సారస్వతం  
     గగనతలము-30

రచన : డా||పిడపర్తి వెం.భా.సుబ్రహ్మణ్యం, పిడపర్తి పూర్ణ సుందర రావు

 
అయోమయం – అంతా అమృతమయం
 

జ్యోతిషంలో అంతర్భాగం వాస్తు. కానీ ఆశావహుడైన మనిషి నేడు వాస్తుకు స్వతంత్రరూపాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ రెండింటిని అధ్యయనము చేసేవానికి చాలావరకు మరియు చాలా కాలము వరకు అన్నివైపులా అయోమయంగానే అనిపిస్తుంది. ఆ అయోమయాన్ని ఛేదించగలిగితే అంతా అమృతమయమని మనం చెప్పవచ్చును. ప్రస్తుత మన వ్యాసంగము ఆ అయోమయాన్ని మన పరిశోధనాపరికరముగా ఎలా మలచుకోవచ్చునో చూడ ప్రయత్నిద్దాము.
 

వాస్తులో మర్మం ఏమిటి?


నలుగురు నాలుగు రకములుగ నిర్వచనము చెప్పే ఈ శాస్త్రము యొక్క ప్రత్యేకమైన స్వరూపమును తెలుసుకోవడానికి సాధారణంగా మనమందరము తక్కువగానే ప్రయత్నిస్తాము. తూర్పున భోజనం, ఈశాన్యం నుయ్యి, ఆగ్నేయం వంట ఇలా మనము బట్టీ పట్టిన కొన్ని విషయాలతో మనము మన అవసరాలను పూర్తి చేసుకోవడము చాలా ఆనవాయితీగా మారింది.
శ్రీరామపట్టాభిషేకానికి వసిష్ఠమహర్షి ముహూర్తాన్ని నిర్ణయించారు. మహర్షి ముహూర్తము దెబ్బతినకూడదు. మరి ఇది ఎలా సంభవించింది అంటే ఒకాయన పట్టాభిషేకానికి వేసిన సింహాసనము వాస్తుకు విరుద్ధముగా ఉండడమని కారణము చెప్పాడుట. అడవులపాలయిన రామపరివారము సీతను ఎలా కోల్పోయిందంటే పంచవటిలో అర్జునుడు నిర్మించిన పర్ణశాలకు ద్వారము అశుభస్థానములో ఉంచడమే అని ఆయన అభిప్రాయపడ్డాడు.


అపహాస్యము చేస్తున్నట్లు అనిపించినా ఈ వాదనలో చాలా వరకు నిజం కూడ ఉండవచ్చు. ఆ నిజమేంటో తెలుసుకోవాలంటే మనము మనను మన శాస్త్రాన్ని ప్రశ్నించుకోక తప్పదు. ద్వారమనేది యజమాని రాశిని బట్టి నిర్ణయిస్తారు. యజమాని రాశిప్రకారము అతనికి నప్పిన దిశలో ద్వారం స్థాపించడం జరుగుతుంది. ఆ విధంగా స్థాపించిన ద్వారము యజమానికి శుభాన్ని కలుగజేస్తుంది మరియు సుఖాన్ని ప్రసాదిస్తుంది.. కేవలము దిశ ఒక్కటే కాకుండ ఏకాశీతిపదవిభాగముద్వారా శుభాశుభస్థానమును నిర్ణయించి దానికి అనుకూలముగ ఆ దిశలోని శుభస్థానములో ద్వారాన్ని ఉంచడము ద్వారా శుభమును పొందవచ్చును.


ఇన్నిరకాలుగా నిర్ణయించిన ఈ ద్వారము యజమానికి శుభాన్ని ఎలా కలుగజేస్తుంది¿ అతని రాశికి అనుకూలముగా కట్టిన ఆ ఇల్లు అతని రాశికి భిన్నమైన రాశులు కలిగిన అతని కుటుంబ సభ్యులకు శుభాన్నిఎలా కలుగజేయగలదు¿ మహర్షుల వచనాన్ని ప్రమాణముగా అంగీకరిస్తూ కుటుంబసభ్యులకు కూడ ఆ స్థానము శుభప్రదమని స్వీకరిద్దాము. ద్వారస్థాపనలో ఇంతగా ప్రభావితము చేసే అంశమేమిటి¿ కొంతమంది చెప్పిన దాని ప్రకారము వాయు ప్రసరణ (ventilation) కారణమని భావిద్దాము. కానీ ఈ అంశము కొన్ని విషయాలలో కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. అప్పుడు ఏమి చేయాలి? యజమాని ఆ ఇంటిలో నివాసముండే పక్షములో గాలి ప్రసరణ అనేది అతనిని ప్రభావితము చేస్తుంది. కానీ ద్వారనిర్ణయమనేది యజమాని నివాసముండని గృహములకు కూడ తప్పనిసరి అని మనకు తెలుసు. అంటే ఇటువంటి సందర్భములలో యజమానిపేరు ఉన్నందనే అతనికి అనుగుణముగ పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదెలా సంభవము¿ యజమాని అందులో నివాసముండకపోయినా, యజమాని ఆ ఇంటికి కొన్ని వందల కిలోమీటర్ల దూరములో ఉన్నా కూడ ఆ గృహము అతనిని ఎలా ప్రభావితము చేస్తోంది?

 అంతదూరములో ఉన్నా ఇల్లు ప్రభావితము చేస్తోంది అంటే ద్వారాది నియమములు గాలిప్రసరణకు కాదని స్పష్టమవుతోంది. మరి ఎక్కడో మన పేరు మీద తీసుకున్న ఇంటికి కొలతలు, హద్దులు, కిటికీలు, ద్వారాలు ఇవి అన్నీ మన పేరు, మన రాశి మొదలుగువాటికి తగ్గట్లు ఉండడమేమిటి మరియు ఆ కొలతలు మనను వెంటాడడమేమిటి? పోనీ ఇవి అన్ని కథలు అందామంటే అనుభవములో ఇవన్నీ నిజాలని ఎందుకు తెలుస్తోంది. ఎవరిని అడిగినా అవి ప్రభావము చూపుతాయి. మా అనుభవములో స్పష్టమైంది అంటారు. పోనీ మీరు వీనికి భిన్నంగా తీసుకోండి అంటే ధైర్యము చేయలేరు. ఎందువలన? మనను అంతగా ప్రభావితము చేస్తున్న ఆ శక్తి ఏమిటి?


భూమికి ఒక ఆకారము ఉంది. దానిపై చాలా రకముల ప్రభావములు పనిచేస్తున్నాయి. ఉత్తర దక్షిణ ధృవములలో ఏర్పడే అయస్కాంతక్షేత్రము మొత్తము భూమిని ఆవరించి ఉంది. తూర్ప దిక్కుగా పయనిస్తున్న భూమిపై తదితరదిశలో ప్రయాణించే వాయువు ప్రసరిస్తోంది. భూమి తూర్పుకే కాక ఉత్తర దక్షిణములలో కూడ ఊగుతుండడంతో ఆ వాయువు దిశలో కూడ కాలాన్ని అనుసరించి మార్పు ఏర్పడుతోంది. నేలకు కూడ ఒక విధమైన ఆకర్షణ వికర్షణలు ఉన్నాయి. కాబట్టి ఇంటిని నిర్మించేటప్పుడు ఆ కొలతలు యజమానికి సరిపోయేటట్లు ఉండాలి అంటాము.


పెద్ద భూమిని మనము ఎన్ని ఖండాలుగా చేస్తే అన్ని ఖండాలలోను దాని లక్షణము సమానముగా ఉంటుందని మనము ఈ విషయంలో భావించవచ్చును. అంటే పునాది తవ్వగానే ఆ చిన్న భూభాగములో భూమికున్న అన్ని లక్షణములు మరియు శక్తులు పనిచేయడము ప్రారంభిస్తాయన్నమాట. కానీ మనము తవ్వకుండ కంచె వేసిన భూ భాగముకూడ మనపై ప్రభావము చూపుతోంది. మరి దీనికి కారణమేంటి అని ఆలోచిస్తే దానికి మనకు ఎదురుగా ఏ కారణములు కనిపించుటలేదు. మరి ఇదంతా నిజమేనా¿ దీనిని మనము ఏ విధముగా నమ్మగలము?


అయస్కాంతమునకు సహజసిద్ధమైన కొన్ని లక్షణములు ఉన్నాయి. దానిని ఎన్ని ముక్కలు చేసినా అందులో ప్రతి ముక్కలోనూ దాని సహజ లక్షణాలు కనిపిస్తాయి. అంటే దాని ప్రతిముక్కలోనూ దాని స్వతంత్రలక్షణాలు కనిపిస్తున్నాయని అర్థము. చిన్నపిల్లలలో మట్టి తినే అలవాటు ఉంటే దానికి అర్థము వారిలో ఇనుము శాతము తక్కువుందని గ్రహించమని వైద్యశాస్త్రము తెలుపుచున్నది. దానికి మందులు కూడ ఆవిధంగానే వాడతాము. సాధారణంగా మట్టి సన్నని నీటిధారలో ప్రవహిస్తున్నప్పుడు నీటి ప్రవాహము కింద స్పష్టంగా ఇనుపరజను కనిపిస్తుంది. నిరంతరభ్రమణములో ఉన్న భూమిపై ఉత్తర దక్షిణధృవాలలో ఏర్పడిన అయస్కాంత క్షేత్రము ఆవహించియున్నది. ఆ ఆవరణయొక్క ప్రభావము భూమిపై పూర్తిగా ఉన్నది. దానికి అనుగుణముగా మనము నివసించే భూఖండములో శక్తి కేంద్రీకరణకు మనము చేయు ప్రయత్నమే వాస్తు. ఆ శక్తిని వినియోగించుకోవడానికి మనము చేయు ప్రయత్నమే వాస్తులో ఉత్తరఘట్టము. ఉత్తరఘట్టములో భాగముగానే ఏ భాగములో ఏ గది ఉండాలి, ఎక్కడ కూర్చుని ఏ పని చెయ్యాలి అనే విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తాము. మన స్థానములో శక్తి కేంద్రీకరణ మన స్వభావానికి విరుద్ధముగా ఉంటే అది మనకు సరిపడని వాస్తు. అదే విధముగా దానిని వినియోగించుకోవడములో తేడా జరిగితే అది దోషము అని మనము చాలా వరకు భావించవచ్చును.


నివసించే భూభాగములో తూర్పు మరియు ఉత్తర భాగములలో పల్లముగా ఉండాలి. నీటి వాడకము కూడ అదే దిశలో ఉండాలి. బోరింగు మరియు నుయ్యను కూడ అదే దిశలో ఉంచుకోవాలి. పడమర మరియు దక్షిణము ఎత్తుగా ఉండాలి. ఆ భాగములలో గోతులు మరియు పల్లము ఉండరాదు. ఆ విధముగా అమర్చుకున్న భూభాగములో ఉత్తరధృవప్రభావము తగ్గి దక్షిణధృవప్రభావము పెరుగుతుందని మనము భావించవచ్చు. సజాతి ధృవములు వికర్షించుకుంటాయి మరియు విజాతి ధృవములు ఆకర్షించుకుంటాయి అనే సిద్ధాంతము ప్రకారము ఉత్తరధృవమునకు సంబంధించిన ప్రభావము ఆ భూఖండముపై ఎక్కువగా పడే అవకాశమున్నది.


అదే విధముగా భూమి తూర్పువైపునకు పరిభ్రమిస్తున్నది. అనగ దాని సాపేక్షముగ భూమిపై ప్రతివస్తువు పూర్వగమనంలో ఉన్నదని అర్థము. భూమి తూర్పునకు తిరుగుతున్నది కాబట్టి దానిపై దానికి భిన్నముగ పశ్చిమాభిముఖ ప్రభావము ఉండగలదని భావించడానికి ఎక్కువ అవకాశములు లేవు. ఈ విషయము చిన్న ఉదాహరణతో స్పష్టమవుతుంది.
ఆ ఉదాహరణతోబాటు మిగిలిన విషయములను వచ్చే నెల చర్చించుకుందాం.....
 

సశేషము.......
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech