కథా భారతి  
     

    బంగారు కల 

 - రచన: హేమ వెంపటి
 

 

   తూరుపుదిక్కు వెల్లబారింది.  రామిరెడ్డి పొలంలో ఏపుగా పెరిగి  , విరబూసిన పొద్దుతిరుగుడు పూలన్నీ   తలలు తిప్పి, ఏకదీక్షగా  తూరుపుదిక్కును గాలిస్తున్నాయి సూర్యుని కోసం! ఆ పొలమంతా నిండుగా అలంకరించబడ్డ పెళ్లి పందిరిలా కలకల లాడుతూ   మెరిసిపోతోంది.

            అటువైపుగా తన పొలానికి వెడుతున్న దొణప్పని కన్నుల పండుగగా ఉన్న ఆ పొలం ఆకర్షించింది. "ఎంత బాగుంది ఈ పొలం" అని అనుకోకుండా ఉండలేక పోయాడు దొణప్ప. కాని వెంటనే అతని మనసులోకి మరో ఆలోచన కుడా వచ్చింది......

             " రామిరెడ్ది మొదలే మోతుబరి రైతు ! అందుకే పొలంలో బోరు వేయించగలిగాడు. ఆ తరవాత, ఆ బోరు బావి సాయంతో వ్యవసాయంచేస్తూ మరింత స్థితిపరుడయ్యాడు.  ఎలాగైనా రామిరెడ్డి అదృష్టవంతుదే " అనుకున్నాడు దోణప్ప దిగులుగా.

                          రామిరెడ్డి పొలం పక్కనే ఉంది దొణప్ప పొలం. అందులో పెరుగుతున్నవీ పోద్దుతిరుగుడుపూలె . కాని ఎంత తేడా వుంది ఆ రెండు పుఉలకీ ! నీరు చాలక పోవడం వల్ల తన పోలంలోవి  పీలగా ఉన్నాయి. అంతే కాదు, సూర్యుణ్ణి తలుచుకుని భయపడుతున్న వాటిలా తలలు వాల్చుకుని ఉన్నాయి ! ఇంక రెండు రోజుల్లోగా వాన పడకపోతే, తానా పంట మీద ఆశ వదిలేసుకోవచ్చు - అనుకున్నాడు బాధగా దొణప్ప. అప్పుడు వచ్చింది అతని మనసులోకి ఆ ఆలోచన......

          "బోరు కాకపోతే పోయె, ఒక మామూలు బావైనా పొలంలో ఉండాలి. లేకపోతే వ్యవసాయం చెయ్యడం చాలా కష్టం. బావి ఉంటే దానికి మోటారు బిగించి పొలంలో బంగారం పండించవచ్చు! ఆ తరవాత నేమున్దిత , చూస్తూండగా సంపన్నులమైపోవదమే, రామిరెడ్డిలా" అన్న ఆలోచన, పురుగులా, దొణప్ప మనసులో ప్రవేశించి దొలవసాగింది. అది మొదలు, బోరు కాపోతే పోయె, పొలంలో ఒక బావైనా వుంటేనేగాని వ్యవసాయంలో సరైన ఫలసాయం రాదు....అన్న భావం పొడజూపి సెలవేసింది అతని హృదయపు లోతుల్లో .

               దొణప్పకి ఒక కూతురు, తరవాత ఇద్దరు కొడుకులు వున్నారు. వాళ్ళు చిన్న పిల్లలే, కాని కూతురు పుట్టినదాది భార్య తాయారు పోరు పెట్టడంతో, పిల్ల పెళ్లికని ఎప్పటికప్పుడు ఇంతో అంతో సొమ్ము అతడు వెనకేస్తూ వచ్చాడు. పిల్ల కింకా పదేళ్లైనా నిండలేదు. పెళ్లికి తొందర లేదు అప్పుడే. పద్దెనిమిది నిన్డటానికి ఇంకా చాల వ్యవధి వుంది కదా! ఇప్పుడప్పుడే తొందర లేదు. ఆ డబ్బుతో తను పొలంలో బావి తవ్వించి, దానికి మోటారు తగిలించి, అవసరమైనప్పుడు వాడుకుంటూ సేద్యం చేస్తే, చూస్తూండగా తానూ కుబేరుడైపోడా! అప్పుడింక ఒక్క ఆడపిల్ల పెళ్లి చెయ్యడం అదేమంత కష్టం కాదు. " ఔనన్న వరుని దెచ్చి, నా సామి రంగా.... అంగరంగ వైభోగంగా పెళ్లి జరిపించనూ" అనుకున్నాడు  దొణప్ప మనసులో ఉత్సాహంగా ఉంటుంది.

                       మెరకచేలో వర్షాధారంగా పంట పండించే రైతు కనే బంగారు కల పొలంలో బావి!
                       అదునుకు వానలు కురిస్తే కృషీవలునిపై కనక వర్షం కురిపించగల ఆ పొలాలు, వర్షాలు ఎగబెట్టి నప్పుడు, ఎక్కడా పచ్చదనమన్నది కనిపించకుండా, బొగులు బొగులుమంటున్న  బోడి బయళ్లై , ఎండమావుల్ని సృష్టించే మరుభూములుగా మారిపోతాయి. అటువంటప్పుడు కర్షకుని ఆదుకునేది ఆ పొలంలో ఉన్న బావి మాత్రమే. 

                     కాని , మరీ ఎక్కువ రోజులు వర్షాలు కురవకపోతే నూతులూ, చెరువులూ, వాగులూ వంకలూ - అన్నీ ఎండిపోయి, తాగు నీరు కూడా కరువై, ఆ ప్రదేశం క్షామదేవతకు నిలయంగా మారిపోతుంది.

                      "ఎలాగైనా పొలంలో ఒక బావి తవ్వించాలి. లేకపోతే నా ఆబోరు దక్కదు" అనుకున్నాడు దోణప్ప. వెంటనే లేచి బయలుదేరేడు పంతులు గారి దగ్గిరికి భావికి ముహుర్తాం కోసం ...  తన పొలంలో బావితవ్వించాలనుకోగానే దొణప్ప, పంతులుగారిచేత మంచి ముహూర్తం పెట్టించి , సరిగా ఆ ముహూర్తంలో  గ్రామ దేవతకు, నేలతల్లికి మొక్కి బావి పని ప్రారం భించాడు. పుడక శాస్త్రం చేయించాడు, గణాచారిని ప్రశ్న అడిగాడు, ముడుపులు కట్టాడు, ఇంకా ఎన్నెన్నో శాంతులు చేయించాడు. ఇవికాక ప్రత్యక్ష సాక్ష్యంగా భూమిలో లోతుగా గుంట తవ్వించి ఆ ప్రదేశంలో తడి ఎంత లోతున తగుల్తుంది అన్నది తెలుసుకున్నాడు. అన్నీ సంతృప్తిగా ఉన్నాయనిపించిన తరువాతనే పూలతో, పసుపు కుంకాలతో భూమి పూజ చేసి  కొబ్బరికాయలు పగలేశారు, కోడిని కోశారు. అప్పుడు వుప్పర్లు వచ్చి తవ్వకం పని మొదలు పెట్టారు. పని చక చకా సాగుతోంది... 

                    బ్యాంకులు లోను ఇస్తున్నాయంటే, తనకు అప్పు కావాలని అర్జీ పెట్టాడు దొణప్ప. ష్యూరిటీ కావాలన్నారు బ్యాoకు వాళ్లు. ఒక సామాన్య వ్యవసాయదారునికి ష్యూరిటీ సంతకం చెయ్యాలంటే ఎవరూ ముందుకు రాకపోడంతో, చివరికి భూమినే తనకాగా ఉంచి డబ్బు అప్పు తీసుకోవలసివచ్చింది. చేతిలో డబ్బు ఐపోయే సరికి లోన్ డబ్బు అందింది. బావి ఏడు నిలువుల లోతుకు వెళ్లింది. అప్పుడు వినిపించింది గునపం పోటు "ఖంగ్"మంటూ చేసిన చప్పుడు. "బావిలో బండపడింది" అంటూ హహాకారాలు చేశారు పనివాళ్లు. దొణప్పకు ఒళ్లు ఝల్లుమంది. 

                  ఇంతవరకూ వచ్చాక పని ఆపడం కుదరదు కదా! ఉప్పర వాళ్లకు సెలవిచ్చి పంపేసి, రాతి పనివాళ్లకు కబురుపెట్టాడు దొణప్ప. ఇంక మొదలయ్యింది అసలైన ఖర్చు. పనివాళ్లకు ఎక్కువ కూలి ఇవ్వాల్సిరావడమే కాక డైనమైట్, దానిని పేల్చడానికి కావలసిన ఇతర హంగులూ కూడా కొనవలసి రావడంతో డబ్బు ధారాళంగా ఖర్చైపోతోంది. తట్టుకోలేకపోయాడు దొణప్ప. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకపోడంతో, పని ఆపెయ్యవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సాయంకాలం పనివాళ్లను పంపించి ఇంటికి వచ్చిన దొణప్ప నెత్తిని చెయ్యి ఉంచుకుని గుమ్మంలోచతికిలపడ్డాడు ఉసూరుమంటూ.

           భర్తను చూసి చేతిలో పని ఆపి అతని దగ్గరకు వచ్చింది తాయారు. "ఏంటయ్యా! ఏమయ్యింది" అని అడిగింది ఆత్రంగా.. "బాయిలోన బండబడె, బక్కరైతు బంగపడె ! ఎట్ట జేస్తురయ్యో ఈ యెగసాయమూ... " అని దీర్ఘంతీస్తూ భోరున ఏడ్చాడు దొణప్ప. 
            తాయారమ్మకి అర్థమైపోయింది. కాని భర్తకు ధైర్యం చెప్పడం తన బాధ్యత అనుకుంది. దగ్గరగా వచ్చి అతని బుజమ్మీద చెయ్యేసి, " బాధ పడకయ్యా! రాతికింద నీరు జాస్తీ ఉంటుంది. ఇంకొక్క పొర దీస్తే జల జలజలా పడుతుంది. దిగులేట్టుకోబోకయ్యా" అంది ఓదార్పుగా.
 
             "చిల్లర డబ్బులు కూడా మిగలకుండా ఖర్చెట్టేస్తిని. ఇప్పుడేంజెయ్యాలో దిక్కు తెలియడం లేదే తాయారూ! ఇక స్పీడు వడ్డీకి అప్పుదేవాలి. వాళ్లూ తాకట్టు అడుగుతారేమో. "

             "అప్పొద్దు, ఇప్పటికే చాలా ఉన్నాయి అప్పులు. నావీ పిల్లవీ కొద్దిపాటి నగా నట్రా ఉన్నాయి కదా! ఉన్న వెండి బంగారాలు అమ్మి పని జరిపించు. మంచిరోజులు వచ్చాక మళ్లీ చేయిద్దువులే"అంది.

               "అంతేనంటావా ! సరైన వర్షం పడకపోడంతో పైరు అక్కరకొస్తుందన్న నమ్మకం కూడా పోయింది. ఈ ఏడు సూర్యకాంతం విత్తడానికి పెట్టిన పెట్టుబడి మీద నష్టం రాకుండా ఉంటే చాలు మనం బతికి బయటపడినట్లేనే తాయారు.. నీరసంగా తన ఒప్పుదలని వ్యక్తం చేశాడు దొణప్ప.

                "మరైతే బువ్వ తిందువుగాని, పద" అంటూ తను ముందు లోపలకు దారితీసింది తాయారమ్మ. దొణప్ప లేచి కాళ్లూ చేతులూ కడుక్కోడానికి దొడ్డివైపుకి వెళ్ళాడు. 

            చేతులూ కాళ్లూ శుభ్రంగా కడుక్కుని, నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేస్తూ, అలవాటుగా తలేత్తి ఆకాశాన్ని పరికించి చూశాడు దొణప్ప. ఆకాశంలో మేఘాలు పరుగులు తీస్తున్నాయి. ఉత్తరాన దిగంతరేఖ దగ్గర మదపుటేనుగుల్లాంటి కారుమబ్బులు ఒకదానితో ఒకటి ఢీకొంటూ, తోసుకు తోసుకు ముందుమున్దుకి వస్తున్నాయి. ఉండుండీ ఒక మెరుపు కనిపిస్తోంది. చూస్తూండగా గాలి చల్ల బడింది. అది చూసి సంతోషించాడు దొణప్ప. కొంచెం సేపట్లో వర్షం పడవచ్చునన్న ఆశాభావం కలిగింది అతనికి. తుండు గుడ్డతో చేతులు తుడుచుకుని భోజనానికి కూర్చున్నాడు.

             దొణప్ప భోజనం చేస్తూండగా పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములుతో మొదలయ్యింది వాన. "ఈ వాన ఇలా సాగితే ఇక ఈ సంవత్సరం మనమంతా గట్టెక్కేసినట్లే! ఈ ఏడాదికి పొలాలకు నీటి ఇబ్బంది ఉండదు. మంచి దిగుబడికి ధోకా లేదు" అన్నాడు భార్యతో అతడు.

              భోజనం ముగించి, వాన ఏపాటిగా ఉందో చూడాలని వెలుపలకు వచ్చాడు దొణప్ప. అతని వెనకే వచ్చింది తాయారమ్మ. అంతలో ఎక్కడనుండి వచ్చిందో, విసురుగా వచ్చిన మాయదారి గాలి ఆకాశంలో మేఘాల్ని చెల్లాచెదరు చేసేసింది. వాన ఆగిపోయింది. తడిసిన ఎండుటాకులు గాలివేగానికి పైకి లేచి, సుడులు తిరుగుతూ విసురుగా ఎగిరి వచ్చి ఆ దంపతుల మొహాల్ని తాకాయి. చేతులతో మొహాలు కప్పుకుని ఉసూరు మన్నారు వాళ్లు.

                 డైనమైట్ ధర పెరిగింది, లోతు  కెళ్ళినకొద్దీ కూలి కూడా పెంచారు. అక్కడితో వెండి బంగారాలమ్మగా వచ్చిన డబ్బు ఏ మూలకీ రాలేదు. తాయారమ్మ వెళ్లి గణాచారిని ప్రశ్న అడిగి వచ్చింది. తొమ్మిదవ మట్టులో నీరు తగులుతుంది అని చెప్పింది దేవత. 

                   దొణప్పలో కసిపెరిగింది. ఏమైనా దీని అంతు చూడాల్సిందే - అనుకున్నాడు. వెంటనే పొలంలో ఒక వారగా ఒక పూరిల్లు వేసి అందులోకి మకాం మార్చి, పాత ఇల్లు బేరం పెట్టేశాడు. అది మూడు తరాలనాటి పాత కొంప కావడంతో పెద్దగా ధర పలకలేదు. ఇప్పటికే మన్ను ఏడు మట్లు, రాయి కొంచెం తక్కువగా ఒకటిన్నర మట్లు తవ్వడం అయ్యింది. ఇంక తవ్వాల్సింది ఒక్క మట్టుకి తక్కువే ఉంది. అది పూర్తైతే తానూ దర్జాగా వ్యవసాయం చేసుకోవచ్చు - అనుకున్నాడు ఆశగా. ఐనకాడికి ఇల్లమ్మి ఆ డబ్బు కూడా బావి మీదే పెట్టాడు దొణప్ప.

                లోతు ఎక్కు వయ్యిన కొద్దీ పనివాళ్లు కూలి ఎక్కువ అడుగు తున్నారు. కాని ఇవ్వక తప్పదు. నెమ్మదిగా పని సాగుతోంది. చివరిసారిగా పట్నంవెళ్లి, తన దగ్గరున్న మొత్తం డబ్బుతో డైనమైట్ తీసుకు వచ్చాడు దొణప్ప. "ఇదే ఆఖరు ఛాన్సు. ఈ దెబ్బతో తాడో, పేడో తేలిపోతుంది" అనుకుంటూ. ఆ ఉద్వేగంలో అతడు ముందు వెనుకలు చూసుకోలేదు. చేతిలో ఉన్న డబ్బు చాలా వరకు ఖర్చు చెశాడు.
 
                     డైనమైట్ ఆఖరు స్టిక్ కూడా పేల్చడం అయ్యింది. ఆ శబ్దం, లోతైన ఆ వ్యర్థ కూపంలో గింగిరాలు తిరుగుతూ  భయంకరంగా ధ్వనించింది. కాని నీటి జాడ మాత్రం ఎక్కడా కనిపించ లేదు. కుప్ప కూలిపోయాడు దొణప్ప. ఇక ఆశలేమీ మిగల లేదు. పనిముగించి, పనివాళ్లు వచ్చి వరసలో నిలబడ్డారు కూలి డబ్బుల కోసం. డబ్బు సంచీ పైకి తీసాడు, కాని దొణప్ప దగ్గర చాలినంత డబ్బులేదు. బిక్క చచ్చిపోయాడు అతడు. పనివాళ్లు అతని బాధని అర్థం చేసుకుని, రేపు వచ్చి తీసుకుంటామంటూ వెళ్లిపోయారు.

             పట్టరాని దుఃఖంతో ఇల్లు జేరాడు దొణప్ప. విషయం అర్థం చేసుకుంది తాయారమ్మ. నిరాశతో మూగబోయిన మనసులతో ఇద్దరూ ఒకరి నొకరు పలుకరించుకోకుండా మౌనంగా ఉండిపోయారు. వాళ్లు భోజనాలు చెయ్య లేదు. పిల్లలకు మాత్రం తినిపించి పడుకోమని పంపించేసింది తాయారు. ఆ రాత్రి ఆ దంపతులకు కాళరాత్రే అయ్యింది.

                మరునాడు, ఎంత పొద్దెక్కినా మంచం దిగని భర్తను చూసి కళవెళ పడింది తాయారమ్మ. దగ్గరగా వెళ్లి పలకరించింది. " ఇదిగో, నిన్నటి సంగతులన్నీ మర్చిపో. నారోసిన వాడు నీరు పొయ్యక పోడులే. దిగులెట్టుకోకు" అంది.

                 "దిగులెట్టుకోక ఏంచెయ్యను చెప్పు? ఏదేదో ఆశించి ఉన్నది కాస్తా కూడా పోగొట్టాకదా! రేపు పిల్లలు నన్ను అడిగితే ఏం చెప్పను! అదలా ఉంచు, ఇంకాస్సేపట్లో కూలాళ్లు డబ్బు కోసం వస్తారు. కానిడబ్బు లేదు నాదగ్గర. ఎక్కడికైనా వెళ్లి అప్పు అడుగుదామంటే, ఎవర్ని పలుకరించాలన్నా నాకు మొహం చెల్లదనిపిస్తోంది. నాలాంటి నిర్భాగ్యుడికి  అప్పిస్తారన్న ఆశ కూడా లేదు.  నిన్న, కూలాళ్లు పాపం, వాళ్లంతట వాళ్లే, డబ్బిమ్మని రొక్కించకుండా వెళ్ళిపోయారు. ఈ వేళ ఏం చెప్పి పంపాలో నాకు తెలియడం లేదు. ముందు నుయ్యి వెనక గొయ్యి లా ఉంది నా పరిస్థితి!" ఇటువైపు తిరక్కుండానే చెప్పాడు అతడు భార్యకు జవాబు.

                తాయారమ్మ గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది అక్కడి నుండి. కొద్దిసేపట్లో మళ్లీ తిరిగి వచ్చింది.

                  "ఇదిగో, ఇది కాస్త నా మెళ్లో కట్టు చెపుతా" అంది తాయారమ్మ, భర్తకు దగ్గరగా వచ్చి అతన్ని తన వైపుకి తిప్పుకుంటూ. దొణప్ప ఆశ్చర్యంగా భార్యవైపు చూశాడు. పసుపు కొమ్ము కట్టి ఉన్న పసుపుతాడు అతని చేతిలో ఉంచింది తాయారమ్మ.

           తెల్లబోయాడు దొణప్ప. " ఎందుకిది" అని అడిగాడు ఆశ్చర్యంగా.

           " ఇది నీ అవసారం తీరుస్తుంది. ముందు నేను చెప్పింది చెయ్యి. ఆ తరవాత చెపుతా ఎందుకో" అంది ఆమె దృఢంగా. ఆమె చెప్పినట్లుగానే ఆ పసుపుతాడు ఆమె మేడలో కట్టాడు అతడు.

           వెంటనే తాయారమ్మ తన మెడలో ఉన్న మంగళ సూత్రాలు, బంగారు గొలుసుతోసహా తీసి అతని చేతిలో పెట్టింది.

             "తాయారూ" అంటూ ఆర్తనాదం లాంటి కేక పెట్టాడు అతడు.
             "ఒద్దు! కోప్పడకండి. మనకు మంచిరోజులు వచ్చాక మళ్లీ కొనొచ్చు. ఇప్పుడు ఇవి అమ్మి, ఆ డబ్బు కూలోళ్లకు ఇవ్వండి. పాపం వాళ్లూ బతకాలి కదా" అంది తాయారు.

              అవాక్కై ఉండిపోయాడు దొణప్ప, ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి. 
 
              చూస్తూండగా రోజు గడవడం భారమయ్యింది వాళ్లకి. డబ్బుకి కటకట వచ్చింది. ఇదివరకు ఎప్పుడో వాళ్లకి అప్పిచ్చిన వాళ్లు ఇప్పుడు తీర్చమని అడుగుతున్నారు. పూలమ్మిన ఊళ్లో కట్టెలు అమ్ముకు బ్రతకడం కంటే పొరుగూరు వెళ్లి పుడకలేరుకుంటూ బ్రతకడం మేలు - అన్న ఆలోచనకు వచ్చాడు దొణప్ప. వెంటనే పొలం బేరం పెట్టాడు. పది ఎకరాల ఏక ఖండం, అతనికి మిగిలున్న పొలం మొత్తం అదే! 

                తన పొలంలో కలిసే పొలం కనక  ట్రాక్టర్తో వ్యవసాయం తేలికౌతుంది - అంటూ రామిరెడ్డి ఆ పొలం కొనడానికి ముందుకి వచ్చాడు.కాని ఇద్దరి మధ్య బేరం తెగలేదు. బావి మీద తాను పెట్టిన డబ్బులో కొంచెమైనా రాబట్టాలని దొణప్ప ఆలోచనైతే, పొలంలో కొంత మేర ఆ bodiబావి ఆక్రమించడం వlla కొంత పొలం తనకి నష్టం వచ్చింది కనుక, ఇంత కంటే ఎక్కువ ఇవ్వనక్కరలేదని రామిరెడ్డి అనుకున్నాడు. పట్టు పట్టారు ఇద్దరూ. 

                     కాని దొణప్పకి ఉన్న తొందర రామిరెడ్డికి లేదు. పోనీ అని మరెవరికైనా అమ్మడానికి దొణప్ప సిద్ధపడినా, రామిరెద్డికి జడిసి ఎవరూ కొనడానికి ముండుకి రావడం లేదు. పచ్చి వెలక్కాయ గొంతులో అడ్డుపడ్డట్లు దొణప్పకి ఊపిరి ఆడకుండా తయారయ్యింది పరిస్థితి. చివరకి తప్పనిసరిగా ఆ పొలం రామిరెడ్డికే ఇచ్చెయ్యాలనే నిర్ణయానికి రాక తప్పలేదు అతనికి. 

                ఒక నిశ్చయానికి వచాదన్నమాటేగాని , ఆ రాత్రి ఇక దొణప్పకి నిద్ర పట్టలేదు. అశాంతితో దుఃఖంతో రాత్రంతా పక్కమీద అటూ ఇటూ దొల్లుతూనే ఉన్నాడు. తను తన పిల్లలకు ఇవ్వవలసినదాన్ని, ఇలా గతిమాలి అమ్ముకోవలసి రావడమన్నది అతడు హరాయించుకోలేకపోతున్నాడు. తనకు బావి తవ్వించాలన్న ఆలోచన రావడం మొదలు జరిగిన వన్నీ సినిమాలా, అతనికి కళ్ల ఎదుట కనిపించ సాగాయి. తగని విషయాన్ని తలకి ఎత్తుకుని తను కుటుంబానికి చెయ్యరాని ద్రోహం చేసినట్లు భావించి, తనని తానే నిందించుకున్నాడు ద్రోనప్ప. పిల్లల భవిష్యత్తు తలుచుకుని విపరీతమైన వ్యధను అనుభవిస్తున్నాడు అతడు. తలనెప్పితో అతనికి తల భారంగా తయారయ్యింది. కాసేపు ఆరుబయట తిరగాలనిపించింది. 

                 తెల్లారబోతోందన్నదానికి గుర్తుగా దొడ్లో గంపకింద ఉన్న కోడి గొంతెత్తి కూసింది. దొణప్ప నెమ్మదిగా మంచం దిగాడు. పూరింటి తడిక తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు. శరద్రాత్రులు కావడంతో వెన్నెల వెలుగులు నేలంతా ,  పిండారబోసినట్లు తెల్లగా పరుచుకుని ఉంది. చల్లగాలి సేదదీర్చేదిగా ఉంది. కాని ఆ సొగసులేమీ పట్టించుకునే స్థితిలో లేడు అతడు. బయట పచార్లు చేస్తున్న దొణప్ప దృష్టిని ఆకర్షించింది అల్లంత దూరంలో  అసంపూర్ణంగా మిగిలి  ఉన్నబావి. 
                    "ఈ బావి కోసం ఆశపడే కదా, నేను సంసారాన్ని దరిద్రమనే  సుడిగుండం పాలుచేశాను! నా శక్తిని నేను తెలుసుకోకుండా, ఎవరికో వుంది కదా అని, నాకూ బావి కావాలనుకోడం నేను చేసిన పెద్ద తప్పు.  పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అయ్యింది కదా చివరికి నా పరిస్థితి"  అనుకున్నాడు దొణప్ప విచారంగా. ఉక్రోషం, ఉద్వేగం లాంటివి క్షణ క్షణం పెరిగిపోతూండగా ఏదో ఒకటి చేసి కసి తీర్చుకోవాలన్న తహ తహ పుట్టింది అతనికి. విసురుగా, పెద్ద పెద్ద అంగాలు వేసుకొంటూ బావి వైపుకి నడవ సాగాడు.

                              భర్త పక్కన పడుకున్న తాయారమ్మకు కూడా ఆ రాత్రి సరిగా నిద్రపట్ట లేదు. అసలే బాధలో ఉన్న భర్తను పలకరించి మాట్లాడి, అతని బాధను మరింత పెంచడం ఇష్టంలేక కళ్లు మూసుకుని కదలకుండా, నిద్రపోతున్నట్లుగా పడుకుని ఉండిపోయింది ఆమె. తెల్లారేముందు ఆమెకు కొద్దిగా కునుకు పట్టింది. కాని అంతలోనే ఎవరో తట్టి  లేపినట్లు ఆమెకు మెలకువ వచ్చేసింది. 

                               పక్కన భర్త లేకపోడంతో కంగారుపడి మంచందిగి ఇవతలకు వచ్చింది. తెరిచిఉన్న తలుపు చూడగానే ఆమెకు మరింత భయమేసింది, బయటికి వచ్చి చూసిన తాయారమ్మకి వెన్నెల వెలుగులో దూరంగా, బావివైపుకి వెడుతున్న దొణప్ప కనిపించాడు. దూరం నుండి ఆమె చూస్తూండగానే మెట్లమీదుగా నూతిలోకి దిగిపోయాడు దొణప్ప.ఆమె మనసు కీడును శంకించింది. ఒక్క పరుగున బయలుదేరింది ఆమె, అతన్ని అందుకోవాలని.

           దొణప్ప క్రిందికంతా దిగి బావి మట్టును చేరుకున్నాడు.  మట్టులోనిలబడి ఆ శుష్క కూపాని పరికించి చూసాడు. అతని ఉక్రోషం తార స్థాయికి చేరడంతో హిస్టీరియా వచ్చిన వాడిలా ఊగిపోతూ కేకలుపెట్టాడు......

            "పాపాత్మురాలా! తల్లివని నమ్మా కదమ్మా నిన్ను! నన్నే బలిగా కోరుకుంటావా అమ్మా! కన్న బిడ్డల్నే పలహారం చేసే నాగుపామువని తెలుసుకోలేకపోయా. గండకత్తెరvai నా బ్రతుకును ముక్కలు ముక్కలు చేశావుగదే! అన్నీ మింగేశావు, రేపీ పొలం కూడా రెడ్డి పరమైపోతుంది. వచ్చిన డబ్బు అప్పులకు సరిపోతుంది. ఇంక నీకు జవాబుదారుగా మిగిలింది నే నొక్కణ్ణే కదా. రేపు నా పెళ్ళాం బిడ్డలకు నేనేం సమాధానం  చెప్పగలను? నన్నూ సాంతం మింగేసి నీ దాహం తీర్చుకో!"

            "నన్నూ మింగి నీ దాహం తీర్చుకో...." అన్న మాటనే పట్టుకుని, పదే పదే అదే అంటూ, తల రాతి మట్టుకు కొట్టుకుంటూ అరవసాగాడు దొణప్ప పిచ్చిపట్టిన వాడిలా. అతని తల పగిలి రక్తం చిమ్మింది. విపరీతమైన ఉద్వేగంవల్ల స్పృహ తప్పి పడిపోయాడు అతడు. సరిగా అప్పుడే తాయారమ్మ బావిలోకి దిగి వచ్చింది. భర్త కింద పడిపోడం చూసి కంగారుగా దగ్గరకు వచ్చి, అతన్ని ఒడిలోకి తీసుకుని అసహాయంగా ఏడవడం మొదలుపెట్టింది ఆమె.

           అకస్మాత్తుగా చిటపట శబ్దాలు వినిపించడంతో, తాయారమ్మ ఏడుపాపి విన సాగింది. నూతి మట్టులో దోణప్ప తల పెట్టి కొట్టినచోట ఒక చిన్నపగులు ఏర్పడింది. ఆపై ఒక చిన్న  పెళ్ల ఊడి, ఎగిరిపడింది. వెనువెంటనే చిమ్మనగ్రోవితో చిమ్మినట్లుగా నీరు పైకి లేచి ఆ దంపతుల మీద జల్లుగా కురిసింది. చల్లని నీరు మీద పడడంతో తెలివిరాగా, కళ్లు తెరిచాడు దొణప్ప. చిట పట శబ్దాలు అంతకంతకీ పెరుగుతున్నాయి. తాయారమ్మ కంగారు పడుతూ భర్తను రెక్కపట్టుకుని లేవదీసి మెట్ల మీదుగా డిపించసాగింది. వాళ్లింకా రాతి మెట్లమీద ఉండగానే, ఫెళఫెళ మంటూ బావి మట్టు ఛిన్నాభిన్నమైపోయి ,మహా వేగంతో నీరు పైకి లేచి, బావి నిండసాగింది. దిగ్భ్రాంతితో నిలబడి చూస్తున్న ఆ దంపతుల కాళ్లను తాకింది నీరు.

              కాళ్ల కింద జేరిన నీటి ఉరవడికి అరికాళ్లలో చక్కిలిగిలి పుట్టడంతో కిలారున నవ్వి, "ఇదిగో, వినిపిస్తోందా! గంగమ్మ తన తప్పు దిద్దుకున్నానని, ఇక నవ్వుతూ బతకమని గిలిగింతలు పెట్టిమరీ చెపుతోంది మనకు, చూశావా! ఇంక నీకు ఏ భయం లేదు. అంతా ఆనందమే!" అంది తాయారమ్మ.
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech