భ్రమర కేళి

మదిలో రస స్ఫూర్తి ఇనుమడించిన వేళ, ప్రపంచంలో తనకున్న శక్తియుక్తులన్నిటినీ కూడదీసుకుని కళాకారుల మనస్సు కళా సృష్టి చేస్తుంది. కొన్ని వందల భావాలు ఒకే చిత్రంతో చెప్పడానికి తన కుంచెను సర్వ రీతుల్లో ఆనందనర్తనమాడిస్తారు చిత్రకారులు. సరిగ్గా ఆ సంగతులను తెలుసుకుని ఆనందిచేదే రసజ్ఞ హృదయం. కుంచె కొసల నుండి జాలువారే వేలాది భావాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ శీర్షిక. ప్రతి నెలా శ్రీ శేషగిరి రావు గారి చిత్రాలకు వెనుక కథ ఇందులో మీకోసం.....


రచన: నరసింహాచార్య (సాధన)

మహాకవి కాళిదాసు మానసపుత్రిక శకుంతల. ఆమె ముగ్ధ మనోహర రూపురేహలు, వనం వచ్చిన దుష్యంత మహారాజు చిత్తాన్ని దోచి నిశ్చేష్టుడిని చేస్తాయి. అంతఃపుర స్త్రీల సౌందర్యాన్ని మించిన సౌందర్యంతో ఆశ్రమ స్త్రీల చిలిపిచేష్టలు మనోరంజకంగా ఆ మహారాజుని అలరిస్తున్నాయన్న సత్యాన్ని కవి భ్రమరకేళి ద్వారా సూచిస్తే, వాటిని రేఖాచిత్రంగా మలచారు మన ఆచార్య శ్రీ కొండపల్లిశేషగిరి రావు.

"చక్కనమ్మ చిక్కినా అందమే" అన్న చందాన పంకాన ఉన్నప్పటికీ పద్మం యొక్క అందం మచ్చలతో కూడినప్పటికీ, కలువ ఱేడు సహజ సౌందర్యం, వల్కలాన్ని ధరించిన శకుంతలలోని లావణ్యం కొత్తసొబగులతో, వనరాణిలా అలరింపజేస్తుంది.

"వనజ్యోత్స్న" అనే లతకు నీరుపోస్తున్న శకుంతల సోయగానికి మహారాజు దుష్యంతుడే కాక, మధుపం కూడా ఆకర్షితమై, ఆ రాజు మనస్సు లాగా ఆమె చుట్టూ పరిభ్రమిస్తోంది. దానికి బెదిరిన ఆ వనబాల, బేలచూపుతో, తత్తరపాటుతో తన సుకుమార కరములతో తరిమే ప్రయత్నం చేస్తుంటే, ఆ సౌందర్యసోయగాన్ని ఆస్వాదించిన దుష్యంత మహారాజు, భ్రమరానికి కల్గిన "అదృష్టం తనకు దక్కలేదే" అనే వలపు తలపుతో ఆ సదవకాశ భాగ్యం కొఱకు పొంచి ఉన్నాడు.

అరాలకుంతలయైన ఆ శకుంతలను తన సయ్యాటలతో ఆటపట్టిస్తూ, ఆమె చెక్కిలిని తాకుతూ భీతహరిణిలా ఉన్న ఆ అద్భుతనేత్ర సౌందర్యాన్ని అతి సమీపం నుండి ఆస్వాదిస్తూ, చెవిని చేరి గుసగుసలాడుతూ అల్లరిచేస్తున్న ఆ భ్రమరకేళి, సౌందర్య పిపాసులకు అమృతహేల.

వన సౌందర్యాన్ని, వనబాలలు శకుంతల, ప్రియంవద, అనసూయల సహజ సౌందర్యాన్ని, ఆశ్రమ ధర్మాన్ననుసరించి, తన విల్లంబులను, మకుటాది సమస్త ఆభరణాలను విసర్జించిన దుష్యంతుని ధర్మ దీక్షను, సాదు స్వభావంతో హరిణాలతో సహజీవనం చేస్తున్న ఆశ్రమవాసుల జీవనచయనికను నేత్రపర్వంగా చిత్రీకరించారు డ|| కొండపల్లి శేషగిరిరావు గారు. ఈ చిత్రంలో వివిధ వర్ణాల ఆకులను చిత్రించడం ద్వారా వృక్షజాతులను, వాటి రీతులను చిత్రబధ్ధం కావించారు.

ఈ దృశ్యమే శకుంతలా దుష్యంతుల తొలి సమాగమ సాదృశ్యంలా కాళిదాసు కవి అక్షరమాలికని చిత్రమాలికగా మలచిన చిత్రకారులు బహుధా అభినందనీయులు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)