మంచి వ్యాపారం

సమాజంలో తనకంటూ గుర్తింపు ఉండాలని, పది మందినీ ముందుకు నడిపించాలనీ, అలా పది మందిలోనూ పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవలని కనబడ్డ కొన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో చదివిన ఓ సుబ్బారావు ఎలా చేస్తే తాను చదివినవన్నీ నిజం చేసి చూసుకోవచ్చో తెగ ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తూ ఒక సినిమా చూద్దామని వెళ్ళాడు. సినిమా బానే ఉంది, జనం బానే ఉన్నారు. చక్కగా ఆసాంతమూ చూశాడు. సినిమా అయిపోయాక పని హడావిడిలో అందరికన్నా ముందు బయటపడటానికి వడిగా కదిలాడు. సినిమా హాలు బయటికి అందరికన్నా ముందే ఈలవేసుకుంటూ వచ్చి వెనక్కి తిరిగిచూశాడు. హాలు జనమంతా తన వెనకే ఉన్నారు. తాను ముందుండి నడిపిస్తున్నట్లుగా అనిపించింది. అతగాడికి ఆనందంగా, పదిమందినీ ముందుకు నడిపించాలన్న తపన తీరేందుకు ఒక మార్గంలా కనిపించింది. అంతే! అప్పటి నుండీ జనం బాగా ఉండే సినిమాలకు వెళ్ళడం మొదలుపెట్టి అందరికన్నా ముందు బయటకి వస్తూ తెగ అనందించడం, పదిమందిని ముందుకి నడిపిస్తున్న వాడిలా, నాయకుడినని అందరిలోనూ చెప్పుకోవటం మొదలుపెట్టేడు.

*******************************

నాయకత్వమంటే ఏమిటో, ఎలా ఉండకూడదో మా మిత్రుడొకసారి చెబుతూ ఈ పిట్ట కథ చెప్పాడు. వినడానికే ఇంత హాస్యాస్పదమైన పని నిజంగా చేసేవారు ఎవరైన ఉంటారేమో తెలియదుగానీ సరిగ్గా అలాగే ప్రవర్తించేవారిని నిత్య జీవితంలో చూస్తుంటే మొదటగా నవ్వు వస్తుంది, ఆపైన బాధ కల్గుతుంది, ఆయా వ్యక్తులు మనవాళ్ళైతే. అయితే, ఇలా పదిమందిలోనూ గుర్తింపు పొంది ఒక నాయకుడిలా ఉండాలన్న తపన వెనుక అసలు కారణం, "కీర్తి కండూతి".

స్వతంత్ర భారత చరిత్రలో అతి పెద్ద పేరుపొందిన వ్యక్తి మహాత్ముడే. అయితే ఆయన తన వ్యక్తిత్వంతో, నిబధ్ధతో, క్రమశిక్షణతో పేరు పొందాలన్న ఎటువంటి కాంక్ష లేకుండా సత్యవ్రతంతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. అన్ని అందలాలూ ఆయన్ను వెతుక్కుని వచ్చాయి. అదీ ఆయన వద్దని వారించినా తప్పని పరిస్థితి. ఆయన చరిత్ర తెలుసుకున్న ప్రతి వ్యక్తీ ఆయనలా సత్యవ్రతానికంటే ఆయనలా పేరుపొందాలనే గట్టిగా కోరుకుంటున్నారు. రాత్రికి రాత్రే ఒక కొత్త "జాతిపిత" అన్న పేరు తెచ్చుకోవాలన్న యావ చాలామందిలో వెర్రి తలలు వేస్తోంది ఈనాడు.

తాము చేసే ప్రతి పనిలోనూ ఏదో గుర్తింపు, పేరు రావాలని తెగ ఆరాటపడేవాళ్ళని మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. దానికే "కీర్తి కండూతి" అని ముద్దుగా పేరు. ఈ కండూతి కూడదని అనేకమంది పెద్దలు ఎన్నో రకాలుగా అనగా హాస్యంగా, చీత్కారంగా, నిందాత్మకంగా ఎన్నో కథలు, నవలలు ఇలా పలు ప్రక్రియల్లో తెలియజెప్పినా ఆ కండూతి మాత్రం మన సమాజంలో నానాటికీ పెరిగిపోతుండటం బహుబాధకరం.

దేవాలయంలో అందరికోసం అమర్చిన సీలింగ్ ఫ్యాను ప్రతి రెక్కపైనా కిందా దాతల పేర్లు వ్రాయటం చూస్తునే ఉంటాము. వెనకటికో ఊళ్ళో ఒకాయన తాను విరాళమిచ్చిన ఫ్యాను వేయద్దన్నాడట. ఫ్యాను రెక్కలు తిరిగితే తన పేరు కనిపించదని. ఇక దేవాలయాల్లో ప్రతి నాపరాయి మీదా కనపడే పేర్లని చూస్తుంటే అంతమంది దానమిచ్చారని ఆనందించాలో లేక పేరు గట్టిగా కనపడటం కోసమని తాపత్రయ పడటం చూసి నవ్వుకోవాలో తెలియదు. మన పేరు కనిపించకపోతే వచ్చే నష్టమేంటి? దానమో ధర్మమో గుప్తంగా ఉంటే కోల్పోయేదేముంది?

ఈ మధ్యే కొత్తగా ఒక కొత్త సంప్రదాయం వేళ్ళూనుకుంటొందట. బజార్లలో కనిపించే హోర్డింగుల పైన ఇంతకు ముందు కేవలం సినిమా ప్రకటనలే ఉండేవి. ఈ మధ్య ఒకాయన తన కూతురి పుట్టునరోజుని జనమందరికీ తెలిసేలా పెద్దక్షరాలలో వ్రాయించి శుభాకాంక్షలు తెలిపాడట. సదురు కూతురు మాణిక్యం చూసి ఎంత ఆనందించిందో తెలియదు కానీ ఆ తండ్రి తన పేరునూ పెద్ద అక్షరాలలో వ్రాయించేసుకున్నాడట. మళ్ళా ఆ కూతురు ఎక్కడ పొరబడుతుందో అని. ఇలా ఒకళ్ళను చూసి మరొకళ్ళు వాతలు పెట్టుకోవడం పరిపాటి అవుతోందట. మనింట్లో మనవాళ్ళకి శుభాకాంక్షలు తెలియజెయాలంటే ఆప్యాయంగ వారిని దగ్గరకు తీసుకుని చెప్పచ్చు. ఇంకా చాలదనుముంటే వారికిష్టమైన వస్తువేదన్నా తెచ్చి ఇవ్వచ్చు. మరీ అసహ్యకరమైన ప్రదర్శన లేకుండా. అలా కాక ఈ హోర్డింగుల పిచ్చిని ఏమనాలి. పది మంది స్మృతిలో తమ పేరు బలవంతంగా రుద్దడానికి వేసే పిల్లిమొగ్గలు మాత్రమే అవి.

ఇవాళ ఈ హోర్డింగు సంప్రదాయం వింత అనుకుంటే, ఒకప్పుడు తెలియని వారికి వార్త అందించడం కోసం వార్తా పత్రికలలో ప్రారంభమైన శ్రధ్ధాంజలి విభాగాలు, ఈనాడు ఎంతెంత వికృత రూపాలు సంతరించుకున్నాయో మనం చూడట్లేదూ. ఓ మూడునెలల క్రితం కొన్ని వార్తాపత్రికలు తిరగేస్తుంటే కనిపించిన విషయం చూసి విస్తుపోయాను. ఓ కార్మిక నాయకుడు స్వంత పనిమీద పిల్లలు పిలిస్తే అమెరికా చూసివచ్చాడు. దానివల్ల ఎవరికీ ఒరిగిందేమీ లేదు. ఆయనకు కాస్త పిలలదగ్గర ఉన్నానన్న తృప్తి తప్ప. దానికి ఆ సంఘం సభ్యులు యావత్తూ రకరకాల పత్రికలలో చేసిన హడావిడి ఇంత కాదు. ఆయనకే కావాలని వేయించుకున్నాడో, లేక ఏ రాజకీయ కారణాలో లేక కీర్తి కండూతులో మొత్తం మీద వార్తా పత్రికల వారికి మంచి లాభాలే తెచ్చిపెట్టాయి. స్వదేశాగమన, విదేశీ పర్యటన, పదవీ విరమణ, ఇలా ఏదో ఒకకారణం చాలు ఆ వ్యక్తి పట్ల తమ విధేయతను ప్రపంచానికి చాటుకోవడానికి. తద్వారా "పేపర్లో పెద్దక్షరాలలో" తమ పేరు చూసుకుని మురిసిపోవడానికి. తమ పేరు పదిమందిలో నానడానికి. తద్వారా ఏదో ప్రతిఫలం పొందడానికి.

ఏ పండుగన్నా వస్తే ఇక రాజకీయ నాయకులు చేసే విన్యాసాలు సరే సరి. ప్రతి సందు చివరా ఆయా పండుగకు సంబంధించి శుభాకాంక్షల పేరిట బ్యానర్లు, హోర్డింగులు, అందులో ఆయా నాయకుడి ఫొటోలు. చూసినవారికి బాగా గుర్తుండేలా. శుభాకాంక్షలు తెలుపాలంటే ఒకసారి నడుం వంచి కాలికి పని చెప్పి ఆయా వ్యక్తుల దగ్గరకు వెళ్ళి చెప్పవచ్చు కదా. ఇలాంటి వికృతాలను చూసే ఎవరో అని ఉంటారు, "పెళ్ళాం పిల్లలకి తిండి పెట్టి ఊరునుధ్ధరించినట్లు మాట్లాడుతున్నాడని". ఏ హోర్డింగులో ఎవరు వేయించుకున్నారో తమ పిల్లపాపలకు అన్నం పెట్టి పోషిస్తున్న విషయం.

************************

ఈ "పేరు తెచ్చుకోవడం" అన్న కుప్పిగంతులు ఒకప్పుడు ఇంతగా భారతదేశంలో ఉండేవి కాదనడానికే ఎక్కువగా ఆధారాలు దొరుకుతున్నాయి, ప్రాచీనా సాహిత్యమంతా. పేరు కోసం చేయడాన్ని సనాతనులు మహాపాపంగా భావించారు. ఎంతో గొప్ప శాస్త్ర విషయాలకు ఆలవాలమైన వేదం ఒక్కళ్ళు వ్రాసినది అని చెప్పడానికి అధారాలు లేవు. "సైన్సు" ఎవరు వ్రాశారు అంటే ఏమని చెబుతాం? కాబట్టి ఆ వేదాల రచయిత ఎవరన్న ప్రశ్న అర్ధం లేనిదని ఒప్పుకున్నా, అందులో ఏదో ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కళ్ళు వ్రాసి ఉండవచ్చు కదా? కనీసం వారి పేర్ల మీదుగా ఏ "సుబ్బారావు పనస" అనో లేక "వెంకట్రావు అనువాకం" అనో ఎక్కడా పేర్లు లేవే. ఇంకా అపౌరుషేయం అని కూడా గట్టిగా చెప్పారు.

ఇతిహాసపు వీరుల చరిత్రలు చదివి ప్రతివారూ నమ్రతతో, వినయంగా ఉండటమే నేర్చుకున్నారు తప్ప, అర్ధం లేని పేరులకోసం ప్రాకులాట మచ్చుకైన కనిపించదు. ఇంకా, అలా ప్రయత్నించడం ప్రతి-నాయకుడి లక్షణంగా చిత్రీకరిస్తూ ప్రాచీన సాహిత్యం యావత్తూ మనుషులను క్రమమైన మార్గంలో పెట్టింది. ఒకళ్ళు గొప్పో కాదో నిర్ణయించడం ఎవరికివాళ్ళు స్వంతగా చేసుకునేదిగా కాక, శాస్త్ర పారంగతులైన వ్యక్తులకు అప్పగించడంతో, సమాజానికి దార్శనిక దృష్టితో కూడిన మంచి లభిస్తూ వచ్చింది. అదృష్టవశాత్తూ ఆయా శాస్త్ర పారంగతులు కుమ్మక్కై తమ పబ్బం గడుపుకోకపోవడం అన్నది చాల తక్కువ శాతం జరగడం వల్ల, సమాజానికి కొంతలో కొంత మేలు జరిగింది.

అయితే, ఆధునిక యుగంలో, పాశ్చాత్య దండయాత్రల అనంతరం, పరాయి పాలనలో కొద్ది కొద్దిగా ఈ పేరుకోసం ప్రాకులాడటం అన్న జాఢ్యం మన సమాజంలో వచ్చి చేరింది. పరాయి పాలనలో అవసరాల కోసం ప్రభువుల దగ్గర మంచి పేరు తెచ్చుకొని "పని" జరిపించుకునే "లౌక్యం" మనకు ఎవరో పరాయి వాడు నేర్పింది కాదు. మన జాతే స్వంతగా నేర్చుకుంది, సరైన నాయకత్వ లేమితో, మరియూ ఆర్ధిక ప్రగతే అన్నిటికీ సమాధానమన్న సంకుచిత ధోరణి పెంపొందించిన నవీన మేధావుల ఆలోచనా ధోరణితో. ప్రతి చిన్నపాటి మంచి పనికీ కర్తలైన వాళ్ళు తమను అందరూ మెచ్చి శాలువాలు కప్పాలనుకోవడం పాశ్చాత్య నాగరికతా ప్రభావం మాత్రమే అని ఒక్క మాటలో పరులపైన ఆ నిందను మోపలేం. మన గొప్పతనానికి మనం ఎంత కారణం అవుతామో అలా మనలో నీచత్వాలకూ మనం అంతే కారణం అవుతాం. అది ఒప్పుకుని దిద్దుకోవడంలోనే మానవత్వం పరిమళిస్తుంది.

మంచి చేస్తే మెచ్చుకుంటారు కానీ, అందుకోసమే మంచి చేయడం, అదీ ఏదో కొద్దిగా కంటితుడుపుగా అన్నదే అసలు సమస్య. ఇక తెల్లదొరలు వదిలాక "నల్లదొర"ల స్వయంపాలనలో మరింత పెరిగుతూ వచ్చింది. అది వైరస్‌లా గుణశ్రేఢిలో పెరిగి ఎవరూ అడ్డుకోలేనంతగా పెరిగిపోతోంది. ప్రతి చిన్న విషయానికీ ప్రతివాళ్ళూ గుర్తింపు కోసం పయత్నించడం, తమను తాము గొప్పగా ఊహించుకోవడం, ఆపై మరింత ప్రతిఫలం ఆశించడం వెర్రితలలు వేస్తోంది. మంచితనం కూడా ఒక వ్యాపారాత్మక పెట్టుబడి అయిపోయింది.

మంచితనంతో, పేరుతో "వ్యాపారం" చేయడం అన్నది ఇవేళ అసలు సమస్య. ఈ సమస్యను సమాజం ఎంత త్వరగా అధిగమిస్తే అంత మేలు. లేకపోతే ఇక మంచితనమే మిగలలేని పరిస్థితి వస్తుంది. ఆ పర్యవసానం తప్పించాలంటే మళ్ళీ గుప్తంగా పరహితం చేయడం అన్నది పెంపొందాలి. అందుకు ప్రతి వ్యక్తీ దైనందిన కార్యక్రమల నుండే ఆ అలవాటును పెంపొందించుకోవాలి. మంచితనం అవసరాన్ని బట్టి గాక ఒక వ్యక్తిత్వ పర్యవసానంగా మాత్రమే ఉండాలి. అపుడు ఏ చీకూ చింతా ఉండదు.

మీ

ప్రఖ్య వంశీకృష్ణ


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)