పాఠకుల సమర్పణ  
     అమ్మకి సరయిన స్థానం, స్వర్గమే!

- నిర్వహణ -  కోసూరి ఉమాభారతి

 
 

తెల్లారుజామున మెల్లగా కళ్ళు విప్పుతుంటేమసగ్గా ఆ చీకటిలో, చిరునవ్వులు చిందిస్తూ ఎదురుగా అమ్మ. 

"ఇంకాసేపు నిదుర పోవచ్చుగా రాత్రి చాలా సేపు మేల్కొన్నావు," అంటూ తల నిమిరింది, రోజూలా. 

ఆ చల్లని స్పర్శ, ఆ మెత్తని మాట తొలకరి జల్లులా సేద తీర్చి, ఉత్సాహాన్ని నింపుతుంది నాలో, రోజూలా. 

మగతనిద్దుర వీడగానేఅమ్మ పైలోకాలకి వెళ్ళిపోయి, మూడేళ్ళవుతుందని గుర్తుకొస్తుంది, రోజూలా.  

ఎదురుగా గోడ మీద ఉన్నది  అమ్మ పటం. అందుండే అమ్మ చిరునవ్వులుచల్లని పలికరింపులురోజూలా.  

ఆ రోజు అమ్మ వర్ధంతి, అమ్మ పటానికి, దణ్ణం పెట్టుకొనికళ్ళ వెంట జారుతున్న బాష్పాలని తుడుచుకోకుండా కాసేపు అలా ఉండిపోయాను.  స్నానపానాదులు ముగించుకొనిదేవుని గదిలో అమ్మ  పటానికి పూల మాల వేసి, అమ్మకిష్టమైన వంటకాలు పటం ముందుంచి కాసేపు కళ్ళు మూసుకొని గోడకి జారిగిల పడ్డాను. 

మహరాణిలా, అందంగా హుందాగా ఉండేది అమ్మ నా తరువాత అమ్మకి ఇంకా ముగ్గురు పిల్లలు.  అమ్మ అహర్నిశలు మమ్మల్ని కాపాడుతూ, ప్రేమగా గారాబంగా పెంచింది.  ఆమె అమ్మతనంలో ఒక పదోవంతు నేను నా బిడ్డలకి పంచగలిగినా, నేను మంచి అమ్మనే అవుతాను.  మా అమ్మమ్మ, " మరీ అంతలా మునిగిపోకే

ఏదైనా  సమపాళ్ళల్లో  ఉండాలి.  నీది మరీ పశుప్రేమ కాస్త నీ సంగతి నీవు పట్టించుకో," అని అప్పుడప్పుడు అమ్మని మందలించేది. 

***************************************************************************

వివాహమై దూర తీరాలకేగినా, నా మనస్సు, ఆలోచన, అమ్మ చుట్టూనే  ఉండేవి.  నా ఉన్నతికిఎదుగుదలకి

నేనెక్కిన ప్రతి మెట్టుకిఅమ్మేగా ఆయుష్షు పోసింది.  అమ్మ జీవన కొలనులో, నన్నో తామర పువ్వులా, కష్టనష్టాల బురద అంటకుండా సాకింది.   నేనిల్లు వదిలిన క్షణం,  ‘నా దేవత నను వీడి పోయిందిఅన్నది అమ్మ.  నా తోబుట్టువుల పెంపకంలో అమ్మ తనమునకలయ్యింది.  ఆ తరువాత ఆమె జీవితం సుడిగుండాల చిక్కుకొంది. 

ఆమె ఉనికిని గిరగిరా తిప్పేసింది.  పరిస్థితుల నడుమ అమ్మ నలిగిపోయింది.  అలిసిపోయింది.  ఆరోగ్యం పాడయింది.   కుటుంబ భారం పెరుగుతూ  పోయింది.  ఆటుపోట్లకి తట్టుకోలేక క్రుంగిపోయింది.   

 ******************************************************************************

నేనున్నానని అమ్మని ఆదుకొన్నాను .  చేయూతనిచ్చాను అన్ని విధాలా సహాయం చేసాను.  సగభారం మోసాను.  కొంతదూరం అమ్మతో  నేనూ నడిచాను.  నా వొళ్ళో తల ఆన్చి సేద తీరమన్నాను. వణుకుతున్న చేతుల్లో ఆసరానయ్యాను.  సన్నగిల్లుతున్న చూపుకి  చిరుదీపం వెలిగించ గలిగాను. 

 

అమ్మ జీవితంలో నేనోక్కితినే కానుగా!  ఎన్నో భారాలు మరెన్నో మజిలీలు ఇంకెన్నో శక్తులు, మరెన్నో ప్రభావాలు.  అమ్మ జీవితంలో మలుపులు, ఎదురీతలుఒడుదుడుకులు.  విధి రాతల్ని ఎదురించలేక పోయాను.  

అమ్మ  జీవనయానంలోని  మలుపులు నన్ను అమ్మ వెంట పోనివ్వలేదు.  దారులు వేరయ్యాయి.  నే తిరగలేని మలుపు అమ్మ తీసుకొంది.   

నేనందించిన సాయం నా తల్లికి చూపు తేలేదు, వినికిడి నివ్వలేదు, సంతోషాన్ని సంతృప్తినీ పంచలేదు.  అమ్మ చుట్టూ ఉన్న బురద, గట్టిగా పేరుకు పోయింది.  అమ్మ చుట్టూ కొలనులో విష నాగులు,  అమ్మకి కాపలా కాస్తున్నాయి.  నే  ఛేదించలేని విషవలయమే.  అమ్మనా  స్థితిలో అలా చూడలేకపోయాను,  అమ్మ ఇంకా ప్రాణాలతో ఉంటే,  ఆమె అనుభవించేది  బాధ, భయం, దౌర్బాగ్యం, దారిద్ర్యమే అని వాపోయాను.

 

అమృతం పంచిన అమ్మపై,  సొంతవారు దుర్మార్గపు దాడులు చేసి, ఆమెని  విషపు కొలనులో ఈదులాడించారు.

చూపు, వినికిడి, ఆరోగ్యం అన్నీ క్షీణించాయి.  నా చేయూత, సహాయం, బురదలో పోసిన పన్నీరు అయ్యాయి.

నా ఆర్తనాదాలు నా చాచిన చేతులు ఆమె వరకు వెళ్ళలేక పోయాయి.  నేనూ నిస్సహాయరాలునయ్యాను. 

 

ఓ వేకువ జామున, తొలి సూర్య కిరణాలు మోసుకొచ్చాయి నాకు,  ఓ శుభ వార్త.....ఔను, శుభ వార్తే....

మా అమ్మ ఈ లోకాన్ని విడిచి పోయిందన్న వార్త.  నాకు,  ఓ శుభ వార్తే.......   

"నువ్వింకా  బాధలు పడకుండా  విషాలు మ్రింగకుండా,  ఈ పాపాన్ని, పాపాత్ములని వదిలిపోతున్నందుకు 

నాకు సంతోషమే నమ్మా!  అమ్మా నీవు సుఖంగా ఉండాలి దేవతలాంటి నీకు సరైన స్థానం ఆ స్వర్గాన ఉందమ్మా,".... అని కుప్ప  కూలిపోయాను, ఆ రోజు. 

 ********************************************************************************

 Happy Mother’s Day!  Happy Mother’s Day!  Happy Mother’s Day!  Happy Mother’s Day!

to all the mothers to be………

అమ్మగా నేనున్నాగా

అమ్మ నవుతా, నేను

ఋతువులు మారిన తరుణాన

 

మగత నిద్దరలే, ఎదురు చూపులే

నీ రాకకై, క్షణక్షణం నిరీక్షణే

నీ చిట్టి చేతులు తడిమిన నిముషాన

ఇదిగో! ఉన్నాలే  అని నేనన్నాగా!

 

దోబూచులాడుతూ, నెలవంకలా

నన్నాట్టడిస్తూ, చిరు దివ్వెలా

నీ ఊహలే, మది నిండగా

నీ బోసి నవ్వులే, నాకు పండగ

 

ఊరిస్తూ, ఉడికిస్తూ

మురిపిస్తూ, మైమరపిస్తూ

ఊహకందని నీ అందం

ఊపిరే ఐన అనుబంధం

 

అదరకే, బెదరకే, చెదరకే పాప

నీ కోసమే వేచి చూస్తూ, అమ్మగా నేనున్నాగా! 

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

  Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.                    సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                                                                                                            Site Design: Krishna, Hyd, Agnatech