సునామి ద్రష్టా, వాతావరణ శాస్త్ర నిపుణుడు - డాక్టర్ తాడేపల్లి సత్యనారాయణ మూర్తి

సాగరశాస్త్రం, వాతావరణశాస్త్రలలో ప్రవీణుడిగా వృద్ధినొంది, తన అఖండానుభవంతో తనదంటూ ఓ ముద్ర వేసి, ప్రపంచంలోనే అతి శ్రేష్ట సునామి నిపుణుడిగా, విశిష్ట స్థానాన్ని పొందిన శాస్త్ర స్రష్ట, తెలుగు వాడు, డాక్టర్ తాడేపల్లి సత్యనారాయణ మూర్తి (టాడ్ మూర్తి).

సముద్ర శాస్త్రం, వాతావరణ శాస్త్రం, కోస్తా తీర పరిరక్షణ నిర్వహణ, అనర్ధ నివారణ నిర్వహణాది రంగాలలో విశిష్ట కృషి చేసిన అనుభవశాలి. డాక్టర్ తాడేపల్లి సత్యనారాయణ మూర్తి గారు ఉపయుక్త గణితంలో సిద్ధహస్తులు. సంఖ్యాత్మక విశ్లేషణ (న్యుమరికల్ అనాలసిస్) లో శిక్షణ పొంది భూభౌతిక శాస్త్రం, రస గతి శాస్త్రం, భూ శాస్త్ర రంగాలలో ప్రావీణ్యం సంపాయించి, వాతావరణ మార్పుల గురించి, సాగర జలాపాయల క్షేత్రాలలో ప్రత్యేకత పెంపొందించుకుని సాంకేతిక పరిజ్ఞనానాభివృద్ధికి దోహదపడ్డారు.

సిద్ధాంతరీయ ద్రావగతి శాస్త్రంలో (తిరాటికల్ హైడ్రోడైనమిక్స్ లో) దిట్ట, వాతావరణ సూచనలలో పారంగతుడు. "గణితాన్ని నూటికి 99.9 శాతం జనం ద్వేషిస్తున్నారు. ఈ విషయంలో మానవాళి సమైక్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది" అని ఓ సందర్భంలో అన్నారు డాక్టర్ మూర్తి గారు. ఆయన దృష్టిలో - గణితం అతి తర్కబద్ధ అంశం (లాజికల్ సబ్జెక్ట్) - మననం చేయవలసిన పని లేదు " అని స్థిర అభిప్రాయం ఆయనది. కలన గణితం (కాల్కులస్) అంటే మూర్తి గారికి యెంతో మక్కువ. చికాగో విశ్వవిద్యాలయం లో ఉన్నత విద్య నభ్యసిస్తూ ఉండగా నోబెల్ బహుమతి గ్రహీత అచార్య ఎస్ చంద్రశేఖర్ శిష్యుడిగా అభ్యాసం కొనసాగించేరు.

మూర్తి గారి స్వస్థలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా. నలుగురు పెద్దవాళ్ళు డబ్బు పోగు చేసి స్టీమర్ టికెట్ కి డబ్బు ఇచ్చి వీడుకోలు ఇచ్చేరు. ఎంతో సాధించాలి అన్న తపనతో, దూర తీరాలకు (అమెరికా) పయనమైయ్యారు మూర్తి గారు. తొలుత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం ఎస్ సి భూ బౌతికశాస్త్రం (జియో ఫిజిక్స్)లో చేసి, కర్నూల్ ప్రభుత్వ కాలేజీలో అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేసారు.

సునామి

ఈ సాగర ప్రభంజనం అపే శక్తి యవరికీ లేదు. కాక పోతే దీన్ని ముందే పసిగట్టితే, ప్రజలను జాగరూకులను చేసి ఆస్తి, ప్రాణ నష్టాలను సాధ్యమైనంతమటుకూ నివారించ వచ్చు. ఇలా సాగర పరీవ్యాప్తమైన బృహత్తర కార్యానికి కావలసిన నైపుణ్యం, అవగాహన, రానున్న ఉపద్రవం గురించి ముందుగా హెచ్చరికలు ఇవ్వగలిగే పరిజ్ఞాన సంపద లోకానికి ఇచ్చిన ద్రష్ట, అద్బుత వైజ్ఞానికుడు, శ్రీ తాడేపల్లి సత్యనారాయణ మూర్తి గారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలకు, సునామీ గూర్చి హెచ్చరించే పరిజ్ఞానాన్ని నెలకొల్పిన ప్రజ్ఞాశాలి, సాగరశాస్త్ర కోవిదుడు, ఆచార్యుడు, తెలుగు వాడు, డాక్టర్ టాడ్ మూర్తి.

పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాలకు సునామి ముప్పు గురించి హెచ్చరించే సంస్థను రూపొందించిన పురోగామి మూర్తి గారు. దక్షిణ భారత దేశ తటీ ప్రాంతం సునామి ముప్పుకు గురైన తర్వాత, భారత ప్రభుత్వం భావి ప్రణాలికకు నాంది పలికింది. హిందూ మహా సముద్రంలో సునామి హెచ్చరిక కేంద్రం వ్యవస్థాపన చేయ వలిసిన ఆవశ్యకత గురించి చెప్పి, అది రూపొందించేందుకు తన వంతు సహాయాన్ని అందించడానికి సంసిద్ధుడైన ప్రజా శాస్త్రవేత్త డాక్టర్ టాడ్ మూర్తి.

" భారత దక్షిణాదిలో ఎస్ ఎస్ సి పి నిర్మాణంతో సేతు వారధి ఉన్మూలిస్తే కేరళ రాష్ట్రంలో తోరియం నిల్వలు ఉన్న ఇసుక, కోస్తా ప్రాంతం అంతా నశించి, జీవారణ్యానికి ముప్పు వాటిల్లుతుంది " అని అభిప్రాయం వెలిబుచ్చారు.

చేసిన కృషి, సాధించిన ఘనత

చికాగో విశ్వవిద్యాలయం నుండి సాగర శాస్త్రం, వాతావరణ శాస్త్రాలలో డాక్టరేట్ పట్టా సాదించారు. కెనడా ఓషనోగ్రఫిక్ సంస్థలో 27 యేళ్ళ పాటు పనిచేసారు. మూర్తి గారు కెనడాలోని, ఒట్టావ విశ్వవిద్యాలయం, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అచార్యుడిగా పనిచేస్తున్నారు.

ఉత్కృష్టమైన కృషి చేసి, ఫలితాలను ప్రపంచానికి పంచిన సాగరశాస్త్ర విశారధుడు, శాస్త్రవేత్త - డాక్టర్ టాడ్ మూర్తి. సునామి హెచ్చరిక సంస్థ నెలకొల్పడంలో, క్రియాశీలక పాత్ర పోషించిన అనుభవశాలి, సిద్ధహస్తుడు. ప్రపంచంలో ప్రపధమంగా ఆవిష్కరింపబడ్డ "పాసిఫిక్ సునామి సిస్టం" సుత్రధారుడు.

కెనడా దేశానికి పాసిఫిక్ సముద్ర పర్యంతం సునామి వార్నింగ్ సిస్టం నిర్మాణం చేసారు. కెనడాలోనే కాక అలాస్కా, హవాయి లో కూడా హెచ్చరిక కేంద్రాలని స్థాపించారు.

సముద్ర గర్భంలో కేంద్రీకృతమై, వచ్చే భూకంపాల వల్ల యేగిసే సునామి అలల గతిని (" ట్రావెల్ టైం ") కొలిచే సాధనాలు - టైడ్ గేజ్, " కంప్యూటర్ సిములేటెడ్ మోడల్ " ఆదారంగా సూచనలు ఇచ్చే పద్ధతులను కనిపెట్టేరు. కెనడా ఓషనోగ్రఫిక్ సంస్తలో 27 యేళ్ళు పాటు వాతావరణ శాస్త్ర క్షేత్రంలో పనిచేసారు.

హిందూ మహా సముద్రంలో సునామి హెచ్చరిక కేంద్రం యేర్పాటుకు ముందు, పాసిఫిక్ సముద్రంలో ఉన్న కేంద్రంతో "జియో స్పాషియల్" వ్యత్యాసాలు గమనించవలసిన అవసరం గురించి వక్కాణించారు. కేవలం భారత దేశ సునామి సూచన కేంద్రమే కాక, హిందూ మహా సముద్ర తీర 36 దేశాలకు సమగ్ర సునామి సూచనా కేంద్ర ఆవశ్యకత గురించి డాక్టర్ మూర్తి తన అభిప్రాయం వ్యక్త పరిచారు. తన అనుభవం తో విశ్లేషించి, విశాఖపట్నం అనుకూలమైన ప్రాంత మని, భారత సునామి హెచ్చరిక కేంద్రం అక్కడ నెలకొల్పాలని, గొవాలో పరిశోధనా కేంద్రం ప్రరంభించాలని డాక్టర్ మూర్తి సలహా ఇచ్చారు.

ఆయన పద్నాల్గవ యేట అప్పటి ప్రధాని పండిత్ నెహ్రూ ఆయన స్వగ్రామం సందర్సించి నప్పుడు, " ప్రకృతి వైపరిత్యాల నుండి వచ్చే సమస్యలను తీర్చే సంకల్పం " చేయాలని శాస్త్రజ్ఞులకి తన భాషణలో పిలుపునిచ్చారు. ఇది స్పూర్తిగా తీసుకున్నారు మూర్తి గారు. తాను, ఓ మంచి శాస్త్రవేత్త కావాలని ఆకాంక్షించి ఆ దిశగా కృషి చేసారు.

సేతు మీద హితవు

సేతు సముద్ర (ఎస్ ఎస్ సి పి) పరియోజన - "ఆర్ధికంగా ప్రతికూలిస్తుంది ", అని చెపుతూ, సుమత్రా, అండమాన్ దీవులలో యేర్పడే సునామీ వల్ల దీనికి అత్యంత ప్రమాదకరమైన పరిణామ సభవిస్తుందని తన అభిమతాన్ని ప్రకటించారు. అంతేకాక తటీ వాహక ప్రాంతంలోని దదాపు 3600 అరుదైన చెట్లు, జీవరాశులు నశిస్తాయని వారి ఉవాచ. నాసా ఉపగ్రహ చిత్రాలు - సేతు వారధి - 17.5 లక్షల యేళ్ళ నాటి వారధి అని తెలుపుతోంది, ఇంతటి చారిత్రాత్మిక కట్టడాన్ని నష్ట పరచడం తగదు అని అభిప్రాయం వెలిబుచ్చారు.

భూ శాస్త్ర నిపుణుడు, అచార్యుడు, సాగర శాస్త్ర దిట్ట, విక్టర్ రాజమానికం, పాల్క్ స్ట్రైట్ లో యేటా 24 సెంటిమీటర్లు కల్కం ("సెడిమెంటేషన్") అవుతోందని, సేతు సముద్రం షిప్పింగ్ చానల్ ప్రాజెక్ట్ తగదని, పర్యావరణం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తన అభిమతం వ్యక్తం చేసారు. ఇదే కాక సుమారు 3.5 లక్షల మత్శ్య కారులు జీవనో పాది కోల్పోయే ప్రమాదం వుందని కూడా తెలిపారు.

డిశంబర్ 2004 సునామి విధ్వంసం

డిశంబర్ 26, 2004 లో సంభవించిన సునామి ఉపద్రవం వల్ల హిందూ మహా సముద్ర తటీ ప్రాంతాలకు విపరీత ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దక్షిణ భారత దేశం సహా, ఇండోనెసియా, మలేసియా, శ్రీ లంక, సొమాలియా ఇత్యాది దేశాలలో బీభత్శం సృష్టించింది. దాదాపు 175,000 మంది ప్రాణాలు కోల్పోయారు; 50,000 జాడ లేకుండా పొయారు; 1,700,000 కాందశీకులైయ్యారు. ఇదే కాక, కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ప్రాంతీయ ఆర్ధిక వ్యవస్థలు కుప్ప కూలి, ప్రజలు జీవనోపాది కోల్పోయారు.

డిశంబర్ 2004, సునామి అధారంగా " బైడ్ సిములేషన్ నమూన (మోడల్) " రూపొందించారు డాక్టర్ మూర్తి గారు. భూకంపం 6.5 రిట్చర్ స్కేల్ దాటితే సునామి ముప్పుకు గురైయ్యే అస్కారం చాలా ఉంటుంది. హిందూ మహా సముద్ర తటీ ప్రాంతాలుగా ఉన్న 36 దేశాలు కలిసి ఉమ్మడి సునామి హెచ్చరిక సంస్త నెలకొల్పాలని సూచించేరు. గోవాలో సునామి పరిశోదనా కేంద్రం నెలకొల్పాలని అభిప్రాయపడ్డారు.

భారత దేశ భూకంప పర్వవేక్షణ వ్యవస్త, సునామి హెచ్చరిక కేంద్రం వ్యవస్తలను అనుసందానం చేయాలని సూచన ఇచ్చారు. దీని కోసం కావలసిన ఉపకరణాలు - సముద్ర గర్భంలో ఉప్పెన తరంగాల పీడనామానం (టైడ్ గేజ్ లు), " టైడల్ ఫ్లో " ను పర్వవేక్షించే ఉపకరణాలు, రాడార్ సాంకేతిక పరిజ్ఞానాలు అనుసంధానం చేయాలని వివరించారు. సునామి ఆగమనం తెలుసుకునేందుకు ఇవి ఉపకరిస్తాయి.

భూకంపాలను పసిగట్టి తద్విషయాలను తెలియ పరిచే నెట్‌వర్క్‌ను, ఉపగ్రహ, టెలిఫోన్ వ్యవస్థలతో అనుసంధానం చేయాలి. ఇదే కాక ఆయన సంఖ్యా వివరణలతో నమూనాలు, సునామి కెరటాలు ఉప్పొంగి నప్పుడు యెలా వుంటుందో, కోస్తా ప్రాంత చిత్రపటాల విశ్లేషణలతో పాటు, ప్రజలను చైతన్య వంతం చేసి ఉప్పెనల ముప్పు గురించి అవగాహన, వివరణ, శిక్షణ ఇవ్వాలని సలహా ఇచ్చారు, మూర్తి గారు.

మైలు రాళ్ళు - అందుకున్న మన్ననలు

తన సుధీర్ఘ అనుభవంలో యెన్నో మైలు రాళ్ళు దాటేరు, యెన్నో మన్ననలు అందుకున్నారు. వీటిలో:

  • 2005 సంవత్సరంలో టొరాంటో లో, కెనడా ప్రధాన మంత్రి, డాక్టర్ టాడ్ మూర్తి ని "సూపర్ - అచీవర్స్" లో ఒకరుగా గౌరవించారు.
  • సునామీ ఉపద్రవాల సూచనలు, ప్రజా హిత సమాచారం అందించే, అంతర్జాతీయ సునామి సంస్థ (సొసైటీ) ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
  • అంతర్జాతీయ సునామీ సంస్థ, అధ్యక్షుడిగా వ్యవహరించారు.
  • కెనడా తూఫాను హెచ్చరిక కేంద్రం అధిపతిగా వ్యవహరించారు.
  • సునామి మీద ప్రసిద్ధ పత్రిక, సైన్స్ ఆఫ్ సునామి హజార్డ్స్, ఎడిటర్ గా వ్యవహరించారు.
  • ఐ పి సి సి 2007 నిర్వాహకుడిగా వ్యవహరించారు
  • మూడేళ్ళ పాటు ఆస్ట్రేలియా రాష్ట్ర టైడల్ కేంద్ర, సంచాలకుడిగా ఉన్నారు.

సముద్ర పర్యంతం పరీవ్యాప్తమై యే కోణం నుంచైనా ఆవిద్భవించగల విద్వంసకరమైన తరంగాలను సూచించే ప్రణాళికను రూపొందించారు. ఈ పరిజ్ఞాన ప్రతిష్టాపనతో పొంచి ఉన్న ఉపద్రవం గురించి తత్కాల సూచన ఇచ్చే అవకాశం యేర్పడింది. తద్వారా భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలను అరికట్టడానికి అవకాశం యేర్పడింది. ఇటీవల కాలంలో అట్లాంటిక్ సముద్ర కారిబియన్ ద్వీపాల సునామి హెచ్చరిక సంస్థ ప్రతిష్టాపనకు సలహాలు అందించారు.

రచించిన పుస్తకాలు, ప్రచురించిన పత్రాలు

వీరి పుస్తక రచనలు - భూకంప శాస్త్రం, సముద్ర శాస్త్రం, వాతావరణ శాస్త్రం, కోస్తా తీర పరిరక్షణ నిర్వహణ, అనర్థ నివారణ నిర్వహణ రంగాలలో ప్రపంచ ప్రేక్షకులకు, విద్యార్ధులకు ఉద్దేశించబడినవి.

డాక్టర్ మూర్తి గారి ముఖ్య రచనలు:

  • నేషనల్ మోడలింగ్ ఆఫ్ ఓషన్ డైనమిక్స్, టి ఎస్ మూర్తి, జెద్ కొవాలిక్
  • ద ఇండియన్ ఓషన్ సునామి - సంపాదకులు - టాడ్ మూర్తి, అశ్వతానారయణ, నిరుపమ
  • నాచురల్ హజార్డ్స్ జర్నల్ (పత్రిక), సహ సంపాదకుడిగా ఉన్నారు

పాసిఫిక్ సముద్ర పర్యంతము పరీవ్యాప్తమై విభిన్న సాంకేతిక పరిజ్ఞాన వస్తువలను అమర్చి, ఉపగ్రహ, టెలిఫోన్ తో సమన్వయం చేసి, సునామి ఉపద్రవ హెచ్చరిక సంస్త నెలకొల్పి, తద్వార, భారి ఆస్తి నష్టం, జన నష్టం కలుగకుండా, దాని బారి నుంచి కాపాడే దిశగా, పురోగాభివృద్ధి పదంలో నడిపించిన ద్రష్టగా, సముద్ర శాస్త్రం, వాతావరణ శాస్త్రం, కోస్తా తీర పరిరక్షణ నిర్వహణ, అనర్థ నివారణ నిర్వహణాది రంగాలలో విశిష్ట సేవలు అందించారు. ఇంతటి విశిష్ట వాతావరణ శాస్త్రవేత్తగా ఆరితేరినవాడిని ఇటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల వారే కాదు, సమస్త మానవాళి డాక్టర్ మూర్తి గారికి ఋణపడి ఉంటుందని చెప్పక తప్పదు.

ఈ వ్యాస సంకలనానికి విషయ సేకరణలో తోడ్పడిన మిత్రుడు కూచిభొట్ల రవీంద్ర తండ్రి గారు డాక్టర్ విద్యాసాగర్ కూచిభొట్ల కి కృతజ్ఞతలు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)