అమెరికా సందర్శనం - బండారు శ్రీనివాస రావు బండారు శ్రీనివాసరావు గారు తెలుగువారికందరికీ సుపరిచితులే- ఆకాశవాణి లో AIR-హైదరాబాద్, మాస్కో లలో వార్తలు చదువుతూ,దూరదర్సన్లో ప్రోగ్రాం డైరెక్టర్ గా చేస్తూ, ఒక ప్రముఖ జర్నలిస్టుగా పేరుతెచ్చుకుని, అనేక వార్తాసంబంధిత కార్యక్రమాలను వారు నడిపారు. ప్రతినేలా వారిని సుజనరంజనికి ఒక శీర్షిక వ్రాయమని అడిగితే వారు అంగీకరించారు. త్వరలో వారి సహకారంతో ఒక సరిక్రొత్త శీర్షిక మీముందుకు తేబోతున్నాము. ప్రస్తుతం వారి అమెరికా సందర్శన అనుభవాలను, అమెరికాకి క్రొత్తగా వస్తున్న పేరెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని వారికి ఉపయోగపడే విధంగా వ్రాసారు. అది అందరికీ ఉపయోగపడుతుందని మీ ముందుకు తెస్తున్నాం.

మూడవ భాగం

కొలరాడో లోయలు

అటు సంపన్నులకూ - ఇటు సామాన్యులకూ ఆహ్లాదాన్ని అందించే లాస్ వేగాస్ నుంచి బయలుదేరి గ్రాండ్ కేనియాన్ వెళ్ళి ఇంటూరిష్ట్ హోటల్ లో దిగాము. ఆ రాత్రి ఐమాక్స్ థియేటర్లో గ్రాండ్ కేనియన్ లోయలు గురించిన డాక్యుమెంటరీ చూశాము. లోయలగుండా కొన్ని వేల అడుగుల లోతుకు హెలికాప్టర్లో రివ్వున దూసుకు వెళ్ళిన దృశ్యాలను విశాలమైన తెరపై చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. కొన్ని లక్షల సంవత్స్రాల క్రితం కొలరాడో నది వేగంగా పారుతూ వొడ్డులను ఒరుసుకుంటూ ఉదృతంగా ప్రవహించిన కారణంగా ఈ లోయలు సహజంగా ఏర్పడ్డాయని చెబుతారు. పైనించి కిందికి చూస్తే పారుతున్న నది ఒక సన్నని గీతలా కనిపిస్తుంది. కిందకు దిగివెళ్ళి చూడడానికి హెలికాఫ్టర్ సౌకర్యం వుంది.

తెలుగు పూజారి

లాస్ వేగాస్ గురించిన జ్ఞాపకాలు మననం చేసుకుంటూ వుండగానే ఆ తరువాత వీకెండ్ లాస్ ఏంజిలిస్ ప్రయాణమై వెళ్ళాము. కార్లో మరో అయిదువందల మైళ్ళు. లాస్ ఏంజిలిస్ లో ప్రవేశిస్తూనే ముందు సెవెన్ హిల్స్ అనే ప్రాంతానికి వెళ్ళాము. అక్కడ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం వుంది. అక్కడి పూజారి కూడా మన తెలుగువారే. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగావుంది. స్వామి దర్శనం చేసుకుని నగరం పొలిమేరల్లో వున్న డిస్నీలాండ్ కు బయలుదేరాము. అమెరికా వచ్చిన ఇన్ని రోజుల్లో ఏనాడూ ట్రాఫిక్ జాం చూడలేదు. ప్రపంచంలో వున్న కార్లన్నీ లాస్ ఏంజిలిస్ లోనే వున్నాయా అన్నట్టుగా వాహనాలు రోడ్లపై కనిపించాయి. ముందు వెనుక ఇటూ అటూ ఎటుచూసినా కారులబారులే. అప్పటికే చీకటి పడిందేమో మా ప్రక్కమార్గంలో ఎదురుగా వస్తున్న వాహనాల హెడ్లైట్లు ప్రశంతమైన సరస్సు నీటిపై తేలి ఆడుతున్న కార్తీక దీపాల మాదిరిగా మెల్లగా కదులుతూ వున్నాయి.మేము వెళుతున్నవైపు చూస్తే వరుసలు వరుసలుగా వెళుతున్న కార్ల టెయిల్ లైట్ల ఎర్రటి ధగధగలు. గంటకి వందమైళ్ళ వేగంతో ప్రయాణం చేసి వచ్చిన మా కారు వేగం 10-15 మైళ్ళకు పడిపోవడంతో మా హోటల్కి గంటన్నర ఆలస్యంగా చేరాము.

డిస్నీల్యాండ్

మేము దిగిన రేడిసన్ హోటల్ డిస్నీల్యాండ్ కు దగ్గిరలోవుంది. మర్నాడు ఉదయమే బయలుదేరి డిస్నీల్యాండ్ లో సాధ్యమైన విశేషాలు రోజంతా చూద్దామని వెళ్ళాము. సుమారు మూడువేల కార్లు నిలిపే పార్కింగ్ లాట్ వుంది. మేము వెళ్ళేసరికి అది సగానికి పైగా నిండిపోయిది. కారు నిలిపినచూట ఓక నెంబర్ రాసివుంటుంది. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోకపోతే తిరిగి వచ్చేటప్పుడు కారు వెతుక్కోవడం చాలా కష్టమౌతుంది. ఇక అప్పుడు ప్రారంభించిన నడక రాత్రి పది గంటలవరకూ సాగింది. ప్రవేశద్వారం దాటగానే డిస్నీల్యాండ్ నిర్మాత విగ్రహం వద్ద ఫొటోలు తీసుకుని ఆ లోకంలోకి అడుగుపెట్టాము.

అదిగో నవలోకం

ఒక్కసారి టికెట్ చూసి లోపలికి వెడితే అక్కడవున్న అనేక ' ఎట్రాక్షన్స్ ' ను ఉచితంగా చూడవచ్చు. అయితే జాగ్రత్తగా ప్లాను చేసుకుని వెడితే వీటిల్లో అనేకం చూడటానికి వీలుంటుంది. ప్రతి షోకు కొన్ని నియమిత సమయాలుంటాయి. ప్రతిచోటా fast pass మిషన్లు ఏర్పాటుచేశారు. మన ఎంట్రీటికెట్ ను అందులోకి ఇన్సర్ట్ చేస్తే ఆషోని చూసే సమయము ముద్రించిన fast pass మన చేతికి వస్తుంది. అప్పుడు క్యూలో నిలబడకుండా fast pass ద్వారం ద్వారా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకు రివర్స్ ఆఫ్ అమెరికాని చూడాలని వెళ్దామనుకుందాం. మనం వెళ్ళేసరికే నౌక వెళ్ళిపోయివుంటే, fast pass టైం ప్రకారం అక్కడికి చేరుకోవచ్చు. ఈ లోపల వ్యవధిలో చుట్టుపకల మిగిలిన వింతలు చూడవచ్చు. దట్టమైన అడవుల మధ్య పారే నదిపై ఈ నౌకపై కలయతిరగవచ్చు. ఈ నౌక రెండు అంతస్తుల భవనమంత పెద్దదిగా వుంటుంది. ఒకేసారి మూడు నాలుగు వందలమంది ప్రయాణం చేయవచ్చు. పూర్వకాలంలో రెడ్ ఇండియన్ల ఆటవిక జీవితం ఎలా వుండేదో కళ్ళకు కట్టినట్టు చూపే ఆ నాటి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించారు. అడవుల్లో దాగిన పైరేట్లు గుర్రాలమీద స్వారీ చేస్తూ నౌకపై తుపాకులు పేలుస్తూ బీభత్సం సృష్టిస్తారు. అంతా సహజంగా కనిపించే కృత్రిమ సృష్టి ఇది. అలాగే మిక్కీటూన్ టౌన్. సందర్శకులను చినచిన్న బోట్లపై తిప్పుతారు. వేగంగా పారే నీటికాలువల్లో ఈ చిన్ని పడవలు ఎలాంటి యంత్రాలసాయంలేకుండానే టూన్ టౌన్ మొత్తం తిరిగి వస్తాయి. త్రోవలో అటూ ఇటూ కనిపించే కాల్పిక జగత్తు- వాల్ట్ డిస్నీ ఊహా సంపత్తికి సజీవ ఉదాహరణగా కనిపిస్తుంది.

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందర్నీ సంభ్రమాశ్చర్యాలతో ముగ్దుల్ని చేసే అనేక ఆకర్షణలువున్నాయి. అలాగే fire works (దీనికి బాణా సంచా అనే మాట సరిపోదేమో). ఇందులో బాణాసంచా వాడారో- ఆధునిక లేజర్ పరిజ్ఞానం వాడారో అర్థంకాదు. సుమారు ఒక గంటసేపు ఆకాశమంతా రంగురంగుల హరివిల్లుగా మారిపోతుంది. నింగిలోకి దూసుకువెళ్ళిన తారాజువ్వలు వివిధవర్ణాలతో ఆకాశానికి క్రొత్త అందాలను అద్దుతాయి. లేజరుషోలో విచిత్ర ఆకారాలున్న వింత వింత పాత్రలు ఆకాశంలో చేసే విన్యాసాలు మెడ సాచి చూడాల్సిందే. ఒక కొండ శిఖరంపైనుంచి జాలువారే నీటితోపాటు ఒక్కసారిగా కిందకు జారిపడటం - చీకటి గుహల్లో ప్రయాణించడం- ఎంతో ఎత్తైన- అనేక వంపులు తిరిగిన రోలర్ కోస్టర్ పై వొళ్ళు జలదరించే అమితవేగంతో తిరగడం కిందాపైనా - నలువైపులా అద్దాలు బిగించిన రైలులో ఎంతో ఎత్తున ప్రయాణిస్తూ డిస్నీల్యాండ్ ని చూడడం - దేనికది ఒక మరుపురాని అనుభూతే.

హాలీవుడ్

ఆ రాత్రి హోటల్లో గడిపి-మర్నాడు లాస్ ఏంజిలిస్ Down Town మీదుగా యావత్ సినీ ప్రపంచానికి రాజధాని అయిన హలివుడ్ కి వెళ్ళాము. అక్కడ ప్రపంచంలో అతి పెద్దదయిన సినీ స్టూడియో- యూనివర్సల్ స్టూడియోని చూసాము. సందర్శకులందర్నీ వెంటవెంటనే బయలుదేరే అధునాతన టూరిస్టు బస్సుల్లో త్రిప్పి స్టూడియో విశేషాలను తెలియజేస్తారు. జలపాతాలు - అగ్నిప్రమాదాలు -భూకంపాలు అన్నీ కృత్రిమమే. కానీ ఎంతో స్వాభావికంగా వుండి గగుర్పాటు కల్పిస్తాయి. మనం ఒక వంతెన మీదుగా వెడుతుంటాము. హఠాత్తుగా ఎదురుగా వచ్చిన రైలు - పట్టాలు తప్పి కింది నదిలోకి వొరిగిపోతుంది. అనేక బోగీలు నీళ్ళలో కొట్టుకు పోతుంటాయి. ఇంజను వంతెన మీదుగా వేళ్ళాడుతూవుంటుంది. హాహాకారాలు- ఆర్తనాదాలు. అన్నీ నిమిషాల్లో జరిగిపోతాయి. కొద్దిసేపట్లో అన్నీ మామూలే. రైలు రైలులాగానే వుంటుంది. ఇంజను బోగీలు యధాస్థానంలోకి వస్తాయి. మనం బస్సులోకి వస్తాము. మనల్ని మరో స్టూడియోలోకి చేరుస్తారు. రెండువైపులా ఎత్తైన భవంతులు లోపల దీపాలు వెలుగుతుంటాయి. హఠాత్తుగా భూకంపం వచ్చిన చప్పుడు. ఇళ్ళు పేకమేడల్లా కూలిపోతుంటాయి. కరెంటు పోతుంది. అంతా గాడాంధకారం. నిమిషాల్లో అంతా మామూలు. కూలిన భవంతులు ఎక్కడివక్కడ అతుక్కుని తిరిగి యధాతధంగా నిలబడతాయి. అలాగే మరో దృశ్యం. పెద్ద భవనానికి మంటలు అంటుకుంటాయి. విపరీతమైన గాలి వీస్తుంది. తలుపులు కిటికీల్లోంచి పెద్ద పెద్ద అగ్నికీలలు మనవైపుకు దూసుకు వస్తాయి. మంటలవేడికి వాతావరణం అంతా వేడెక్కుతుంది. మళ్ళీ మామూలే! క్షణాల్లో ఎక్కడి మంటలు అక్కడే హూష్ కాకి. భవనం చెక్కుచెదరకుండా దర్శనమిస్తుంది.

జురాసిక్ పార్క్

గతంలో ఈ స్టూడియోలో నిర్మీంచిన భారీ చిత్రాల సెట్టింగులను యధాతధంగా అలాగే వుంచి సందర్శకులకు చూపిస్తున్నారు. ఒక చోట మేము ప్రయాణిస్తున్న బస్సు ఒక బరాజ్ ప్రక్కగా ఆగింది. ఆనకట్టకు పగులు ఏర్పడి నీరు బయటకు వస్తోంది. నిమిషాల్లో గండి పెద్దదయ్యింది. రిజర్వాయర్ లో నీరంతా ఒక్కసారిగా పొంగి వరదగా ప్రవహించింది. ఇది కూడా సినిమాయే. సందర్శకుల వినోదం కోసం ఈ స్టూడియోలో అనేక థీం పార్కులు ఏర్పాటుచేశారు. సమయాభావం వల్ల వాటిల్లో కొన్ని మాత్రమే చూడగలిగాము. ' జురాసిక్ పార్క్ ' పేరుతో ఏర్పాటుచేసిన థీం పార్క్ ఎంతో బాగుంది. వేగంగా ప్రవహించే నీటి వాలు ఆధారంగా నడిచే బోటులో కూర్చోవెట్టి తీసుకెడతారు. నీటిజల్లులు పడి దుస్తులు తడిచిపోకుండా రెయిన్ కోట్లు ధరించాల్సివుంటుంది. మనం ఎక్కిన బోటు వేగంగా సుళ్ళు తిరుగుతూ కొండలు, అడవుల్లోనుంచి వెడుతుంది. అన్ని వైపులా భీకరమైన డైనాసిరస్ లు మెడలు సాచి మనల్ని కొరుక్కుని తినివేయాలని ప్రయత్నిస్తుంటాయి. ఆఖరికి మనబోటు ఒక జలపాతం పై అంచుకు చేరి కొన్ని క్షణాలు ఆగుతుంది. పై నుంచి ఒక పెద్ద డైనాసారస్ తల వేగంగా ముందుకు వస్తుంది. కోరలు సాచి మన తల పట్టుకునేలోగా బోటు 80 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలోకి జారిపోతుంది. వేగంగా పారే నీటిలో బోటుతో సహా జారి క్రిందపడతాము. ఎంత గుండె ధైర్యం వున్న వాళ్ళనైనా సరే ఒక్క క్షణం వొళ్ళు జలదరిస్తుంది. జలపాతంలోకి జారిపోయేటప్పుడు భయంతో కేకలు పెట్టే సందర్శకుల మొహాలను-హావభావాలతో ఫొటోలు తీసి ఇస్తారు. కొంత ధర చెల్లాంచాలనుకోండి.

పిల్లల ప్రపంచం

అమెరికాలో పిల్లలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాళ్ళు వాడే సబ్బులు - క్రీములు, ఆహారపదార్థాలు - బొమ్మలు అన్నీ ప్రత్యేకంగా వుంటాయి. వాటిని వారి వయస్సుని బట్టి ప్రత్యేకించి తయారు చేస్తారు. వారి కోసం విడిగా టివి ఛానల్స్ ఉన్నాయి. వారి అభిరుచుల ప్రకారం కార్యక్రమాలను వినోదభరితంగా రూపొందిస్తారు. ఇటీవల విడుదలయిన ష్రెక్ చలనచిత్రం పిల్లల కోసం నిర్మించారు. పూర్తిగా కంప్యూటర్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు.దీన్ని చిత్రీకరించిన విధానాన్ని వివరించే డాక్యుమెంటరిలు కూడా విడుదలయ్యాయి. రికార్డుస్థాయిలో కలెక్షన్లు సాధించిన ష్రెక్ చిత్రంపై రూపొందించిన 4ది చిత్రాన్ని యూనివర్సల్ స్టూడియోలో చూశాము. 3డి చిత్రం కన్నా దీంట్లో ఎఫెక్ట్స్ ఎక్కువ. సినిమాలో కానవచ్చే చిన్న చిన్న విచిత్ర జీవులు మన వంటిపై పాకుతున్న అనుభూతిని కల్గించారు. పాము వేగంగా తలవిసిరితే అది మన మొహం దాకా వచ్చి విషం చిమ్మినట్లు నీటి తుంపరలు మనపై పడ్తాయి. దీన్నే 4డ్ అంటారు. అలాగే ఉత్తరదృవానికి చిన్న విమానంలో ప్రయాణం చేస్తుంటాము. మధ్యలో ఇంజను చెడిపోతుంది. మంచు అఖాతాల మధ్యగా విమానం ఒంకర్లు తిరుగుతూ వేగంగా దూసుకు పోతుంది. మనం కూర్చున్న కుర్చీలు కూడా విమానం మాదిరిగా తిరిగి పోతుంటాయి. ఇలా ఎన్నో వింత అనుభూతుల్ని మనసులో పదిలపరచుకుని హాలీవుడ్ కూ - లాస్ ఏంగిలిస్ కూ గుడ్ బై చెప్పాము.

సీ వరల్డ్

ఆ తరువాత మజిలీ సీ వరల్డ్ ఎడ్వేంచర్ పార్క్, ఇది సాన్ డియాగొలో వుంది. కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. వేల్స్- డాల్ఫిన్స్ ఇంకా అనేక రకరకాల జలచర అద్భుత విన్యాసాలను ఇక్కడ చూడవచ్చు. షామూ అనే వేల్-డాల్ఫిన్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ. వీటన్నిటినీ చూపించడానికి ఓపెన్ అయిర్ ఆడిటోరియాలు అనేకం ఉన్నాయి. ప్రేక్షకుల గ్యాలరీకి- వేదికకూ నడుమ జలరాశి ఉంటుంది. సర్కస్లో మాదిరిగా వేదికకు రెండువైపులా నీటిలో వున్న గేట్లు తెరెవగానే వేల్స్-డాల్ఫిన్స్ ఎంతో వేగంగా వచ్చి రకరకాల ఫీట్సుతో ప్రేక్షకుల్ని రంజింపచేస్తాయి. సుమారు 70 అడుగుల ఎత్తువరకు గాలిలో ఎగిరి మళ్ళీ నీటిలోకి జంప్ చేస్తాయి. రివ్వున ఎగిసి పడే తుంపర్లతో గ్యాలరీల్లో వున్నవారు తడిసి ముద్దయిపోతారు. అందుకని రెయిన్ కోట్లు ధరించి వెళ్ళాలి. వీటిని అక్కడ సప్లయి చేస్తారు. ట్రెయినర్లు చెప్పే మాటలని అర్థం చేసుకుంటూ డాల్ఫిన్లు కడుపుబ్బనవ్వేలా చేస్తాయి. కోతుల్ని-పాముల్ని-గంగిరెద్దుల్ని ఆడించేవాళ్ళను చూశాము కానీ ఇక్కడా ఎలుకలు, ఉడతలకు కూడా ట్రెయినింగ్ ఇచ్చి వాటితో అనేక విన్యాసాలను చేయించారు. సర్కస్ లో బఫూన్లమాదిరిగా ఇవి అప్పుడప్పుడు స్టేగిమీదకు వచ్చి ట్రెయినర్లతో పోటీపడి నటించాయి. కృత్రిమంగా సృష్టించిన ఉత్తరదృవ సందర్శన ఇందులో మరో ఆకర్షణ. ధృవప్రాంతాల్లో నివసించే తెల్లని మంచు ఎలుగుబంట్లని చాలా దహ్హిరగా చూడవచ్చు. అలాగే పారదర్శకంగా వుండే పెద్ద ట్యూబ్ లో వెడుతూ చుట్టూవున్న సముద్రజలాల్లో సంచరించే జలజీవరాశులను చూడడం మరో అనుభూతి.

అథిధి దేవోభవ

శాన్ ఫ్రాన్సిస్కోలో వున్న రోజుల్లో- ఒకసారి నాపావ్యాలీకి వెళ్ళాము. వైన్ తయారీకి ప్రపంచ ప్రసిద్ధి పొందిన ప్రాంతం అక్కడ ఎక్కడ చూసినా వందల వేల ఎకరాల్లో ద్రాక్షతోటలే కనిపించాయి. వైన్ తయారుచేసే కంపెనిలు డజన్లకొద్దీ వున్నాయి. వీటిని చూడటానికి సందర్సకులని అనుమతిస్తారు. గైడ్లను నియమించి వైను తయారుచేయడంలో ఇమిడివున్న అనేక అంశాలను- కర్మాగారంలోని వివిధ విభాగాలను చూపిస్తూ వివరంగా తెలియజేస్తారు. తరువాత వైన్ టేస్టింగ్ రూం కు తీసుకెళ్ళి సందర్శకులకు అక్కడ తయారుచేసే వివిధ రకాల వైన్లను మచ్చుకకు రుచి చూపిస్తారు. ఇవన్నీ ఉచితమే. కాకపోతె ఈ కంపెనిలు తమ ఉత్పత్తుల ప్రచారానికీ- మార్కెటింగ్ కీ అనుసరిస్తున్న వ్యూహాలని చెప్పుకుంటారు.

మంచులో షికారు

కొత్త సంవత్సరం తొలిరోజుల్లో సియాటల్ లో మంచు వీరీతంగా కురిసింది. మంచుపడటం అన్నది ఈ నగరానికి కొత్తేమికాకపోయినా, ఇంత మంచుని గత రెండు దశాబ్దాలుగా చూడలేదని స్థానికులే చెప్పారు. ఇళ్ళూ-వాకిళ్ళూ- రహదారులు- కాలిబాటలు మంచుతో నిండిపోయాయి. నగర జీవనం అస్తవ్యస్తం అయింది. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మంచు రోడ్లపై కార్లు నడపటం కష్టమనుకున్న వాళ్ళు ఆఫీసులకు ఎగనామం పెట్టారు. మాస్కోలో నాలుగేళ్ళకుపైగా ఇలాంటి వాతావరణం వంటబట్టిన నేనూ మా ఆవిడ మాస్కో దుస్తుల మాదిరి కాకపోయినా - ఆ మోస్తరు దుస్తులు వేసుకుని బయటపడ్డాము. మంచు కురుస్తోంది. తెల్లటి పూలరేకులవానమాదిరిగా, రోడ్లమీద కార్ల సంచారం బాగా తగ్గిపోయింది. అరకొరగా కానవస్తున్న వాహనాలుకూడా నెమ్మదిగా- జాగ్రత్తగా సాగుతున్నాయి. రోడ్లమీద గీతలు- మంచువల్ల కానరాకపోవడంతో వాహనదారులకు దిక్కుతోచడంలెదు. కాలి బాటపై మడిమొల వరకూ మంచులో కూరుకుపోతున్న కాళ్ళను పైకి లాక్కుంటూ- జారిపడకుండా చూసుకుంటూ రెండు మైళ్ళలోపు దూరంలో వున్న ఫాక్టోరియా మాల్ అనే పద్ద షాపింగ్ సెంటరుకి వెళ్ళాము.

మరోప్రపంచం

ఒకే కప్పుకింద ఒకే ఆవరణలో వున్న వివిధ దుకాణాల సముదాయం ఇది. సుమారు మూడువేల కార్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్క్ చేసుకోవడానికి వీలయిన పార్కింగ్ లాట్ వుంది. నలువైపులా ప్రవేశద్వారాలున్న ఈ మాల్ లో - ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిచెందిన దుస్తులూ-పాదరక్షలు- నగలు- పుస్తకాలు-ఔషదాలు- ఎలక్టృఆనిక్ - వీడియోలు - పిల్లల బొమ్మల దుకాణాలు వున్నాయి. పోలీస్ స్టేషన్ - పోస్టఫీస్ - బ్యంకులు -ఎ టి ఎం సౌదుపాయాలు ఏర్పాటుచేశారు. తాజా కూరగాయలు, పాలు, మాంసం అమ్మే విభాగాలున్నాయి. ఓ డజను పైగా రెస్టారెంట్లువున్నాయి. వివిధ దేశాలకు చెందిన ఆహారపదార్థాలు లబిస్తాయి. లాంటి పెద్ద పెద్ద మాల్స్ సియాటల్ లో పాతికపైగావున్నాయి. వీటిని చూడాలన్నా షాపింగ్ చేయాలన్నా గంటలకొద్దీ సమయం ఖర్చుచేయాల్సివుంటుంది. అలాగే ' ఐకియా ' ఇక్కడ ఇంటికి కావల్సిన వస్తువులు సమస్తం దొరుకుతాయి. అంటే ఇటుకలనుంచి ఇంటి పైకప్పు-గోడలు- కిటికీలు- ద్వారబంధాలు-తలుపులు ఇలా విడిబాగాలన్నీ కొనుగోలుచేసి- ఇనష్ట్రక్షన్ ప్రకారం బిగించుకుంటే ఏకంగా ఇల్లే అమరిపోతుంది. బెడ్ రూం, కిచెన్- డ్రయింగ్ రూం -లాన్ ఫర్నిచర్ ఒక్కచోటే విక్రయిస్తారు. ఇలాంటివే వాల్ మార్ట్- బస్ట్ బై - కాస్ట్ కో - చాలా పెద్ద పెద్ద షాప్స్. వీటిల్లో షాపింగ్ చేయడానికి వెళ్ళినవాళ్ళు షాపింగ్ చేస్తుంటే పిల్లలకాలక్షేపంకోసం రిక్రియేషన్ సెంతర్స్ వున్నాయి. ఇవన్నీ కార్పొరేట్ యాజమాన్యంలో నడుస్తాయి. దేశంలోని అన్ని నగరాలు -పట్టణాలు అన్ని చోట్లా ఇవి కనిపిస్తాయి. వీటి ఆవిర్భావంతో రిటెయిల్ మార్కెట్లు అంతరించిపోతున్నాయంటారు.

చిరంజీవ్ సినిమా క్రేజ్

ఇక్కడ వుండగా రెండు సినిమాలు చూశాము. చిరంజీవ్ నటించిన ' ఠాగూర్ ' చిత్రాన్ని ఒకరోజు ప్రత్యేకంగా ప్రదర్శిస్తుంటే వెళ్ళాము. ఒక్కొక్క టిక్కెట్టు పది డాలర్లు. మామూలుగా అమెరికన్ సినిమాలయితే ఇంత ఖరీదు వుండదు. హౌస్ ఫుల్ అయింది. అంతా తెలుగువాళ్ళే. హైదరాబాద్ క్రాస్ రోడ్ థియేటర్లో సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది. ఒకటే చప్పట్లు- డాన్సులు. తెరమీద చిరంజీవి కనిపించినప్పుడల్లా ఈలలు-కేకలు. సినిమా ప్రొక్షన్ చేస్తున్న అమెరికన్ ఆపరేటర్ కి బుర్ర తిరిగిపోయి ఉంటుంది. నాలాంటివాళ్ళే - అంటే అయిదు పదులు దాటున వాళ్ళు- నలుగైదు జంటలు తప్ప ప్రేక్షకులందరూ 30 సంవత్సరాలలోపు వాళ్ళే. స్టూడెంట్లు, ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్ళు, సియాటల్ లో ఇంతమంది తెలుగు వాళ్ళు వున్నారా అనిపించింది. మరోరోజు ఎ.ఎం.సి లో ఒక ఇంగ్లీషు సినిమా చూశాము. 10,15 థియేటర్లు ఒక్కచోటనే వుంటాయి. టికెట్ కౌంటర్ నుంచి- ఇంటర్వెల్ లో క్యాంటిన్ వరకూ ప్రేక్షకులందరూ ఎంతో క్రమశిక్షణతో క్యూలో నిలబడతారు. ఎల్లోలైన్ దాటి ముందుకు వెళ్ళరు.

మైక్రోసాఫ్ట్ టెంపుల్

సియాటల్ లో హిందూ రెలిజియన్ సెంటర్ వుంది. దీని నిర్మాణానికి మైక్రోసాఫ్ట్ సంస్థ లక్షల డాలర్ల భూరివిరాళం ఇచ్చింది. గుడి ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా వుంది. శ్రీవేంకటేశ్వరస్వామి -శివపార్వతులు- లక్ష్మీనారాయణులు- గణపతి-కుమారస్వామి ఇలా ఎందరో దేవతా మూర్తుల పాలరాతి విగ్రహాలు చాలా అందంగా ప్రతిష్టించారు. ఇక్కడ పూజారి తెలుగువారే. ఆయన భార్యా, కుమార్తెతో కలసి గుడి ఆవరణలోనే నిర్మించిన ఇంట్లో వుంటారు. డిల్లీలో సంస్కృత భాషలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. రీసెర్చి చేస్తుండగా ఈ అవకాశం లభించిందని ఆయనే చెప్పారు. హైదరాబాద్ లోని ఎంసీఅర్ ఇన్‌స్టిట్యూట్ లో పనిచేస్తున్న విజయరాఘవాచారిగారు తనకు గురుసమానులని చెబుతూ- ఆయన గురించి చాలా పొగిడారు. ఈ గుడిలో దసరా, దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

వెల్లువెత్తిన తెలుగుతనం

మరోరోజు సియాటల్ ఆంధ్రా అసోసియేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వెళ్ళాము. ఒక స్కూల్లోని ఆడిటోరియం చూసిన తర్వాత ఇక్కడి విద్యార్థులు ఎంత అదృష్టవంతులో అనిపించింది. క్రీడా మైదానం -బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్, సైన్సు లేబొరేటరీ, కంప్యూటర్ లేబొరేటరీ, ఎంతో పెద్ద పార్కింగ్ వున్న ఆ స్కూల్ని చూస్తే ఇక్కడ విద్యారంగానికి ఎంత పెద్ద పీట వెస్తున్నారో అర్థం అయింది.

ఆంధ్రా అసోసియేషన్ వారి సాంస్కృతిక కార్యక్రమ చాలా బాగుంది. చక్కని హాస్యనాటికతో పాటు- సంగీత విభావరి నిర్వహించారు. ప్రేక్షకులందరూ 30-35 సంవత్సరాలలోపు వాళ్ళే. ఇప్పటి సినిమా పాటల్తోపాటు 50 సంవత్సరాల కిందటి పాత సినిమా పాటలను స్వరబద్దంగా పాడడం అద్భుతంగా తోచింది. అలాగే నాటిక కూడా. వేషాలు వేసిన వారందరూ ఇక్కడ బిజీగా ఉదయమ్నుంచి సాయంత్రం దాకా ఉద్యోగాలతో తీరికలేని వాళ్ళే. ఎక్కడా తడబడకుండా ప్రదర్శనను రక్తికట్టించారు.

పిల్లలకు ప్రత్యేకం

కార్లో రేడియో, ఇంట్లో టీవీ సర్వసాధారణం. అవసరం కూడా. టీవీలో వందకుపైగా ఛానల్స్. ఇవికాక మరెన్నో పెయిడ్ ఛానల్స్. తెలుగు ఛానల్స్‌లో కనబడే అభ్యంతరకర -అశ్లీల దృశ్యాలు ఏ ఛానల్‌లోనూ చూడలేదు. పెయిడ్ ఛానల్స్‌లో ఏమయినా చూపిస్తున్నారేమో తెలియదు. పిల్లలకోసం ప్రత్యేకంగా ఛానల్స్ వున్నాయి. ఆ కార్యక్రమాలను రూపొందిస్తున్న తీరు ప్ర్శంసనీయం. కార్పోరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ వారు పిల్లల కోసం తయారుచేసి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే - ఒకానొక కాలంలో మనదేశంలో రేడియో- దూరదర్శన్ కార్యక్రమాలు గుర్తుకు వచ్చాయి. సస్యవిప్లవానికి రేడియో దోహదపడితే గతంలో దూరదర్శన్ ప్రసారం చేసిన విజ్ఞాన వినోద కార్యక్రమంలో ప్రభావితమైన యువజనులు అనేకులు ఈ నాడు అనేక రంగాల్లో ముందుకు పోతున్నారు.

పెడ ధోరణులు

ఈ రోజుల్లో అనేక రకాల ప్రైవేట్ ఛానల్స్ అందుబాటులోకి వఛ్ఛాయి. వాణిద్య పరమైన ధోరణులుతప్ప- పిల్లల్ని యువతని సరైన దారిలో నడిపే దిశానిర్దేశనం కానరావడంలేదు. నేటిబాలలే రేపటి పౌరులు అనే వాక్యం-శుష్కవాక్యం కాకుండా అమెరికన్ సమాజంలో తీసుకుంటున్న చర్యలు-జాగ్రత్తలు అందరికీ అనుసరణీయం.

బాలలు సమర్థత కలిగిన వ్యక్తులుగా, వ్యక్తులు భాద్యత కలిగిన పౌరులుగా- మారడనికి అవసరమైన అన్ని అవకాశాలు ఇక్కడవున్నాయి. అలాగే చెడిపోవడానికి కూడా. సమాన అవకాశాలతో సమర్థతకు ఇస్తున్న గుర్తింపువల్ల అభివృద్ధి నిరాటకంగా సాగింది. పౌరుల సర్వసాధారణ జీవితంలో ప్రభుత్వ ప్రమేయం అతి తక్కువగావుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేను చూసిన సోవియట్ యూనియన్‌లో (పైగా అప్పట్లో అది ఇనుపతెర దేశంగా పాశ్చాత్యదేశాల్లో పేరు పొందిన దేశం) కూడా సర్వసాధారణ పౌర జీవితంలో ప్రభుత్వ ప్రమేయం కానరాలేదు. ప్రజలు ప్రభుత్వంపై ప్రభుత్వ యంత్రాంగంపై ఎక్కువగా అధారపడాల్సిన అవసరం లేకుండా చూశారు. అప్పటి సోవియట్ యూనియన్‌లో ప్రజలకు నిత్యం రోడ్లపై తారసపడే ప్రభుత్వ- లేదా అధికార యంత్రాంగం తాలూకు ఏకైక ప్రతినిది ట్రాఫిక్ పోలీసు. అమెరికాలో ఆ ట్రాఫిక్ పోలీసుకూడా రోడ్లపై కానరారు. మనవద్ద సైతం ప్రజలకు చేరువగా వుండే ప్రభుత్వ ప్రతినిధులు -ప్రధానంగా పట్టణాల్లో-ట్రాఫిక్ పోలీసులే. పట్టపగలు నడిరోడ్డుపై ప్రజలపై జులుం చేస్తూ ముక్కుపిండి గోళ్ళూడగొట్టి డబ్బులు వసూలుచేసుకునే వీలున్న ఏకైక ప్రభుత్వవ్యవస్థ కేవలం మనదేశంలోనే వుండడం మన దురదృష్టకరం. అమెరికాలో వ్యక్తిగత స్వేఛ్ఛకు స్వఛ్ఛందంగా గీసుకున్న సరిహద్దురేఖలకారణంగా దాన్ని దుర్వినియోగపరిచే అవకాశలు తగ్గిపోయాయి. పౌర హక్కుల ఉద్యమాలు బలంగావున్నా అవి వినియోగదారుల హక్కుల పరిరక్షణకే పరిమితం అయినట్టుగా కానవస్తోంది. ఇరాక్ యుద్ధం వంటి అమెరికన్ ప్రభుత్వ విధానాలు - విడేశాంగ నీతిపై పౌరుల అనుకూల-ప్రతికూల స్పందనలు భాధ్యతగా వుంటాయి. ఇటీవల ఎవరికో వీడ్కోలు చెప్పడానికి సియాటల్ విమానాశ్రయానికి వెళ్ళాము. విమానాశ్రయం వెలుపల ఎవరినో రిసీవ్ చేసుకోవడానికి నలుగురైదురు వచ్చారు. వారి చేతుల్లో Welcome to Clark అనే ప్లే కార్డులు వున్నాయి. మేము చూస్తుండగానే ఆ క్లార్క్ మహాశయుడు బయటకు వచ్చాడు. ఆయన ఎవరొకాదు. 2004 నవంబర్‌లో జరిగిన అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి స్థానం కోసం పోటీపడిన నలుగురైదుగుర్లో ఒకరు. ఎలాంటి పటాటోపం లేకుండా -క్లార్క్ తన నామినేషన్ ప్రకారం నిర్వహించుకుంటున్న తీరు నివ్వెర పరచింది. విమానాశ్రయం అధికారులు కూడా ఆయన రాకపట్ల అనవసరమైన ' అత్యుత్సాహం ' ప్రదర్శించలేదు.

ఇండియన్ అమెరికా

అమెరికాలో అన్నీదేశాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో కానవస్తారు. టూరుస్టులగా వచ్చినవారే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడ్డవాళ్ళు అనేకమందివున్నారు. అలాగె మనదేసం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు వైద్య-విద్యారంగాల్లో పాతుకు పోయారు. అష్టైస్వర్యాలతో తులతూగుతున్న అనెకమంది సంపన్న అమెరికన్లకు సరిటుగే వారు చాలామందివున్నారు. మన రాష్ట్రానికి చెందినవారు కూడా ఈ దేశంలొ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇండియన్‌స్టోర్స్ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన ఓ రెడ్డిగారు భారత్ బజార్ అనే పద్దషాపు నడుపుతున్నారు. కరివేపాకు నుంచి మన వాళ్ళకు అవసరమైన సమస్తం ఇక్కడ లభిస్తాయి. అక్కడి వీడియో పార్లర్‌లో వున్న తెలుగు సినిమాల్లో దేవదాసు నుంచీ ఇటీవల విడుదలైన సినిమాలదాకా అన్నీ వున్నాయి. పోతే కంప్యూటర్ పుణ్యమా అని ఇక్కడికి వచ్చి పెద్ద ఉద్యోగాలు చెసుకుంటూ రెండు చేతుల్తో (భార్య-భర్త) ఆర్జిస్తున్న వాళ్ళు అనేకం. మనదేశంలో కలలో సయితం ఊహించని జీవన ప్రమాణాలు వీరు అనుభవిస్తున్నారు. కష్టపడుతున్నా అందుకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతున్నారు. వీరి మూలంగా వారి కుటుంబాలు కూడా ఆర్థికంగా తెరిపిన పడుతున్నాయి.

శాన్‌ఫ్రాన్సిస్కోలో వున్న ఒరకిల్ కార్యాలయానికి వెడితే- ప్రతి అంతస్తులో తెలుగువారి పేర్లు నేంప్లేట్లో కనిపించాయి. వీరంతా ఆ కంపెనీలో చాలా పెద్దపెద్ద హోదాల్లో పనిచేస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో లోని ఇండియన్ అసోసియేషన్ వారు నిరుడు తమ ఉత్సవాలకోసం మన దేశం నుంచి ఒక ప్రసిద్ద హిందీ సినీనటుడిని ఆహ్వానించారట. ఆయనకు ఒక భారతీయ డాక్తరు ఇంట్లో ఆతిధ్యం ఏర్పాటుచేశారు. ఒక కొండపై ఆ డాక్టరు కట్టుకున్న విలాసవంతమైన భవంతిని చూసి కోట్లు గడిస్తున్న ఆ సినీనటుడుకూడా ముక్కున వేలేసుకున్నాడట. ఇక్కడ మనవారి సంపాదనలు గురించి తెలియచెప్పడానికి ఈ విషయాలు చెబుతుంటారు. వీళ్ళందరూ ఎంతో కష్టపడి చదువుకుని నా అన్న వారినందర్నీ వొదిలి పెట్టి ఇంతంత దూర ప్రదేశాల్లో సెటిలయి జీవిస్తున్నవారే. ఎవరూ కాదనరు. వీళ్ళలో ప్రతి ఒక్కరూ ప్రతిభ కలిగిన మరో విద్యార్థికి అండదండలనందించి వారిని పైకి తీసుకురాగలిగితే, అలాగే ఈ పరంపర కొనసాగితే ఈ సంపాదనలకు అర్థం-పరమార్థం ఉంటుంది.

ఇంటూ 45

ఇక్కడికి టూరిస్టులగా వచ్చెవారు, ' ఇంటూ 45 ' ఫోబియా నుంచి బయటపదకపోతే చాలా ఇబ్బంది. డాలరు విలువ మనదేశంలొ 44 లేదా 45 రూపాయలు వుండవచ్చు. కానీ ఇక్కడ డాలరు డాలరే. అలా అనుకోకపోతే హోటళ్ళలో ఓ కప్పు కాఫీ లెదా ఓ కోక్ కూడా త్రాగలేరు. ఇంత ఖరీదా అనిపిస్తుంది. ' ఈ చొక్కా ఇంత ధరా ! అదే మన అమీర్‌పేటలో అయితే ' అని అనుకునే మనవాళ్ళు ఇక్కడ చాలామంది కనిపిస్తుంటారు.

అమెరికా - చైనా భాయీ- భాయి

ప్రపంచీకరణ- నూతన భౌగోళిక సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఎక్కువ బాగుపడుతున్న దేశం చైనానే అనిపిస్తుంది. ఇక్కడ దొరికే పిల్లల బొమ్మల దగ్గర్నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఎక్కువభాగం చైనాలో తయారయినవే కానవస్తాయి. కొద్ది ప్రతిఫలానికి పనిచెసే పనివారు (చీప్ లేబర్ అంటారు - ఆ మాట ఎందుకో వాడలనిపించడంలెదు) ఆ దేశంలో సమృద్ధిగా వుండదంవల్ల చౌకగా వస్తువులు తయారు చేసే వీలుంది. ఈ రూలు మనదేశానికీ వర్తిస్తుంది. కాని నాణ్యత అనే మరోపదం అంతర్జాతీయ విపణిలో మనల్ని దూరంగా నెడుతోంది. చైనాలో పనిచేసేవారితో పాటు-వారి చేత నిబద్దతగా పనిచేయించే యంత్రాంగం వుండటంవల్ల నాణ్యత విషయంలో అమెరికన్ ప్రమాణాలకు ఆ దేశం సరితూగగలుగుతోంది.అందుకే ఇక్కడి కార్పొరేట్ సంస్థలు ఆ దేశంపట్ల మొగ్గుచూపుతున్నాయి. ఇక్కడి ఇండియన్ స్టోర్సుల్లో తప్పితే మేడ్ ఇన్ ఇండియా సరుకులు వేరే చోట కానరావు. ఆహారపదార్థాలు, ఫాన్సీ వస్తువుల మార్కెటింగ్ అవకాశాలు ఇక్కడ పుష్కలంగా వున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం దురదృష్టకరం.

ముక్తాయింపు

అమెరికాలో దాదాపు అయిదు మాసాలు గడిపి- తిరిగి వచ్చేముందు చుట్టుపక్కాలు, స్నేహితులకు గుర్తుగా ఇచ్చేందుకు ఏమైనా వస్తువులు కొనదంకోసం ముమ్మరంగా షాపింగ్ చేశాము. కాని ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఎక్కువభాగం మేడ్ ఇన్ చైనా అని లేబుళ్ళు కనిపించాయి. ఇదేమిట్రా అని ఆశ్చర్యపోతుంటే ఒక మిత్రుడిలా అన్నాదు. ' నిరుడు మా ఫ్రెండొకడు ' అమెరికన్‌డే ' కోసం అమెరికా జాతీయపతాకం కొన్నాదు. దాని మీద మేడ్ ఇన్ చైనా అని రాసుంది '

ఇది నవ్వులాటకు చెప్పిన విషయం కావచ్చేమో కానీ ఇందులో ఎంతో వాస్తవం వుంది.

అమెరికాలో నచ్చిన విషయం రోడ్లు అని వ్రాశానుకదా! మరో సంగతితో దీన్ని ముగిస్తాను. " ఈ దేశంలో వున్న అయిదు మాసాలు శుద్దమైన గాలి పీల్చాను. పరిశుభ్రమైన నీళ్ళు త్రాగాను '

అంకితం : అమెరికాను మొదటిసారి సందర్శించే తెలుగు తల్లితండ్రులందరికీ !

- భండారు శ్రీనివాసరావు

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)