సారస్వతం  

     అన్నమయ్య కీర్తనలు

రచన : జి.బి.శంకర్ రావు

 

ఎటువంటి మోహమో

ఎటువంటి మోహమో ఎట్టి తమకమొకాని

తటుకనను దేహమంతయు మఱచె చెలియ||

 

పలుకు తేనెల కొసరి పసిడి కిన్నెర మీటి

పలుచనెలుగున నిన్ను పాడి పాడి

కలికి కన్నీరు బంగారు పయ్యెద నొలుక

తలయూచి తనలోనె తలవంచు చెలియ||

 

పడతి నీవును తాను పవళించు పరపుపై

పొడము పరితాపమున పొరలి పొరలి

జడిగొన్న జవ్వాది జారు చెమటల దోగి

 ఉడుకు నూరుపుల నుసురుసురాయె చెలియ||

 

తావిజల్లెడి మోముదమ్మి కడు వికసించె

లో వెలితి నవ్వులను లోగి లోగి

శ్రీ వేంకటేశ లక్ష్మీకాంత నినుగలసి

ఈ వైభవము లందె నిదివో చెలియ||

అన్నమయ్య పరమాత్మ పత్ల తన్మయీభావంతో పరితపించే జీవనాయిక పరిస్థితిని తెలుసుకుని రచించిన మధుర శృంగార సంకీర్తన ఇది! ఇక్కడ జీవనాయిక జీవాత్మకు ప్రతిరూపం! పరిపరి విధాల పరమాత్మ సంగమం (ఐక్యం) కోసం ఎదురుచూస్తుంది. ఆ ఎదురుచూపులో, మోహపారవశ్యంలో, తమకంలో తన దేహాన్నే మరచిపోయినది నాయిక! తత్త్వార్ద్గంలో తరచి చూస్తే ఈ అశాశ్వతమైన దేహాన్ని మరచినపుడే కదా పరమాత్మ ప్రత్యక్షమయ్యేది! బంగారు కిన్నెర చేత బట్తుకుని పలుకుతేనెల మంద్రస్వరంలో వేంకటేశ్వరుని పాటతో ఆహ్వానిస్తుంది నాయిక! ఆ గానపారవశ్యంలో కలికి చకోరాక్షి యొక్క కన్నుల నుండి నీరు జారి పయ్యెదపై ఒలికి వింత శోభ సంతరించినదట! స్వామి వారు తాను యోగ పరవశముచే సంయోగం చెందు పరపుపై విరహతాపము జ్ఞప్తికి తెచ్చుకుని స్వామి గురించి తపిస్తుందట ఇక్కడి నాయిక! చివరకు జీవాత్మ తపస్సుకు మెచ్చి పరమాత్ముడు వచ్చాడు! ఇక ఆ నాయిక ఆనందానికి అవధుల్లేవు! పరిమళాన్ని వెదజల్లే ఆ ముఖపద్మం వికసించినదట! ‘తావి జల్లెడు మోముదమ్మిఅను పాదంలో అచ్చ తెలుగు భాష వెలుగులను విరజిమ్ముతుంది! ఓ వెంకటేశ్వరా! లక్ష్మీ కాంత నిన్ను కలసి, ఈ మహా వైభవాలను పొందినదయ్యా! అని విశేషంగా చెబుతున్నాడు అన్నమయ్య!


తటుకున = తటుక్కున, తటాలున;

కిన్నెర = వీణ లాంటి వాద్య విశేషము;

పొడము = పుట్టు / జనించు;

ఉడుకు = తాపము;

ఊరుపు = ఊపిరి (శ్వాస)


ఎదుట ఎవ్వరు లేరు


ఎదుట ఎవ్వరు లేరు ఇంతా విష్ణుమయమే
వదలక హరిదాస వర్గమైన వారికి||

ముంచిన నారాయణమూర్తులేయీ జగమెల్ల
అంచిత నామములే ఈ అక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరి ప్రసాద మీ రుచులెల్ల
తెంచివేసి మేలు తా తెలిసేటి వారికి||

చేరి పారేటి నదులు శ్రీపాద తీర్ధమే
భారపు ఈ భూమి ఇతని పాదరేణువే
సారపు కర్మములు కేశవుని కైంకర్యములే
ధీరులై వివేకించి తెలిసేటి వారికి

చిత్తములో భావమెల్లా శ్రీ వేంకటేశుడే
హత్తిన ప్రకృతియెల్లా ఆతని మాయే
మత్తిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు
తిత్తి దేహపు బ్రదుకు తెలిసేటి వారికి||వేదాలు, ఉపనిషత్తులు, వాటి సారమైన భగవద్గీత...ఇవన్నీ భగవంతుడు సర్వాంతర్యామియని, అణువు నుండి అజాండం వరకూ వ్యాపింఛిన పరమమూర్తి యని ఘోషిస్తున్నాయి! కానీ మానవులమైన మనం పరమాత్మను అన్ని చోట్ల దర్శించలేక మనభౌతిక పరిధికి అందే విగ్రహాల రూపంలోనే చూస్తాం! కాని తన యావజ్జీవితాన్ని శ్రీవేంకటేశ్వరునికి అంకితం చేసిన అన్నమయ్య తన ప్రతి అనుభవంలోనూ, అనుభూతిలోనూ, పనిలోనూ, ప్రతిచోటా ఒకటేమిటి ఎల్లవేళలా ఆ స్వామి చింతననే కలిగి, ఆ స్వామి విభూతినే దర్శించాడు! అందుకే ఈ పాటలో హరిదాసులైన వారికి ఈ జగమంతా విష్ణుమయమే! అంటున్నాడు. అగపడు అక్షరాలన్నిటినీ నారాయణ నామాలగానే భావించాడు! ఈ భూమండలంపైన మనం నివశిస్తున్న ఈ భూమి విరాడ్రూపుని యొక్క పాదరేణువుగా భాసిస్తుందట! తాను చేయు ప్రతి పని కేశవునికి సమర్పించే కైంకర్యమేనంటున్నాడు! చిత్త సరోవరంలో నిలుపుకున్న ముర్తి ఒక్కడే! వాడే శ్రీ వేంకటేశ్వరుడు! నిత్యం పరిణామశీలమై ప్రవర్తించుచున్న ఈ ప్రకృతి ‘మాయ’ అని అంటున్నాడు! ఈ పాటలో ఇంకో విశేషమేమంటే పల్లవి చివరలో మరియు చరణాల చివరలో ఈ విషయాలన్నీ ఎవరికి తెలుస్తాయో మరీ వివరంగా చెబుతున్నాడు! వారెవరంటే మేలు తెలిసిన, ధీరులై, వివేచన చేయగల, ఈ తిత్తి దేహపు (అశాశ్వతమైన) జీవితం గురించి తెలిసిన హరిదాసులు! దీనికి ప్రత్యక్ష ఉదాహరణ భాగవతంలోని ప్రహ్లాదుని చరిత్ర! తత్త్వ స్వరూపుడైన ప్రహ్లాదుడు అన్నిచోట్లా పరమాత్మను దర్శించి, ఇందుగలండందు లేడని చెప్పి స్తంభం నుండి సైతం స్వామిని ప్రత్యక్షం చేయిస్తాడు! అన్నమయ్య దృష్టి అదే!


అంచిత = పూజింపబడు;
మత్తిలి = సోదించి, చూడగా(?);
దేహమ్ను = తిత్తి (తోలు) సంచి
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech