ఐడెంటిటీ క్రైసిస్

మార్నింగ్ మీటింగులన్నీ ఇంట్లో ముగించుకొని ఆఫీసుకు బయలుదేరుతుంటే ఫోను మోగింది. ఫోను ఎత్తితే అవతలివైపు రికార్డు చేయబడ్డ ఓ ఆడకంఠం. 'ఈ కాల్ మీ ఫలానా టెలీఫోను కంపెనీది. మీ నెలసరి ఫోను బిల్లు డబ్బులు ఇంకా మాకు అందలేదు. మీరు ఇప్పుడు చెల్లించదల్చుకుంటే నెంబరు ఒకటి నొక్కండి ' అని నా తప్పిదాన్ని తియ్యని కంఠంతో చల్లగా చెప్పింది.

'ఛస్! మళ్ళీ పప్పులో కాలేసాను ' నన్ను నేను నిందించుకొన్నాను. ఈ మధ్య నా బుద్ధి మందగిచ్చినట్టుంది. రోజూ కుప్పలుగా వస్తున్న చెత్త ఉత్తరాల కుప్పలో నా ఫోనుబిల్లు కూడా ట్రాష్ చేసినట్టుటున్నాను.

గత్యంతరం లేక నెంబరు ఒకటి నొక్కాను. ఈసారి కంఠం మారింది.

'మీరు క్రెడిట్ కార్డుతో పే చెయ్యదల్చుకున్నారా?' - ప్రశ్న.

'యస్ ' - నా జవాబు.

'సారీ. మీరు ఏమన్నారో నాకు అర్థం కాలేదు ' - అవతలివైపు సందేహం.

నేను ఇంగ్లీషులో మూడక్షరాల అతి చిన్న పదాన్ని పలికితే ఎందుకు అర్థం కావటం లేదన్నది నా ధర్మ సందేహం.

పళ్ళు బిగించి గాలిని నెమ్మదిగా వదులుతూ 'యస్ ' మళ్ళీ అన్నాను.

'మళ్ళీ సారీ! మీరెం అంటున్నారో అర్థమైతే ఓట్టు. అవునంటే ఒకటవ నెంబరు, కాదంటే రెండవ నెంబరు నొక్కండి.' అంటూ తరుణోపాయం చెప్పింది ఆవలి కఠం.

నాది మొండిపట్టు. 'అమీ, తుమీ తేల్చుకోవాలి. నేను యస్ అంటున్న చిన్న ఇంగ్లీషు ముక్క ఒక మెషీనుకు అర్థం కాకపోతే నేను చదివిన ఇంత చదువు బూడిదలో పోసిన పన్నీరౌతుంది ' అనుకుంటూ 'నువ్వా, నేనా?' అన్న తరహాలో ఈసారి నోరు మొత్తం తెరిచి గొంతు వదలు చేసుకొని మళ్ళీ 'యస్ ' అన్నాను.

'ఇలా అయితే లాభం లేదు. మా రిప్రజెంటేటివ్ తో మాట్లాడాలంటే నెంబర్ జీరో నొక్కండి ' ఇక నీ పని జీరోనేనని తేల్చేసింది ఆ రికార్డు చేయబడ్డ కఠం.

మయసభలో దుర్యోధనునికి కలిగిన పరాభావం కంటే ఒక వీసం ఎక్కువే ఫీలవుతూ జీరో నెంబరు నొక్కాను. వెంటనే నిజమైన ఆడకఠం వినిపించింది.

'హలో, హౌ అర్యూ? మా ఊళ్ళో వాతావరణం బాగుంది, మరి మీ ఊరి సంగతేంటీ?' మొదలగు మాటామంతీ, కుశలప్రశ్నలయ్యాకా అసలు విషయంలోకి దిగాం.

'నో వర్రీస్. మీరు క్రెడిట్ కార్డుతో పే చెయ్యొచ్చు. మీరు చెయ్యవలసిందల్లా నాకు ఆ కార్డు వివరాలు చెప్పండి.' అంది. అమెరికావాళ్ళు 'అండీ, గుండీ' అని అనరని మీకు తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు. కాని అచ్చ తెలుగులో రాయాలనే తపనతో నాకు నేను గౌరవం ఇచ్చుకుంటున్నాను.

కార్డు నెంబరు, ఎక్స్ పైరేషన్ డేట్ చెప్పాను. 'డెబిటా కార్డా, క్రెడిట్ కార్డా?' ప్రశ్నించింది.

'డెబిట్ కార్డు ' ఠక్కున నా జవాబు.

'అయితే కార్డు తిప్పి చూసి వెనకాల ఉన్న మూడు నంబర్లు చెప్పండి. అది మీ కార్డు సెక్యూరిటీ కోడ్. ఐడెంటిటీ తెఫ్ట్ నివారించటానికి ' అంటూ మరో సూచన.

బాహాటంగా కార్డు మీద రాసుంటే అది సెక్యూరిటీ కోడ్ ఎలా అవుతుంది? అన్నది 'మనవడి ప్రశ్న, తాతయ్య జవాబు ' శీర్షికలో లాగా నా మనసులో మెదలుతున్న ప్రశ్న. అడుగుదామనుకొని 'ఎందుకులే, ఇప్పుడు టైం లేదు ' అని ఊరుకొన్నాను.

క్రెడిట్ కార్డు తతంగం పూర్తయ్యాకా 'నాకు మీరో సహాయం చెయ్యాలి. ఫోనుబిల్లు మొదటి పేజీలో కుడిచేతి పైభాగానా ఉన్న మూడు అంకెలు చూసి చెప్పండి ' నాకు మళ్ళో పని చెప్పింది.

'నా దగ్గర బిల్లు లేదు. పోగొట్టుకొన్నట్టున్నాను. అయినా నా టెలీఫోను నెంబరు కదా కావల్సింది బకాయి చెల్లించడానికి?' అమాయకంగా నేనడిగిన ప్రశ్న.

'కరెక్టే! కాని ఆ మూడంకెలు మీ కస్టమర్ ఐడెంటిఫికేషన్ కోడ్. అది లేకుండా నేను మీ బిల్లును కంప్యూటర్లో చూడలేను ' అవతల ఆవిడ నిస్సహాయత.

చాంతాడంత ఫోను నెంబరు పెట్టుకొని, మళ్ళీ ఈ ఐడెంటిఫికేషన్ కోడ్ ఏమిటో?

'ఆ మూడంకలే కనక నా అస్తిత్వాన్ని నిరూపిస్తాయనుకుంటే పాతబిల్లులు చూసి తర్వాత ఫోను చేస్తాను ' సారీ, థాంక్యూ అంటూ ఫోను పెట్టేశాను.

ఇలా ఎవరికి వాళ్ళు నా అనుమతి లేకుండా నాకు ఐడెంటిఫికేషన్ల మీద ఐడెంటిఫికేషన్లు ఆపాదిస్తున్నారు అనిగొనుక్కుంటూ ఆఫీసుకు చేరుకొన్నాను. సీట్లో సెటిల్ అయిన తర్వాతా నాదగ్గరకు ఈ మధ్యనే ఇండియానుండి (అంటే ఆంధ్రప్రదేశ్, అందునా హైద్రాబాడ్ అని అర్థం) వచ్చిన కుర్రాడు నా దగ్గరకొచ్చాడు.

'నాకో సందేహముండి. ఓ రెండు నిమిషాల టైముందా?' - అతని అభ్యర్థన.

'తప్పక ' - నా హామీ

'నేను ఇక్కడకు వచ్చినప్పటినుండి మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్ వేర్ లో మరియూ అందరి నోటా సోషల్ సెక్యూరిటి నెంబర్ అని వింటున్నాను. ఆ నెంబరు కథా కమామీషు ఏమిటీ?' - ఇదీ ఇతని మనసును తొలిచేస్తున్న ధర్మసందేహం.

సప్తసముద్రాల ఆవల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలకలో రాక్షసుడి ప్రాణాలున్నట్లు, ఈ అమెరికాలో ప్రతీవాడి చరిత్ర ఆ తొమ్మిదంకెల్లో ఏ విధముగా దాగున్నది చెప్పుకొస్తూ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని శుకుడు ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిత్తుకి భాగవత కథామృతాన్ని చెప్పినట్టు చెప్పాను. అందుకు ఆ సందర్శకునికి ఎంతగానో మరో ఐడెంటిటీ నెంబరు గురించి జ్ఞానోదయమయింది.

అతను వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచించటం మొదలెట్టాను. నేను ఇండియాలో చదువుకొంటున్నప్పుడూ పెద్దలు, శ్రేయోభిలాషులు 'నీకంటూ ఓ ఐడెంటిఫికేషన్ ఉండాలోయ్ ' అంటూ క్లాసులు పీకేవాళ్ళు. అలానే గాలికి తిరుగుతున్న వాళ్ళను చూసి 'వాడికో ఐడెంటీఫికేషనంటూ లేదు ' అని కోపగించుకునేవాళ్ళు.

మరి వాళ్ళు చెప్పినట్టి ఐడెంటిఫికేషన్ కి, మరి ఈ నెంబర్ల ఐ. డీ. లకీ సారూప్యమేమీ లేదే? అసలు నా ఐడెంటిటీ ఏమిటీ అని నన్ను నేను ప్రశ్నించుకొన్నాను.

ఈ ప్రశ్నకు భగవద్గీతలో కృష్ణుడు జవాబు చెప్పినట్టు గురుతు. అస్త్రశస్త్రాలు నేలపడేసి 'ఈ యుద్ధం చెయ్యటం నావల్ల కాదు ' అంటున్న అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో 'వెర్రివాడా! నేను, నేను అంటున్నావు. అదంతా నీ భ్రమ. ఈ విశ్వమంతా నేనే. అన్ని కర్మలు చేస్తున్నది నేనే, చేయిస్తున్నదీ నేనే' అంటూ అర్జునుని ఐడెంటిటీనీ తేల్చేశాడు, ఈ ప్రపంచంలోని జీవులందరికి పెద్ద ఐడెంటిటీనే ఆపాదించాడు కూడా.

ఏంటో, నేను చిన్నప్పుడు మాఊళ్ళో పెరుగుతున్నప్పుడు నా ఐడెంటిటీ చాలా సింపుల్ గా ఉండేది - నేను ఫలనా వారి ఫలానా నెంబరు అబ్బాయిని.

మానసిక శాస్త్రవేత్తలు చెప్పుటున్నట్టు మనిషి ఎదుగుదలలో ఎనిమిది తడవలు ఐడెంటిటీ క్రైసిస్ లో పడతారట. ఆ ఎనిమిదికి తోడు అమెరికాలో బిజినెస్ వాళ్ళు సృష్టిస్తున్న మరికొన్ని అంకెల ఐ.డీ. క్రైసిస్ లు మరికొన్నీను.

'ఈ ఐడెంటీల గొడవేంటో' అనుకొంటూ పనిలో మునిగిపోయాను.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)