జరిగిన కాలేజిలో వత్తిడి, ఇంట్లో వాళ్ళ పోరు భరించలేక అనూష రూమ్మేట్, కల్పన ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పిల్ల మరణానికి తాము బాధ్యులు కాదంటు యాజమాన్యం తప్పించుకోజూస్తుంది. అనూష ఆ ఘోరాన్ని దిగమింగుకోలేక ఉంటుంది. కల్పన ఆత్మహత్య కాలేజిని, పిల్లలను, యాజమాన్యాన్నీ కుదిపేస్తుంది. వాడిగా చర్చలూ ప్రారంభమవుతాయి. అనూష దిగమింగుకోలెకౌంటే హఠాత్తుగా కల్పన కనిపిస్తుంది. అనూష దయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తూంటుంది. మరో వైపు ఆనూష తమ్ముడు అనిరుధ్ కూడా ఇంట్లొ పోరు భరించలేక ఇంటినుంచీ పారిపోతాడు.

ఇల్లు వదిలి వెళ్ళిన అనిరుధ్ ఒక రెండ్రోజులు వేరే ఊరు వెళ్ళి, అక్కడ తన పరిస్థితి తెలుసుకున్నాక ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. తననెవరో కిద్నాప్ చేశారని తండ్రిని నమ్మించి, స్థానిక పోలీసుల సాయంతో హైదరాబాద్ తిరిగివస్తాడు. అనిరుధ్ పారిపోయిన విషయం తెలుసుకున్న పోలీసు కానిస్టేబుల్ అనిరుధ్ తండ్రికి వత్తిడి లేకుండా పిల్లలను చదివించడం గురించి చెబుతాడు.

15 వ భాగం

హిమవర్ష రాత్రి పన్నెండు వరకు చదివింది. మరలా ఉదయం నాల్గింటికి లేచింది. వారం నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ రోజే చివరి పరీక్ష. అమ్మ పెట్టీన టిఫిన్ తినలేకపోయింది. ఎందుకో వాంతికొచ్చినట్లనిపించింది. బహుశా నిద్ర లేమి వల్ల పైత్యం చేసిందేమో అంది అమ్మ. మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఇలాటివి పట్టించుకోకూడదు అని ముక్తాయించింది కూడా. అమ్మకు కావాల్సింది మార్కులు ... నా ఆరోగ్యం కాదు అనుకుంది హిమవర్ష.

కాలేజికి నడుస్తున్నప్పుడు దు:ఖం వచ్చింది. తనకు అమ్మా నాన్న ఉన్నారు. కానీ తను ఒంటరి. తన గురించి ఎవ్వరూ పట్టీంచుకోరు. తన మనసులోని భావాల్ని పంచుకోవడానికి ఎవ్వరూ లేని అనాథ తను. జీవితం ఎడారిలా ఉంది. వసంతాగమనానికి అవకాశం లేని మోడు బతుకు. ఇదీ ఓ బతుకేనా?

మరలా తలపోటు, విపరీతమైన తలనొప్ప్పి... నరాలు చిట్లిపోతాయేమోననిపించేలా... పరీక్ష రాస్తుంటే అక్షరాలు బూజారగా అలికినట్లు కంపిస్తున్న్నయి. కళ్ళు బైర్లు కమ్మినట్లు... చీకటి తెరలేవో అడ్డు పడ్తున్నాయి. బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించి విఫలమై బెంచీమీద ఒరిగిపోయింది.

రాత్రి ఎక్కువసేపు మేల్కోవటం వల్ల అలా జరిగి ఉండొచ్చని లెక్షరర్లు హిమవర్ష మొహం మీద నీళ్ళు చల్లి లేవడటానికి ప్రయత్నించారు. లేవలేదు. గట్టిగా తట్టీలేపారు. ప్రయోజనం లేదు. బలమంతా ఉపయోగించి కుదిపి చూశారు. ఐనా లేవ లేదు.

లెక్చరర్లో అందోళన మొదలైంది. హిమవర్ష స్పృహ తప్పిందన్న వార్త కాలేజంతా వ్యాపించింది. హుటాహుటిన పక్కనే ఉన్న వుడ్ల్యాండ్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. ఇంటికి కబురు పెట్టారు.

హాస్పిటల్లో డాక్టర్లు గంట సేపు ప్రయత్నించినా హిమవర్ష స్పృహలోకి రాలేదు. వత్తిడి వల్ల కావచ్చేమోనని మొదట అనుమాన పడినా ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించకపోతే అత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఏమైనా మింగిందా అనే అనుమానం వచ్చింది. మరుక్షణం ఈ వార్త దావానంలా పాకిపోయింది.

సునందా కాలేజీలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదివే ఒక అమ్మాయి పరీక్ష రాస్తూ స్పృహ తప్పి పడిపోయిందనీ, ఆత్మహత్యా ప్రయత్నమై ఉండొచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారనీ తెలియగానే ఈశ్వరరావు అప్రమత్తమైనాడు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం... ప్రతికారం తీర్చుకునే అవకాశం...

హైద్రాబాదులోని అన్ని పేపర్లకు ఈ వార్త అందేలా చేశాడు. శ్రీచరిత కాలేజీలన్నిట్లో ఈ వార్తని ప్రముఖంగా చర్చించుకునేలా చేశాడు. సునందా కాలేజి యాజమాన్యం పెట్టె వత్తిడి, మానసిక హింస తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహతయా ప్రయత్నం చేసిందన్న వార్త నిజమని నమ్మేలా ప్రతినోటా నానింది. కొంతమంది విద్యార్థుల్ని రెచ్చగొట్టీ కాలేజీ యాజమాన్యం పైకి గొడవకి పంపించాడు. టీవి మీడియాకి సమాచారం అందించాడు. చీమ చిటుక్కుమన్నా పొలోమని తమ కెమేరాలతో వాలిపోయే న్యుస్ చానళ్ళూ, అతి సాధారాణంగా జరిగే ప్రేమ వివాహాన్ని కూడా ఒక పేరున్న నటుడి కూతురి వ్యవహారమని తెల్సుకుని కొన్ని వారాల వరకూ ఊకదంపుడిగా చెప్పి ఆ దంపతులు తుమ్మినా దగ్గినా అదేదో అద్భుతమైన దౄశ్యంలా చిత్రీకరించిన మీడియా... మసాలా దొరికిందని సంబరపడిపోయి విద్యార్థుల మీద హెచ్చుమీరుతున్న కార్పొరేట్ కాలేజీల హింసపేరుతో ప్ర్యత్యేక కార్యక్రమాలు నిర్వహించటంలో తలమునుకలైపోయాయి.

గంటన్నర ప్రయత్నించాక న్యురోసర్జన్ కి కబురెట్టరు. మరో అరగంటకు హిమవర్ష తెలివిలోకొచ్చింది. ఆ రోజంతా అబ్జర్వేషన్లో పెట్టాలన్నారు. మరునాడుదయానికి దిశ్చార్జ్ చేసారు. ఇంటికొచ్చిన క్షణం నుంచి అమ్మ తిడ్తోనే ఉంది. " కావాలని నా మీద కక్షతో పరీక్ష ఎగ్గొట్టటానికి పన్నిన పన్నాగమంది. నాకు తెలీదనుకోకు. నీకేరకమైన అనారోగ్యం లేదని డాక్టర్లు చెప్పారు. నిజం చెప్పు. స్పృహలోలేనట్లు నటించావు కదూ. నిజంగా స్పృహ తప్పినోళ్ళని బైటికి తిసుకురాగలరు గాని నటించేవోళ్లను ఎంత గొప్ప డాక్టర్లయినా ఎలా మెలకువలోకి తీసుకురాగరు? అందుకే గంటన్నర ప్రయత్నించినా వాళ్ళకేమి అంతుబట్టి ఉండదు. మన బంధువుల్లో నా పరువు తీయాలని కంకణం కట్టుకున్నావు. సంతోషంగా ఉందా... అనుకున్నది సాధించావుగా" అంటూ కామా పుల్ స్టాపులు లేకుండా మాట్లాడ్తొనే ఉంది.

రాఘవరావు కూడా బాగా నిరాశకు లోనైనాడు. న్యూరో సర్జన్ చప్పిన మాటలు గుర్తొచ్చాయి. "మీ అమ్మాయికి శారీరికంగా ఏ రుగ్మతా లేదండీ. ఏదో బలమైన మానసిక వత్తిడికి లోనౌతోంది. షి ఈజ్ ఇన్ డిప్రెషన్. తనకిష్టంలేని పని చేయాడానికి మనసు ఎదురు తిరగటం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. అందుకే గంటన్నర సేపు మామందులేవి పని చేయలేదు" అని. అంటే హిమవర్షకి చదువంటే ఇష్టం లేదా? ఏం తక్కువ చేశామని డిప్రషన్? తన భార్య చెప్తున్నట్లు పరీక్ష రాయటం ఇష్టం లేకనే ఇలా చేసిందా?

హిమవర్షకి ఏడుపు ఆగటం లేదు. పరీక్ష రాయలేకపోయానన్న బాధ ఓ వైపు, స్వంత అమ్మానాన్నే తను నటించానని నమ్ముతున్నందుకు దు:ఖం మరో వైపు... ఇంతకు ముందు కూడా ఒకట్రెండు సార్లు ఇలా జరిగింది. రాత్రుళ్ళు చదువుకుంటున్నప్పుడు విపరీతమైన తలనొప్పి రావటం... కొన్ని గంటలు తను వళ్ళు తెళికుండా పడిపోవటం... ఎప్పటికో మళ్ళా అనారోగ్యానికి సంబధించిన అంశాలున్నాయని తెల్సుకోలేకపోయింది. అందుకే ఇంట్లో ఎవ్వరికి అలా జరుగుతున్నట్లు చెప్పలేదు. ఇప్పుడు కాలేజీకేళ్తున్న సమయంలో అలా జరగటం వల్ల అన్ని విషయాలు బైట పడ్డాయి.

రెండ్రొజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్తర్ చెప్పినా మరునాడే కాలేజీకి బయల్దేరింది. అమ్మ మాట్లాడే సూటిపోటి మాటలు వినడం కన్నా కాలేజీలో గడపటమే బాగుంటుంది కాబట్టి. కాలేజీలోకి అడుగుపెడ్తున్నప్పుడు గేటు దగ్గర ఆ అబ్బయి నిలబడి ఉన్నాడు.

పదో తరగతిలో తన క్లాస్మేట్.. సుధాకర్. సునందా బాయ్స్ కాలేజీలో ఇంటర్ యంపిసి చదువుతున్నాడు.

పలకరింపుగా నవ్వాడు. ఆనవ్వులో ఏదో బాథ చాయామాత్రంగా ఉంది.

"నిన్న కళ్ళు తిరిగి పడిపోయావటగా. పెపర్లో కూడా రాశారు. నీకెలా ఉందో కనుక్కుందామని వచ్చా. ఓ అరగంట చూసి నువ్వు కాలేజికి రాకపోతే ఇంటికొద్దామనుకున్నా" అన్నాడు.

అతను చూపించిన శ్రద్దకి హిమవర్షకి కళ్ళు చెమర్చాయి.

"మీ ఇంట్లో మీ అమ్మ ఎలానో మా ఇంట్లో మా నాన్న అలా. ఎప్పుడూ చదువు... మార్కులు తప్ప మరో విషయం మాట్లాడడు. మనిద్దరం ఒకే బోట్లో ప్రయాణిస్తున్నాం. అందుకే నీ బాధను నేను అర్థం చేసుకోగల్ను. మన ర్యాంకులు తప్ప వీళ్ళకు మన ఆరోగ్యాలు, మానసిక పర్స్థితులతో సంబధం లేదు. నేనందుకే ఇండైరక్ట్ గా ఎదురుతిరుగుతున్నా వాళ్ళకేమి ఎదురు చెప్పను. కానీ పరీక్ష మాత్రం ఫెయిలయ్యేలా రాస్తాను. అదే వాళ్ళకు నేనేసే శిక్ష" అన్నాడతను.

"నీ క్లాస్ వదలగానే నేను మీ యింటి దాకా తోడొస్తాను" అన్నాడు వెళ్ళబోతూ.

"ఎందుకూ.. నేను వెళ్తాలే"

"దార్ళో నడుస్తూ నిన్నటిలా స్పృహ తప్పి పడిపోతేనో ... అమ్మో... ఎంత ప్రమాదం. నేను వస్తాను. ఈ రోజే కాదు. రోజు వస్తాను"

చప్పున హిమవర్షకో విషయం గుర్తోచ్చింది. గర్ల్స్ కాలేజీ వదిలిన అరగంట తర్వాతే బాయ్స్ కాలేజీని వదులుతారు. కాలేజీ వదిలాక యింటికెళ్ళే అమ్మయిలకు బాయ్స్ నుంచి ఏ రకమైన అసౌకర్యం కల్గగూడదని చేసిన ఏర్పాటది. ఇదే విషయం సుధాకర్ తో చెప్పింది.

"ఎలాగూ పరీక్ష సరిగ్గా రాయకూడదని నిర్ణయించుకున్నాక క్లాసులు ఎగ్గొట్టట్టం ఓ లెక్కా" అంటూ వెళ్ళిపోయాడు.

హిమవర్షకి అతను మాట్లాడిన కాసిని సాంత్వన వాక్యాలే కొండంత బలాన్నిచ్చాయి. ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న వ్యక్తికి గడ్డిపోచ దొరికినా ప్రాణప్రదంగా పట్టుకుని గుండెలకు హత్తుకొన్నట్ట్లు ఆ అమ్మయికి సుధాకర్ చూపించిన కన్సర్న్ చాలా విలువైందిగా అనిపించింది. దాన్ని కాపాడుకోవాలని, జార విడుచుకోకూడదని అనుకుంది.

********************************

లంచ్ తర్వాత క్లాసులు జరగలేదు. మధుమిత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి "నా ఫ్రెండ్ దుర్గం చెరువు చూద్దామంటోంది. వెళ్ళమంటారా?" అని అడిగింది.

"నీకు చాలా సార్లు చేప్పాను కదా. నువ్వేం చేయాలనుకున్నా నా పర్మిషన్ అడగక్కర లేదని. నువ్వు సర్వ స్వతంత్రురాలివి. నీ విజ్ణత మీద, నువ్వు చేసే నిర్ణయాల మీద నాకు అపారమైన నమ్మకముంది. నువ్వేం చేసినా అన్ని విధాలుగా అలోచించి చేస్తావని నాకు తెలుసు" అన్నాడతను.

"మీరలా అనటం మీ వాత్సల్యం. నేనిలా మీ అనుమతి కోరడం కూతురిగా నా బాధ్యత" అంది.

అతను నవ్వి "నీ యిష్టం తల్లీ, వెళ్ళిరా" అన్నాడు.

తన ఫ్రెండ్ యామిని స్కూటి మీద ఇద్దరూ దుర్గం చెరువు చేరుకునేటప్పుటికి మద్యహ్నం మూడు కావస్తోంది.

"ఇలా ఎండలో దుర్గం చెరువులాంటి ప్రదేశం చూడటమేమిటే? కొద్దిగా చల్లబడ్డాకవస్తే బావుండేదిగా" అంది మధుమిత.

"పెద్ద చెరువుండి ఉంటుంది. దాని పై నుంచి చల్లని గాలులు వీస్తూంటాయి. దట్టంగా చెట్లు పెంచి ఉంటారు. మనం హాయిగా చెట్టుకింద కూచుని చెప్పుకోవచ్చు. ఇందుకే ఇలా ఎండ ఉంటేనే బావుంటుముది" అంది యామిని.

టికేట్ కొంటున్నప్పుడు కౌంటర్ళో కుచున్న వ్యక్తి వింతగా తామిద్దరి వైపు చూసినట్లనిపించింది. మధుమితకు.

గేటు దాటి లోపలికి అడుగుపెట్టి మెల్లగా నడవటం ప్రారంభించారు. నళ్ళటి తార్రోడ్డు. పక్కన పెద్ద పెద్ద వృక్షాలు ... కొంత దూరం వెళ్ళగానే ఓ చెట్టుకింద అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ పద్దెనిమిదేళ్ళ వయసు మించి ఉండదు. అమ్మాయి ఒడిలో అబ్బయి పడుకుని కబుర్లు.. కిలకిలలు.. తాము పార్కులోపలికి వెళ్ళే వ్యక్తులకు బాహాటంగా కనిపిస్తామన్న స్పృహే లేదు.

మరో పొదలోపల గడ్డిమీద అమ్మాయి అబ్బాయి పడుకుని ఒకరిమీద ఒకరు చేతులూ కాళ్ళు వేసుకుంటూ....

"ఇదేం స్థలమే... లోపలకెళ్ళే మార్గంలోనే ఇన్ని భీభత్స దృశ్యాలుంటే లోపల మరెంత భయానకంగా ఉంటుందో'' అంది మధిమిత.

"ఔనే, వాళ్ళకు సిగ్గువేయటం లేదేమో కాని నేను సిగ్గుతో చచ్చిపోతున్నానే. దుర్గం చెరువు ఇలా ఉంటుందని నాకు తెలీదు. సారీనే. మనం వెనక్కెళ్ళిపోదాం" అంది యామిని.

"ఇక్కడిదాక వచ్చాంగా, అసలిక్కడ ఏం జరుగుతుందో చూసే వెళ్దాం" అంది మధుమిత.

లోపలకెళ్ళక వాళ్ళు వూహించినట్లు పెద్ద పెద్ద చెట్లు లేవు. పెద్ద పెద్ద రాళ్ళున్నాయి. రాళ్ళ పక్కన గడ్డిలో టీనేజీ తీరని అమ్మాయి అబ్బాయిలున్నారు. పొదల్లాంటి వాటిలో జంటలు చేరి కువకువలు పోతన్నారు.

ఇద్దరూ కొద్దిగా నీడ చూసుకుని చిన్న రాతిమీద కూచున్నారు. ఎదురుగా రెండు పెద్ద బండరాళ్ళున్నాయి. జంటలు జంటలుగా వాటిలోపలికెళ్ళి వస్తున్నారు. ఒక జంట లోపలికేల్లి పావు గంట తర్వాత బైటకొచ్చి. ఎవ్వరు చూసినా మాకేం భయంలేదనట్లు అక్కడే నిలబడి ముద్దులు పెట్టుకుంటున్నారు.

మొక్కలకు నీళ్ళు పెడుతున్న అక్కడి ఉద్యోగిని పిలిచి మధుమిత మాట్లాడింది. "ఇలా జరుగుతుంటే మీరెవ్వరూ అభ్యంతర పెట్టరా? ఏటు చూసినా చూడగూడని దృశ్యాలే కనిపిస్తుంటే పర్యాటకులకు ఇబ్బందిగా ఉండదా?"

"ఈ టైంలో వచ్చేవాళ్ళందరూ అందుకోసమే వస్తారమ్మా. దీన్ని లవర్స్ పార్క్ అంటారు. మనకిష్టం లేకపోతే కళ్ళు మూసుకోవటం తప్ప ఏమీ చేయలేం" అన్నడతను.

మధుమితకు కోపం వచ్చింది. "అదేం సమాధానం? మీ ఇంచార్జ్ ఎవరు?" అంటూ లేచి నిలబడింది. అతను సమధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు.

"దీని అంతు చూసే వరకు వదలకూడదే. పద కౌంటర్లో ఎంక్వైయరి చేద్దాం. పేపర్ వాళ్ళకు ఇన్ ఫాం చేస్తే మంచిది. మా నాన్నగారికి చెప్పి దీనిమీద ఆర్టికల్ రాయిస్తాను. ఇంత విచ్చలవిడితనానికి అధికార ఆమోదం ఉండటం మన దౌర్భాగ్యం" అంటూ రెండడుగులు వేసి ఆగిపోయింది. రెండు బండరాళ్ళ మధ్య నుంచి జుట్టు సవరించుకుంటూ వస్తోంది హిమవర్ష. పక్కన తనకు తెలిసిన సుధాకర్. పదో తరగతిలో క్లాస్మేట్.

హిమవర్ష మధుమితను చూడగానే కంగారు పడింది. మొదట వెనక్కి తిరిగి బండరాళ్ళ చాటుకి తప్పుకోవాలనుకుంది. కానీ మధుమిత చూపు గాలంలా వడిసి పట్టుకుందని అర్థమై తలవొంచుకుని మెల్లగా నడుచుకుంటూ అపరాధిలా మధుమిత ముందు నిలబడింది. సుధాకర్ మధుమితను చూడగానే వేగంగా బైటికెళ్ళిపోయాడు.

ఓ నిమిషం మధుమిత మూగదానిలా నిలబడిపోయింది. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తెలీని సందిగ్ధ స్థితి. . చప్పున తనతో పాటు యామిని ఉందన్న విషయం స్పురణకు వచ్చింది. తన స్నేహతురాల్ని యామిని ఎదురుగా ప్రశ్నించడం సంస్కారం కాదని గుర్తొచ్చి, " యామినీ.. నేను మరికొద్దిసెపుండి వస్తాను. నువ్వెళ్ళిపోగలవా ప్లీజ్" అంది.

యామిని వెళ్ళిపోయాక మరలా అదే బండమీద కూచుంటూ " ఇప్పుడు చెప్పు. నువ్వేం చేస్తున్నావో స్పృహలో ఉండే చేస్తున్నావా? కాలేజి ఎగ్గొట్టి ఇలా పార్కులకొస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను. అసలు నువ్వేనా? ఇలా పార్కుల చుట్టూ బాయ్స్ తో తిరిగినా యంసెట్లో ర్యాంకొచ్చి నీకు సీటొస్తుందనుకుంటున్నావా? చదువంటే ఇష్టం, శ్రద్ధ ఉన్న నా స్నేహితురాలు హిమవర్షేనా ఇలాంటి తప్పు చేసి నా ఎదురుగా దోషిలా నిలబడింది? మీ అమ్మనాన్నకు తెలిస్తే ఏమైనా ఉందా? అసలు నీ అంతరాత్మకు నువ్వు చేస్తున్న పని తప్పనిపించటం లేదా? అని అడిగింది.

హిమవర్ష వెక్కి వెక్కి ఏడ్చింది తప్ప సమాధానం చెప్పలేదు.

"చాలా తెలివిగల దానివి. చదువులో ముందుండేదానివి. ఈ జాడ్యం ఎప్పుడు పట్టుకుందే?"

"ఈ మధ్యనే" చాలా మెల్లగా సమాధానం చెప్పింది హిమవర్ష.

"ఎందుకలా చేశావు?"

"ఏమో నాకు తేలీదు. నన్నెవరూ ప్రేమించటం లేదన్న వెలితి... దానివల్ల నిరాశ.. నేను ఒంటరిదాన్నన్న ఫీలింగ్... అదే టైంలో సుధాకర్ బాగా కన్సర్న్ చూపించాడే.. నాకు తెలికుండానే అతని వైపుకు ఆకర్షింపబడ్డాను. మైకంలా ఉండుందే... అన్నీ మర్చిపోయాను. నా చదువూ.. బాధ్యత.. యంసెట్... నేను డాక్టర్ కావాలనే మా నాన్న కోరిక... మా అమ్మ తిట్లు... ఇలా బావుందే... ఇంత క్రితం వచ్చిన తలనొప్పి కూడా తీసేసినట్లు తగ్గిపోయింది... తెలుసా?"

"చాల్లే నోర్మూసుకో.. మనది చదువుకునే వయసు... ప్రేమించే వయసు కాదు"

"ప్రేమకు వయసుతో నిమిత్తమేమిటి? దానిక్కావల్సింది మనసు"

"కాదు.. ప్రేమించడానికి కూడా సరైనా వయసుండాలి. నిజమైన ప్రేమకూ ఆకర్ష్ణ్నకూ మధ్య వ్యత్యాసాన్ని తెల్సుకునేంత మయసు.. జీవితానికి సంబధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి సరిపడా వయసు... మానసిక పరిపక్వత వచ్చేంత వయసు.. నీ విషయంలో ప్రేమించడానికి ఓ సాకు మాత్రమే ప్రేమ రాహిత్యమనో., ఒంటరితనమనో అనుకుంటున్నావు. నిజమైన కారణం అది కాదు. వత్తిడి. చదువుకొమ్మని, ర్యాంకులు తెచ్చుకొమ్మని పెద్దవాళ్ళు, మాష్టర్లు పెడ్తున్న వత్తిడి... దాన్నుంచి పారిపోవడానికి ఇదో దారి.. అంతే. అందంగా, రంగురంగుల స్వప్నంలా వూరించే దారి. కానీ చివరంటా వెళ్ళి చూస్తే గమ్యాలు అగాధాలు.. బురద హుంటలూ

హిమవర్ష ఏమి మాట్లాడలేదు.

"సరే. ఐందేదో అయిపోయింది. ఇకనుంచైనా జగ్రత్తగా ఉండు. వత్తిడి పెడ్తున్నది వాస్తవమే. దాన్ని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో ఆలోచించు. ధ్యానం చేయి... యోగా చేయి. నీ కిష్టమైన దేవుణ్ణి కొద్దిసేపు ప్రశాంత చిత్తంతో ప్రార్థించు. లేదా హాయిగా అనిపించే సంగీతం విను. అంతేగాని దాన్నించి తప్పించుకునే ప్రయత్నంలో మరింత భయంకరమైన విష వలయంలో చిక్కుకోకు".

"అంతేనంటావా? నాకు సుధాకర్ మీద ప్రేమ ఉందనుకున్నానే"

"ప్రేమా లేదూ దోమా లేదు. ఇక్కడ కనిపించిన జంటల్ని నిశీతంగా పరశీలించావా... సగం మంది సాఫ్టవేర్ కంపెనీల్లోనో లేదా కాల్ సెంటర్లోనో పని చేసే యువతీ యువకులు.. మిగతా సగం మంది మన వయసున్న టీనేజర్లు. వీళ్ళల్లో ఎక్కువ మంది వత్తిడి నుంచి ఉపశమనం కోసమే ఇలా ప్రేమ ముసుగులో శరీరాకర్షణకు లోనవుతున్నారు. మన టీనేజర్లు పక్కదోవ పట్టటానికి ముఖ్య కారణాలు చెప్పినా.. ఈ వయసులో ఉండే హార్మోన్ల ప్రభావం.. సినిమాల ప్రభావం.. ఇంటర్నెట్లోని అశ్లీల వెబ్సైట్లు అందుబాటులో ఉందటం... అగ్నికి ఆజ్యం పోసినట్లు చదువుతో పాటు అనివార్యపోయిన వత్తిడి".

"లేదే.. నేను సుధాకర్ ని నిజంగానే ప్రేమించానే"

"అలానే అనిపిస్తుంది... కళ్ళకున్న రంగు రంగు పొరలు తొలిగిపోయే వరకు. ఇంటికేళ్ళి కూల్ గా ఆలోచించు. నీకే అర్థమౌతుంది.. నీది తప్పటడుగో కాదో. పద వెళ్దాం" అంది.

పసి పిల్లని వేలు పట్టుకుని నడిపించినట్లు హిమవర్ష చేతిని తన చేతిలోకి బలంగా తీసుకుని దుర్గం చెరువునుంచి బటికి నడిపించింది.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)