కథా విహారం -
 కథా ఋషులు ఒకరిద్దరిలో ఒకరైన మునిపల్లె రాజు మేజికల్ రియలిజం
- విహారి

  మనిషి యొక్క అస్తిత్వవేదనలను చిత్రించడంలో నేను జాతీయ, అంతర్జాతీయ హద్దులను దాటి రాయగలిగాను. వివాదప్రాయ రచనకు నేను దూరంగా జరిగాను. అలాగే పాతదయిన మూసపోసినట్లు ఉండే భాష నా రచనలో కనబడదు అన్నారు మునిపల్లెరాజు గారు. మునిపల్లె రాజు ‘మంత్ర వాస్తవికథా మాంత్రికుడు’. సోషల్ రియలిజంలో మేజికల్ రియలిజం ను మిశ్రీకరించగలిగిన బుద్దిజీవి.

కథలు రెండు రకాలు. మేథస్సుతో ప్రభావితమైనవి. హృదయంతో ప్రభావితమైనవి. ఎక్కడ మేథ ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువ. ఎక్కడ పునాది హృదయమో ఆ కథ కథా బంధురం అంటారు రాజుగారు. హృదయగతమైన కథాంశాల్నే ఎన్నుకుని, తమ విశిష్ట సాహిత్య సంప్రదాయాల విజ్ఞతతో కూడిన శైలిని కూర్చి, శిల్పకళాబంధురం చేస్తూ కథా రచన సాగిస్తున్న అసాధారణ మేథావి - రాజుగారు.

‘సప్తతి మహోత్సవం’ అని ఒక కథ ఉంది. దీనిలోని ఒక సన్నివేశాన్ని చూడండి. ఒక పాత మంచం మీద చంద్రిక, సింహం పోలికతో ఆమె. ఒకనాటి చంద్రబింబం వంటి ముఖం. ముక్కును కూడా సగం తినేసిన ఘోరమైన కుష్టువ్యాధి. గొంతు బొంగురుగా ఏదో పాడుతున్నది. పక్కనే స్టూలు మీద కూర్చుని సీతారాంగారు ఆమెకు పాయసం తినిపిస్తున్నారు. ఆ పాత్ర - కన్పించకుండా పోయిన బంగారు పంచామృతపాత్ర!

ఆమె నాకు ఓపికతో నమస్కారం చేయబోయింది. ఆ చేతులకు వేళ్ళు లేవు. దుర్గంధం ఆగదు.
కళంక భరంగాని ఒక ప్రణయగాథ ముగింపు ఘట్టంపైన ఏవో మృత్యు పక్షుల రెక్కల చప్పుడు వినిపించినట్లయింది. ఆయన ఒకనాటి చంద్రిక విశాల నేత్రాల మీద దుప్పటి కప్పాడు. చావు బ్రతుకుల విభజన రేఖ, చేశాను.
నాకగుపించలేదు. ఒక మనిషి మౌనమైన గీతా ధ్యానమై, మహాయోగమై మహిమాన్వితుడైన ఆ దివ్య క్షణాన సీతారాంగారికి ఈ సారి మళ్ళీ పాదాభివందనం
ఒక కల్లోల కేంద్రం నుంచీ ప్రారంభమైన ఘట్టం చివరికి ఒక శాంతియాత్రగా, రసార్ద్రంగా, కనుచెమరింపుతో ముగిసింది. అంతరిక్షం దివ్యయోగం ప్రయోగశాల. అవని కేవలం అనాత్మకుల క్రీడా క్షేత్రం. అని మరో కథలో ఒక చోట శీర్షికగా రాజుగారు వ్రాసిన వాక్యాలు ఇక్కడా అన్వయిస్తాయి. తాపీగా ఇలా సాగాలనుకుంటే, అడ్డదిడ్డంగా అలా పరిగెత్తే స్వభావం కలది - జీవితం అనిపిస్తుంది. గుండె బరువెక్కుతుంది.

రాజు గారి మేజికల్ రియలిజం కథలు అస్తిత్వనదం ఆవలి తీరాన అనే సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
మేజికల్ రియలిజం అన్నది ఒక రచనా స్వరూపంగా లాటిన్ అమెరికన్ రచయితల రచనల్లో ప్రస్ఫుటంగా నిలదొక్కుకుంది. వారిలో ప్రథమగణ్యుడు గేగ్రియల్ గార్షియా మార్న్యెజ్.

భౌతిక దృష్టికి కనబడే వాస్తవం వెనుక గాఢంగా హృదయాన్ని పెనవేసుకుని వున్న అతిలోక, అలౌకిక వాస్తవాల చిత్రణ - ఈ మేజికల్ రియలిజం. మనం భౌతికంగా గుర్తించదగిన వాస్తవాలు - ఊహించలేని విధంగా కార్యకారణ సంభవాల కతీతంగా వివరణలకందని వేగంతో సంభవించే సంఘటనల్లో కలగలసి చదువరికి కొత్త అనుభూతిని పంచుతాయి. మనకు తెలిసిఉన్నదానికి, కథలో పాత్ర గతంలో అనుభవించినదానికి - ఆవలి అంచుల్ని స్పృశిస్తుంది ముగింపు. మానవ స్పందనల్నీ, సంబంధాలనూ మానవాతీత సంభవాలతో అనుసంధిస్తాడు రచయిత. అందుకనే కొందరు మేజిక్ రియలిజమ్ ని It is a Combination of reality and fantasy అన్నారు. An art of sruprises అన్నారు. ఈ కారణం వలన్ మేజికల్ రియలిజంకి విశ్వాసం కేంద్ర బిందువు.

ఈ సూత్రానికి ఆద్యులు మన వాల్మీకి. వ్యాసుడే అని రాజుగారు ఎంతో నిర్దిష్టంగా conviction తో చెప్పడానికి కారణం - రామాయణ మహాభారతాల్లోని అనేక గాథల్లో ఈ అద్భుత వాస్తవికత ద్యోతకం కావటమే. ఆధునిక సంక్లిష్ట జీవన సమస్యల పరిథిలో - రాజుగారు మేజికల్ రియలిజం ని అనుసంధించి కథారచన చేశారు. ఒక అదృశ్య పృచ్ఛకుడు అంతరాత్మపైకి సంధించే ప్రశ్నలన్నిటికి తార్కికంగా, హేతుబద్ధంగా సమాధానాలు లభించవు. కొన్ని ప్రశ్నల మూలాల విశ్లేషణకి మనస్తత్వ శాస్త్ర పరిజ్ఞానం అవసరమౌతుంది. ఒక్కొక్కప్పుడు ఆధ్యాత్మిక విశ్వాసపు పునాదిరాళ్ళు అవసరమౌతాయి. కొండొకచో అవి ఎక్కువశాతం జవాబులేని ప్రశ్నలుగానూ మిగిలిపోవచ్చు. ఇది మేజిక్ రియలిజంలోని ముఖ్య వివరణ.

రాజుగారి కథల్లో మేజికల్ రియలిజంకి ఉదాహరణప్రాయంగా చెప్పుకోగలిగే కథ. - ‘నైమిశారణ్యంలో సత్రయాగం’. కథానాయకుడు చక్రి. గతం నుంచీ, మోహనాపాశాల నుంచి పలాయనం చిత్తగించిన విరాగి. కమల తనకు రాసిన ఉత్తరాల దొంతరని చలినెగడులో విసరివేశాడు. భగ్న ప్రేమికుడు. అనంత సత్యాన్వేషణతో హిమాలయాలు చేరాడు. అభయానంద గోస్వామిగా చక్రతీర్థ ఆశ్రమం పరిరక్షణా బాధ్యతలో నిలబడ్డాయి. కడకు తన పూర్వాశ్రమ పరిచితమైన శునకం - మిల్కీ - జీవన అంత్యదశలో తనముందు నిలిచింది. దానిమెడలో తోలు బెల్టుకు ఒక కాగితపు చుట్టా. ఆనాటి కమల ప్రేమ లేఖను పోలిన కాగితం, ‘కమల అంత్యదశలో ఉన్నది. తమ దర్శనం కోసం తుదిశ్వాస నిలుపుకుంటున్నది’ చూశాడు. సమీపించాడు. ‘నేను కమలను స్వామీ అంటున్నది ఆ అస్పష్ట ఆకారం. ఆ చక్రీ లేడు కదా ఇక్కడ అన్నాడు. ఆమె శ్వాస ఆగిపోయింది. గోస్వామి కాళ్ళ వద్ద శునకమూ తోకాడించటం లేదు. చుట్టూ నిశ్శబ్దం అంతా ప్రశాంతి! కథ ముగిసింది.

ఒక సత్యాన్వేషి, సాధకుని ఆధ్యాత్మికానుభూతి - ‘altered reality గా వ్యక్తీకరింపబడింది. అస్తిత్వ వేదనకీ, అంతస్సంఘర్షణకీ - మాత్రిక వాస్తవిక పరిష్కారం, ఇదే అద్భుత వాస్తవికత. It may be intrinsically plausible. But can never be explained'.

అస్తిత్వనదం - ఆవలితీరాన’ అని మరొక కథ ఉంది. ఇందులోనూ ఒక భ్రష్టయోగి, విరాగి. జీవన సమరంలో క్షతగాత్రుడు. ‘కస్త్వం - కోహం? నీవెవరివి? నేనెవరిని? ఎవరు సమాధానం చెప్తారు. ప్రస్థానం సాగిపోతున్నది. ఒక మంత్ర నగరద్వారం, ఒక మహాస్వప్నం, సత్రం దరిలో ఒక మహానీయుడు. ఒక చిదానందమూర్తి మహా నిర్యాణం. ఒక మహాద్భుత దృశ్యం చూశాడు. భక్తుల ఆరాధన, ఆర్భాటం అంతా చూసి అచేతనుడై నిలిచి పోయాడు. జ్వరం తీవ్రత, సంధి ప్రేలాపన. మార్వాడీ వర్తకులు అంబులెన్స్ లో డాక్టర్ దగ్గరికి తీసుకుపోయారు. డాక్టర్ సచ్చిదానంద ఇతన్ని చూసి సంభ్రమాశ్చర్యాలతో ‘రఘూ’ అన్నాడు. ‘చూడు రఘూ మన లావణ్య. ఈ ఆస్పత్రిలోనే ఉంది. స్పెషల్ వార్డ్ డాక్టర్. అక్కడకు పంపిస్తాం నిన్ను అన్నాడు. లిఫ్ట్ లో తీసుకెళ్ళారు. స్ట్రెచర్ మీద! ఇదీ కథ! మేజికల్ రియలిజం కథ ఒక సందిగ్డంలో ముగుస్తుంది. ఇదెలా సాధ్యం? అనే open ended ప్రశ్న తలెత్తుతుంది పఠిత మేథలో. రష్డీ అంటాడు. ‘అది మూడో ప్రపంచపు ఆత్మభావనని వ్యక్తీకరిస్తుంది’ అని.

రాజుగారి ఈ ప్రయోగాత్మక కథలు చదువరికి ఒక నిసర్గానుభూతిని అందిస్తాయి. కాలం మార్మికగతి, తెగని తంత్రి అన్నారు రాజుగారు. Time past and time future are perhaps in time present' అన్నాడు టి.ఎస్. ఎలియట్. Character is a process అంటే అర్ధం ఇదే! - సృజనశీలి రాజుగారి భావన కూడా అనిపిస్తుంది! అందుకనే రాజుగారి కథల్లో జిజ్ఞాస ఒక శేష ప్రశ్న!!
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech