కాళిదాసు రఘువంశం - మొదటి భాగం

మువ్వల సుబరామయ్యగారు విజయవాడలో జయంతి పబ్లికేషన్స్ అధినేత. గత మూడు దశాబ్దాలుగా వారు వివిధ ప్రాచీన గ్రంధాలను ముద్రించి, ఎన్నోగ్రంధాలకు తెలుగులోకి అనువాదాలు చేయించి అమితమైన సాహితీ సేవలను అందించారు. యువ, మిసిమి, రచన, ఆంధ్ర జ్యోతి, వంటి అనేక పత్రికలలో వారి వ్యాసాలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. వారికున్న ఈ ప్రాచీన సాహిత్య పరిజ్ఞాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఈ సాహిత్యాలను పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో అందించమన్న మా అభ్యర్థనకు వారుచేసిన రూపకల్పనే ఈ శీర్షికే, "ప్రాచీన సాహిత్య దర్శనం"గా వెలుగొందగలదు. ప్రతినెలా వారు ఒక ప్రాచీన కావ్యాన్ని తీసుకొని దానిని సరళతరమైన భాషలో అందించడమేకాకుండా అవసరమైన వ్యాఖ్యలను కూడా జతపరుస్తారు.


మహాకవి కాళిదాసు రచనలను పరిశీలించితే అతడు శైవుడుగా కనిపిస్తాడు. కాని అతడు హరి విద్వేషి కాదు. హరి అవతారమైన రాముని వంశ చరిత్రను రఘువంశం కావ్యముగా రచించాడు. కాళిదాసు కావ్యాలలో కల్లా రఘువంశం ప్రసిద్ధమైంది. రఘువంశం కావ్యంలో పంతొమ్మిది సర్గలని కొందరు, కాదు ఇరవైఐదు సర్గలని మరికొందరు అంటారు. మల్లినాధుని వ్యాఖ్యానంతో మనకు పంతొమ్మిది సర్గలే ఇప్పుడు లభిస్తున్నాయి. ఇందులో దిలీపుని మొదలుకుని అగ్నివర్ణుని వరకు రఘువంశ రాజుల చరిత్ర ఉంది. పురాణాలలో అగ్నివర్ణుని తరువాత ఇంకా ఇరవైఏడు మంది రాజులున్నట్లు చెప్పబడింది. కవి అగ్నివర్ణుని విలాస జీవితం వర్ణిస్తూ హఠాత్తుగా కావ్యాన్ని ముగించాడు. మొదటి తొమ్మిది సర్గలలో దిలీపుని సేవా పరాయణత, రఘుమహారాజు దాని నిరతి, అజుని కోమల స్వభావము, దశరథుని చరిత్రలు వర్ణించాడు. తర్వాత తొమ్మిది నుండి పదిహేను సర్గలలో శ్రీరాముని ఆదర్శ జీవితం చిత్రించాడు. చివరి నాల్గు సర్గలలో కుశుడు మొదలుకొని అగ్నివర్ణుని వరకుగల ఇరవై మంది రాజుల చరిత్రను వర్ణించాడు.

వేదాలకు మొదట ప్రణవం ఉన్నట్లు, రాజులలో వైవస్వత మనువు మొదటివాడుగా ఉన్నాడు. దోషరహితమైన ఈ సూర్యవంశంలో పాలసముద్రంలో చందమామ పుట్టినట్లు దిలీపుడనే రాజచంద్రుడు పుట్టాడు. దిలీపమహారాజు భార్య సుదక్షిణాదేవి. ఉత్తమమైన మగధవంశంలో పుట్టిందామె. యఙ్ఞానికి దక్షిణవలె ఆమె అన్నివిధాల దిలీపునికి తగిన ఇల్లాలు.

అయితే అన్నీఉన్న దిలీపమహారాజుకు సంతానం లేదు. సంతానంకోసం ఆయన రాజ్యపరిపాలన మంత్రులపై ఉంచి, సుదక్షిణాదేవి తాను పుత్రసంతానం కోసం బ్రహ్మను పూజించాడు. తరువాత ఇద్దరూ తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. మగధరాజకుమార్తె సుదక్షిణాదేవి, మహాత్ముడైన దిలీపుడు తమ గురువైన వశిష్ఠులవారికి, ఆయన ధర్మపత్ని అరుంధతీదేవికి పాదాభివందనం చేసారు. మహర్షి దంపతులు రాజ దంపతులను మనసారా ఆశీర్వదించారు.

దిలీపుడు 'ఓ తండ్రీ! వశిష్ఠమహామునీ! ఇక్ష్వాకువంశస్థులకు అసాధ్యములైన పనులు సిద్దింపజేసే సమర్ధులు మీరు. కాబట్టి సంతాన భాగ్యం పొందడానికి, పితృఋణం నుండి విముక్తుడను కావడానికి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి' అని అడిగాడు. వశిష్ఠమహర్షి దివ్యదృష్టితో చూచి 'మహారాజా! పూర్వం నీవు దేవేంద్రుని చూచి తిరిగి భూలోకం వస్తూ ఒక చోట కల్పవృక్షం నీడలో ఉన్న కామధేనువును సత్కరించకుండా వచ్చేసావు. అప్పుడు నీవు పరధ్యానంగా ఉన్నావు. అప్పుడు ఆ కామధేనువు 'నన్ను తిరస్కరించావు కాబట్టి నా సంతతిని పూజించకుండా నీకు సంతానం కలగదు' అని నిన్ను శపించింది. అప్పుడు మదించిన దిగ్గజం ఆకాశ గంగలో యదేచ్చగా మునుగుతూ పెద్ద శబ్దం చేస్తూ ఉన్నందున కామధేనువు శాపం నీవు వినలేదు. ఆ కామధేనువు పుత్రిక అయిన నందినీధేనువును పూజించు. నీ కోర్కె నెరవేరుతుంది' అన్నాడు.

అప్పుడు నందిని అనే ధేనువు వనం నుండి అక్కడికి వచ్చింది. 'ఓ రాజా! మనం మాట్లాడు కుంటున్న నందిని ఇక్కడకు వచ్చింది. కాబట్టి నీ కోర్కె త్వరలోనే సిద్దిస్తుంది. నీవు నందినీధేనువు అనుగ్రహం కలిగేటంతవరకూ దానిని సేవించాలి. ఈ పనిలో నీకు ఎలాంటి ఆటంకం కలగకుండుగాక! మంచి కుమాళ్ళు జన్మిస్తారు' అని మహర్షి చెప్పగా దిలీపుడు అతని భార్య చాలా సంతోషించారు.

దిలీపుడు తన పరివారాన్ని పంపివేసి, తానే నందిని సంరక్షణ భారాన్ని చేపట్టాడు. నందినీ ధేనువుకు శ్రద్ధాభక్తులతో శుశ్రూష చేస్తూ వచ్చాడు. దిలీపుడు ఆయన భార్యా భక్తితో ఇరవైయొక్క రోజులు ఆ గోవును సేవించారు. గోవ్రతం నిష్ఠతో అనుష్ఠించారు. ఇరవై రెండవరోజు మామూలుగా తన వెంటవస్తున్న దిలీప మహారాజుని పరీక్షించాలనుకున్నది నందినీ ధేనువు. హిమాలయప్రాంతంలో పచ్చికనేలలలో సంచరిస్తూ గంగోదకం పడే స్థలానికి దగ్గరలో ఉన్న ఒక గుహలో ప్రవేశించింది. దిలీపుడు పర్వత శోభను తిలకిస్తూ నందినిని గమనించలేదు.

గోవు బిగ్గరగా దీనంగా అరిచింది. గభాలున తిరిగి చూచాడు. ధనస్సు చేతపట్టుకిఉన్న దిలీపుడికి కొండగుహలో ఎర్రని నందినీధేనువుపై లంఘిస్తున్న తెల్లని సింహం ఒకటి కనిపించింది. రాజు వెంటనే దానిని చంపటానికి అమ్ములపొది నుండి బాణం తీయబోయాడు. ఆ చేయి అలాగే కదలకుండా ఉండిపోయింది. ఆయన ఆశ్చర్యచకితుడైనాడు.

సింహం రాజుతో వింతగా ఇలా పలికింది. 'ఓ దిలీప మహారాజా! నీవు నామీద ఎలాంటి అస్త్రం ప్రయోగించినా అది వ్యర్ధమే. నేను పరమశివుని సేవకుడను. నికుంభునితో సమానుడను. నా పేరు కుంభోదరుడు. ఆ ఎదురుగా కనిపిస్తున్న దేవదారు చెట్టుకు మా తల్లి పార్వతీదేవి బంగారు కుండతో నీరు తెచ్చిపోస్తుంది. ఆ నీటితో పెరిగిన ఈ చెట్టును శివుడు కుమారస్వామితో సమానంగా ప్రేమిస్తాడు.

ఒక సారి ఒక అడవి ఏనుగు వచ్చి తన గండ స్థలాన్ని ఈ చెట్టుకు ఆనించి రుద్దుకున్నది. ఆ కారణంగా చెట్టు చర్మం ఊడిపోయింది. అదిచూచి మా అమ్మ పార్వతీదేవి దుఃఖించింది. అప్పటి నుండి ఈశ్వరుడు అడవిఏనుగులు ఇక్కడికి రాకుండా ఉండే నిమిత్తం నాకు సింహరూపం ప్రసాదించాడు. ఆ చెట్టు దగ్గరకు వచ్చిన జంతువులను ఆహారంగా చేసుకుని ఈ కొండగుహలో ఉండమని ఆఙ్ఞాపించాడు. ఇదీ నా కథ. పరమేశ్వరుడు నియమించిన వేళకి నాకీ ఆవు లభించింది. ఓ రాజా! నీవు సిగ్గుపడక వెనుదిరిగిపో. నీవు గురు భక్తి కలవాడవే, నాకు తెలుసు. నీవీ ఆవును రక్షించవలసి ఉన్నమాట నిజమే. కాని ఏం చేస్తాము. దీని మూలంగా నీ కీర్తికి ఏమీ భంగం రాదు. వెళ్ళిపో'

సింహం ఇలా పలకగా, ఈశ్వరుని మహిమ వలన ఇలా జరిగిందని తెలుసుకున్నాడు దిలీపుడు. సింహం మాటలకు 'ఓ సింహరాజా! పరమేశ్వరుడు నాకు పూజ్యుడు. అయితే నా గురువు వశిష్ఠులవారి గోధనం నశించిపోతూఉంటే నేను చూస్తూ ఉపేక్షించడం న్యాయం కాదు. నన్ను నీవు భక్షించి ఆకలి తీర్చుకో. ఈ గోవును మాత్రం విడిచిపెట్టు. నీకు పుణ్యం ఉంటుంది. నాకీ శరీరం ముఖ్యం కాదు. ఈ దేహాన్ని నీవు పరిగ్రహించి శాశ్వతమైన కీర్తిని నాకు ప్రసాదించు' అని వేడుకున్నాడు.

సింహం నందినిని విడిచిపెట్టింది. అంతవరకు స్థంభించి ఉన్న దిలీపుని చేతులు స్వాధీనంలోకి వచ్చాయి. ధనుర్భాణాలు విడచి సింహం ఎదుట నిలబడ్డాడు. అప్పుడు దేవతలు విధ్యాధరులు దిలీపునిపై పూలవాన కురిపించారు.

నందిని మనుష్యభాషలో 'రాజా! నీ చిత్తసుద్ధిని పర్రిక్షించడానికి నేనే ఈ మాయని సృష్టించాను. నీవే నెగ్గావు. వసిష్ఠ మహర్షి మహత్యం వల్ల సింహమే కాదు యమధర్మరాజు కూడా నన్ను ఏమీ చేయలేడు. నీకు కావలసిన వరాలు కోరుకో' అని పలికింది. దిలీపుడు చేతులు జోడించి, తన వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించే కుమారుని తన పట్టపురాణి సుదక్షిణాదేవి యందు అనుగ్రహించవలసినదిగా కోరాడు. అందుకు ధేనువు 'అట్లే అగుగాక! నాయనా! నీవు ఒక దొన్నెలో నా పాలు పిండి త్రాగవలసింది' అని చెప్పింది. 'గోమాతా! దూడకూ, గురువుల హోమానికి పోగా మిగిలిన నీ పాలతో భూమి ఫలం ఆరవభాగం తీసుకున్నట్లే, గురువుగారి అనుమతితో ఆరవభాగం నేను తీసుకుంటాను' అని విన్నవించాడు.

నందినీ ధేనువు దిలీపునితో ఆశ్రమానికి వచ్చింది. గోవును చూడగానే వశిష్ఠ మహర్షికి అర్ధమైంది. అయినా దిలీపుడు జరిగిన సంగతి గురువుకు, తన భార్య సుదక్షిణకు చెప్పాడు. మహర్షి అనుమతితో దిలీపుడు నంధినీ ధేనువు పాలు త్రాగాడు. మరునాడు ధేనువును పూజించారు రాజదంపతులు. వశిష్ఠుడు వారిని దీవించి తిరిగి నగరానికి పంపాడు.

తరువాత కొన్నాళ్ళకు సుదక్షిణాదేవి గర్భం ధరించింది. తొమ్మిది నెలలు నిండిన తరువాత ఒక సుమూహుర్తంలో ఒక పిల్ల వాడిని కన్నది. వశిష్ఠ మహర్షి రాకుమారుడికి జాతకర్ణాది సకల కార్యాలూ జరిపించాడు. దిలీపుడు తన కుమారునికి రఘువు అని పేరు పెట్టాడు. రఘువు దినదిన ప్రవర్ధమానమైనాడు. యుక్తవయసు రాగానే పెళ్ళిచేసి, రఘువుకు యువరాజ్య పట్టాభిషేకం చేసాడు దిలీపుడు.

అంతట దిలీపుడు నూఱు అశ్వమేధయాగాలు చేయాలనుకున్నాడు. రఘుమహారాజును యఙ్ఞాశ్వాలకు రక్షకుడిగా నియమించి తొంభైతొమ్మిది అశ్వమేధాలు జయప్రదంగా నిర్వహించాడు. తరువాత నూఱవ యాగం ప్రారంభించగా యాగాశ్వాన్ని దేవేంద్రుడు అపహరించాడు. రఘుమహారాజు సైనికులు గుఱ్ఱం ఎలా మాయమయిందా అని ఆశ్చర్య పోయారు. అప్పుడు వశిష్ఠులవారి నందినీ ధేనువు అక్కడకు వచ్చింది. ఆ గోవు మహిమ తెలిసిన రఘుమహారాజు గోమూత్రంతో తన నేత్రాలు తుడుచుకున్నాడు. దేవేంద్రుడు తూర్పు దిక్కున తన సారధిచే యాగాశ్వాన్ని పగ్గాలతో తన రధానికి కట్టించి అపహరించుకు పోతూ ఉండడం రఘుమహారాజు చూచాడు. అతన్ని అడ్డగించాలనుకుని అంతరిక్షంలో వినపడేటట్లు బిగ్గరగా 'ఓ దేవేంద్రుడా! మా తండ్రిగారి అశ్వమేధయాగానికి ముఖ్య సాధనమైన ఆ గుఱ్ఱాన్ని విడిచిపెట్టు. సన్మార్గాన్ని అవలంబించి ధర్మాన్ని నిలబెట్టు' అని పలికాడు.

దేవేంద్రుడు ఆశ్చర్యపడి తన రధాన్ని వెనుకకు త్రిప్పి 'ఓ రాకుమారా! కొందరికి యశస్సే ధనం. తమ కీర్తిని ఇతరులు హరించకుండా సర్వవిధాల రక్షించుకుంటారు. మీ తండ్రి నూఱు అశ్వమేధయాగాలు జయప్రదంగా నిర్వహించినట్లయితే అతనికి ఇంద్రపదవి లభిస్తుంది. ఆ విధంగా నా కీర్తిని చెడగొట్టి, నా స్థానం ఆక్రమించడానికి ప్రయత్నిస్తునాడు కాబట్టి ఈ గుఱ్ఱాన్ని నేను అపహరించాను. ఇందులో నా దోషంలేదు. పూర్వం సగర చక్రవర్తి కుమారులు యఙ్ఞాశ్వం విషయంలో కపిల మహర్షి జోలికి పోయి సర్వనాశనమైనారు. కనక ఈ విషయంలో అనవసర ప్రయాస వద్దు' అన్నాడు.

'దేవేంద్రా! నీవు నా గుఱ్ఱాన్ని వదలనట్లయితే మొదట నాతో యుద్ధం చేసి, నన్ను జయించి, గుఱ్ఱాన్ని పట్టుకుపో' అన్నాడు రఘుమహారాజు. అప్పుడు వాళ్ళిద్దరికీ గొప్ప యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు జయించాలన్న జిగీషతో ఉగ్రమైన బాణాలు ప్రయోగించుకున్నారు. చివరకు ఇంద్రుడు అంతులేని కోపంతో తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. దాని దెబ్బకు రఘువు నేలమీద పడిపోయాడు. అయితే పడిపోయిన రఘువు మరల ఒక్క నిమిషంలో లేచాడు. తన వజ్రాయుధం దెబ్బకు అజేయుడై నిలచిన రఘువును ఇంద్రుడు ఎంతో మెచ్చుకున్నాడు. 'రఘు మహారాజా! నా వజ్రాయుధం దెబ్బతిని బ్రతికిన వాడు నీవు తప్ప ఎవ్వరూ లేరు. అందువలన నీ మీద నాకు ప్రేమ కలిగింది. ఈ యాగాశ్వాన్ని తప్ప మరేదైనా కోరుకో, ఇస్తాను' అన్నాడు దేవేంద్రుడు. 'దేవా! యఙ్ఞాశ్వాన్ని విడిచి పెట్టడం నీకు ఇష్టం లేకపోతే, మరొకపని చెయ్యి. నూఱొవ అశ్వమేధయాగ ఫలాన్ని నా తండ్రికి సంపూర్ణంగా ప్రసాదించు. నా తండ్రికి మీరే మీ దూతతో ఈ విషయం తెలియజేయండి' అని చెప్పాడు.

దేవేంద్రుడు అలాగేనని అదృశ్యమైనాడు. రఘువు తన నగరానికి తిరిగి ప్రయాణమైనాడు. ఇంద్రుడు తన దూతలను చేత దిలీపమహారాజుకు సంగతంతా చెప్పమని పంపాడు. నూఱవ అశ్వమేధయాగఫలం లభించినందుకు రాజు మిక్కిలి సంతోషించాడు. వజ్రాయుధం దెబ్బకు తట్టుకుని ఇంద్రుని మెప్పించినందుకు తన కుమారుని దగ్గరకు తీసుకుని ప్రశంసించాడు. సర్వసంగ పరిత్యాగుడై రాజ్యలక్ష్మికి చిహ్నమైన శ్వేత ఛత్రాన్ని రఘువుకు అప్పగించి, భార్య సుదక్షిణాదేవితో వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక్ష్వాకు వంశపు రాజులందరు వృద్ధాప్యంలో వానప్రస్థం అవలంబించడం ఆచారం.

రఘుమహారాజు పాలన ధర్మ పాలన. రఘువు చతురంగ బలాలను సమకూర్చుకుని దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. మొదట తూర్పు దిక్కుగా వెళ్ళాడు. త్రోవ పొడుగునా శతృరాజులను జయించి వారినుంచి కప్పములను తీసుకున్నాడు. ఆ విధంగా తూర్పు సముద్రతీరం చేరుకున్నాడు. సింహళదేశాధిపతులు ఆయనకు శరణుజొచ్చారు. వంగదేశపు రాజులు గంగా నదిలో ఓడల మీద వచ్చి రఘుమహారాజును ఎదిరించి, ఓడిపోయి, అపారమైన ధనము కానుకగా ఆయనకు సమర్పించి, ఆయన పాదాలకు మ్రొక్కి మరల రాజ్యం పొందారు.

రఘుమహారాజు తన ఏనుగులను వరసగా నిలబెట్టి, వంతెనగా చేసి, దాని మీద తన సైన్యంతో కపిలానదిని దాటాడు. ఉత్కళరాజులు చూపిన మార్గాన కళింగదేశం వెళ్ళాడు. అపజయం ఎరుగని రఘువు కళింగుని యుద్ధంలో జయించాడు. కళింగరాజు శరణాగతుడు కాగా అతని ఐశ్వర్యం మాత్రం తీసుకుని అతని రాజ్యం తిరిగి ఇచ్చివేసాడు. ఇలా విజయభేరి మోగిస్తూ తూర్పుదిక్కు నుండి అగస్త్యులవారు ఉండే దక్షిణదిక్కునకు వెళ్ళాడు.

అది దక్షిణాయనం. పాండ్యరాజులు రఘుమహారాజు ప్రతాపంముందు ఆగలేకపోయాడు. తామ్రపర్ణీనది సముద్రంలో సంగమించే చోట తాము సంపాదించిన అమోఘమైన ముత్యాలను రఘువుకు అప్పగించారు. చందనపు చెట్లతో ఉన్న మలయ, దుర్గురు పర్వతాలు రెండూ దక్షిణదిశ అనే సుందరికి రెండు కుచాలవలె ఉన్నాయి. రఘువు ఆ పర్వతాలపై యధేచ్ఛగా సుఖాలు అనుభవించాడు. తరువాత సముద్రానికి దూరంగా భూదేవికి చీర జారిపోగా కనిపిస్తున్న పిరుదులవలె ఉన్న గుహ్యపర్వతాలని ఆక్రమించాడు.

ఆవిధంగా పశ్చిమ దేశాలను జయించడానికి వెళ్ళాడు. గుహ్యపర్వతానికీ, దక్షిణ సముద్రానికీ మధ్య ప్రయాణం చేసింది ఆయన సైన్యం. పూర్వం పరశురాముడు భూమి కావాలని అర్ధించగా సముద్రుడు తన జలాన్ని తగ్గించి కొంత చోటు ఇచ్చాడు. ఇప్పుడా సముద్రుడు రఘుమహారాజుకు పడమటి రాజులనే కానుకలను సమర్పించాడు. పశ్చిమ దేశాన్ని జయించి, పారశీక రాజులను జయించాడు. సముద్ర తీరం వెంట వెళ్ళాడు. తురుష్కులను ఓడించాడు. తరువాత ఉత్తరదేశపు రాజులను జయించడానికై ఆ దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దేశమందలి హోణ రాజులను హింసించాడు. కాంభోజరాజులు ఎదురు నిల్వలేక పోయారు.

హిమవత్పర్వతం పైన ఉత్సవ సంకేతులనే పేరుగల సప్త గణాలను భయంకరమైన యుద్ధంలో రఘువు జయించాడు. అదిచూచి కిన్నెరలు ఆ విజయాన్ని ఒక కావ్యంగా గానం చేసారు. తరువాత రఘువు లౌహిత్యం అనే పేరుగల నదిని దాటాడు. ప్రాగ్జోషితపుర రాజు యుద్ధం చేయకుండానే లొంగిపోయాడు. కార్యుదేశాధీశ్వరుడు వినయంతో తలవంచి వశమైనాడు.

ఆవిధంగా జయశీలుడైన రఘుమహారాజు దిగ్విజయం చేసి ఏకఛత్రాధిపత్యం సాధించాడు. మహదానందంతో తిరిగి తన పట్టణానికి ప్రయాణమైనాడు. తరువాత ఆయన విశ్వజిత్తు అనే గొప్ప యాగం చేసాడు. ప్రపంచాన్ని జయించి చేయదగిన యాగం అది. దానిలో సర్వస్వమూ దక్షిణకింద ఇయ్యవలసి ఉంది. రఘుమహారాజు తన సర్వస్వం దానం చేసాడు యఙ్ఞంలో.

పరతంతు ముని శిష్యుడైన కౌత్సకుడనే ముని కుమారుడు పద్నాలుగు విద్యలు నేర్చుకుని, గురుదక్షిణ అడగడానికి రఘుమహారాజు దగ్గరకు వచ్చాడు. మహారాజు ఆ మునికుమారుని గౌరవించి, ఒక మట్టిపాత్రలో పూజా ద్రవ్యాలతో యధావిధిగా పూజించి, కుశల ప్రశ్నలు వేసాడు. కౌత్సముని మహారాజు సర్వస్వం దానం చేసాడన్న విషయం గమనించాడు. తాను వచ్చిన పని నెరవేరదనుకున్నాడు. 'రాజా! గురుదక్షిణ కోసమని నీ వద్దకు వచాను. నీ పరిస్థితి నాకు అర్ధమైంది. ఇంకొక దాతను అర్ధించాలనుకుంటున్నాను' అని వెళ్లడానికి సిద్ధమయ్యాడు. 'స్వామీ! మీ గురువుగారికి ఇవ్వవలసిన గురుదక్షిణ ఏమిటి? ఎంత?' అని అడిగాడు. కౌత్సఋషి 'నేను విద్యలన్నీ నేర్చుకున్నతరువాత గురుదక్షిణ తీసుకోమని మా గురువైన పరతంతు ఋషిని వేడుకున్నాను. నీవు చేసిన శుశ్రూషలే చాలు అని ఆయన అన్నారు. తీసుకోవలసిందేనని నేను బలవంతం చేసాను. అప్పుడాయనకు కోపం వచ్చి నేను కటిక దరిద్రుడనని తెలిసి కూడా ఒకొక్క విద్యకు కోటి చొప్పున పద్నాలుగు విద్యలకూ పద్నాలుగు కోట్ల ద్రవ్యం గురుదక్షిణగా తెమ్మని ఆయన కోరారు. [ఋక్కు, యజస్సు, సామం, అధర్వణం - అను నాలుగు వేదాలు, శిక్ష, వ్యాకరణం, ఛంధస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం - అను ఆరు వేదాంగాలు, తర్కం, మీమాంస, పురాణ, ధర్మశాస్త్రాలు - అనే నాలుగు శాస్త్రాలు - మొత్తం పద్నాలుగు విద్యలు] రాజా! నీవు పేరుకు రాజుగా ఉన్నావేగానీ నీ వద్ద ధనం లేదన్నది నాకు తెలుసు. అందువలన నిన్ను అడగడానికి మనసొప్పలేదు' అన్నాడు.

'ఓ మహాత్మా! రెండు రోజులు ఉండండి. మీ కోర్కె నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. నా దగ్గరకు వచ్చి మరొక దాతను అర్ధించడానికి వెళ్ళారనే అపవాదు నాకు లేకుండా చేయండి' అని విన్నవించగా కౌత్సముని సంతుష్టుడైనాడు. భూమిలో ద్రవ్యమంతా తానే తీసుకున్నందున కుబేరుని దగ్గరనుండి పొందాలనుకుని వెంటనే తన రధాన్ని ఆయత్తం చేయించాడు. ఇంతలో కోశాధికారి వచ్చి 'మహారాజా! మన బొక్కసంలో ఆకాశంనుండి బంగారు వాన కురిసింది' అని ఆశ్చర్యంతో ఆయనకు చెప్పాడు. రఘుమహారాజు తాను ఏ కుబేరునికోసం వెళదామనుకున్నాడో అతని వలన అపార ధనం లభించినందుకు సంతోషించి, కౌత్సముని కోరినదాని కంటే ఎక్కువగా బంగారం అంతా వందలకొలది ఒంటెలమీద, గుఱ్ఱాలమీద కౌత్సఋషి వెంట పంపాడు. ఋషి ఎంతో ఆనందించాడు. అయోధ్యాపురవాసులు రఘుమహారాజు దాన గుణాన్ని ఎంతగానో కొనియాడారు.

కౌత్సముని 'రాజా! కోరిన ద్రవ్యాన్ని భూదేవి ఇస్తూఉంటుంది. కాని ఆకాశం కూడా నీ ఇష్టార్ధాలను ఇవ్వడం వలన నీ మహిమ ఇంత అంత అని వర్ణించనలవి కాకుండా ఉంది. మహనీయుడైన నీ తండ్రికి నీవు ఎలాగో, అలాగే నీకూ సకలైశ్వర్యాలూ గల పుత్రుడు నీకు జన్మించుగాక' అని దీవించి తన గురువు దగ్గరకు వెళ్ళాడు. ఆమహర్షి ఆశీర్వచన ప్రభావం వల్ల రఘుమహారాజుకి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడికి బ్రహ్మ పేరైన అజుడు అని పేరు పెట్టాడు. అజుడు గురువుల వద్ద సకల విద్యలూ నేర్చుకున్నాడు. అన్నివిధాల తండ్రితో సమానంగా ఉన్నాడు. యౌవనం వచ్చింది.

విదర్భదేశాధీశుడైన భోజరాజు తన చెల్లెలు ఇందిమతికి స్వయంవరం చాటించాడు. రఘుమహారాజు అజుడుని సమస్త ద్రవ్యాలతో సైన్యంతో భోజరాజు పట్టణానికి పంపించాడు. అజమహారాజు వస్తున్నాడని తెలియగానే భోజుడు త్రోవలో అతనికి అన్ని సౌకర్యాలూ కలిగించాడు. అజుడు మధ్యలో తన సైన్యంతో నర్మదా నదీతీరమునందు విడిది చేసాడు. ఒక అడవి ఏనుగు అక్కడకి వచ్చి అల్లకల్లోలం చేసింది. యుద్ధంలో తప్ప ఏనుగులను చంపరాదని శాస్త్రం. అందుకని దానిని వెనక్కు మళ్ళించాలని దాని కుంభస్థలంపై ఒక బాణం వేసాడు. ఆ బాణం తాకగానే ఆ ఏనుగు ఒక దివ్య పురుషుని రూపం ధరించి ఆకాశంలో నిలిచాడు. అదిచూచి సైనికులంతా ఆశ్చర్యచకితులైనారు.

'రాజా నేను ప్రియంవదుడనే గంధర్వుడను. నా తండ్రి ప్రియదర్శనుడు. నా గర్వం అణచడానికి మతంగ మహర్షి శాపం పెట్టాడు. అందువలన నాకు ఏనుగు రూపం వచ్చింది. నేను ఆ ఋషిని ప్రార్ధించగా ఇక్ష్వాకు వంశస్థుడైన అజమహారజు బాణం తగిలి నిజరూపాన్ని పొందగలవన్నాడు. నేటికి నీవలన శాపవిముక్తి కలిగింది. స్నేహితుడా! నీకు సమ్మోహనాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను. స్వీకరించు' అని స్వస్థలానికి వెళ్ళాడు. అజుడు గొప్ప స్నేహాన్ని, ప్రయోజనాన్ని పొంది విదర్భ దేశానికి వెళ్ళాడు.

(సశేషం)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)