శీర్షికలు  
     దేవుడున్నాడా? ఓ చర్చా వేదిక - 5

- ముత్తేవి రవీంద్రనాథ్,

 

నేను గత విద్యుల్లేఖ ఒకదానిలో  నాది 'జిజ్ఞాసువు' మార్గం అన్నాను. జిజ్ఞాసువు అంటే ఏమిటో కూడా అక్కడే మీకు స్పష్టం చేస్తే బాగుండేది.'జిజ్ఞాసు' అనే సంస్కృత పదానికి 'Desirous of knowing'అంటే  తెలుసుకుందామనే ఆసక్తి కల;inquisitive; curious అనే అర్థాలను వామన్ శివరాం ఆప్తే గారి  సాధికార నిఘంటువు The Practical Sanskrit - English Dictionary  (మోతిలాల్  బనారసీదాస్,ఢిల్లీ వారి ప్రచురణ)ఇచ్చింది.ఆ పదానికి ఇది సామాన్యార్థం కాగా,అదే శబ్దానికి 'Desirous of getting absolution'--ముముక్షువు అంటే మోక్షం కోరేవాడు అనే మరో అర్థమూ ఉంది.తెలుగులో 'డు,ము,వు లు ప్రథమా విభక్తి కనుక ఆ శబ్దానికి 'వు 'చేరిస్తే 'జిజ్ఞాసువు'అయింది. నేను ఆ శబ్దాన్ని' సత్యాన్వేషి' అనే సామాన్యార్థంలోనే వాడాను.
                       ఒక ప్రశ్నకు మరో ప్రశ్న ఎన్నటికీ సమాధానం కాబోదు.భగవంతుడు లేడని వాదించే వారి పని సులువు.కళ్ళకు కనబడడం లేదు గనుక,ఇంద్రియాలకూ,మనస్సుకూ దేవుడున్నట్లు ఎటువంటి ఆధారాలూ లభించలేదు కాబట్టి దేవుడు లేడని వాదించవచ్చు.కానీ  భగవంతుడు ఉన్నాడని నమ్మేవారు ముందుగా అతడున్నాడని రుజువు పరచాల్సి ఉంటుంది.దీనికి వేరే రుజువులేందుకు?మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఆ సృష్టి కర్తే లేకపోతే మనల్ని ఎవరు సృష్టించారు? మనల్ని సృష్టించినవాడే భగవంతుడు అంటారు ఆధ్యాత్మిక వాదులు.మనకొక  సృష్టికర్త ఉన్నాడనీ , అతడే భగవంతుడనీ కాసేపు మాట వరుసకు అనుకుందాం.ఇప్పుడు నా ప్రశ్న - ప్రతిదానికీ ఒక సృష్టి కర్త     ఉండి తీరాలన్నప్పుడు ఆ భగవంతుడికి మాత్రం సృష్టికర్త ఉండాల్సిన అవసరం లేదా? అంటాన్నేను.
                       ఛీ..ఛీ..భగవంతుడికి ఒక సృష్టికర్త ఉండడం ఏమిటి? అతడే అన్నిటికీ మూలమైన స్వయంభూ అయితే? అంటారు వారు.అలా తనకు ఒక సృష్టికర్త ఉండాల్సిన అవసరం లేని భగవంతుడు అనే ఒక స్వయంభూ ని ఊహించుకోగలిగిన ఆధ్యాత్మిక వాదులు పదార్ధం స్వయంభూ అని నేనంటే మాత్రం అంగీకరించరట.ఇదెంత విడ్డూరం! పై పెచ్చు పదార్థానికి ఉదాహరణలుగా పెన్నులూ సీసాలూ పేర్కొంటూ అవి సృష్టించడానికి ఒక సృష్టికర్త అవసరమేకదా? కాబట్టి పదార్ధం స్వయంభూ ఎలా అవుతుంది?అని తిరిగి  ప్రశ్నలు సంధించడం చిత్రం ! మిత్రమా - స్వయంభూ అయిన పదార్ధం అంటే పదార్థాల పరమాణువులు. వాటికి    సృష్టికర్త లేడని  నా అభిప్రాయం.ఏ పరమాణువుల సంఘాత విఘాతాలతో ఈ విశ్వమంతా ఏర్పడిందో దానినే నేను స్వయంభూ అంటున్నాను.ఆ పరమాణువుల లో  ఉన్న ప్రోటాన్లు,ఎలక్ట్రాన్లు,న్యూట్రాన్లు వగైరా పార్టికిల్స్ వివిధ పరిమాణాలలో కలవడం చేతనే దృశ్య ప్రపంచం లోని పదార్థాలు ఏర్పడ్డాయి.పదార్ధం అంటే తయారుచేయబడ్డ వస్తువు కాదు.ఏదైతే ఈ విశ్వానికి మూలమో,ఏది శక్తికి నిలయమో, ఏదైతే రూపం మారడం తప్ప నశించడం ఉండదో, ఏది ఎల్లప్పుడూ గమనం లేక గతి కలిగి ఉంటుందో, ఆ కారణంగా ఏది నిత్య పరిణామ శీలమో, దేని పరిణామ ఫలితంగా జీవమూ, ఆ తరవాత మెదడు, నాడీ మండలం, వివేచన , వివేకం వరుసగా ఏర్పడ్డాయో, దేని మీద ఆధారపడి భావం, ఆలోచన మనగాలుగుతున్నాయో అదీ  పదార్ధం అంటే.
                                ఇకపోతే ఈ విశ్వాన్నంతటినీ నడిపే ఒక శక్తి ఉంది-- అంటారు వారు. పదార్ధం బయట ఏ శక్తీ లేదు; అనశ్వరమైన పదార్థంలోనే ఆ శక్తి ఇమిడి ఉంది అంటాన్నేను.పైపెచ్చు ఎంత గొప్పదైనా ఆ శక్తికి విచక్షణా పూర్వకమైన చైతన్యం లేదంటాను.ఉదాహరణకు విద్యుత్ నే తీసుకుందాం.వివిధ మార్గాలలో ఉత్పాదన చేసిన విద్యుత్ ను మనకు కావలసిన ప్రాంతానికి తరలిస్తున్నాం.పంపిణీ చేసి మన అవసరాలకు వినియోగించు కుంటున్నాం.ఆ విద్యుచ్చక్తి పరిమాణం ఎన్ని వేల వోల్టు  లైనా  ఆ శక్తి మనం చెప్పినట్లే వింటూ మనకు ఊడిగం చేస్తూనే ఉందికదా?ఆ శక్తినే మీరు భగవంతుడు అంటారా--అప్పుడు దాన్ని తెలివిగా లోబరుచుకుని వినియోగించుకుంటూ దాని చేత అరవ చాకిరీ చేయిస్తున్న మానవుడు' సూపర్ గాడ్' అవుతాడు మరి.ఇది వారికి అభ్యంతర కరమేమో? ఇక్కడే ఇంకొక విషయం కూడా ఉంది.విద్యుచ్చక్తి ఎంత గొప్ప శక్తి అయినా దానికి విచక్షణాయుతమైన స్వంత చైతన్యం లేదు.అది ఎంత పాపులనైనా ఇన్సులేటర్లు వాడి జాగ్రత్తలు తీసుకుంటే ఏమీ చేయలేదు.ఎవరైనా పుణ్యాత్ముడైనా సరే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే షాక్ కొట్టి ప్రాణాలు తీస్తుంది.మరి  కర్మఫలదాతగా భగవంతుడికి ఉండాల్సిన యుక్తాయుక్త విచక్షణ లేనట్టి ఈ శక్తిని భగవంతుడని ఎలా అంగీకరిస్తారు వారు? ఏనుగుకు ఎంత శక్తన్నా ఉండనివ్వండి.అది యుక్తిపరుడైన మావటీడు యొక్క  అంకుశానికి లోబడి ఉంటుంది.అలాగే ఒక యుక్తా యుక్త విచక్షణ లేని  పోట్లగిత్త తనని సమీపించిన వారినందరినీ కుమ్మేస్తుంది..దానికి పుణ్యాత్ముడూ, పాపాత్ముడూ అనే ఎరుక ఉండదు.పదార్ధం లో ఇమిడి  వున్న  ఆ గొప్ప ప్రకృతి శక్తి,  పైన చెప్పుకున్న పరిమితుల కారణంగా భగవంతుడు కానేరదు.
                              ఇక మరో ప్రకృతి శక్తి సూర్యుడినే తీసుకుందాం.సూర్యగోళం మండే వాయు గోళం.అక్కడ నిరంతరం హైడ్రోజన్ పరమాణువులు కలిసి హీలియం  గా మారే ఫ్యూషన్ ప్రక్రియ సాగుతూ ఉంటుంది.ఆ చర్య సందర్భంగా అపారమైన ఉష్ణ శక్తీ, కాంతీ వెలువడుతాయి.అక్కడి నుంచి భూమిపైకి కిరణాలద్వారా ప్రసరించే వేడీ, వెలుతురూ భూమి మీది జీవజాలానికి ప్రాణ ప్రదమైనవి.ఏరోజన్నా సూర్యోదయం కొన్ని గంటలు ఆలస్యమైంది అనుకోండి.
మన శరీరం లోని రక్తం గడ్డ కట్టుకు పోతుంది- రక్త ప్రసారానికి అవసరమయ్యే వెచ్చదనం మనకి  సూర్యుడే ఇస్తాడు మరి! మొక్కలు సూర్యరశ్మిలోనే పిండి పదార్ధం తయారు చేసుకుంటాయి కనుక సూర్య కాంతి లేకపోతే అవి బతకవు. ఆ మొక్కలపై ఆధారపడ్డ జంతుజాలమూ నశించి పోతుంది.సూర్యుడికి ఉన్న ప్రాముఖ్యం అంతటిదన్నమాట.సూర్య నారాయణుడి పేరిట కొందరిచే ప్రత్యక్షదైవంగా పూజలందుకుంటున్న అపార శక్తి స్వరూపుడైన సూర్యుడికి  కూడా ఏమేరకు స్వంత చైతన్యం, యుక్తాయుక్త విచక్షణ ఉన్నాయో చూద్దాం.
                                    సూర్యభగవానుడు అపార కరుణా సముద్రుడనీ, జీవులమీది కరుణతో ఆయన వెలుగును, వెచ్చ దనాన్నీ ప్రసాదిస్తున్నాడని కొందరి విశ్వాసం. కానీ వాస్తవం ఏమిటంటే తన నుంచి కాంతీ, వెచ్చదనం బయటికి రాకుండా చేయగల శక్తిగానీ , తనలో నిత్యం జరుగుతున్న పరమాణు సంఘాతం కారణంగా ఉత్పత్తి అవుతున్న వెలుతురు, వేడిమిల ఉత్పత్తిని నిలిపివేసే సామర్థ్యము గానీ  ఆయనకు లేవు. ఆ వాయువులున్నంతకాలం, పరమాణు సంఘాతం జరిగినంత కాలం ఆయన నుండి శక్తి వెలువడుతూనే ఉంటుంది.ఆ వాయువులూ ఒక పదార్థమే . వాటికీ 'గతి' లేక 'గమనం' ఉన్న కారణం గానే ఈ పరిణామాలు సూర్యునిలో నిత్యం చోటుచేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఆయన మనందరిపైనా ప్రేమతో వెచ్చటి తన కిరణాల నూ  కాంతినీ మనకు పంపుతున్నాడని భావించడం , అందుకు మనమేదో ఆయనకు రుణపడి ఉన్నామని ఆయన్ని ఆరాధించడం అవసరం మాత్రం కాదు. ఇక ఎవరి ఇష్టం వారిది.తనను పూజించిన వారికీ  పూజించని వారికీ ఆ సూర్యగోళం నుంచి నిరంతరాయంగా వెలుగూ, వేడిమీ అందుతూనే వుంటాయి. మండు వేసవిలో  ఆయన తాను ఇష్టపడే వారికి శీత మయూఖుడు(చల్లని కిరణాలు ఇచ్చేవాడు)కాలేడు.తనకు నచ్చని వారికి ప్రత్యేకించి చండ ప్రచండుడు కాలేడు. మనపై ప్రేమతో ఆయన కాంతీ,ఉష్ణాలను తన నుంచి వెలువరించడం లేదు.  తననుంచి నిరంతరం వెలువడే కాంతి, వేడి లను అలా వెలువడకుండా ఆపగలిగే శక్తీ ఆయనకి లేదు. చెప్పులువేసుకుని, గొడుగు నీడన వెళ్ళే ఒక పాపిని మార్తాండుడు ఏమీ చెయ్య లేడు. అలాగే పుణ్యా త్ముడే అయినా ఒక వ్యక్తి మండు వేసవిలో కాళ్ళకు  చెప్పులూ, తలపై గొడుగూ లేకుండా వెళుతూ ఉంటే  సూర్యుడు తన కిరణాలతో  ఇబ్బంది పెట్టకుండా ఉండనూ లేడు..పోనీ తనవారికీ, పెరవారికీ తేడా చూపని విశాల హృదయుడు సూర్యుడు అనుకుందామా? దేవుడైన వాడికి పాప పుణ్య విచక్షణ ఐనా ఉండితీరాలి గదా.అదే లేకుంటే పుణ్యాత్ములకు ముక్తినేలా ప్రసాదిస్తాడు?పాపులకు శిక్షలేలా వేస్తాడు? కాబట్టి ఆ విచక్షణ సూర్యుడికి లేదు కనుక ఆయన భగవంతుడు కానేరడు.మనం సూర్యుడి నుంచి ఇన్ని మేళ్ళు పొందుతున్నాం కనుక ఆయన పట్ల కృతజ్ఞతా భావంతో ఉందామంటే ఎవరికీ అభ్యంతరం ఉండబోదనుకుంటా! కానీ సూర్యుడికి పూజలూ పునస్కారాలూ చేయడం నిరర్ధకం అనే అభిప్రాయం నాది.ఎందుకంటే మనకు రోజూ ఎదురొచ్చే ఒక వ్యక్తికి మనం నమస్కారం చేస్తే అతడు ఏమాత్రం స్పందించ డనుకోండి. ఒకటికి  రెండు సార్లు చూసి మనం అభివాదం చెయ్యడం మానేస్తాం.అదే విధంగా మన అభివాదాన్ని స్వీకరించే చైతన్యం లేనట్లయితే ఒక మండే అగ్ని గోళానికీ, రాతిబొమ్మకూ తేడా ఏముంటుంది? రాయికి నైవేద్యం పెట్టి ప్రసాదం మనం తింటున్నాం గానీ ఏ విగ్రహమన్నా మన నైవేద్యాన్ని రుచి చూస్తుందా? రాయి దేవుడైన రాశులు మింగడా ? అని వేమన ఏనాడో ప్రశ్నించాడు. అలాగే సూర్యారాధన కూడా.దానికి పూజచేసి మన సమయాన్ని వృథా చేసుకోవడమే అని నా అభిప్రాయం.కట్టెదుట వున్న మేలు చేసిన మానవులకు ఎప్పుడూ కృతజ్ఞుడై ఉండని  ఓ వ్యక్తి కూడా సూర్యుడి పట్లనో, మరో ప్రకృతి శక్తి పట్లనో కృతజ్ఞతా భావంతో పూజ చేస్తున్నాడంటే నమ్మేదెలా? సూర్యుడికి విచక్షణా యుతమైన చైతన్యం ఉందనీ, ఆయన భగవంతుడనీ, ఆయనను పూజిస్తే తనకేదో మేలు చేకూరుతుందనే ఆశతో తప్పితే.ప్రాచీనులు సూర్యుడు ఆరోగ్యాన్నిస్తాడని నమ్మేవారు(ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్).రోజూ కొంతసేపు సూర్యరశ్మిలో  వ్యాయామం చేసేవారు కూడా.దీని వలన శరీరానికి అవసరమైన డి -విటమిన్ సూర్యరశ్మి  నుంచి లభిస్తుంది.సూర్యారాధన కంటే ఇదెంతో మేలైనది.శాస్త్రీయమైనది కూడా.
                       కనుక ప్రకృతి శక్తులు మానవుడి కంటే కొన్ని కోట్ల రెట్లు శక్తిమంత మైనవని బెదిరి పోవాల్సిన పని లేదు.మానవుడు ఆ ప్రకృతి శక్తుల రహస్యాలను భేదిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు. ఆ క్రమంలో అక్కడక్కడా ఎదురుదెబ్బలు సహజం.ఒక క్రమ పద్ధతిలో ప్రకృతి శక్తులపై విజయాలు సాధిస్తూ ఎంతటి శక్తినైనా తన అదుపాజ్ఞలలోకి తెచ్చుకుంటూ ఉన్నాడు మానవుడు.ప్రకృతి శక్తులను వాటికున్న అపార శక్తి కారణంగా ఆరాధించబూనుకుంటే  ఎక్కడో సూర్య గోళం ఎందుకు?  ప్రతి అణువు,పరమాణువు లో కూడా అనంతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఇన్ని కోట్ల కోట్ల పరమాణువులను కూడా పూజిద్దామా? చెప్పండి.
                         పదార్ధం యొక్క అణువణువులోనూ శక్తి నిక్షిప్తమై ఉన్న మాట వాస్తవం.కొందరు అపార శక్తిమంతమైన ఆ పదార్థాన్ని' బ్రహ్మ పదార్ధం'
అంటున్నారందుకే. పోనీ, ఆ శక్తినే మనం భగవంతుడు అందామా? మరి భగవంతుడికి ఉండాల్సిన స్వంత చైతన్యం,యుక్తాయుక్త విచక్షణ,పాప పుణ్యాల పరిజ్ఞానం,జీవులకు కర్మ ఫలాలను ప్రసాదించే సామర్థ్యం అణువులు, పరమాణువు లలో  నిక్షిప్తమైవున్న ఆ శక్తికి ఉన్నదా? లేదే? ఆ పరమాణు సంఘాతం కారణంగా ఏర్పడిన పదార్ధం ఒక క్రమ పరిణామం చెంది,జీవ పదార్ధం ఏర్పడి,ముందుగా ఏకకణ జీవులుగా, అవి మరింత పరిణామం చెంది బహుకణ జీవులుగానూ , బుద్ధిజీవులుగానూ  రూపొందడం జరిగింది.బుద్ధిజీవులలోకెల్లా అంతిమంగా యుక్తాయుక్త  విచక్షణ, వివేచన, హేతు దృష్టి కలిగిన  సర్వోత్కృష్ట జీవి అయినట్టి 'మానవుడు' ఏర్పడ్డాడు.పరిణామ క్రమంలో ఆ మానవుడు కూడా రోజురోజుకీ మరింతగా తన విజ్ఞానాన్నీ,వివేకాన్నీ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. విచక్షణ లేనివాడిని మనం 'పశువు' అంటున్నాం.అంటే మానవుడు పశువుకంటే విచక్షణలో మెరుగ్గా ఉంటాడనే కదా?చైతన్యం,స్పందన, ఆర్ద్రత లేని మానవుడిని 'వాడొక బండరాయి' అంటాం. అంటే బండరాయి కంటే మానవుడు మెరుగైన చైతన్యం కలిగి ఉన్నాడనే కదా? తిరిగి ఆ బండరాయిలోనూ,ఆ పశువులోనూ కూడా శక్తి దాగి ఉంది కాబట్టి,ఆ శక్తిని భగవంతుడు అనడం,ఆ భగవంతుడే మనల్ని నియంత్రిస్తున్నాడు అనడం ఎంతమేరకు శాస్త్రీయ దృక్పథం ? అనేది  ఒకసారి ఆలోచించండి.అన్నిట్లోనూ భగవంతుడు ఉంటే ఈ పరిణామానికి అర్థం, విలువ ఏమైనా ఉన్నట్లా? లేనట్లా? యోచించండి.విచక్షణ లేని శక్తి పరిణామ క్రమంలో విచక్షణను, వివేకాన్నీ సంతరించుకుంటే అది మునుపటి దశ కంటే మెరుగైన దశా? కాదా?
                          ఈ విషయాలపై తీవ్రంగా ఆలోచించ గోర్తాను మిత్రమా.మరో సందర్భంలో భగవంతుడి ఉనికి, భగవదారాధన ప్రయోజనాలపై మరిన్ని విషయాలు ముచ్చటించుకుందాం .ఇప్పటికి సెలవు .ఉంటాను.
 

ముత్తేవి రవీంద్రనాథ్ గారి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అనే తొలి రచనకే  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి "కావ్యనుశీలన కళా సమ్రాట్టు" అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు  'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన  హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చర్చా వేదిక.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech