పాఠకుల సమర్పణ  
     మా నాన్నకు జేజేలు - నిర్వహణ : దుర్గ డింగరి  

ప్రియమైన సుజనరంజని పాఠకుల్లారా!

'అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు. చిన్నప్పటి నుండి నాన్న వీపు పై ఎక్కి ఆడుకున్న రోజుల నుండి మీరు చిన్నారి పాపలను ఎత్తుకునే వరకు ఎన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు. అవన్నీ మా అందరితో పంచుకోవడానికి సుజనరంజని ' మా నాన్నకు జేజేలు,' శీర్షిక ద్వారా మీకు మంచి అవకాశమిస్తుంది. నెం.వన్ తెలుగు వెబ్ మాస పత్రికలో మీ నాన్నగారి గురించి ప్రచురిస్తే ఎంత మంది చదువుతారో, స్ఫూర్తిని పొందుతారో ఆలోచించండి.

ఇంకా ఆలస్యమెందుకు? కలం, కాగితం తీసుకుని రాసి కానీ లేదా లాప్ టాప్, కంప్యూటర్లు వున్న వారు టక టకా టైపు చేసి కానీ సుజనరంజనికి పంపించండి. 


 

మా నాన్నగారు నా బెస్ట్ ఫ్రెండ్

- సరస్వతి బట్టర్

శ్రీ సోమంచి వెంకట సుబ్బారావు గారు( జనవరి 5,1919 - డిసెంబర్ 30,2011).

 వృత్తి: లా సెక్రెటరి, లా కమిషన్ సెక్రెటరి టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.

ఆర్కి టెక్ట్: భూ సంస్కరణల చట్టం, భారతదేశవ్యాప్తంగా స్వీకరించబడింది.

ప్రియమైన అమ్మా, నాన్నలు మళ్ళీ స్వర్గంలో కలుసుకున్నారు

నాన్నగారు తణుకు, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు.  తొమ్మిదేళ్ళ ప్రాయములో తండ్రిని కోల్పోయారు.  బాల్యం నుండి చదువు మీద ఎక్కువ మక్కువ.  డాక్టర్ అవ్వాలని దృఢమైన కోరిక, ఆకాంక్ష వుండేది కానీ ఆర్ధిక ఇబ్బందుల వల్ల, పెద్దల దండన వల్ల ఆ బలమైన కోరిక అణచుకున్నారు.  దాదాపు పద్నాలుగేళ్ళ వయసులో సత్యవతి నామధేయురాలిని, ఏలూరు నివాసి పోతుకూచి సుబ్బయ్యశాస్త్రిగారు, ఎమ్.ఏ, ఎల్.ఎల్.బి గారి కుమార్తెను పెళ్ళి చేసుకున్నారు.  ఇరవై ఐదు సంవత్సరాల లోపు  ఒంటరిగా అమిత కష్టాలు అనుభవించి బి.ఎస్.సి, బిఎల్ డిగ్రీలు ఆర్జించి మెడ్రాస్ సెక్రెటరియెట్ లో నెలకు పంతొమ్మిది రూపాయల జీతంతో గుమాస్తాగా చేరారు.   1957లో హైద్రాబాద్ కి బదిలీ అయ్యారు.  నాన్నగారు స్వయంకృషి, పట్టుదల, అంకుఠిత దీక్షతో, ఉన్నత ఆశయాలతో క్రమంగా వృత్తిలో అబివృద్ది నొందారు.  అసిస్టంట్ సెక్రెటరి, డిప్యూటి సెక్రెటరి, డ్రాఫ్ట్స్ మాన్, లా సెక్రెటరి, తదుపరి లా కమిషన్ సెక్రెటరిగా అమిత ఉన్నత స్థాయికి చేరుకున్నారు.  పి.వి. నర్సింహారావు గారితో సన్నిహితంగా పనిచేసి మన్ననలను పొందారు.   1970 దశకంలో ఒక బ్రాహ్మణుడు వృత్తిరీత్యా ఆ పదవి అందుకోవడం చాలా అరుదైన విషయమే కాక అందరినీ అబ్బురపరిచింది అని ఇప్పటికీ అందరూ అంటుంటారు.  

మా అమ్మగారు సత్యవతి గారు, ఆవిడ చాలా చలాకీ మనిషి, సరదా మనిషి, నిక్కచ్చిగా మాట్లాడేవారు. మంచి గాయకురాలు.  ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడేవారు.  1984 లో అమ్మ అకాస్మాత్తుగా పరమపదించారు. 

నవంబర, 2011 ,’మేడమ క్యూర,’ పుస్తక తీసుకెళ్ళాను నేన ఇండియ వెళ్ళినప్పుడ.

నాన్నకి నోబెల ప్రైజ విజేతలంట చాల ఇష్టం.

1963-2011 వరకు, మెహిదీపట్నం, హైద్రాబాద్ లో స్థిరనివాసం.  మేము నలుగురు ఆడపిల్లలం, ఇద్దరు మొగపిల్లలు, మొత్తం ఆరుగురు పిల్లలం.  1984-2011 వరకు మా నాన్నగారే మా ఆరుగురు పిల్లలకు తల్లీ, తండ్రి అయ్యి పెంచారు. పెద్దక్కయ్య రాధ నిస్వార్ధంగా నాన్నకి అండగా నిలిచారు.  నాన్నగారు ఉద్యోగరీత్యా మేధావి అనిపించుకున్నారు.  ఆరుగురు పిల్లలను బాగా చదివించారు ( ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఎం.కామ్ చేసారు) నాన్న గారు కొందరి దగ్గర, బందువుల మరియు నమ్మిన స్నేహితులవల్ల అమితంగా మోసపోయారు, తల్లడిల్లారు కానీ ప్రతీకారం తీర్చుకోవాలని ఆశించలేదు, వారిని పరుషంగా ఈసడించలేదు.  "వారి వల్లే నేను పైకి వచ్చాను," అని కృతజ్ఞతా భావం ప్రకటించేవారు. " Love your enemies-they are valuable assets," అనేవారు.  "A place for everything, Everything in its place," అని పదే పదే పలికేవారు.  

నాన్నగారు చాలా  క్రమశిక్షణతో వుండేవారు. యాబై ఏళ్ళకు పైగా రోజూ దాదాపు మూడు మైళ్ళు తెల్లవారుఝామున వాకింగ్ కి వెళ్ళేవారు.  రెండు వారాలకోసారి దాదాపు 83వ జన్మదినం వరకు బ్రిటిష్ లైబ్రరీకి బస్ లో వెళ్ళి తనకే కాక ఇద్దరు మిత్రులకు పుస్తకాలు తీసుకుని వచ్చి, తిరిగి ఇచ్చేసి వచ్చేవారు.  నాన్నగారికి జ్ఞానతృష్ణ అమితం, నాన్నకి బద్దకస్తులంటే చిరాకు వేసేది.  "Talent without hardwork will not breed success," అనేవారు. నాన్నగారు స్థిత ప్రజ్ఞులు, తను నమ్మిన సిద్దాంతాలను సదా అమలు పరిచేవారు.  పిసినారి అని, లోభి అని లోకం  అన్నా ఖాతరు చేయలేదు.  పిల్లలందరిని ప్రైవేటు స్కూల్స్ లో చదివించారు.  మా స్కూల్ యూనిఫార్మ్ లు దగ్గర ఉండి మంచి రకంవి కుట్టించేవారు.  తాను లక్షలు, కోట్లు గడించినా, ఎన్నడూ ప్రగల్బాలు పలుకలేదు.  చాలా మటుకు తెల్ల బనీను, కాటన్ గళ్ళ లుంగీతో హాయిగా నిశ్చింతగా వుండేవారు.  "Neither a borrower nor a lender be," అని పదే పదే చెప్పేవారు.   నాన్నగారు ఆడపిల్లలను మొగపిల్లలతో సమానంగా పెంచారు.  ఎంతో మంది పేద విద్యార్ధులకు మా ఇంట్లో నెలవు కల్పించారు.  ప్రతిఫలంగా మా పిల్లలందరికి విద్య చెప్పేవారు.  అలా మేము చదువులో రాణించడానికి పునాదులు వేసారు.  మా నాన్నగారు "డిగ్నిటీ ఆఫ్ లేబర్," అంటే ఏమిటో తన నడవడికతో చూపించారు. 

85 పుట్టిన రోజు సరదాగా తన కాలనీ స్నేహితులతో. ప్రతి జనవరి ఐదున మా యింట్లో సంతోషంగా జరుపుకునేవారు

 

కొన్ని అమూల్యమైన తీపి స్మృతులు: కాలేజ్ రోజుల్లో, నా చెప్పులు తెగినపుడు, నాన్న చెప్పు తన చేతిలో పెట్టుకుని చెప్పులు కుట్టే అతని దగ్గరికి స్వయంగా వెళ్ళి కుట్టించి తెచ్చేవారు. 

చదువుల దగ్గర చాలా ఖండితంగా, స్ట్రిక్ట్ గా వుండేవాళ్ళు.   రోజూ నాతో ఇరవై లైన్లు బట్టీ పట్టి ఉచ్చరించేవారు, అవి మామూలు పాఠాలు కాదు, షేక్స్ పియర్, వికార్ ఆఫ్ వేక్ ఫిల్డ్, విలియమ్ వర్డ్స్ వర్త్, కవితలు నేర్పేవారు.  అవి అప్పజెప్పడం అయిన తర్వాతే ఆటలకి పర్మిషన్ ఇచ్చేవారు.  పెద్దయిన తర్వాత ఉద్యోగంలోనూ, సంసారంలోనూ, సంఘంలోనూ, ఆ జ్ఞాపకశక్తి ఎన్నో విధాల ఉపయోగపడుతుంది.  అందరూ మెచ్చుకుంటున్నపుడు నేను మనస్సులోనే "నాన్న థ్యాంక్ యూ," అని పదే పదే నమస్కరిస్తాను నాన్నకి.  

నాన్న ప్రోధ్బలంతో ఆయన కోరిక నెరవేర్చాను-నేను ఎమ్.బి.బి.ఎస్ లో సీట్ తెచ్చుకుని.  న్యూస్ పేపర్ లో రిజల్ట్స్ చూసి, నాన్న వొంటి మీద సరిఅయిన అచ్చాదన లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా, పేపర్ తీసుకుని పరిగెత్తుకుని స్నేహితులకి, అడిగిన వారికి, అడగని వారికి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ దండోరా వేసారు-"మా చిన్నమ్మాయికి మెడిసిన్ లో సీట్ వచ్చిందని" పదే పదే చెప్పేసారు, అల్పసంతోషి అయిన మా నాన్న.  నేను TOEFLC ( Test of English as a Foreign Language) రాయడానికి వెళ్తుంటే, తనూ వచ్చారు.  రెండు గంటల ప్రయాణం బస్ లో, పరిక్ష నాలుగు గంటలు బయట గడ్డిలో నిండుటెండలో ప్రేమగా వేచి వుండేవారు నేను వచ్చేంతవరకు. నాకు 97% స్కోర్ వస్తే, నాకన్నా తనే ఆనంద పడ్డారు.  ఆయన కర్మయోగి. 

నేను ECFMG పరీక్షలకి చదువుతుంటే రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో, రోడ్డు మీద వున్న ఇరానీ కెఫే నుండి వేడి వేడి టీ తెచ్చిచ్చేవారు.  అది తాగి ఇంకో రెండు, మూడు గంటలు చదువుకునేదాన్ని.  ఆయన కార్యదీక్ష అటువంటిది.  నాన్నగారు తన 93 ఏళ్ళ వరకు తనే తల్లి, తండ్రి అయ్యి మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచారు, గారాబం చేసారు, ఎప్పుడూ మీకు ఏమి కావాలి అనే వాళ్ళు కానీ, యేనాడు "నాకు ఇది కావాలి," అని అడగలేదు, ఆలోచించలేదు.  మా నాన్న మహనీయులు. 

సరస్వతి కుటుంబం ఫోటో

1985 లో పెళ్ళి చేసుకుని యు.ఎస్.ఏ కాపురానికి వచ్చాను.  తల్లి లేని పిల్ల అని, ఆఖరు అమ్మాయి అని అందరూ గారాబంగా పెంచడం వలన, ఎం.బి.బి.ఎస్, డి.జి.వో  పుస్తకాల లోకంలో గడపడం వలన నాకు బొత్తిగా ఇంటి పనులు, వంట పనులతో పరిచయం కలగలేదు.  పెద్ద కోడలుగా పెద్ద బాధ్యతలు మోయడం కొత్తగానూ, భయంగానూ, వుండేది.   అసలైన లోకం అవగాహన బొత్తిగా లేక పోవడం వల్ల, ఆర్ధిక సంపాదన లేక ఇబ్బందులు ఎదుర్కున్నాను.  నాన్నగారు అన్ని అవగాహన చేసుకుని, "నీకు గౌరవం, ఆదరాభిమానాలు కలిగే సందర్భాలు నీవే కలిగించుకోవాలి, నీ కాళ్ళ మీద నీవు నిలబడాలి.  చదువు సార్ధకం చేసుకోవాలి, దానికి త్యాగం చేయాలి - అపుడే భవిష్యత్తు బాగుపడుతుంది" అని నిక్కచ్చిగా తెలిపారు.  మా పెద్దబ్బాయిని నాన్నగారు తన దగ్గర హైదరాబాదులో వుంచుకుని "హ్యాపీ స్కాలర్," స్కూల్ లో చేర్పించి, రోజూ వాడిని బడికి తీసుకెళ్ళి తీసుకొచ్చేవారు.  దారిలో వాడికి పెప్సీ కొనిచ్చేవారు.  ఇండియాలో 1990 దశకంలో స్ట్రాలు అపురూపం.  అమెరికా నుండి నేను స్ట్రాలు పంపించేదాన్ని.  నాన్నగారి మనసులో కల్మషం లేదు.  చిన్న పిల్లల అమాయకత్వం ఉండేది. 

(1) నలబై ఏళ్ళకి పైగా అదే షేవింగ్ కిట్ వాడేవారు.(2) నాన్నగారితో, ’చివరి ఫోటో నాతో, నువ్వు మళ్ళీ వచ్చేటప్పటికి నేను మాట్లాడలేను, అడ్డంగా పడుకుని వుంటాను," అన్నారు 

మా నాన్న మితభాషి, మేధావి.  ఆయనకి తొంబై మూడేళ్ళ వరకు కూడా నిరంతరమైన ఆసక్తి వుండేది.   ఒక దశాబ్ధంకి పైగా నాకు ప్రతి శనివారం నాన్నకి ఉత్తరం రాయడం అలవాటు, జీవితంలో ఏ చిన్న విశేషం జరిగినా, ఉత్తేజపరిచే సంఘటనలు జరిగినా అన్ని నాన్నతో పంచుకోవాలి అనే తపన వుండేది.  నాన్నగారు, వెంటనే ప్రతి ఉత్తరానికి సమాధానం ఇచ్చేవారు. ప్రతి ఉత్తరంలో న్యూస్ పేపర్ క్లిప్స్, భర్తృహరి, సుమతి, వేమన శతకాల నుండి, షేక్స్ పియర్ సాహిత్యం నుండి ఉదహరిస్తూ కలిపి జవాబు రాసేవారు. మేము ఇద్దరం ఒకరి ఉత్తరాల కోసం ఇంకొకరు చాలా ఎదురు చూసే వాళ్ళం.  నాన్న గారు నా ఉత్తరాలను ఒక బైండర్స్ లో భద్రంగా ఫైల్ చేసుకుని మళ్ళీ మళ్ళీ చదువుకునేవారుట.  అది నాకు చాలా తృప్తినిచ్చేది.    నాన్న గారి వినికిడి తగ్గాక ఉత్తరాలు చాలా సహాయం చేసాయి.  నాన్నగారు నా బెస్ట్ ఫ్రెండ్! నేను నవంబర్, 2011 లో నాన్న దగ్గరికి వెళ్ళి ఆయనతో సమయం గడిపి, నాకు ’ఛీఫ్ ఆఫ్ స్టాఫ్’గా, వెటరన్స్ ఆపైర్స్ కి ప్రమోషన్ వచ్చిందని స్వయంగా చెప్పి, రాసి ఆయన దీవెనలు తీసుకున్నాను.  నాన్న చాలా సంతోషించారు, ఆనందబాష్పాలు రాల్చారు.  ఎన్నో ప్రశ్నలు అడిగారు, ’జీతం పెరుగుతుందా’ అని అడిగారు.  నేను రాసిన వాక్యాలు బుక్ మార్క్ పెట్టుకుని, తన స్నేహితులకి, ఉత్సాహంతో, గర్వంగా చూపించుకున్నారు.  నా కళ్ళు చెమ్మగిల్లాయి.  మనసు చలించింది.  నా అభివృద్ది చూసి సంతోషం పాలు పంచుకునే యీ పెద్ద తోడు ఎంతో అమూల్యమైంది - కాని ఇంక కొద్ది రోజులు మాత్రమే యీ అదృష్టం అని మనసు నొచ్చుకుంది. నా మనసుకి బలంగా తెలిసింది నాన్న ఎక్కువ కాలం వుండరు అని.  ఎన్నో ఫోటోస్ తీసి, వీడియో తీసి, వాయిస్ రికార్డర్ వాడి, ’నాన్న ఎలా అనిపిస్తుంది, ఇంక ఎక్కువ కాలం బతకను అంటున్నావు ఏంటి?’ అంటే "నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది.  మీరందరూ సంతోషంగా వుంటే చాలు,’ అని భోరున ఏడ్చేశారు.  వాయిస్ రికార్డర్ లో ఆ సంభాషణలు ఎన్నోసార్లు వింటూ వుంటాను భారమైన మనస్సుతో.  ఆఖరి చూపులు దక్కినందుకు అదృష్టవంతురాలిని.  తల్లి తండ్రులు పిల్లలకు గట్టి పునాది మరియు ఎగరడానికి రెక్కలిస్తారు.

నాన్నగారు డిసెంబర్ 30, 2011 లో పరమపదించారు, సునాయస మరణం పొందారు.  మరో జన్మంటూ వుంటే మళ్ళీ ఆ తండ్రికి కూతురిగా జన్మించే అదృష్టం కలగాలని ప్రార్ధిస్తున్నాను. 

నాన్నగారు నేత్రదానం చేసారు, అవి ఈ లోకాన్ని ఆసక్తితో, కృతజ్ఞతతో వీక్షిస్తున్నాయి.   మా నాన్నకి జేజేలు!


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

  Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.                    సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                                                                                                            Site Design: Krishna, Hyd, Agnatech