సమష్టి నృత్య కళ- చెక్కభజన సంగీత నృత్యాత్మకం

రెండవ భాగం

డా. జోగధేను స్వరూప కృష్ణ గారు కడప జిల్లా, ప్రొద్దటురు ఎస్. సి . ఎన్. అర్. కళాశాల లో తెలుగు శాఖలో రీడర్. నెట్ బ్రౌజింగ్, రేడియొ ప్రసంగాలు, కవితలు రాయడం, వెబ్ డిజైనింగ్ వీరి వ్యాసంగం. యు.జి.సి ఢిల్లి ఆర్థిక సహకారంతో రాయలసీమ జానపద కళారూపలు- సాంఘిక, చారిత్రక నేపథ్యము అన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు. వీరు జానపద కళల గూర్చి విశేషమైన పరిశోధన చేసి కనుమరుగువుతున్న మన జన పథాలలోని కళలను వెలికితీసి ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. ఆ ప్రయత్నానికి కొనసాగింపుగా సుజనరంజని ద్వారా ప్రపంచవ్యాప్త తెలుగువారికి తమ అసలైన సంపదను గురించి తెలియజెప్పే ఊహతో పతినెలా తమ పరిశోధనాత్మక వ్యాసాలను అందిస్తున్నారు. అమూల్యమైన విశేషాలు ప్రతినెలా మీకోసం...


భజన పాటల్లో సాహిత్యం: చెక్కభజన చేసేటప్పుడు పాడే పాటలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు.

  • భక్తి పాటలు
  • పౌరాణిక గీతాలు.
  • నీతి పాటలు
  • జడకోపులు
  • వీర గాథలు
  • ప్రభోదాత్మకాలు
వీటిలో రామాయణ, భారత, భాగవతాల్లోని పాటలు ప్రసిద్దమైనవి. అట్లే నీతి పాటలు, ప్రత్యేకంగా మట్కా మహమ్మారి మీద, తాగుడు వంటి వ్యసనాలమీద పాడే పాటలు ప్రభోదాత్మకాలు.

భక్తి పాటలు:

చెక్కభజనలో ప్రతీ నృత్యం ప్రార్థనతో మొదలవుతుంది. ఈ ప్రార్థన పాటల్లో ఆయా ప్రాంతాలలోని ప్రసిద్దులైన దేవతలను స్తుతిస్తారు. ఆది పరాశక్తిని, శ్రీరాముని, ఈశ్వరుని, నందలూరు దస్తగిరిని, తిరుపతి వెంకన్నను భక్తితో స్తుతిస్తారు. దేవతలమీద తమకుండే భక్తిని ప్రకటిస్తూ ఈ దేవతలు కరుణించనప్పుడు దేవతలను బూతులతో తిట్టే సంప్రదాయం కనిపిస్తుంది. ఆసాది కథల్లో ఈ పద్దతి ఉంది.

వినాయకుని ప్రార్థన:
యిందురా గననాయకా నీకు వందనంబు యిదిగో దేవా
సుందరాంగుడనీ పాదములకు ముందుగా వందనంబు చేతును
మంచి మల్లెలతోనా నిన్ను పూజ చేతుమురో దేవా
గుండు మల్లెలతోనా నిన్ను పూజ చేతుమురో దేవా
విప్ప పూలతోనా నిన్ను పూజ చేతుమురో దేవా
సుందరాంగుడ నీ పాదములకు ముందుగా వందనంబు చేతును.
జానపదులకు భాష గురించిన పట్టింపులేదు. ఇందురా గననాయకా- అన్న ప్రయోగంలోని పామరోచిత భాషను గమనించవచ్చు. అడుగులకు అనుగుణంగా పాటను లయాత్మకంగా పాడటం కోసం ప్రాసను తనకు తెలియకుండానే ఉపయోగించడం జానపదుడి ప్రత్యేకత.

ఇందుకు నిదర్శనం:
తూమెడు తూమెడు తుమ్మిపూలు తెచ్చి
మానెడు మానెడు మల్లి పూవులు తెచ్చి
గనపాతి నీ పూజ గనమూగ గడిపేము
గరిక టెంకాయలు గనమైన కుడుమూలు
అత్తరు పన్నీరు కలియ కల్లాపు చల్లి రంగులతో
జలకంబువాలలాడిన తండ్రి శరను

ఇందులోని ప్రాసను గమనించవచ్చు. ఇందులో తూమెడు, మానెడు పదాలకు తుమ్మిపూలు, మల్లిపూలు అంటూ ప్రాసయుక్తంగా ప్రయోగించడంలోనే జానపడుది నైపుణ్యం దాగిఉంది. ఈ ప్రాస ప్రయోగం జానపడుదికి అలవోకగా అబ్బింది. ప్రయత్నించి ప్రయోగించేది కాదు. అప్రయత్నంగా వచ్చింది. ఘనముగా, శరణు అన్న పదాలను గనమూగ, సరను అని ప్రయోగించడంలోని జనపదత్వాన్ని గమనించవచ్చు. జానపదుడు పాటల్లో తాను నివసించే పరిసరాలను గురించిన విషయాలు ఎక్కువగా ఉంటాయి. తనచుట్టు ఉన్న, తనకు తెలిసిన సంస్కృతి, సంప్రదాయాలు, తనవాళ్ళు జానపదుడు ఎక్కువగా ప్రయోగిస్తాడు. అతని సాహిత్యం అతని పరిధిని దాటిపోదు. కల్పనలు, ఊహలు ఉండవు.

కార్తీక మాసములో కడ సోమవారములో
ప్రొద్దుటురిలో రామేశ రాములు చక్కని రాములు
చక్కని రాములు రాములు కొలువై ఉన్నాడు
రాములు కొలువై ఉనాడు దేవుడు కొలువై ఉన్నాడు

ఈ పాటలో అంధ్రప్రదేశ్ లోని కడప జిల్లలోని ప్రొద్దటురులో రమేశ్వరం అనే ప్రాంతం ఉంది. అందులోని రామాలయంలో వెలసిన రామున్ని గురించిన పై పాటలో రామున్ని గురించి వర్ణనలో చక్కని రాముడు కొలువై ఉన్నాడు అన్న ప్రయోగం, రామేశ రాములు అన్న ప్రయోగం భిన్నమైనవి. కోదండరాముడున్నాడు. పట్టాభిరాముడున్నాడు. వీళ్ళతో బాటు రామేశ రాముడు జానపదుడి సొత్తు. పై భక్తి పాటలతో పాటు సినిమాల్లోని భక్తి పాటలు, అన్నమయ్య, రామదాసు కీర్తనలు సినిమా పక్కీలో మార్చుకొని గానం చేయడం కనిపిస్తోంది. కడప జిల్లాలో పాడే భక్తి పాటల్లో ఈ విషయం గమనించవచ్చు.

పౌరాణిక పాటలు:

భారత, రామాయణ, భాగవతాల్లోని అనేక ఘట్టాలు జనపదుడు తమ కళారూపాలకు సాహిత్యంగా మలచుకున్నాడు.ఈ పురాణ కథలను, సన్నివేశాలను తన జీవన విధానానికి అనుగుణంగా, తన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా మార్చుకున్న సంధర్భాలు కనిపిస్తాయి.

భారత సంభద పాటలు:

కౌరవ సభలో ద్రౌపదీ కృష్ణుని వేడుకొనే ఘట్టం, అరణ్య వాసంలో పాండవుల కష్టాలు, కీచక వధ, గోపికలు కృష్ణున్ని వేడుకోవడం వంటి ఘట్టాలను పాటలుగా మలచుకోవడంలో జానపదుడు ప్రత్యేకత ప్రదర్శిస్తాడు. భారతం:

నీలవరన పాలసయనా నిన్ను నమ్మిన్నానురా
నన్ను సభకు తేచ్చి యవమానింపబోతున్నారురా
అచ్చుతానన బ్రోవరా దిక్కు యవరున్నారురా
దిక్కు నీవె దీన బాందవ గ్రక్కున దయచేయరా
నీలవరన పాలసయనా నిన్ను నమ్మిన్నానురా

కోరి పాండురాజునకు నే కోడలైనందుకు
వారకాంతను దీటెచేయక వసుదలో బతుకెందుకూ
కంసమర్దన వంశపాలన కలిగి కృష్ణ నను బ్రోవరా
పాతకుడు దుశ్శాసనుడు నా పైట పట్టుచున్నాడురా
నీలవరన పాలసయనా నిన్ను నమ్మిన్నానురా

ఇది ద్రౌపది కృష్ణున్ని వేడుకొనే ఘట్టం. ఇందులో సర్వశ్య శరణాగతి, అన్యధాశరణం నాస్తి, త్వమేవ శరణం మమ అన్న అన్న భావన జానపదుడు నమ్మడు. అందుకే దిక్కు యెవరులేరని కోరి పాండురాజుకు కోడలైనందుకు వంశపాలన చేసి బ్రోవమని ద్రౌపదితో చెప్పించాడు. నీలవర్ణ అన్న పదాన్ని నీల వరన అనడంలోను, జలధి శయన అన్న ప్రయోగానికి బదులు పాల సయన అని ప్రయోగించడం జానపదత్వం.

కీచక వధా ఘట్టంలోని పాటను గమనించండి.

అంటరాకుమురా కీచకా వర్రీ తుంటతమేలానీకు
అంటరాకుమురా కీచకా నేనలాంటిదానను కాను
బూమిలో పంచపతులున్నారు నాకు తప్పుకొని త్రుంచివేతురు
మాయాజూదము నా గంధర్వులు ఓడ రాజ్యమునూ దేవా
మాయాజూదము రాజ్యమూలు ఓడి ఓడిరే రాజ్యమూనూ దాయాదులకును
పదిలముగ పదిరెండు ఏండ్లు వరన వాసము గడుప వచ్చితిమి

ఇందులో సైరంధి కీచకునితో జూదం, అరణ్యవాస విషయాలు చెప్పడం భారత రచనకు వ్యతిరేకం. కానీ జానపదుడు ఇవన్నీ పట్టించుకోడు. మార్చి రాసుకుంటాడు. తనకు కావలసింది స్వేచ్చగా చెప్పడం జానపదుడి ప్రత్యేకత. పంచపతులు అన్న ప్రయోగం చూడండి. పంచ పాండవులు అన్నా ప్రయోగాన్ని బట్టి వచ్చిఉండాలి. మొదటి పాదంలోని వారీ అన్న పదప్రయోగం స్వచ్చమైన జానపదత్వాన్ని కలిగి ఉంది. నేనలాంటిదానను కాదు అన్నది సహజమైన పల్లె పదం.

కీచకుని దగ్గర సైరంధ్రిచే మదిర బదులు కల్లు అడిగించాడు జానపదుడు. అట్లే కృష్ణునితో సల్ల తాగించాడు.సల్ల అంటే మజ్జిగ. వేసవిలో చలివేంద్రాలు పెట్టడం ఇప్పటికీ ఆనవాయితీ. తిరణాల, జాతరలలో ఇప్పటికీ చల్ల పోస్తారు. యక్ష ప్రశ్నలు సంధర్భంలో పాండవ కౌరవులు ఆడిన జూదం విషయంగా పాచికల బదులు తనకు తెలిసిన పులి మేక జూదాన్ని ప్రస్తావి స్తాడు.

పులులు కొన్ని మేకలు కొన్ని రోజులు జూదమాడెర తమ్ముడా

పాచికలాటకు బదులుగా పర్యాయంగా పులిజూదం ప్రస్తావించబడింది. ఇదే జానపదత్వం అంటే. రామాయణ సంబంధి పాటలలో దాదాపుగా రాముని పుట్టుకనుంచి, పెళ్ళి,వనవాసం, పట్టాభిషేకం వరకు అన్ని రకాల పాటలు చెక్కభజన కళాకారులు వాడుకుంటారు. డా. చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు రామాయణంలోని పాటలను 63 జానపదగీతాలను సేకరించాడు.

ప్రభోదాత్మకాలు:

తమ కళారూపాలను సామాజిక చైతన్యంకోసం ప్రయోగించడం కనిపిస్తుంది. బుర్రకథ, కోలాటం వంటి కళారూపాలలో ఈ విషయాన్ని గమనించవచ్చు. ప్రభోదాత్మకాలైన పాటల్లో ఈడిగసుబ్బులుపై పాటలు, సుగాలి పాపిడిపై పాటలు, మట్కా జూదంపై పాటలు, కల్లు సారాయి తాగి చెడిపోయేవారిని గురించిన పాటలు అనేకం ఉన్నాయి. ఇందులో చాలా ప్రసిద్దమైనది అత్తరు సాయిబు పాట. ఇది లేకుండా చెక్కభజన ప్రదర్శనే ఉండదు. ప్రేక్షకులు అడిగి మరీ పాడించుకుంటారు.

అత్తరు సాయిబూ రారా నా అందగాడారారా
అందరు మొగుల్లు బొంబాయెళ్ళి పౌడరు తెస్తుంటే
నా లడాసు మొగుడు బొంబాయెళ్ళి మూడిద తెచ్చాడే
అత్తరు సాయిబూ రారా నా అందగాడారారా

అందరు మొగుల్లు చిలంకూరెల్లి చేరలు తెస్తుంటే
నా లడాసు మొగుడు చిలంకూరెల్లి గోనిపట్ట తెచ్చాడే
అత్తరు సాయిబూ రారా నా అందగాడారారా

అందరు మొగుల్లు రాత్రి అయితే రాగాలు తీస్తుంటే
నా లడాసు మొగుడు రాత్రి అయితే గురకలు తీస్తాడే
అత్తరు సాయిబూ రారా నా అందగాడారారా

ఈ పాటను పాడేటప్పుడు జానపదులు విపరీతమైన హాస్యాన్ని అనుభవిస్తారు. తన మొగుడు పనికి మాలినవాడని చెప్పకనే చెప్పడం ఈ పాటలోని విశేషం.

చెక్కభజనను గురించి, భజన పాటలను గురించి విశేషమైన పరిసోధన చేసినవారిలో డా. చిగిచర్ల కృష్ణారెడ్డి గారు ప్రముఖులు. ఈయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల శాఖలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు.

ఆధార గ్రంధాలు:

  • జానపద నృత్యకళ- డా. చి. కృష్ణారెడ్డి
  • భజన పాటలు- డా. మూలె రామమునిరెడ్డి
  • రాయలసీమ కళారూపాలు- డా. పేట శ్రీనివాసులు రెడ్డి

సంప్రదించిన కళాకరులు:


పుల్లయ్య, గొరిగనూరు
మహనందయ్య- సీతంపల్లే
భజన క్రిష్ణయ్య- చెన్నూరు , కడప జిల్లా

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)