జ్ఞాపకాల వలస పక్షులు
(ఇటీవల సిలికానాంధ్ర ఉగాది కవిసమ్మేళనంలో చదివిన కవిత)

              -డా||కె.గీత

 

చిలక్కొయ్యకు వేళ్లాడుతున్న
పాత వత్సరాన్ని తీసి బూజు దులపడం మొదలు పెట్టాను
జ్ఞాపకాలు ఒక్కోటిగా రాలిపడ్డాయి
చెరువు ముఖాన జల్లెడ పట్టే వాన చినుకుల్లా
బురద చేలో వేళ్లకు గిలిగింతలు పెట్టే వరి మొలకల్లా
తమలో తాము తొక్కిస లాడుతూ
గిరికీలు కొట్టే తూనీగల్లా
రెప రెప లాడుతూ జ్ఞాపకాలు
వేల మైళ్ల దూరానికి వరదై వచ్చిన వలస పక్షుల్లా గదిలో వాలాయి
కళ్లు నులుముకుంటూ నిద్రలేచానా...
పేము బెత్తంతో నాన్న తయారు!
యోగర్టు కప్పు మూత తెరిచానా.....
మీగడ పాల వెన్న బువ్వ గోరుముద్దల అమ్మ ముఖం
పిల్లల్ని బడికి దించి వస్తున్నానా....
తిరుగుదార్లో గొబ్బి పూలకో
పచ్చి రేగుకాయలకో తుప్పల్లోకి లాక్కెళ్లే నేస్తాలు
ఎక్సర్ సైజు సైకిలెక్కానా...
ఊరి చివర సైకిలు పందేల్లో నా పక్క నించి దూసుకెళ్లే నవ్వుల సరదాలు
జాంకాయ కాకెంగిలికున్న రుచి స్ట్రాబెర్రీకుందా!
బఠానీలతో బరువెక్కిన లాగూ జేబు జీన్స్ పేంటుకుందా!
గదంతా పర్చుకున్న
తెలివేకువ యౌవనపు తొలి మెట్లు
ప్రపంచమంతా పరవశమే నిండిన పదారు-పందొమ్మిది సంవత్సరాలు
వెన్నెల నురుగంటుకున్న జలతారు ముంగురులు
నిశ్శబ్దాల్ని భాషించే మెరుపు కళ్లు
గాలిలో ఏట వాలుగా లేచి రెక్కలొచ్చిన క్షణాలు
కంటి ముందు ఉడుతల్లా పరుగెడుతూన్నాయి
సంవత్సరం తర్వాత సంవత్సరం
జీవితపు పరమ 'పథ" సోపానంలో
సగర్వంగా అధిరోహించిన నిచ్చెనలెన్నో
నిలువునా మింగి నట్టేట ముంచిన నాగులెన్నో
తల విదిలించినా జోరీగలై వదలక చుట్టూ ముసిరే జ్ఞాపకాలు
జీవించడానికి అర్థం చెప్పి
బతుకుని సఫలం చేసిన కొత్త బంధాలెన్నో-
తుఫాను అలల తాకిడికి ఎటో కొట్టుకుపోయిన అశ్రు బంధాలెన్నో-
గాలికి లాంతర్లు ఊగుతున్నట్లు
మదిలో జ్ఞాపకాలు-
బీరువా తలుపు వారగా వినయంగా
నిలబడ్డ కొత్త వత్సరాన్ని ధరించానా.....!
జ్ఞాపకాలు తమలో తాము గుస గుసలాడుకుని
పడుగూ పేకై పేనుకుని
పోగులై చేరి
వస్త్రమై పర్చుకుని
మేలిముసుగై అల్లల్లాడి
గొంతులో స్వరధ్వనులై ప్రవేశించి
గప్ చుప్ గా గుండెల్లో నిద్రించాయి.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech