మూలం: స్టెఫాన్ త్సైక్

జరిగిన కథ:

వీరవాఘ రాజ్యంలో విరాట్ గొప్ప యోధుడు. అచంచల రాజభక్తి కలవాడు. అయితే రాజుగారి బావమరిది రాజ్యం మొత్తం ఆక్రమించాలన్న దురుద్దేశంతో వీరవాఘ సైనికుల్ని కొందర్ని లంచాలతో లోబర్చుకొని దండెత్తి వచ్చాడు. ఆ విపత్కర సమయంలో రాజుగారు విరాట్ ను సైన్యానికి నాయకత్వం వహించి శత్రువుని ఎదుర్కోమని కోరాడు. ఆనాటి రాత్రి జరిగిన సంగ్రామంలో విరాట్ తన శక్తియుక్తులతో శత్రువుల గుడారంపై దండెత్తి రాజవిద్రోహులను కడతేర్చాడు. మరుసటి రోజు ఉదయం విరాట్ చనిపోయిన విద్రోహులలో ఒకరిని తన అన్నగా గుర్తించాడు. తన చేతులతో స్వంత అన్ననే చంపుకొన్న సంఘటన విరాట్ ని ఎంతగానో కలచివేసింది. విజయకేతనంతో తిరిగి వచ్చిన విరాట్ కు రాజుగారు వజ్రాలతో పొదిగిన తమ పూర్వీకుల ఖడ్గాన్ని బహుకరిస్తూ సర్వ సైన్యాధ్యక్ష పదవిని అప్పగించబోయాడు. అయితే విరాట్, సొంత అన్ననే చేజేతులా చంపుకున్నానని, ఇక జీవితంలో ఖడ్గాన్ని ముట్టబోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా చెడు జోలికి పోని, ధర్మబద్దుడైన విరాట్ కు రాజుగారు ప్రధాన న్యాయాధికారి పదవీ బాధ్యతలను అప్పగించాడు.ాట్ ని ఎంతగానో కలచివేసింది.

ఆరోజు నుంచి విరాట్ ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాక రాజభవనంలోని తన న్యాయపీఠం నుంచి రాజుగారి పేరిట న్యాయ నిర్ణయం చేయసాగాడు. ఆయన తీర్పులు ధర్మకాటాతో తూచినట్లు ఉండేవి. ఏవైపు మొగ్గకుండా త్రాసు సమంగా ఉన్నట్లు ఉండేవి. మెరుస్తున్న ఆయన కళ్ళు ముద్దాయి ఆత్మను లోతుగా శోధించేవి. ఆయన వేసే ప్రశ్నలు అపరాధపు మూలాల దాకా చొచ్చుకుపోయేవి. ఆయన విధించే శిక్షలు కఠినంగా ఉండేవి. కానీ ఎప్పుడూ విచారణ రోజే తీర్పు చెప్పేవాడు కాదు. ప్రశాంతంగా ఆలోచించడానికి ఒకరోజు సమయం తీసుకునేవాడు. ఏ విషయంపైన అయినా తీర్పు చెప్పదల్చుకుంటే ఆరోజు తెల్లవారుఝామునే నిద్ర లేచేవాడు. మనసును ప్రశాంతంగా ఉంచుకొని, మేడమీద అటూ ఇటూ పచార్లుచేస్తూ తను చెప్పబోయే తీర్పు అన్నివిధాలా న్యాయబద్ధమైనదా కాదా, సమంజసమైనదా కాదా అని పలువిధాలుగా ఆలోచించేవాడు. ఆయన మేడమీద నడుస్తూ ఉంటే ఆయన పాదధ్వని ఇంట్లో వాళ్ళకి వినిపించేది.

తీర్పు చెప్పే ముందు భావావేశానికి లోనుకాకుండా ఉండడం కోసం మరోసారి చేతులు, కాళ్ళు చల్లని నీళ్ళతో కడుక్కునేవాడు. తీర్పు చెప్పాక తన తీర్పు సమంజసంగా ఉందా లేదా చెప్పమని ముద్దాయిని అడిగేవాడు. నూటికో కోటికో ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళంతా ఆయన తీర్పును శిరసావిహించేవారు. న్యాయపీఠం మెట్లను ముద్దుపెట్టుకుని, ఆ తీర్పును దైవనిర్ణయంగా స్వీకరించేవాళ్ళు.

విరాట్ ఎప్పుడూ, ఎవ్వరికీ మరణశిక్ష విధించలేదు. ముద్దాయి ఎంత క్రూరుడైనా, ఎంత పెద్ద నేరం చేసినా మరణదండన మాత్రం విధించేవాడు కాదు. తన జీవితాన్ని రక్తసిక్తం చేసుకోవాలంటే భయపడేవాడు.

విరాట్ న్యాయాధికారి కాక పూర్వం ఆ రాజ్యపు వధ్యస్థలిలో ఉన్న బండలన్నీ మరణదండనకు గురైన వ్యక్తుల రక్తంతో నలుపెక్కాయి. విరాట్ న్యాయాధికారి అయ్యాకా ఒక్క మరణశిక్షా లేక వర్షాలకు ఆ రక్తపు చారికలు కొట్టుకుపోయి బండలు తెలుపెక్కాయి. మరణశిక్షలు మానేసిన తర్వాత నేరాలా సంఖ్య కూడా పెద్దగా పెరగలేదు. నేరస్తుల్ని భూగర్భంలో తొలిచిన కారాగారానికి పంపేవాడు. లేదా కొండల మీదికి పంపి వాళ్ళచేత తోటల ప్రహరీలకు కావలిసిన రాళ్ళను కొట్టించేవాడు. మరికొందరిని నదీతీరాల్లో ఉన్న బియ్యం మరల్లో ఏనుగుల జతన కట్టి చక్రాలను తిప్పించేవాడు. మానవ జీవితాన్ని ఆయన గౌరవిచేవాడు. ప్రజలు ఆయన్ని గౌరవ భావంతో చూచేవారు. ఆయన్ తీర్పులెప్పుడూ అధర్మంగా లేకపోవడం కూడా దీనికొక కారణం. సత్యాన్వేషణలో ఆయనెప్పుడూ అలసిపోయేవాడు కాదు. ఆయన పలుకులెప్పుడూ పరుషంగా ఉండేవి కావు. చాలా దూరప్రాంతాల నుంచి కూడా రైతులు తమ తగాదాల్ని పరిష్కరించుకోవడానికి విరాట్ దగ్గరకు వచ్చేవాళ్ళు. పూజారులు కూడా ఆయన ఆజ్ఞల్ని శిరసావిహించేవారు. మహారాజు సైతం విరాట్ సలహాలు తీసుకునేవారు.

పోనుపోను విరాట్ ఖ్యాతి రాజ్యమంతా వ్యాపించింది. కొద్ది రోజుల్లేనే వీరుడు, అసమాన యోధుడు అని తాము పొగిడిన విషయం ప్రజలు మర్చిపోయారు. వాళ్ళ దృష్టిలో ఆయన ఇప్పుడు యోధుడు కాదు, ఉత్తమ న్యాయాధికారి. ధర్మదేవతలాంటి న్యాయమూర్తిగా పేరొందాడు.

విరాట్ న్యాయాధికారిగా నియమితుడై ఆరేళ్ళు అయింది. ఒకరోజు కొంతమంది గ్రామీణులు ఒక కొండజాతి యువకుణ్ణి తాళ్ళతో బంధించి విరాట్ ముందుకు లాక్కొచ్చారు. ఈ కొండజాతివాళ్ళు పర్వతాలకు అవతలి వైపున ఉండేవాళ్ళు. వాళ్ళు పూజించే దేవుళ్ళు వేరు. ఈ యువకుడి కాళ్ళు రక్తసిక్తమై ఉన్నాయి. ఆ గ్రామీణులు ఇతన్ని బంధించి మైళ్ళకు మైళ్ళు నడిపించినట్టున్నారు. అతనిది కండరాలు తిరిగిన ఒళ్ళు. చాలా బలిస్ఠంగా ఉన్నాడు. అతని కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉన్నాయి. బలమైన అతని బాహువుల్ని తాళ్ళతో గట్టిగా బిగించి కట్టేశారు. లేకపోతే అతన్ని అదుపులో వాళ్ళ వల్ల కాదు. ఆ యువకుణ్ణి వాళ్ళు న్యాయపీఠం ముందుకు తోసి బలవంతం మీద అతను మోకరిల్లేలా చేశారు. ఆ తర్వాత వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. న్యాయాన్ని అర్థించడానికి వచ్చాం అన్నట్టుగా చేతులు జోడించి నిలబడ్డారు. విరాట్ ఆ అపరిచితుల వంక ప్రశ్నార్థకంగా చూసి అడిగాడు, 'సోదరులారా, మీరెవరు? చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. మీరు బంధించి తెచ్చిన ఈ వ్యక్తి ఎవరు?'

వచ్చిన వాళ్ళలో పెద్దతను ముందుకు వచ్చి చేతులు జోడించి "ప్రభూ, మేము మందలు మేపుకునే వాళ్ళం. ప్రశాంతంగా బతికే తూర్పు ప్రాంత నివాసులం. మేం మీ ముందుకు తెచ్చిన ఈ యువకుడు దుష్టుల్లోకెల్లా మహాదుష్టుదు. మహాపాపి. వేళ్ళమీద లెక్కపెట్టలేనంత మందిని అతను హత్య చేశాడు.

మా గ్రామంలోని ఒక అమ్మాయిని తంకిచ్చి పెళ్ళి చేయవలసిందిగా కోరాడు. అందుకు ఆ అమ్మాయి తండ్రి అంగీకరించలేదు. దానికి కారణం వీళ్ళ జాతి నీతి నియమాలు, ఆచారాలు. వీళ్ళు గోవుల్ని వధిస్తారు. కుక్క మాంసం తింటారు. అందువల్ల తన కూతుర్ని ఇతనికి ఇవ్వకుండా లోయప్రాంత వ్యాపారి ఒకతనికి ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆ కోపంతో ఇతను మా గ్రామ పశువుల్ని ఎన్నింటినో తోలుకుపోయాడు. ఒకరోజు రాత్రి వచ్చి ఆ అమ్మాయి తండ్రిని, ఆయన ముగ్గురి కొడుకుల్ని చంపేశాడు. ఆరోజు నుంచి ఆ కుటుంబంలో వాళ్ళుగానీ, మా గ్రామంలో వాళ్ళుగానీ పశువులు మేపుకోడానికి పర్వతప్రాంతానికి వెళితే పట్టుకుని చంపేసేవాడు. అలా ఇప్పటికి పదకొండుమందిని చంపేశాడు. చివరకు మేమంతా కలిసి వెంటాడి ఎంతో కష్టపడి ఇతన్ని పట్టుకోగలిగాం. ఎంతో శ్రమకోర్చి మీ సమక్షానికి తెచ్చాం. ఓ ధర్మదాతా, ఈ హంతకుడి బారీ నుంచీ మమ్మల్ని, మా గ్రామాన్ని రక్షించండి" అన్నాడు వినయంగా.

విరాట్ తల ఎత్తి ఆ యువకుని వైపు చూశాడు. "వాళ్ళు నీ గురించి చెప్పింది నిజమేనా?" అని ప్రశ్నించాడు.

"ఎవరు నువ్వు? మహారాజువా?"

"నా పేరు విరాట్. రాజుగారికి, న్యాయానికి సేవకుణ్ణి. నా పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, సత్యాన్ని అసత్యం నుంచి వేరుచేయాలని నా కోరిక."

ముద్దాయి ఒక్క క్షణం మౌనంగా ఉండి తరువాత విరాట్ వైపు తీక్షణంగా చూశాడు. "ఎక్కడో దూరంగా న్యాపీఠం మీద కూర్చుని ఏది నిజమో, ఏది అబద్ధమో నువ్వెలా తెలుసుకుంటావ్. ఇక్కడికి వచ్చినవాళ్ళు చెప్పినదాన్ని బట్టేగా నీకు తెలిసేది?"

"వాళ్ళ ఆరోపణలకు నీ సమాధానమేమిటో చెప్పు. మీరు ఇద్దరూ చెప్పినదాన్ని బట్టి నిజమేదో నేను గ్రహిస్తాను."

ధిక్కార ధోరణిలో ఆ యువకుడు కనుబొమలెగరేశాడు.

"నేనేమి చేశానో నీకెలా తెలుస్తుంది. వీళ్ళతో నాకు విరోధం లేదు. కోపం హద్దులు దాటినప్పుడు నా చేతులు ఏం చేస్తాయో నాకే తెలియదు. కూతుర్ని డబ్బుకోసం అమ్మేసిన ఆ తండ్రిపట్ల, అతని పిల్లలపట్ల, అతని నౌకర్లపట్ల న్యాయంగా నేను చేయాల్సింది చేశాను. అది నేరంగా, నన్ను నేరస్తుడిగా వీళ్ళు ఆరోపించదలుచుకుంటే ఆరోపించనీ. వాళ్ళనీ, నీ తీర్పునీ ద్వేషిస్తాను."

అపరాధి ఇంత గొప్ప న్యాయాధికారి సమక్షంలోనే ఎంతో అహంకారంతో ప్రవర్తించడం చూసి ఆ గ్రామీణులు కోపంతో ఊగిపోయారు. బంట్రోతు కొరడా ఝుళిపించాడు. విరాట్ సైగలతో అందరినీ శాంతపరచి మళ్ళీ ప్రశ్నించాడు.

వాళ్ళు ఒక్కో నేరాన్ని చెప్పినప్పుడల్లా విరాట్ ముద్దాయిని సంజాయిషీ అడిగేవాడు. ముద్దాయి దేనికీ సమాధానం చెప్పకుండా పళ్ళు పటపట కొరికి మౌనం వహించేవాడు. ఒకే ఒక్కసారి మాత్రం అతను నోరు విప్పి "ఇతరుల మాటలు విని నీవెలా న్యాయాన్ని తెలుసుకుంటావ్?" అని ప్రశ్నించాడు.

మిట్ట మధ్యాహ్నానికి నేరం పూర్వాపరాలు వినడం ముగిసింది. విరాట్ న్యాయపీఠం నుంచి లేస్తూ "నేను ఇంటికి వెళుతున్నాను. తీర్పు రేపు చెబుతాను" అన్నాడు.

అందుకు గ్రామీణులు చేతులు జోడించి "ప్రభూ, తమ దయాభిక్ష కోసం ఇక్కడికి రావడానికి ఏడు రోజులు ఎడతెగని ప్రయాణం చేశాం. తిరిగి వెళ్ళడానికి మరో ఏడు రోజులు పడుతుంది. ఆలన పాలన లేక మా పశువులు దప్పికతో అలమటించి పోతుంటాయి. పొలాలు దుక్కులు దున్నుకోవాలి. మా యెడల దయచేసి తీర్పును రేపటిదాకా వాయిదా వెయ్యకుండా ఇప్పుడే చెప్పండి" అని వేడుకున్నారు.

వాళ్ళు చెప్పింది విని విరాట్ ఆలోచిస్తూ కొద్దిసేపు అలా మౌనంగా కూర్చున్నాడు. పెద్ద బరువు నెత్తిన ఎత్తుకున్నవాడిలా కనుబొమలు వాలిపోయి ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా, భయం అంటే తెలియని వాడిని, క్షమాభిక్ష కోరని వాడిని శిక్షించాల్సిన అవసరం విరాట్ కి ఏనాడు రాలేదు. చాలాసేపు ఆలోచనల్లో మునిగిపోయాడు. సమయం గడిచేకొద్దీ ఆయనకు విచారం ఎక్కువ కాసాగింది.

తన తీర్పు, తన మాటలు ఆవేశంగా ఉండకూడదని లేచి సెలయేటి దగ్గరకు వెళ్ళి చల్లటి నీళ్ళతో ముఖం, కాళ్ళు కడుక్కున్నాడు. ప్రశాంతంగా వచ్చి న్యాయపీఠం మీద కూర్చున్నాడు.

(సశేషం)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)