ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారినీ ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు మార్చి 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఈ మాసం సమస్య

" ఆ.వె.//ఆడువారి మాటలర్థాలె వేరులెక్రితమాసం సమస్య(పుల్లెల శ్యామసుందర్ గారు పంపిన ప్రశ్న)

కం: అందమె ఆనందమంచు అద్దము చూచెన్ "ఈ సమస్యకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

మొదటి పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫొర్నియా

కం.// అందము చందము కలగిన
సుందరి నేననుచునొక్క సొగసరి మహదా
నందము పొందెను అహహా
అందమె ఆనందమనుచు అద్దము చూచెన్


రెండవ పూరణ - కోరాడ ప్రకాష్, విజయనగరం

కం:// అందరు చీరను మెచ్చుకు
అందున ఇంతిని పొగడక అడగకనుంటే
సుందరి కోపము తెచ్చుకు
అందమె ఆనందమంచు అద్దము చూసెన్


మూడవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే

కం:// ఇందుగలదందు లేదని
సందేహమువలదు! ఆమె సందు దొరికితే
అందరి అద్దములందున,
అందమె ఆనందమంచు అద్దము చూచున్


నాల్గవ పూరణ - శ్రీరాం, సిడ్నీ, ఆస్ట్రేలియా

కవిత: కందము మించిన చందము లేదు
గంధము మించిన సుగంధము లేదు
ఆనందము మించిన బంధము లేదు
అందము మించిన ఆనందము లేదు
అందమె ఆనందమంచు అద్దము చూసెన్


ఐదవ పూరణ -- మాజేటి సుమలత, బెంగళూరు

కం.// సందులు గొందులు వెదకుచు
సుందరి చేరంగ నతడు చోద్కుల తోడన్
పొందుగ క్రాపును దువ్వుచు
అందమె ఆనందమంచు అద్దము చూచెన్ [స్కూటర్ అద్దము]


ఆరవ పూరణ - ఎం. వి.సి. రావు, బెంగళూరు

కం.// అద్దపు నకిలీ పుష్పము
ముద్దుగ నుందంచు తీతి మురిపెము తోడన్
కుద్దుగ పీల్చగ విరి, మక
రందమె ఆనందమంచు అద్దము చూచెన్


ఏడవ పూరణ- సుబ్రమణ్యం బత్తల, రోచెస్టర్ హిల్ల్స్, మిచిగన్

కవిత.// కలువ రేకుల కనులు కాంతు లీనుచు నుండ
చిగురుటాకుల మోవి పై చిరుహాస మలర
ముద్దు మోమున ముదమందు ముద్దరాలు తన
అందమె ఆనందమనుచు అద్దము చూచెన్


ఎనిమిదవ పూరణ-భోగారావ్ పప్పు

కం://అందము పరమాత్మునిలో
అందము యప్రకృతిలోను, అందరిలోనన్
అందము చూచుట నెరుగక
అందమె ఆనందమంచు అద్దము చూచెన్


పాఠకులనుండీ మరిన్ని మంచి పద్యాలు
- పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫొర్నియా
(అందరూ పంపించండి, అందరితో పంచుకోండి)

కొత్తిమీర కారం:

కొత్తిమీర నూరి, కొంచెముప్పును జేర్చి,
పులుపు, మిర్చి, వంగ ముక్కలేసి,
పోపుజేర్చి దాన్ని పొయ్యమీదుంచితే,
కూర రుచిగనుండు నారగింప!


పెసరట్టు :

పెసలు నానబోసి పిసరు అల్లము వేసి
జీలకర్ర కొంత జేర్చి రుబ్బి
పెనము మీద పోయ పెసర్ట్టగునయా
తెలుసుకొనర నరుడ! తెలుగు వంట!


అల్లప్పచ్చడి :

కొద్ది మిరపముద్ద, పెద్ద అల్లంముక్క,
పులుపు, తీపి, పోపు వేసి దంచి,
అట్టు ముంచితిన్న అద్భుతముగనుండు!
తెలుసుకొనర నరుడ! తెలుగు వంట!


భక్త హనుమ - తల్లాప్రగడ

సందర్భం : అశోకవనంలో అల్లరి చేసిన హనుమంతుడిని పట్టుకొని రావణుని కొలువులోకి తెస్తుంటే... హనుమను చూసిన రావణుడు ఆతడిని ఒక సాధారణమైన కోతిగా భావించి, కోతి ఇంత భీభత్సమెట్లాచేయగలిగిందా అని ఒక పక్క ఆశ్చర్యపోతూ, ఇలా అనుకున్నాడు

సీ.// అయ్యడ వనమంత వ్రయ్యలు కొట్టగ, మేడ్పడె ఈ కోతి మేడమందు !
అయ్యారే! మేడియమైనను లేకుండ కండయండలు మెండుయుండెనంచు,
కాండమూలాలతో కంపించి ఖండించె, కండ కొవ్వున కన్నుకానకుండ!
కొండముచ్చుకిపుడీ గండర గండుడే గండరించును గాదె గండమింక!

తే.గీ.//హాల కేళి వేళందలి హాళి తోటి
హావళిగొనివచ్చినవాడ! హాలికుడవు
కావె, హారకుడవు, తుచ్చ కపివి యంచు
రావణుడు కోపగించేను రామచంద్ర!


ప్రతిపదార్థము

అయ్యడ = అప్పుడు

వనమంత = అశోకవనమంతా

వ్రయ్యలు కొట్టగ= ముక్కలు కొట్టగ

మేడ్పడె = మోడుపడెను

ఈ కోతి మేడమందు!= ఈ కోతి ఆటలు లెక కొట్లాత్లందు

అయ్యారే! = ఆయ్యారే (ఆశ్చర్యము)

మేడియమైనను = ఒక బాకు లేక ఆయుధమైనా

లేకుండ = లెకుండా

కండయండలు = ఒక్క కండ అండలు

మెండు యుండె నంచు= బాగా వున్నాయికదా అని

కాండమూలాలతో = (వృక్షాలను) వేళ్లతోసహా

కంపించి = కదిలించి

ఖండించె= (లెక) విరిచాడే

కండ కొవ్వున = కాండ కావురము కాదా

కన్నుకానకుండ!= కన్నుమిన్ను చూడకుండా (చేసాడు కాదే)!

కొండముచ్చుకిపుడీ = ఈ కొండముచ్చుకి ఇప్పుడు ( కోతి అని ఈసడించుకోవడం)

గండర గండుడే = శూరులకి శూరుడైనటువంటి వాడే (రావణుడు)

గండరించును గాదె = పుట్టిస్తాడు కదా

గండమింక!= గండాలు ఇకపైన!

హాల = మద్యము లేక సుర

కేళి =ఆట (కల్లుతాగిన కోతి అనుట)

వేళందలి = (కోతి కల్లు తాగినప్పటి) వేళ నందు

హాళి తోటి= ఉత్సాహంలో కోరికలతో

హావళి గొనివచ్చినవాడ!= ఉపదృవములను తెచ్చేవాడా

హాలికుడవు కావె= నీవు వనమాలివి/రక్షకుడవు ఐనా కావే

హారకుడవు, = దోంగలా వున్నావు, లేక నాశకుడవు

తుచ్చ కపివి = ఒక్క సామాన్య కోతివి

యంచు= అని అనుచూ

రావణుడు కోపగించేను =కోపము తెచ్చుకున్నాడు ఆ రావణుడు

రామచంద్ర!= రామచంద్రుడా!

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)