కథా భారతి  
      కథా విహారం

- రచన :  విహారి

 

 
 సామాజికాంశాలతో పదునైన గల్పికలు
1. సబ్బని లక్ష్మీనారాయణ: భాధ్యత
2. ఎల్.ఆర్.స్వామి రచన: లోగుట్టు పెరుమాళ్ళు కెరుక!

 
 మానవ సంబంధాలూ సార్వత్రికమైనవి, సార్వజనిక మైనవి, కథాగతమైన విశేషానికి పాఠకజనపరంగా సాధారణీకరణం జరుగుతుంది. కాబట్టి చదువరులకు ఏ పరిమితులూ అడ్డురావు. సాహిత్యం సార్వజనికం కదా! అన్నారు సుప్రసిద్ధ కథా రచయిత. సాహితీవేత్త - డా. పోరంకిదక్షిణామూర్తి. అంటే, సాహిత్యం సార్వజనికం కనుక, సాధారనీకరణం జరిగినప్పుడు - ప్రక్రియాభేదం ఉన్నా, పాఠకులు ఆదరిస్తారు. ఇదిగో - అందుకు నిదర్శనంగా ఈరెండు గల్పికలు.

కథానిక కంటే గల్పిక నిడివిలో మాత్రమే చిన్నది కాదు, వస్తువు పరంగా కూడా అది ఒక మెఱపు. జీవిత పార్శ్వాలల్లో ఒక పార్శ్వాన్ని స్పృశించి, గాఢమైన భావాన్ని చదువరి మేధకు అందించే విరుపు అది. ఆ మెఱపు, విరుపులే దాన్ని పఠిత మనస్సులో పదికాలాల పాటు నిలిపే ఆయుధాలు. ఆకాలంలో ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప గల్పికల్ని సృష్టించారు. కుటుంబరావుగారు కూడా సుమారు 50 గల్పికల్ని తెలుగు సాహిత్యానికి బహుకరించారు.

భాద్యత : సబ్బని లక్ష్మీనారాయణ: కవిగా లబ్ధ ప్రతిష్ఠులు. మౌనసముద్రం,నది నా పుట్టుక, మనిషి, బతుకు పదాలు వంటి కవితా సంపుటాలు వెలువరించారు. నేటి కవిత 2007 కి సంపాదకత్వం వహించారు. పుస్తకసమీక్షకులుగా, వ్యాసకర్తగా, కథకుడుగా రాణిస్తున్న ప్రతిభాశాలి. వారు పొందిన సత్కారాలు, బహుమతులూ, పురస్కారాలూ చాలా వున్నాయి.

చెల్లెలు పద్మ తన కూతురికి చెవులు కుట్టిస్తున్నాం రమ్మని ఆహ్వానించింది అన్న నారాయణని. నారాయణ చేనేత కార్మికుడు, తండ్రిలేడు, తల్లీ, భార్యా, పిలల్లూ, నెలంతా కొట్టుకున్నా వెయ్యి పదేను వందలు రావు. చెల్లికేమైనా తీసుకుపోవాలి. పైన రానూపోను ప్రయాణం ఖర్చులు. ఇదీ సమస్య. అందరికీ అన్నీ అమర్చటం నారాయణ భాద్యత! అందరి కోసం, ఖర్చుల కోసం నేనున్నా, కాని నాకోసం ఎవలున్నారు? ఎవలి లేకున్న నాకోసం బాధ్యతలు మాత్రం ఉన్నాయి ఇదీ నారాయణ వేదన! ఇడే గల్పిక ముగింపు కూడా! అనుబధం, రక్తసంబంధం కల్పించే భావోద్వేగాలూ, అవ్యక్త బాధావ్యథలూ మనిషిని ఎలా సంకటపెడతాయొ చక్కగా చిత్రించారు రచయిత. అటు చెల్లెలు, ఇటు భార్యా, పిలల్లూ. ఇక అసలైన పళ్ల చక్రం ఆర్థిక సమస్య . దానిలో పడి నలుగుతూ తన వారి పట్ల తన భాద్యత ని విస్మరించలేని బడుగు జీవి ఆతి పెద్ద సంవేదనని, చిన్న గల్పికలో కరీంనగర్ పలుకుబడీ, మాట తీరు, మనుషుల మనసు దగ్గరతనం,అద్బుతంగా లక్ష్మీనారాయణగారి శైలిలో పలికేయి. అదే ఈనాటి ప్రాచుర్య పదం - మాండలికం. కొండంత సమాజంలోని గోరంత మధ్యతరగతి మనిషి వ్యథని ఆర్తిగా, ఆర్ర్థంగా చెప్పారు. రచయితకు అభినందనలు!

లోగుట్టు పెరుమాళ్ళు కెరుక: ఎల్.ఆర్. స్వామి సుప్రసిద్ద కథారచయిత. మాతృభాష మళయాళమే అయినా,1980 లో విశాఖపట్నం వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకొని, తెలుగులో ఇబ్బడిముబ్బడిగా రచనలు చేసిన ప్రజ్ఞాశాలి స్వామిగారు. అనేక అనువాదాలూ చేశారు, మళయాళంలో వందకు పైగా కవితలు ప్రచురించిన కవి కూడా. స్వామిగారి కథా సంపుటుల మీద ఎందరో ప్రముఖుల ప్రశంసలూ వచ్చాయి. నేను చూసిన జీవితాన్ని ఇతరులకు తెలియజేయడం కోసం నేను వ్రాస్తున్నాను....... జీవితమంటే ఒక అనుభవాల చిట్టా,అనుభూతుల పుట్ట. ఇతరుల జీవితాలను చూసి, చదివి అర్థం చేసుకోగలిగిన వాడు తన జీవితాన్ని కొంత సుఖమయం చేసుకోగలడు అనే నమ్మకంతో రచనలు చేస్తున్నారు స్వామి.

ఒకే సామెతని ఆధారంగా తీసుకుని ప్రయోగాత్మకంగా అధిక సంఖ్యలో కథలు వ్రాశారు స్వామి. అలాంటి ప్రయోగాల్లో ఒకటి లోగుట్టు పెరుమాళ్ళు కెరుక అనే సామెత మీద ప్రచురించిన గల్పికలు. అందులో అదే శీర్షిక గలిగిన రచన ప్రస్తుతం మన తేజోరేఖ.

నిండు నూరేళ్ళూ బతికి చనిపోయింది పెద్దమ్మ. అదృష్టవంతురాలు. పెట్టి పుట్టింది. దర్జాగా, మహారాణిలా బతికిన ఆవిడ శరీరం - ఇవాళ - అస్థికల గూడులా వుంది. చూపు ఎప్పుడో మందగించింది. నడుము వంగిపోయింది. మనిషి కదలలేదు. అంతా మంచంలోనే. భర్త పోయిన స్త్రీకి పిల్లలున్నా వార్థక్యం ఒక శాపమే. పెద్దమ్మకి ఒక కొడుకు - సుబ్బయ్య. ఒకకూతురు లలిత. పెద్దమ్మకి బంగారమే ఆసరా. అన్నీ ఆ పిల్లే చేసింది. ఆరేళ్ళ అనుబంధం వాళ్లది. ఎంతో సేవ చేసింది బంగారమ్మ. కూతురు కూడా చెయ్యని పనులు చేసింది. పెద్దమ్మ శవం పక్కన దుఃఖిస్తోంది బంగారమ్మ. నా కిలా అన్యాయం చేస్తావని కలలో కూడా అనుకోలేదే అమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. లలిత సరి కొడుకు సుబ్బయ్య వచ్చాడు - హైదరాబాదు నుంచీ.

లలిత ఏడుపులో నిజం బయటకొచ్చింది పెద్దమ నగలూ, రెండు లక్షల పై చిలుకు డబ్బూ, బంగారమ్మ పేరు మీద రాసి పోయింది పెద్దమ్మ! లలిత ఏడుపు - తల్లి పోయినందుకు కాదు, నగలూ డబ్బూ పోయినందుకన్నమాట! లోగుట్టు పెరుమాళ్ళు కెరుక అంటూ ముగిసింది గల్పిక.

స్వామిచెప్పినట్టు తాను చూసిన జీవితాన్ని ఇతరులకు తెలియజేస్తాడు రచయిత. అయితే లోకాన్ని చూడటం ఒకటి, దాన్ని జీర్ణం చేసుకోవటం మరొకటి అన్నారు పాలగుమ్మి పద్మరాజు గారు. జీర్ణం చేసుకోవటంమంటే, ఉపరితలంలో కనిపించే సమస్య మూలాన్ని ఆకలింపు చేసుకోవటం అన్నమాట. ఈ కథలో లలిత ఏడుపు వెనుక అసలు కారణం - డబ్బు. మానవ సంబధాలన్నీ ఈరోజుల్లో ఆర్థికసంబంధాల మీదే ఆధారపడివున్నాయని విశ్లేశకులంటే, కొందరికి ఆ వాస్తవం అనుభవంలోకి రానందువల్ల నమ్మరు మరి కొందరు నిజాన్ని జీర్ణం చేసుకోలేక కొట్టి పారేస్తారు. కానీ సత్యం సత్యమే కదా. అదే ఈ గల్పిక చెప్తున అర్థం! ఒక వ్యక్తి బాహ్య ప్రవర్తనకీ, ఆంతరంగిక నైజానికి పొత్తు కుదరటం - సాదారణంగా జరగదు అదీ ఘర్షణ హేతువు! మంచి కథానికకి గానీ గల్పికకు గానీ, ఆ ఘర్షన అవసరం.

అందుకనే - కొడవటగంటి కుంటుంబరావుగారు చెప్పారు. కేవలం భావాలతో కథ సమకూరదు. వీటితో పాటు కథకి , ఉద్రేకం , అతీంద్రియ జ్ఞానంతో ముడిపడిన తృష్ణ కావాలి అని.


అవును హృదయం , ఉద్వేగం, ఉద్రేకం, జ్ఞానతృష్ణ, సత్య శోధన, ఉన్న గల్పికలు ఈ రెండూ. మనిషిలోని అంతఃకరణలు అంతరించిపోకుండా మానవీయ విలువలు నిలవాల్సిన ఆవశ్యకతని చిత్తశుద్దితో చిత్రించారు - ఇద్దరు రచయితలూ! ఇద్దరి కిద్దరే - కలంబలం కల కథకులు. ఇద్దరికీ అభినందలు!
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech