అర్జునుడే కాదూ, అశ్వాలు విన్నాయి!

పోతనగారి భాగవతంలో ఒక చిత్రమైన పద్యం ఉంది. అది ప్రథమస్కంధంలో భీష్మస్తవంలో ఉంది. భీష్ముడు అంపశయ్యమీద ఉండి శ్రీకృష్ణుని స్తుతిస్తూ చెప్పిన పద్యం అది.

హయరింఖాముఖ ధూళి ధూసర పరివ్యస్తాలకోపేతమై రయజాతశ్రామ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేడ్కనని నా శస్త్రాహతిన్ చాలనో చ్చియు బోరించు మహానుభావునెదలో జింతింతు నశ్రాంతమున్

ఈ పద్యంలోని శ్రీకృష్ణుని ముఖారవిందాన్ని వర్ణిస్తున్నాడు భీష్ముడు. యుద్ధరంగంలో తొమ్మిదోరోజు యుద్ధ దృశ్యాన్ని మళ్ళీ ఒకసారి ఊహించుకొంటున్నాడు. ఆరోజు భీష్ముడు విజృంభించి యుద్ధం చేశాడు. యుద్ధరంగంలో శూలం ధరించి వచ్చిన ప్రళయకాలరుద్రుడిలా ఉన్నాడు. పార్థసారథి అతివేగంగా రథం నడుపుతున్నాడు. అర్జునుడు యథాశక్తితో భీష్ముని పోరాడుతూ, సారథియైన కృష్ణుణ్ణి కాపాడుతూ, తనని తాను కాపాడుకొంటున్నాడు. ఆ స్థితిలో శ్రీకృష్ణుని ముఖపద్మం ఎలా ఉందో గమనించిన భీష్ముడు ఆ దృశ్యాన్ని మరచిపోలేక మళ్ళీ గుర్తు చేసుకొంటున్నాడు.

అతి వేగంగా పరిగెడుతున్న అర్జునుని గుర్రాల కాలి గిట్టల వల్ల రేగిన ధూళి నుదుటి మీద పడుతోందట. అప్పటికే బాగా చెమట పట్టిన ఆ నుదుటి మీద ముంగురులు (అలకలు) గుండ్రం గుండ్రంగా, గిరజాలు గిరజాలుగా అతుక్కొని ఆ ఫాలభాగం ఎంతో అందంగా ఉందిట. అటువంటి నుదుటి మీద గుర్రాల గిట్టలదుమ్ము పడి ఆ ముఖానికి అదో అలంకారంగా ఉందిట.

ఇక్కడే కాస్తా ఆగి ఆలోచించాలి. అసలే యుద్ధరంగం. భీభత్స దృశ్యాలు. భయంకర స్థితి. వేగం, గాలి, ధూళి, కళ్ళు కప్పేస్తూ ఉంటాయి. ఈ స్థితిలో చెమటతో దుమ్ము కొట్టుకొని ఉన్న ముఖం - ఎంత భగవంతుడిదైతే మాత్రం - అంత అందంగా ఉంటుందా? పైగా ముఖం మీద పడిన దుమ్ము ఆ ముఖం అందాన్ని పెంచే ఆభరణం కావడమేమిటి? అనౌచిత్యంగా లేదూ?

మనకు అలా ఉండవచ్చు. కాని పరమాత్మకు అలా ఉండదు. ఎందుకంటే ఆయన ఆ ధూళిని అలంకారంగానే భావించాడు. మన మనోభావాలను బట్టే మన ముఖం ఉంటుంది. మనం విపరీతమైన ఆనందంతో నవ్వుతుంటే కూడా కళ్ళవెంట నీళ్ళొస్తాయి. అవి దూరం నుండి చూసే వారికి కన్నీళ్ళలా కనిపించవచ్చు. కాని మన ఆనందబాష్పాలు మనకు తెలుసు. ఎందుకంటే ఆ సమయంలో మన మనసులో నున్నది ఆనందమే కాని దుఃఖం కాదు. అలాగే గుర్రాల గిట్టల ద్వారా దుమ్ముని పరమాత్మ నుదిటి మీద చిమ్ముతుంటే ఆయన ఆ ధూళిని నవ్వుతూ స్వీకరించాడు. అందుకే అది అలంకారమయింది.

ఎందుకలా స్వీకరించాడని ఆలోచిద్దాం. ఆయన భగవద్గీతలో ఏం చెప్పాడు? 'కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన ' అన్నాడు. అంటే మనం పనిచేస్తూనే ఉండాలి. కాని ఆ పని వల్ల వచ్చే ఫలితం ఏదయినా సరే భగవతర్పణ బుద్ధితో ఆ పని చేయాలి. సరిగ్గా ఆశ్వాలు అదే పని చేశాయి. అశ్వాల పని ఏమిటి? సారథి చెప్పినట్టు విని పరుగు పెట్టాలి. అవి పాండవుల పక్షంలో ఉన్నా, కౌరవుల పక్షంలో ఉన్నా వాటి పని పరుగు పెట్టడం మాత్రమే. ఒకవేళ రథికుడు యుద్ధం మధ్యలో వెనక్కు పారిపోదలిస్తే, సారథి అలాగే నడిపిస్తే, అశ్వాలు ఇంటికే పరిగెత్తాలి కాని సారథి అటు లాగితే, అశ్వాలు స్వయం నిర్ణయంతో ఇటు లాగితే ఇక కథ నడిచేదెట్లా? అర్జునుడి అశ్వాలు శ్రద్ధగా, భక్తిగా పార్థసారథి ఎలా నడిపిస్తే అలా నడిచాయి. తత్ఫలితంగా రేగిన దుమ్మును ఆయనకే అర్పించాయి. అంటే కర్మఫలాన్ని భగవదర్పితం చేశాయి. కాబట్టే భగవంతుడు దాన్ని అలంకారంగా భావించి స్వీకరించి వాటిని అనుగ్రహించాడు. అందుకే ఆయన ఫాలభాగం దుమ్ముతో ఉన్నా ప్రకాశించింది. అంటే మన శక్తికొలది మనం జీవితంలో ధర్మ నిర్వహణ చేస్తూ తత్ఫలాన్ని భగవంతునికి అర్పిస్తే ఆయన దాన్ని అలంకారంగా భావించి స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తాడన్నమాట.

ఇంతకీ అశ్వాలకి ఇంత అవగాహన ఎక్కడిది? అర్జునిడితో పాటు గీతోపదేశ సమయంలో అశ్వాలు కూడా అక్కడ ఉన్నాయి. అవీ విన్నాయి. మరి వాటికి గీతలో భాష అర్థమవుతుందా? మన భాష అర్థం కాదు. కాని భగవంతుడి భాష అన్ని జీవులకి అర్థం అవుతుంది. అదీ విషయం.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)