ఇహపరసాధనమిది
 

ఇహపరసాధన మిది యొకటే
సహజపు మురారి సంకీర్తననొకటే

భవసాగరముల బాపెడిది తేప
భువి నజ్ఞానము పులివాకట్టిది
జవళి నాశాపాశములకు కొడువలి
నవనీతచోరు నామం బొకటే

చింతా తిమిరము చెరచేటి సూర్యుడు
అంతట దరిద్రహతపు నిధానము
వింత మరణభయవినాశ మంత్రము
మంతుకు హరినామంబిది యొకటే

మించు దుఃఖముల మృతసంజీవని
అంచల పంచేంద్రియముల కంకుశము
ఎంచగ శ్రీ వేంకటేశు దాసులకు
పంచిన పాళ్ళ పరగిన దొకటే

కలియుగంలో నామస్మరణకు, నామసంకీర్తనకు ఉన్న ప్రాధాన్యత ఎనలేనిది! సాక్షాత్తూ భగవంతుడే తాను కలియుగంలో కేవలం ‘సంకీర్తనం’ చేత సంతుష్టుడునౌతానని ప్రకటించాడు. అందుకే కలౌ సంకీర్త్య కేశవమ్ అని, సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాస్సుఖినోభవన్తి అని పలురకాలుగా పేర్కొన్నారు. అటువంటి విశిష్ట సంకీర్తన మంత్రాన్ని తాను ఉపాశించి మనందరికీ కరదీపికగా, ఆత్మజ్యోతిగా అందించాడు అన్నమయ్య ఈ సంకిర్తనలో ఇహపరాలను సాధించడానికి సాధనము మురారి సంకీర్తనమొకటేనని చాటి చెబుతూ, చరణాలలో ఆ సంకీర్తన ఏ విధంగా విశ్వరూపం ధరించి మనల్ని భవబంధ విముక్తుల్ని చేస్తుందో, అజ్ఞానాంధకారాలను దారిద్ర్యాన్ని, మరణ భయాన్ని, పలు బాధలను, పంచేంద్రియాల వికారాలను ఏ విధంగా రూపుమాపుతుందో చక్కగా స్పష్టం చేస్తున్నాడు ఆచార్య పురుషుడు! మరి మనం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇహపరసాధక మంత్రమైన సంకీర్తనను ఆశ్రయిద్దాం!

మురారి - ముర + అరి = రాక్షసులకు శత్రువు (శ్రీ మహావిష్ణువు);
భవసాగరము = సంసారమనెడు సముద్రము
జవళి = రంగురంగుల (భ్రాంతిని కలుగజేయు)
తిమిరము = అంధకారము
మంతుకు = ప్రసిద్ధికి
మించు = ఎక్కువైన
అంకుశము = ఏనుగు కుంభస్థలము నందు పొడిచెడి ఆయుధము
పరగిన (పరిగీ) = ప్రీతితో / అతిశయముతో
అంకుల = ప్రక్క, పార్వ్యము (శ.ర)

 
ఇహపరసాధన
 
ఇహపర సాధన మీతలపు
సహజ జ్ఞానికి సతమీతలపు

సిరులు ముంగిటను జిగిదడబడగా
హరిని మఱవనిది అది తలపు
సరికాంత లెదుట సందడి గొనగా
తిరమయి భ్రమయనిదే తలపు

వొడలి వయోమదముప్పతిల్లినను
అడచి మెలంగుట యది తలపు
కడగుచు సుఖదుఃఖములు ముంచినను
జడియని నామస్మరణమే తలపు

మతి సంసారపు మాయ గప్పినను
అతికాంక్షజొరనిదది తలపు
గతియై శ్రీ వేంకటపతి గాచిన
సతతము నితని శరణమే తలపు




మనసు కోతి వంటిది మరియు వాయువు వంటిది! దానిని నిగ్రహించుట మిక్కిలి కష్టమైనది! గీతాచార్యుడు సైతం మదిని నిగ్రహించుట మిక్కిలి సాహసవంతమైన పని అని చెబుతాడు! భౌతిక పరిధులను తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మనసు మాత్రం నిశ్చల స్థితిని పొంది భగవంతునిపై లగ్నమై ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే సిరిసంపదలు కుప్పలు తెప్పలుగా పడుతున్నా సరే! సర్వాత్ముడైన హరిని మరవదు! అతిశయమైన సౌందర్యంతో భామినులు సందడి చేస్తున్నా సరే, ఆ మోహావేశానికి లోను కాదు, యవ్వనము మదము చేత పొంగి పొరలుచున్ననూ అణకువగా ఉంటుంది తప్ప విర్రవీగదు! సుఖ దుఃఖాలలో సైతం హరినామస్మరణను విడువదు! సంసారమనే మాయ ఆవరించిననూ అత్యాశలకు లోను కాదు! ఎల్లప్పుడూ శ్రీ వేంకటపతి శరణాగతినే కోరుకుంటుంది జ్ఞాని తలపు

సతము, సతత్ము = శాశ్వతము
జిగి = ప్రకాశించు
తిరము = స్థిరము (శాశ్వతము)
అడచి = అణచి
మెలంగుట = ప్రవర్తించుట
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech