కథా భారతి  
 

    చేదు నిజం         

 రచన: గన్నవరపు నరసింహమూర్తి

 
 
‘హలో మోహన్! చాలారోజులైందిరా నిన్ను చూసి, ఇప్పుడే ఊళ్ళో పనిచేస్తున్నావు?’ నేను స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ దగ్గర ఆటో దిగుతుంటే అక్కడే నిలబడి ఉన్న వ్యక్తి నన్ను అడిగాడు. ఆ వ్యక్తిని ముందు పోల్చుకోలేకపోయినా కొద్ది క్షణాల తరువాత గుర్తుపట్టాను. వాడు రమణ; బి.ఈడీలో నా క్లాస్ మేట్.

‘హలో రమణా! నువ్వేంట్రా ఇలా తయారయ్యావు. అసలు నిన్ను పోల్చుకోలేకపోయాను తెలుసా! బీఈడీ చేస్తున్నప్పుడు ఈన కర్రలా ఉండేవాడని ఇప్పుడు డ్రమ్ లా తయారయ్యావ్. అదిసరే నేను విజయనగరం మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో సైన్స్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. మరి తమరు? అని వాణ్ణి నేను అడగబోతుంటే వెనుక నుంచి నా భుజం మీద దెబ్బ పడటంతో ఆశ్చర్యంతో వెనక్కి తిరిగాను. అక్కడ మా మరో క్లాస్ మేట్ రాజు ఉన్నాడు. హాయ్ రాజూ..ఆహా! మనవాళ్ళందరూ స్పాట్ కి దిగుతున్నారన్నమాట. పదండి..లేకపోతే లేతైపోతుందంటూ లోపలికి వెళుతుండగా ముర్తి, గిరి లు కూడా కలిసారు. మేమందరం ఐదేళ్ళ క్రితం విజయనగరం బి.ఈడీ కాలేజీలో కలసి చదువుకున్నాము. ఇప్పుడు స్పాత్ వాల్యుయేషన్ లో కలిసాము.

చదివు పూర్తైన వెంటనే మేమంతా ఎక్కడెక్కడో టీచర్లుగా ఉద్యోగాలు రావడంతో చెల్లాచెదురయ్యాము. అదృష్టవశాత్తూ ఇన్నాళ్ళకు పదవతరగతి పేపర్లు దిద్దటానికి విశాఖపట్టణం డ్యూటీ మీద రావడం వల్ల వీళ్ళందర్నీ కలిసే అవకాశం కలిగి ఉంది.

అప్పటికే పదకొండు కావడంతో పరుగుపరుగున రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నాపేరు నమోదు చేయించాను.

అదొక పేద్ద విశాలమైన హాలు. అక్కడ స్పాట్ కి వచ్చిన చాలామంది టీచర్లు కౌంటర్లో తమ పేర్లను నమోదు చేసుకుంటూ ఆ రోజు దిద్దవలసిన పేపర్లను తీసుకుంటున్నారు. చూడటానికి చేంతాడులా క్యూ ఉంది. నేను కుర్చీలో నిలబడి ఆలోచిస్తుంటే..‘ఎక్శ్యూజ్ మీ’ అన్న మాటలు వినిపించి వెనక్కి తిరిగాను.

అంతే! నా కళ్ళల్లో ఆశ్చర్యం! అక్కడ దీప నిలబడి ఉంది. ఆమె కూడా నన్ను అంతే ఆశ్చర్యంతో చూస్తోంది.

‘మీరు దీప కదూ’ అన్నాను తడబడుతూ...
ఆర్యూ మిస్టర్ మోహన్? కరెక్టే కదూ..! అంది కనుబొమలు చిత్రంగా కదిలిస్తూ..

హమ్మయ్య, నన్ను బాగానే పోల్చారు. అయినా మోలో..సారీ నీలో పెద్ద మార్పేమీలేదు..ఇప్పుడు నువ్వు ఏ స్కూల్లో అంటుండగానే ‘అవన్నీ తరువాత పదండి ఆ కౌంటర్ ఖాళీగా ఉంది. పేపర్లు తెచ్చుకుందాం...అంటూ ఒక మూలగా ఉన్న కౌంటర్ వైపు వెళ్తుంటే నేను ఆమెని అనుసరించాను.

ఇద్దరం పేపర్లు తీసుకుని దగ్గర్లోనే ఉన్న కేంటీన్ కి వెళ్ళి ఒక మూల ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ చేసాము.

ఇప్పుడు చెప్పు దీపా! మనం చివరిసారిగా ఐదేళ్ళ క్రితం కలిసాము. నువ్వు ఎక్కడో టీచర్ గా పనిచేస్తున్నావనీ తెలుసుకానీ ఎక్కడో తెలియదు. తెలుసుకుందామని ఎన్నిసార్లు అనుకున్నా బాగుండదనీ ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఇంక నీ విషయాలు చెప్పు. అన్నాను కాఫీ అందుకుంటూ..

కానీ దీప నా మాటలు వినిపించనట్లు ఎటో చూస్తూ మౌనంగా కాఫీ త్రాగుతుండడంతో ఆశ్చర్యపోయి, సరే ముందు నా గురించి చెబుతాను. నేను విజయవాడ దగ్గర రాముడిపేటలోని హైస్కూల్ లో సైన్స్ అసిస్టెంట్ గా ఉన్నాను,. మన బి.ఈడీ పూర్తైన ఆర్నెల్లకే పోస్టింగ్ వచ్చింది. ఆ తరువాత సంవత్సరానికి మా మేనమామ కూతురు అంజలితో పెళ్ళైంది. ఇప్పుడు మాకు ఒక బాబు ఉన్నాడు.

అప్పటికి ఆమె కాఫీ త్రాగడం పూర్తైంది.
నీకు కాఫీ బాగా ఇష్టమనీ ఆర్డర్ చేశాను. అయినా నువ్వు కాఫీ తాగుతున్నప్పుడు మాట్లాడవని ఇప్పుడు గుర్తుకొచ్చింది.
ఇన్నాళ్ళైనా నా విషయాలన్నీ నీకు బాగా గుర్తున్నాయ్ మోహన్!
గుర్తుపెట్టుకున్నందుకు థాంక్స్. నేను విశాఖ పట్నం జిల్లా లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్నాను. మా వారిదీ అదే స్కూలు. అతను మనకి రెండేళ్ళు సీనియర్. ఇప్పుడు మాకిద్దరు పిల్లలు.

ఎన్నాళ్ళైనా నువ్వు గుర్తుంటావు దీపా! అయినా మరచిపోయేంతటి అల్పమైనదా చెప్పు మన స్నేహం? నీతో కలిసి జీవితాన్ని పంచుకుందామనీ అప్పట్లో చాలా ఆశపడ్డాను. కానీ ఎందుకో నువ్వే కాదనుకొని వెళ్లిపోయావు. కాఫీ కప్పుని ట్రేలో తిప్పుతూ నిరాశగా అన్నాను ఆమెతో.

ఆ తరువాత చాలాసేపు మా ఇద్దరి మధ్య మౌనం. కాసేపటికి ఆమె లేచి బయలుదేరడంతో నేను కూడా మరే విషయాలు అడగలేదు. ఆమె వెళ్ళిపోయినా చాలాసేపు నేను అక్కడే కూర్చున్నాను. ఆమె వెళ్లిపోయింది కానీ ఆమె వదలి వెళ్ళిన పరిమళం నన్ను ఉక్కిరి బిక్కిరి చెయ్యసాగింది.

ఆ సమయంలో ఆమెతో పరిచయం అయిన మా కాలేజీ రోజులు గుర్తుకురాసాగాయి.

* * *

నేను బి.ఎస్సీ చదువుతుండగా దీపతో పరిచయం అయింది. అదీ కాలేజీలో జరిగిన ఒక డిబేట్ లో ‘భారత దేశంలో స్త్రీకి స్వేఛ్ఛ ఉందా? ’ అన్న విషయం మీద జరిగిన వాదోపవాదంలో దీప మాట్లాడుతూ అమెరికా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలోని స్త్రీలకు స్వేఛ్ఛ చాలా తక్కువనీ స్త్రీలు చాలా సున్నితమైన వారనీ, పూజ్యనీయురాలనీ అబద్ధాలు చెబుతూ వారిని ఎదగనివ్వకుండా అడ్డుపడుతుంటారనీ అదీగాక స్త్రీ ఎదుగుదలను వారు సహించలేరనీ అందువల్లే సమాజం ముందుకు వెళ్ళటం లేదనీ ఆమె గట్టిగా వాదించింది.

దానికి ప్రతిస్పందనగా నేను కూడా మనదేశంలోని స్త్రీలు తాము పురుషులతో సమానమంటూనే తమకు రిజర్వేషన్లు కావాలనుకోవడం ‘ద్వంద్వనీతి’ కాదా? అంటూ తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడాను. ఆ రోజు పోటీలో ఆమెకు ప్రథమ బహుమతి వస్తే నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. అలా ఆ రోజునుంచి తొలి పరిచయం మొదలై చివరకు డిగ్రీ పుర్తయ్యేసరికి స్నేహంగా మారింది.

యాద్రుఛ్ఛికంగా ఇద్దరం బి.ఈడీ లో చేరాము. నాకు ఎమ్మెస్సీ చదివి లెక్చరర్ అవ్వాలన్న కోరిక ఉన్నా చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి మేనమామ ఇంట్లో పెరిగిన నేను అతని ఆర్ధిక పరిస్థితి చూసి చదివించమనీ అడిగే దైర్యం చేయలేకపోయాను. నా మేనమామ పల్లెలో ఒక సన్నకారు పేదరైతు. అతనికిద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి అంజలి, నన్ను చదివించి టీచర్ని చేసి అంజలికిచ్చి పెళ్ళి చేయాలన్నిది అతనికోరిక!

చనిపోతూ మా అమ్మ నన్ను అతనికి అప్పజెబుతూ ఆ కోరిక కోరినట్లు చెబుతుండేవాడు.

బి.ఈడీలో చేరిన తరువాత దీపతో నా స్నేహం మరింత బలపడి తరువాత ప్రేమగా పరిణామం చెందింది. కానీ ఆమె కుటుంబ నేపథ్యం చూసి నాది అత్యాశ అని అనుకునేవాణ్ణి. ఎందుకంటె ఆమె తండ్రి సంపన్న రైతు. అదీగాక ఆమె ఒక్కర్తే కూతురు. అటువంటి ఆమెను తనలాంటి పేదవాడికిచ్చి పెళ్ళిచేస్తాడా అన్న అనుమానం నాకు కలుగుతుండేది. కానీ దీప ప్రవర్తన మాత్రం అలా ఉండేది కాదు.

ప్రతీ సాయంత్రం క్లాస్ అయిపోగానే ఇద్దరం పార్క్ కి వెళ్లి రాత్రి ఎనిమిదింటి దాకా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మా సంభాశణలు ఎక్కువగా భావిజీవితం గురించి సాగేవి. ఇద్దరం పెళ్ళి చేసుకుని ఎంత ఆనందంగా జివితం గడపవచ్చో ఆలోచించే వాళ్ళం. దీపకి మంచి అందంతో పాటు కళలందు ప్రవేశం ఉండేవి. సంగీత సాహిత్యాల్లో ఆమెకి మంచి పట్టుండేది.

ఆమెకి కృష్ణశాస్త్రి, తిలక్ గేయాలంటే చాలా ఇష్టం. ఆమె వాటి గురించి చెబుతుంటే నేను శ్రోతనే అయ్యేవాణ్ణి. బి.ఈడి పూర్తై టీచర్లు కాగానే పెళ్ళిచేసుకుందామనుకుని నిర్ణయించుకున్నాం.

ఆ వేసవి సెలవుల్లో పల్లెకి వెళ్ళినపుడు నా మేనమామ అంజలి తో పెళ్ళి ముహూర్తాలు పెట్తిస్తానంటే కొంతకాలం ఆగమని నేనే సున్నితంగా తిరస్కరించాను. కానీ నెలరోజుల తరువాత నేను రిజల్ట్శ్ కోసం కాలేజికి వెళితే దీప కలిసి తనకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైందని, ఇక తాము కలుసుకోవడం కుదరదనీ, ఇంతకన్నా తాను మాట్లాడలేననీ చెప్పి వెళ్ళిపోయింది. అంత హఠాత్తుగా ఆమె చెప్పిన విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. రెండు నెలల దాకా మనిషిని కాలేకపోయాను. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆమె ఎందుకంత కఠినమైన నిర్ణయం తీసుకుంటుందో నాకర్ధం కాలేదు.

ఆ తరువాత నాకు మా జిల్లాలో జిల్లా పరిషత్ హైస్కూల్ లో టీచర్ గా ఉద్యోగం రావడంతో అందులో చేరిపోయాను. మరో రెండు నెలలకి అంజలితో నా పెళ్ళైపోయింది.

అలా ఆనాడు దూరమైన దీప మళ్ళీ ఇన్నాళ్ళకు ఇక్కడ కలిసింది.

* * *
స్పాట్ వాల్యుయేషన్ కి వచ్చేముందు పదిరోజుల సమయం ఎలాగడుస్తుందా అని భయపడుతూ వచ్చిన నాకు మళ్ళీ దీప రాకతో పదిరోజులూ పదిగంటల్లా గడిచిపోయాయి. మల్ళీ మా కాలేజీ రోజులు తిరిగి వచ్చాయనిపించింది.

ఆ రోజుతో మా స్పాట్ పూర్తైంది. ఆ మర్నాడు ఉదయమే మా ప్రయాణం. అందరూ దిద్దిన పేపర్లన్నీ అప్పజెప్పి రావలసిన డబ్బుని తీసుకుని ఎవరిదారిన వారు వెళ్ళిపోసాగారు. కానీ నేను, దీప మాత్రం సాయంత్రం వరకు మా పనులు పూర్తవగానే ఋషికొండ బీచ్ కి వెళ్ళాము.

బీచ్ లో దూరంగా ఎవరూ లేని ప్రదేశంలో ఇద్దరం కూర్చున్నాం. సాయం సంజ ఆహ్లాదకరంగా ఉంది. తీరం వెంబడి చల్లటి గాలులు వీచసాగాయి. మర్నాటి నుంచి మళ్ళీ విడిపోకతప్పని పరిస్థితి మాది. మళ్ళీ జీవితంలో దీపని చూస్తానో లేదోనన్న ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగింది.
ఆమె పరిస్థితి కూడా దాదాపు నాలాగే ఉన్నట్లనిపించింది. ఆమెను చూస్తుంటె.

అందుకే చాలా సేపటివరకు ఇద్దరం మాట్లాడుకోలేదు. హోరున వీస్తున్న గాలికి ఆమె ముంగురులు ఎగురుతుంటే వాటిని సరిచేసుకునేందుకు చాలా ప్రయాసపడసాగింది. చివరకు ఆ మౌనాన్ని ఛేధిస్తూ ఆమెకు చెప్పడం మొదలుపెట్టాను.

దీపా! జీవితాంతం కలిసి బ్రతుకుదామని నిర్ణయించుకున్న తరువాత నువ్వెందుకు కఠినమైన నిర్ణయం తీసుకున్నావో నాకిప్పటికీ తెలీదు. నువ్వు ఆ రోజు నీ పెళ్ళి విషయం చెప్పి నపుడు దాని కారణం కూడా చెబితే నాలో అంతర్మథనం ఉండేది కాదు. ఆ రోజు నువ్వు నీ నిర్ణయం చెప్పి వెళ్ళిపోయిన తరువాత సంవత్సరం దాకా నేను మనిషిని కాలేకపోయాను. ప్రియురాలుకఠినం...అన్న మాటను నిజంచేశావు. సరే గతం గతః ; కనీసం ఇప్పుడైనా దానికి కారణం చెబితే సంతోషిస్తాను. అదీ నీకిష్టం అయితేనే;

నా మాటలు ఆమె మీద బాగా ప్రభావం చూపినట్లున్నాయ్. అందుకే చాలా సేపటివరకు మాట్లాడలేదు. శూన్యంలోకి సముద్రకెరటాలవైపు చుస్తూ చాలా సేపు గడిపింది. ఆమెంత ప్రయత్నిస్తున్నా కంట్లో నీటిని ఆపడం ఆమె తరం కావడం లేదు. కొద్ది క్షణాల తర్వాత ఆమె మౌనాన్ని వీడింది.

కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం మోహన్! ఇప్పుడింతకన్నా నేనేమి చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం నిజం. నేను చాలా బాధతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నానని మాత్రం చెప్పగలను. జీవితం మనం వ్రాసే కథ కాదు కదా దాన్ని అందంగా ముగించడానికి అంది.. ఆమె మాటల్లో తీవ్రమైన నిరాశని గమనించాను. సర్లే దీపా! ఇంక ఆ విషయం వదిలెయ్యి. కనీసం ఈ ఒక్క రోజైనా సరదాగా మాట్లాడుకుందాం. ఏవైనా మంచి విషయాలు చెప్పు. ఎప్పట్లాగే మౌన ప్రేక్షకుడిగా అన్నీ వింటాను. మళ్ళీ నీ మాటలు వినే అవకాశం వస్తుందో రాదో! అన్నాను.

ఆ తరువాత చీకటి పడేదాకా ఇద్దరం ఎన్నో కబుర్లు చెప్పుకుని భోజనం చేసి ఇద్దరం విడిపోయాము.
అలా మళ్ళీ దీప నన్ను విడిచి మర్నాడు వెళ్ళిపోయింది.

* * *

నేను స్పాట్ వాల్యుయేషన్ నుంచి వచ్చిన పది రోజులకనుకుంటా స్కూల్లో క్లాసు చెబుతుంటె పోస్ట్ మేన్ ఒక ఉత్తరం తెచ్చిచ్చాడు. అదీ దీప దగ్గర్నుంచీ వచ్చిందని ప్ర్హమ్ అడ్రస్ చూడగానే తెలిసిపోయింది. పిరియడ్ పూర్తి కాగానే మా స్టాఫ్ రూంకొచ్చి ఉత్సుకతో దాన్ని చదవడం మొదలుపెట్టాను.

మోహన్ కి

దీప వ్రాయునది.

మొన్న స్పాట్ లో నిన్ను కలసినప్పుడు నోలో బాధని స్పష్టంగా గమనించాను.
ఆనాడు నీకు చెప్పకుండా నా పెళ్ళి నిర్ణయం తీసుకోడం నిన్ను చాలా క్షోభ కు గురిచేస్తుందని నాకు ముందు నుంచే తెలుసు. నువ్వు ఎలాగైతే రెండేళ్ళ దాకా మనిషివి కాలేకపోయావో నేను కూడా సంవత్సరం దాకా బాధపడుతూనే కాలం గడిపాను. నేను నిన్ను మోసం చేసానని ఇన్నాళ్ళూ నువ్వు భావిస్తున్నట్లు మొన్న నిన్ను కలిసినపుడు తెలుసుకున్నాను. అయినా అది నీ తప్పు కాదు. నీ స్థానంలో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు.

అసలు నా నిర్ణయం వెనుక కారణాన్ని ఆనాడే నీకు చెబితే కొన్ని స్పర్ధలు వస్తాయని అది మనిద్దరి భావి జీవితాలకు మంచిది కాదని తలచి అప్పట్లో ఆ సాహసం చెయ్యలేక పోయాను. కానీ ఈనాడు ఆ నిజాన్ని చెప్పవలసిన సమయం వచ్చిందని భావించి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.

ఈ విషయాలను నీకు ఆరోజే చెప్పవచ్చు. కానీ ఎందుకో నీ ముందర ఆ సాహసం చెయ్యలేకపోయాను. అందుకే ఈ ఉత్తరం.

ఆ రోజు శలవులకు ఇంటికి వెళ్ళిన తరువాత పదిహేను రోజుల తరువాతనుకుంటా మీ మేనమామ దగ్గర్నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. నీ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసి చదువు చెప్పించాననీ అందులో విపులంగా వ్రాసాడు. అదీకాక తన కూతురు అంజలిని కోడలిగా చేసుకోవాలన్నది తన చెల్లిలి అదే మీ అమ్మ గారి చివరి కోరిక అనీ, చనిపోయేముందు తనదగ్గర ఆమె మాట తీసుకుందనీ అందులో బాధపడుతూ వ్రాసాడు.

కానీ నువ్వు నా ప్రేమలో పడి అతని కూతురు అంజలిని పెళ్ళి చేసుకోవడానికి విముఖత చూపుతుండటంతో ఆ విషయం తెలుసుకుని ఉత్తరం వ్ర్రాసాడు.

అంజలి నీ మీద మనసు పడిందనీ నువ్వు పెళ్ళి చేసుకోకపోతే ఆమె బ్రతకదనీ కాబట్టి నన్నే ఏదో పరిష్కారం చూపి తనకుతురి పెళ్ళినీతో అయ్యేటట్లు చూడమనీ వేడుకుంటూ నీ మేనమామ వ్రాసిన ఉత్తరం నా నిర్ణయాన్ని మార్చుకునేటట్లు చేసింది! తన కూతురి వివాహం కొసం ఆ తండ్రి ఎంతటి ఆవేదన అనుభవిస్తున్నాడో ఆ ఉత్తరం ద్వారా తెలిసింది.

ఒకవేళ అతని కోరిక కాదనీ మనం పెళ్ళి చేసుకున్నా జీవితంలో మనకు మనశ్శాంతి ఉండదనిపించింది. అందుకే నిన్నుకాదనీ నాన్నగారు తెచ్చిన సంబంధాన్ని చేసుకున్నాను. కానీ ఈ చేదునిజాన్ని నీకు ముందే చెబితే అంజలితో నువ్వు జీవితాన్ని మనఃస్ఫూర్తిగా పంచుకోలేవని ఆనాడు ఆ విషయాలను చెప్పలేకపోయాను. అందుకే ఇన్నాళ్ళు గరళం లాంటి ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. ఇదీ జరిగిన సంగతి.

ఈ ఉత్తరాన్ని వ్రాస్తుంటే నాకెందుకో ఇప్పుడు తిలక్ అమృతం కురిసిన రాత్రిలోని ఈ వాక్యాలు గుర్తుకొచ్చాయి.

ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా
ఆనందం లాంటి విచారం కలుగుతుంది.
నేటి హేమంతం శిధిలపత్రాలమధ్య నిలచి
నాతి వసంతం సమీర ప్రసారాల తలచి
ఇంతేకదా జివితం అన్న చింత
ఇంతలోనే ముగిసిందన్న వంత
చెమ్మగిల్లే నా కళ్ళని ఎవరైనా చుస్త్రారేమో అని
చెదిరిన మనస్సుతో యిటుతిప్పుకుంటాను

చివరగా జివితం చాలా చిన్నది మోహన్! అందమైనది కూడా! ఉన్నన్నాళ్ళూ ఆనందంగా, ఉల్లాసంగా అనుభవిస్తూ దాన్ని గడపాలన్నది నా భావన. అప్పుడే దాని సార్ధకత.

ఏదైనా ఆనాటి మన పరిచయం ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోవాలని ఆశిస్తూ..

దీప..

ఆ ఉత్తరాన్ని పుర్తిగా చదవగానే కంట్లోంచి నాకు తెలియకుండానే ఒక అశ్రువు భారంగా బయటికొచ్చింది.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech