్మ లెగరేసిన భూమాత .

ఉక్కు కాంక్రీటుల కాననమైనా,   ఊపిరాడని జనారణ్యాలు

పచ్చని  శోభలు  నింపుకుంటుంటే,

గులాబీ  కొమ్మమీద  ఎర్రాఎర్రని  చిగుళ్ళు ,

మొగ్గలై  ఎదురు చూసే  కొత్త  వసంతానికి   నాంది

కొత్తగ   మార్కెట్టు లోకి   విడుదలైన  కారు లాగా

ఎర్ర రంగులో మిలమిలా  మెరుస్తూ

సున్నా నించి అరవై కి   అయిదు సెకన్ల వేగంతో

దూసుకొస్తున్న వసంతం

కూచిపూడి,  భారత నాట్యం నృత్య భంగిమలన్నీ  ఒకే చోట

చేరిన వసంత శోభ

వసంతం వచ్చి విముక్తులైన మంచు శకలము లారా!

అందుకోండి మా స్వాంత వచనములు !

 

ఏడవ పూరణ-  డా.రామినేని రంగారావు, యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశం జిల్లా.

ఆ.వె.|| చిటికె వేసినంత చేరుచు సేవకుల్

మనసు నెరిగి అన్ని పనులు చేయ

సుంత సొంత  పనికి చూచు నల్దిక్కుల

చిటికె లోని పనికి చేయి రాదు

 

ఆ.వె.|| పిండి వంట లెన్నొ పెద్దపండుగ నాడు

"వంట-వార్పు" చదివి వండివార్చె

ఉప్పు వేయ మరచె ఒత్తిడి అధికమై

"చిటికె" లోని పనికి చేయి రాదు

 

ఎనిమిదవ పూరణ - నిరంజన్ అవధూత, బోస్టన్

ఆ. వె. || కన్ను పొడుచు కున్న కనరాని గాడాంధ

కార మెల్ల దిశల క్రమ్ము కొనగ

వేసటింత లేక వెలుగులో చేసెడు

చిటికె లోని పనికి చేయి రాదు.

(వేసట = శ్రమ, అలసట)

(వెలుగులో కొంచెమైనా అలసట లేకుండా చిటికెలో చేసే పనిని చీకట్లో చేయడానికి తడబడాలి, చేయి రాదు).

 

సీ|| చిన్నారి కోయిలలు, చిన్ని గొంతుకలెత్తి

          ప్రియమైన రాగాన పిలువ రాగ

పచ్చని మామిళ్ళు, పరువాల రెమ్మలున్

          తోరణాలను గట్టి తీర్చి నిలువ

ప్రకృతి అంతయున్ పరవశంబున క్రొత్త

         విరులతో సొగసుగా వేచి యుండ

రమణీయ ముంగిళ్ళు రతనాల బోలిన

          రంగవల్లుల తోడ రమ్మనంగ

ఆ. వె || ఘల్లు ఘల్లు మనుచు గజ్జెలున్ మ్రోగంగ,

కరుణ జాలు వార, కనుల నిండ

మాకు అభయ మొసగి, మమ్ముల దీవించ,

నవ వసంత లక్ష్మి నడచి రావె !

 

తొమ్మిదవ పూరణ - సింహాద్రి జ్యోతిర్మయి - తెలుగు అధ్యాపకురాలు, ఒంగోలు

 ఆ.వె.|| మరల నమ్మి బ్రతుకు మానవుడీనాడు

నోటి లెక్కకైన మీట నొక్కు

సకల కార్యములను సలుప కంప్యూటర్లు

చిటికెలోని పనికి చేయి రాదు

 

సీ.||కొమ్మ కొమ్మకు చెట్లకు గొత్త చిగురులట్లు 

                   అణువణువు సొగసులంకురించి

గుబురుకొమ్మల మాటు కోయిల కూతలా

                   వలపు పాట వయసు పాడి పిలిచి

తెలియని కోర్కెలు తీయగ బాధింప

                   తోడుకోరి మనసు తొందరించి

చేపట్టి యేలుకోను చెలికాని కోసమై

                 కలల తపసు చేసి కలవరించి

తే.గీ.||వరుడు మరుడు కావాలని వాంఛచేసి

బ్రతుకు చైత్రమవ్వాలని భావమందు

తలచి పులకించు కన్నెల తనువు నిండ

చూడ కనిపించు వాసంత శోభ నాకు

 

పదవ పూరణ -  ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నయి 

 ఆ.వె.|| ఇ౦ట ను౦డ బట్టదిప్పటి వారికి,

వ౦ట జేయ మాని వీధి కేగు,

ఎన్ని వసతులొచ్చి యేమి జేయుటకు,

చిటికెలోని పనికి చేయి రాదు!

 

క౦.||  మామిడి పూయు, చిగురు తిని

కమ్మని రాగము తొడ౦గు కోయిల, విని వి౦

జామర నాట్యము జేయు వ

నమ్ములు, గొని మది ముదమగు ను వస౦తమునన్!

 

పదకొండవ పూరణ- అక్కులు కృష్ణ

కం.||పడుచుల నామములందున్

కడు ఇంపగునవి, బిరబిర గడగడ వడిగా

తడబడ కుండ తెలుపుడని    

అడిగినచొ "వసంత, శోభ"లని తెలుపనే! 

 

కం.||వలచి, మనువాడి, పువ్వులు

నలిగిన య "వసంత, శోభ"నపు రేయిని నా

తలపులలో పదిలంగా

నిలిపితిని, సదా మనమున నెమరే సితినే!  

 

పన్నెండవ పూరణ - శ్రీదేవి

ఆ.వె.|| కటిక రాత్రి లోన కన్ను కానని యంత

బధ్ధకాని కీవు బలివి గాగ

ఇష్టమైన విషయ మింకొకటి ముందుండ

చిటికలోన పనికి చేయిరాదు

    

ఉ.|| ఆకులు లేని చెట్లు యిల ఆశలు గొల్పుచు  ఆకులేయగా

కాకులనోరు మూయగను కమ్మని  కోయిల  గొంతు  విప్పగా

నాకనులేడజూచినను  నామది  రంజిల తోటలుండగా

నాకము భూమిపైని గననా?యన నేడు వసంతమొప్పగా

 

పదమూడవ పూరణ - గొర్తి వేంకట లక్ష్మి, హైదరాబాద్

ఆ.వె.||చేతి లోన చేయి చిరునవ్వుతో వేసి

చేయి తడుపగానె చిటిక వేసి

చేతు నంచు చెప్పి, చెయ్యిచ్చు చెనటికి

చిటిక లోని పనికి చేయి రాదు.

  

కవిత||మధుర మామిడి ఫలములు,మత్త కోకి

లా రవములు మల్లెల సౌరభ రస ఝరులు

పెళ్ళి పందిళ్ళు, విందు లోగిల్లు, పల్ల

వించు తరులు, ప్రకృతి పులకించు పిలుపు

సగటు విద్యార్ధికి పరీక్ష సమయ దీక్ష

అది వసంతాగమ రధము కదలు పధము.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech